రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయ నైతికత
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:11 AM
రాజకీయ సంక్షోభాలు ప్రజాస్వామ్య వ్యవస్థల సత్య క్షణాలు (మూమెంట్స్ ఆఫ్ ట్రూత్). ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ బలమూ, బలహీనతా సంక్షోభ సమయంలో వెల్లడవుతాయి. ఈ దృష్ట్యా...
రాజకీయ సంక్షోభాలు ప్రజాస్వామ్య వ్యవస్థల సత్య క్షణాలు (మూమెంట్స్ ఆఫ్ ట్రూత్). ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ బలమూ, బలహీనతా సంక్షోభ సమయంలో వెల్లడవుతాయి. ఈ దృష్ట్యా రాజకీయ ఆలోచనలు కొత్త రీతుల్లో జరిగేందుకు రాజకీయ సంక్షోభం ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తుంది. లోతైన, దార్శనిక చింతనకు అదొక సందర్భమవుతుంది. చుట్టుముట్టిన సమస్యలను సమగ్రంగా వివేచించి, భవిష్యత్తులో వాటికి తావివ్వని రీతిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పురిగొల్పుతుంది. అప్పుడు సదరు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్థానం మళ్లీ హేతుబద్ధంగా సాగుతుంది. చెప్పవచ్చినదేమిటంటే ఇప్పుడు మనమూ ఒక రాజకీయ సంక్షోభంలో ఉన్నాం. మన ప్రజాస్వామ్యం పతన దిశలో ఉంది. భారత రాజ్యాంగానికి, మన నాగరికతా విలువలకు సవాళ్లు తీవ్రమవుతున్నాయి. అవును, మనం ఒక సంక్షోభంలో ఉన్నాం. మన రాజ్యాంగాన్ని, నాగరికతా ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు మన రాజకీయ చింతన సమష్టి భావోద్వేగంతో విప్లవాత్మకంగా పరిణమించాలి. న్యూఢిల్లీలో ప్రపంచ పుస్తక ప్రదర్శనను సందర్శించిన మూడు రోజులూ మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం భవిష్యత్తును గురించిన ఆలోచనలే నన్ను ఆవహించి ఉన్నాయి. భావాల ఉత్సవంగా కాకుండా అధికార ప్రదర్శనగా మాత్రమే ఏటేటా ఈ పుస్తకాల పండుగ జరుగుతోంది. అరుదుగా దొరికే, విలువైన పుస్తకాలను విక్రయిస్తున్న స్టాల్ ప్రస్తుతం ఒక్కటీ కన్పించలేదు. వివిధ ప్రజా ఉద్యమాలకు సంబంధించిన పత్రికలు, పుస్తకాలు, పోస్టర్లు లభ్యమయ్యే స్టాల్ ఒక్కటి కూడా లేదు. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ బృహత్ బొమ్మలూ, తుపాకులు పట్టుకుని తిరుగుతున్న సైనికులూనూ! (పుస్తక ప్రదర్శనలో సైనికులు ఎందుకు ఉన్నారని నన్ను అడగవద్దు సుమా!).
ఇతరుల కంటే ఎక్కువగా కవులు తమ కాలపు సత్యాలను ఆవిష్కరిస్తారని నేను అనుకుంటాను. ఈ భావనతోనే, ప్రభవిస్తోన్న యువ కవులు అద్నాన్ కఫీల్ దర్వేష్ కొత్త కవితా సంపుటి ‘లానత్ కా ప్యాలా’, పరాగ్ పవన్ పద్యాలు ‘జబ్ హార్ హంసీ సందిగ్ధ్ దీ’, విహాగ్ వైభవ్ కవితామాల ‘మోర్చే పార్ విదాగీత్’ను శ్రద్ధాసక్తులతో చదివాను. రాజకీయ పరాయీకరణ, అణగారిన వర్గాల సామాజిక ఆక్రోశాలను ఈ కవులు తమ కవితల్లో చక్కగా వ్యక్తీకరించారు. అయితే కవిత్వం, ప్రజాస్వామ్యం మధ్య సమస్యాత్మక సంబంధం గురించి అపూర్వానంద్ రాసిన ‘కవితా మే జనతంత్ర’కు రాసిన పరిచయంలో ‘సమస్యల్లా సమకాలీన కవిత్వం నైరాశ్యాన్ని వ్యక్తం చేసేదిగా ఉండడమేనని’ ప్రొఫెసర్ ప్రతాప్‌భాను మెహతా అభిప్రాయపడ్డారు. నిజమే, సమకాలీన కవిత్వం మనలను అప్పుడప్పుడు ఉత్తేజితులను చేస్తుంది. అయితే సమస్యల నుంచి బయటపడే మార్గమేదో చెప్పదు. ఆ మార్గమేదో తెలుసుకోవడానికి రాజనీతి గ్రంథాలే సరైనవి. ఈ విషయమై మొదట తప్పక పేర్కొనవలసిన పుస్తకం పార్థా ఛటర్జీ రాసిన ‘ఫర్ ఎ జస్ట్ రిపబ్లిక్’. మనం మన ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈనాడు ఉన్నచోటుకు ఎలా చేరుకున్నాం? అన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించిన పుస్తకమది. అయితే ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితులను అధిగమించి ముందుకు సాగేందుకు ఆయన సూచించిన మార్గం మనలను సరైన గమ్యానికి తీసుకుపోతుందా అని సందేహిస్తున్నాను. పార్లమెంటేరియన్‌గా మారిన విశ్వవిద్యాలయ ఆచార్యుడు మనోజ్ ఝా పుస్తకం ‘In Praise of Coalition Politics’, మణిశంకర్ అయ్యర్ పుస్తకం ‘A Maverick in Politics’ తప్పక చదవవలసినవి. రాజకీయ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు మనకు మరింతగా తోడ్పడతాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలపై కొత్త ఆలోచనలను పురిగొల్పే పుస్తకాలను ‘ఓరియెంట్ బ్లాక్ స్వాన్’ ప్రచురించింది. ‘50 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎమర్జెన్సీ’ వాటిలో ఒకటి. ఆ ‘చీకటి రోజుల’నే కాకుండా ప్రస్తుత నిరంకుశ పాలనా ధోరణులనూ అర్థం చేసుకునేందుకు కూడా ఈ పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది. ఇప్పుడు విస్మృతమైన ఇద్దరు ధీరోదాత్తుల జీవిత చరిత్రలు తప్పక చదవవలసినవి– ఒకటి, రాజగోపాల్‌సింగ్ వర్మ హిందీలో రాసిన ‘మధు లిమాయే: ప్రతిరోధ్ కా పర్చామ్’; రెండోది, రాధికా కృష్ణన్ రాసిన ‘శంకర్ గుహ నియోగి: ఎ పొలిటిక్స్ ఇన్ రెడ్ అండ్ గ్రీన్’. లిమాయే, నియోగి ఏ విలువలను సమున్నతం చేసేందుకు తమ జీవితాలను అంకితం చేశారో ఆ విలువలను ఇప్పుడు మనం గౌరవిస్తున్నామా అన్న సంశయం కలుగుతోంది.
ఆ సమున్నత విలువలకు మూలాధారం భారత రాజ్యాంగం. మన రాజ్యాంగబద్ధ గణతంత్ర రాజ్య నిర్మాణం, మౌలిక సూత్రాలపై వర్తమాన ప్రాబల్య రాజకీయ శక్తులు చేస్తోన్న దాడి సహజంగానే వ్యవస్థాపక ఆలోచనలను ప్రగాఢంగా అధ్యయనం చేసేందుకు, రాజ్యాంగ దార్శనికతను కాపాడేందుకు ప్రజలను పురిగొల్పుతోంది. రోహిత్ దే, అర్నిత్ షాని సంయుక్తంగా రాసిన ‘అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్‌స్టిట్యూషన్: ఏ న్యూ డెమోక్రటిక్ హిస్టరీ’ అందుకొక నిదర్శనం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలోని ఉన్నత వర్గాలు మాత్రమే రూపొందించలేదని, సాధారణ ప్రజలు, సమస్త మత సమూహాలవారూ అందులో క్రియాశీలంగా పాల్గొన్నారని ఆ పుస్తక రచయితలు స్ఫూర్తిదాయకంగా విపులీకరించారు. స్పీకింగ్ టైగర్ అనే ప్రచురణ సంస్థ ‘భారత రాజ్యాంగ భావాలు’ అన్న ఇతివృత్తంతో పలు పుస్తకాలు ప్రచురించింది. నళినీ రాజన్ (‘సెక్యులరిజం: హౌ ఇండియా రీ షేప్డ్ ది ఐడియా), ప్రభాత్ పట్నాయక్ (సోషలిజం అండ్ ది ఇండియన్ కాన్‌స్టిట్యూషన్), జాన్ హారిస్ (లిబర్టీ), రాజ్‌మోహన్ గాంధీ (ఫ్రెటర్నిటీ: కాన్‌స్టిట్యూషనల్ నార్మ్ అండ్ హ్యూమన్ నీడ్), ఆనంద్ తెల్తుంబ్డే (దళిత్స్ అండ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్) మొదలైన మేధావులు భారత రాజ్యాంగ విశిష్టత గురించి విశదీకరించారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రశ్న కొంత భిన్నమైనది: మన గణతంత్ర రాజ్యాన్ని సంరక్షించుకునేందుకు రాజ్యాంగంపై ఎంత వరకు ఆధారపడగలం? దీనిపై న్యాయశాస్త్ర పండితుడు గౌతమ్ భాటియా నిశితంగా తర్కించారు. భారత రాజ్యాంగం ఒక నైతిక గ్రంథం కాదని, అధికారాలను రూపొందించి, నిర్వహించేందుకు ఒక నిర్దేశక చట్రమని ఆయన తన ‘ది ఇండియన్ కాన్‌స్టిట్యూషన్: ఎ కాన్వర్సేషన్ విత్ పవర్’ అన్న పుస్తకంలో వివరించారు. స్థూల రాజ్యాంగ సూత్రాలు, నిర్దిష్ట చట్టాల మధ్య సంబంధాలను వర్తమాన రాజకీయాల నేపథ్యంలో భాటియా విశ్లేషించారు.
మరింత లోతైన ప్రశ్న: దేశ పౌరుల రాజకీయ నైతికతను తీర్చిదిద్దేందుకు రాజ్యాంగ విలువలపై ఏ మేరకు మనం ఆధారపడగలం? భారత జాతీయోద్యమ స్ఫూర్తితో మన నాగరికతా వారసత్వ బహుళ సంప్రదాయాలతో మన రాజ్యాంగ విలువలను సుదృఢంగా సంధానించే కొత్త భాషను రూపొందించడం మన కాలపు అత్యవసరమైన మేధా కర్తవ్యాలలో అత్యంత ముఖ్యమైనదని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచ పుస్తక ప్రదర్శనలో విడుదలైన నా పుస్తకం ‘‘గణరాజ్య కా స్వధర్మ్’లో ఈ అంశాలను విపులంగా చర్చించాను. ఈ లక్ష్యసాధనలో మరింతగా మేధా సంపత్తిని సమకూర్చుకునే ఆసక్తి ఉన్నవారికి భారతీయమేధ వలసీకరణపై ప్రొఫెసర్ అభయ్ కుమార్ దూబే పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయి. భారతీయ జ్ఞాన సంప్రదాయాలు నిశ్చలమైనవి, మార్పును అంగీకరించనివి కాదని, అవి నిరంతరం నవీకరణ చెందేవే అన్న విషయాన్ని బలరామ్ శుక్లా భారతీయ జ్ఞాన్ పరంపర’లో వివరించారు. సంస్కృత మేధా సంప్రదాయంలోని విశిష్ట ఆలోచనాశీలుర గురించి సంస్కృత విద్వాంసుడు రాధావల్లభ్ త్రిపాఠి తన ‘భారత్ కి సారస్వత్ సాధన’లో విపులంగా రాశారు (దూబే, శుక్లా, త్రిపాఠి రాసిన పుస్తకాలు హిందీ భాషలో మాత్రమే ఉన్నాయి). మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యానికి వాటిల్లిన ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగు మేధా సంపత్తిని ఈ పుస్తకాలు సమకూర్చగలవని నేను భావిస్తున్నాను.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
Also Read:
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..