అక్రమ సుంకాలు లేకపోతే పెట్రోలు చవకే!
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:55 AM
అమెరికా– ఇరాన్ యుద్ధం పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఆయిల్ కంపెనీల ద్వారా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, ధర సంగతి ఎలా ఉన్నా చమురు...
అమెరికా– ఇరాన్ యుద్ధం పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఆయిల్ కంపెనీల ద్వారా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, ధర సంగతి ఎలా ఉన్నా చమురు దొరికితే చాలనే రీతిలో ప్రజలను మానసికంగా సిద్ధం చేసి, ఆ తర్వాత పెంచింది. పెరిగిన ముడిచమురు ధరలతో పోల్చితే పెంచిన ఈ రిటైల్ ధరలు చాలా తక్కువ అంటూ జాతీయ పత్రికలలో వార్తలు వెలువడుతున్నాయి. మరోసారి పెట్రోలియం ధరల పెంపునకు రంగం సిద్ధం అవుతోంది. నిజానికి యుద్ధం ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం ఈ ధరలను పెంచి ఉండేది. కానీ, వివిధ రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని కొంత ఆలస్యం అయింది. ‘పెట్రోలియం ధరలతో మాకేమీ సంబంధం లేదు, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు ధరలను స్థిరీకరించుకొంటాయి’ అని కేంద్ర ప్రభుత్వం చెబుతూంటుంది. కానీ అదే ప్రభుత్వం అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోతున్నప్పుడు ఆ ఫలితం ప్రజలకు అందకుండా శాయశక్తులా ప్రయత్నం చేసింది.
మన దేశంలో 1980కి ముందు వరకు దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్రోలియం రిజర్వు పూల్ మనీ ఉంది. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలలో ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం ఈ నిధిని వినియోగించేవారు. అయితే ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలోని చమురు కంపెనీలకు ధరల నిర్ణయంలో స్వేచ్ఛనిచ్చి, ఇక ధరలతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి ఆ రిజర్వు పూల్ మనీని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకొంది. ధరల నిర్ణయంలో స్వేచ్ఛ లభించడంతో ఆయిల్ కంపెనీలు మూడు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు అన్న తరహాలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి, కోట్ల లాభాలు పొందాయి. మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 160 డాలర్లు. అయినా లీటరు పెట్రోలును రూ.74కే అందించారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయంగా చమురు కంపెనీల మధ్య పోటీ, రష్యాపై అమెరికా ఆంక్షల వంటి పరిణామాల నేపథ్యంలో బ్యారెల్ ధర 46 డాలర్లకు పడిపోయింది. తదనుగుణంగా లీటరు పెట్రోల్ ధర రూ.25కు తగ్గిపోవాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ధర తగ్గించకపోగా, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల మీద పన్నులు, సెస్‌లు విధిస్తూ క్రమంగా లీటరు పెట్రోల్ ధరను 74 నుంచి 109 రూపాయలకు పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలో దాదాపు 50శాతం పన్నులే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ (దిగుమతి సుంకం) మాత్రమే విధించాలి. రిటైల్‌గా అమ్ముతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ టాక్స్, టర్నోవర్ టాక్స్ విధించాలి. కేంద్రం ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ టాక్స్ మాత్రమే విధించాలి. కానీ బేసిక్ టాక్స్ పూర్తిస్థాయిలో పెంచిన తర్వాత ఇంకా పెంచడానికి అవకాశం లేకపోవడంతో సెస్ ఆన్ ఎక్సైజ్, మౌలిక సదుపాయాల సెస్ పేరుతో నాలుగు రకాల పన్నులు వేస్తోంది. ఈ కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ ఫలితం ప్రజలకు చేరకుండా లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కాజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు బంక్‌ల నుంచి అమ్మకపు పన్ను, టర్నోవరు టాక్స్‌తోపాటు రోడ్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో బ్యారెల్ ధర 100 నుంచి 110 డాలర్ల మధ్య ఉన్నప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పటితో పోల్చితే తక్కువే. ఈ నెలలో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరినప్పటికీ పన్నుల మీద పన్నులు, సెస్‌లు లేకపోతే మనకు లీటరు పెట్రోల్ న్యాయబద్ధంగా వసూలు చేసే పన్నులతో కలుపుకొని రూ.82కే లభిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా మనకు చాలా చౌకగా క్రూడ్ సరఫరా చేసింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఇరాన్–అమెరికా యుద్ధం జరుగుతున్నప్పటికీ రష్యా మన దేశానికి అంతర్జాతీయ ధరల కంటే తక్కువకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ధరలు సవరించలేదన్న వాదనతో, మళ్లీ మళ్లీ ధరలు పెంచడానికి సిద్ధం అవుతున్నది.
అన్నవరపు బ్రహ్మయ్య
(జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే