Share News

ప్లాస్టిక్‌ వద్దు... స్టీల్‌ బ్యాంక్‌ ముద్దు!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:18 AM

ఒక పెళ్లి ముగిసింది. వందలాది పళ్లాలు, గ్లాసులు చెత్తకుప్పలో చేరాయి. విందు కొన్ని గంటల్లో ముగిసినా, ఆ ప్లాస్టిక్ వ్యర్థం మాత్రం ప్రకృతిపై దీర్ఘకాల భారం అవుతుంది. సౌకర్యం...

ప్లాస్టిక్‌ వద్దు... స్టీల్‌ బ్యాంక్‌ ముద్దు!

ఒక పెళ్లి ముగిసింది. వందలాది పళ్లాలు, గ్లాసులు చెత్తకుప్పలో చేరాయి. విందు కొన్ని గంటల్లో ముగిసినా, ఆ ప్లాస్టిక్ వ్యర్థం మాత్రం ప్రకృతిపై దీర్ఘకాల భారం అవుతుంది. సౌకర్యం కోసం ఎంచుకున్న ‘వాడి పారేయడం’ సంస్కృతి ఇప్పుడు చెత్త సమస్య అయింది. దీనికి పరిష్కారం కేవలం ప్లాస్టిక్‌ నిషేధం కాదు; పారేయకుండా తిరిగి ఉపయోగించే అలవాటు నేర్పడం.

ప్రతి పంచాయతీ తన జనాభాకు అనుగుణంగా స్టీల్ పళ్లాలు, గ్లాసులు కొనుగోలు చేసి, వాటిని పంచాయతీ ఆస్తిగా నమోదు చేయాలి. పెళ్లిళ్లు, అన్నదానాలు, జాతరలు, పాఠశాల, దేవాలయ కార్యక్రమాలు, గ్రామసభలు, ఇతర సామూహిక వేడుకలకు వాటిని అందుబాటులో ఉంచాలి. ఒక సర్పంచ్‌ నిర్ణయం మరో గ్రామానికి ఆదర్శంగా నిలవాలి. సిద్దిపేటలో గ్రామపంచాయతీ స్థాయిలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూపించారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో పాత్రల నిర్వహణ కూడా చేపట్టారు. తూప్రాన్‌లో 1,500 స్టీల్ పళ్లాలు, 2,000 గ్లాసులతో ఏర్పాటైన స్టీల్ బ్యాంకు అనేక కార్యక్రమాల్లో దాదాపు లక్ష ప్లాస్టిక్ పళ్లాలు, గ్లాసుల వినియోగాన్ని నివారించింది. ఖమ్మంలోనూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వమే అన్నీ సమకూర్చాలని లేదు. ప్రజల భాగస్వామ్యంతో దీనిని విజయవంతం చేయవచ్చు. ప్రతి కుటుంబం ఒక స్టీల్ పళ్లెం, ఒక గ్లాసు ఇవ్వొచ్చు. యువజన సంఘాలు సామగ్రి సమకూర్చవచ్చు. వ్యాపారులు, దాతలు, పూర్వ విద్యార్థుల సంఘాలు సహకరించవచ్చు. ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న స్టీల్ సామగ్రి గ్రామబ్యాంకుకు ఇవ్వగలిగితే, అప్పుడది సామూహిక ఆస్తిగా మారుతుంది.

నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించడం మరో ముఖ్యమైన అడుగు. పాత్రలు ఇవ్వడం, తిరిగి తీసుకోవడం, శుభ్రపరచడం, లెక్కలు నిర్వహించడం వంటి బాధ్యతలను వారికి అప్పగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి. తక్కువ అద్దె లేదా నిర్వహణ రుసుముతో సేవలు అందించవచ్చు. వచ్చిన ఆదాయంతో పాడైన పాత్రలను మార్చుకోవచ్చు. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో ఉంది. అయితే, ప్రజల అలవాటు మారాలంటే ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండాలి. అందుకే ప్రతి గ్రామపంచాయతీ తన వార్షిక ప్రణాళికలో స్టీల్ బ్యాంకును గ్రామ ఆస్తి నిర్మాణ కార్యక్రమంగా చేర్చాలి. ఒక గ్రామం ఇలా మారితే అది ప్లాస్టిక్‌ను తగ్గించిన గ్రామంగానే కాదు, పొదుపును నేర్చుకున్న గ్రామంగా, పంచుకునే సంస్కృతిని పునరుద్ధరించిన గ్రామంగా నిలుస్తుంది. ఇదంతా పళ్లెం గురించి కాదు; రేపటి తరానికి మనం అందించే జీవన విధానం గురించి. ప్లాస్టిక్ వద్దు.. స్టీల్ ముద్దు అన్నది నినాదం కాదు.. ఇంటి నుంచి పంచాయతీ వరకు ఆచరించాల్సిన బాధ్యత.

శ్రీశైలం దూడం

Also Read:

హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక

ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్

Updated Date - Sep 29 , 2026 | 03:18 AM