Share News

పరీక్షలు: పొదల వెనక పులులు!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:29 AM

కొన్నేళ్లుగా, పదో తరగతి విద్యార్థులూ, ఇంటర్ విద్యార్థులూ, ఆఖరికి ఐఐటీ విద్యార్థులూ, ఆ చదువుల భారం మోయలేక, ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక...

పరీక్షలు: పొదల వెనక పులులు!

కొన్నేళ్లుగా, పదో తరగతి విద్యార్థులూ, ఇంటర్ విద్యార్థులూ, ఆఖరికి ఐఐటీ విద్యార్థులూ, ఆ చదువుల భారం మోయలేక, ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక, ప్రాణాలు తీసుకుంటున్న వార్తలు చూస్తున్నాం. 2014 నుంచి 2024 వరకు గత పదేళ్ల కాలంలోనే భారతదేశంలో 1 లక్షా, 23వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

నిన్న మొన్న, బొంబాయి ఐఐటీలో ఒక విద్యార్థి, పరీక్ష హాల్లో కాపీ కొడుతూ పట్టుబడడం, తర్వాత ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ సంఘటన విన్నాక, గతంలో, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో టీచరుగా ఉన్నప్పుడు, పరీక్షల నిర్వహణకు సంబంధించి నా అనుభవాలు కొన్నిటిని చెప్పాలనిపించింది. నా సర్వీసులో, చివరి 7 సంవత్సరాలలో, ‘సోషియాలజీ’లో నేను పరీక్షలు ఎలా నిర్వహించేవాణ్నో మాత్రమే చెపుతాను. నేను పాఠాలు చెప్పే ఆప్షనల్‌ కోర్సులకు, వేరు వేరు సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులు ప్రతి సంవత్సరమూ, సగటున 80–90 మంది వచ్చేవారు. వాళ్లందరూ, ఇంటర్ పూర్తిచేసి, 5 సంవత్సరాల మాస్టర్స్ కోర్సుకు వచ్చినవాళ్లే. వాళ్లు రకరకాల రాష్ట్రాలనించీ, వేరువేరు కుటుంబాలనించీ, వచ్చినవాళ్లు. యూనివర్సిటీలో, వాళ్ల సంఖ్యలు నూటికి: ఎస్సీలు–15, ఎస్టీలు–8, ఓబీసీలు–27, ఓసీలు–50. వాళ్లలో దాదాపు సగం మంది ఇంగ్లీషు మీడియంలోనూ, మిగతా సగం ప్రాంతీయ భాషల మీడియంలలోనూ చదువుకున్నవారు. ఇంగ్లీషు మీడియం చదువుకున్న వారిలో కూడా, ఇంగ్లీషు అంతగా రానివారే ఎక్కువమంది. అందువల్ల, నేను సగం ఇంగ్లీషులోనూ, కొంత హిందీ–ఉర్దూలోనూ పాఠాలు చెప్పేవాణ్ని. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం సోషియాలజీ పాఠాలూ, పరీక్షలూ ఇంగ్లీషులోనే జరగాలి. కానీ, నేను విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకుని, ఆ నిబంధనను పాటించలేదు. ప్రతి పాఠానికీ సంబంధించి, కొన్ని ముఖ్యమైన పాయింట్లను, నిర్వచనాల రూపంలోనూ, క్లుప్తమైన వివరణల రూపంలోనూ, నేనే టైప్ చేసి, యూనివర్సిటీ ఆఫీసు ద్వారా ప్రింటవుట్లు తీయించి, స్పైరల్ బైండింగు చేయించి, క్లాసులో ఎంతమంది వుంటే అంతమందికీ ఒక్కో హ్యాండవుట్ల పుస్తకం లైబ్రరీ వాళ్లు ఇచ్చే ఏర్పాటు చేశాను. పరీక్షా పత్రాలు ఇంగ్లీషులోనే ఉండేవి. పది ప్రశ్నలు ఇచ్చి, వాళ్లకు నచ్చిన 5 ప్రశ్నలకు జవాబులు రాయమనేవాణ్ని. ఆ పది ప్రశ్నలూ పదిరోజుల ముందే బహిరంగంగా అందరికీ ఇచ్చేసే వాణ్ని. జవాబులు, వీలైనంత వరకూ ఇంగ్లీషులోనే రాయమనేవాణ్ని. ఇంగ్లీషులో స్పెల్లింగు తప్పులూ, గ్రామరు తప్పులూ వున్నా, మార్కులు ‘కట్’ చెయ్యననే వాణ్ని. ఎందుకంటే, నాది ఇంగ్లీషు కోర్సు కాదు కాబట్టి. విషయం అర్థం అయిందా లేదా అనేది ముఖ్యం గానీ, ఇంగ్లీషు భాషా సామర్థ్యం ముఖ్యం కాదని చెప్పేవాణ్ని. పోనీ, సగం ఇంగ్లీషులో, సగం వారి భాషలో, రాయమనే వాణ్ని. అక్కడక్కడా, కొన్ని ప్రశ్నల జవాబులు కొందరు తెలుగులో గానీ, కొందరు హిందీలో గానీ రాసినప్పుడు, ఆ పేపర్ల విషయంలో నాకు ఇబ్బంది రాలేదు. ఆ భాషలు నాకు తెలుసు కాబట్టి. సగం ఇంగ్లీషులో, సగం ఉర్దూ లిపిలో కొద్దిమంది రాస్తే, వాటిని ఉర్దూ తెలిసిన వారితో చదివించుకుని పేపర్లు దిద్దేవాణ్ని.


ఒక సెమిస్టరులో, రెండు ఇంటర్నల్ పరీక్షలకు 20 చొప్పున, రెండు 20లు, 40 మార్కులుండేవి. సెమిస్టర్ చివరి పరీక్షకు 60 మార్కులుండేవి. మొత్తం 100కి. ఇంటర్నల్ పరీక్షలకు కూడా, ఏ టాపిక్కుల్లోనైతే నేను ప్రశ్నలు అడుగుతానో, వాటిని కూడా ముందే ఇచ్చేవాణ్ని. ఒక ఇంటర్నల్ పరీక్షలో మాత్రం, నేను అడిగే ప్రశ్నలకు నోటి మాటలతో (‘ఓరల్’గా) జవాబు చెప్పాలి. బట్టీ కొట్టినట్టు చెప్పకూడదు. కావాలంటే, నేను ఇచ్చిన లెక్చర్ నోట్స్ తెరిచి, చూసి, చదివి, దాని అర్థం చెప్పాలి.

ఇలా సాగింది నా బోధనా, పరీక్షల నిర్వహణ.

ఏ సంవత్సరంలోనూ విద్యార్థులు (కంటిచూపు లేని విద్యార్థులతో సహా) ఎవ్వరూ అభ్యంతరపెట్టలేదు. అసంతృప్తి చెందలేదు. ఒక్కసారి మాత్రం, ఒక కుర్రాడు, 5 ప్రశ్నలకూ, 5 చీటీలు తెచ్చుకుని, చూసి రాస్తున్నాడు. అది చూసి, ‘‘నువ్వు ఇలా చెయ్యడం చాలా తప్పు. నమ్మక ద్రోహం. నేను సిలబస్‌లో ప్రతి పాఠమూ వీలైనంత వివరంగానే చెప్పాను గదా? లెక్చర్ నోట్స్ కూడా ఇచ్చాను గదా? ముందుగానే ప్రశ్నలు కూడా ఇచ్చాను గదా? నువ్వు ఇలా చెయ్యడం నేను ఒప్పుకోను. నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు పరీక్ష రాయడం ఆపేసి, పేపరు ఇచ్చి వెళ్లిపో. నీకు మళ్లీ తర్వాత, సప్లిమెంటరీ పరీక్ష పెడతాను కావాలంటే’’ అని పంపించేశాను. అప్పుడా కుర్రాడు, నవ్వుకుంటూ, పేపరు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యమూ చేసుకోలేదు. పోలీసు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు అప్పట్లో. ఇది జరిగి దాదాపు పదిహేనేళ్ల పైనే అయింది. ఇప్పుడేమి చేస్తున్నాడో!

అమలులో ఉన్న ఈ పరీక్షల పద్ధతికి, నేను ఎప్పట్నించో వ్యతిరేకం. వీలున్నచోటల్లా, దాన్ని అతిక్రమించాను. అది నేరం అనుకోవడం లేదు. నాకీ అభిప్రాయాలు కలగడానికి కారణం ఇద్దరు. ఒకటి, చలంగారు. రెండు మావో. వాళ్లిద్దరి మాటలూ చెప్పి ముగిస్తాను.

‘‘కుర్రాళ్లు పరీక్షలు రాస్తూ వుంటే, కావలి కూచున్నాను. ఈ పరీక్షలు రాసేవారికి మార్కులు వేయడం ఎక్కువ బాధో, లేక వీళ్లు రాస్తూ వుండగా కావలి కాయడం ఎక్కువ బాధో నిర్ణయించుకోలేకుండా వున్నాను. ఈ కావలి కాయడంలోని ఈ అనుమానంలో నైతిక నీచత్వం స్ఫురిస్తుంది. ‘మీరు దొంగలు. మీకు నీతి లేదు. నేను చాలా నీతిమంతుణ్ని. మీ దొంగతనాలు పట్టి చీల్చేందుకు ఇక్కడ కూచున్నాను’ అంటున్నట్టుంటుంది. వాళ్లు తలెత్తి నా వంక చూసి, మళ్లీ తలలు వొంచి రాస్తూ వుంటే, అక్కడ కూచోవడం సిగ్గేస్తుంది.’’ (–చలం. 1937 నాటి ‘మ్యూజింగ్స్’లో).


‘‘ప్రస్తుత పరీక్షల పద్ధతి విద్యార్థులను శత్రువులుగా పరిగణించేలా, వారిపై మెరుపుదాడి చేసేలా ఉంది. ఇది విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసి, దెబ్బతీయడానికి అడవిలో పొంచి ఉండే పులి లాంటిది. ఇప్పటి పరీక్షా విధానం శత్రువులతో వ్యవహరిస్తోన్నట్టు వుంది గానీ, ప్రజలతో వ్యవహరిస్తోన్నట్టు లేదు. శత్రువుమీద ఆకస్మిక దాడులు చేసినట్టు, ఈ పరీక్షల విధానం విద్యార్థులమీద ఆకస్మిక దాడులు చేసి వారిని హడలెత్తిస్తోంది. బట్టీలు పట్టినదాన్ని తిరిగి వల్లించేట్టు చెయ్యడానికీ, మూసలో పోసినట్టు రాసే విధానాన్ని పరీక్షించడానికీ, బూర్జువా స్పెషలిస్టుల్ని తయారు చెయ్యడానికీ తప్ప, ఈ విధానం ఎందుకూ పనికిరాదు. దీన్ని పూర్తిగా మార్చేసి, విద్యార్థిలో వున్న నిజమైన శక్తిసామర్థ్యాలు బయల్పడడానికీ, నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికీ ఉపయోగపడే పద్ధతులను అభివృద్ధిపరచాలి’

(మావో. 1964లో)

చివరిగా, 1952లో ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో, ఒక నాటికలో, స్కూలుకెళ్లే కుర్రాడు అనే సరదా మాటలు చూడండి: ‘‘పరీక్షలు... పరీక్షలు... పాడు పరీక్షలు! ఈ పరీక్షలు కనిపెట్టిన వాడిని పట్టుకుని నడి బజారులో నిలబెట్టి, తుపాకీతో ఠాచ్... ఠాచ్ అని కాల్చేయాలి!’’ ఇలా అన్న పిల్లవాడు, పరీక్షలను తప్పించుకోవడానికి, ‘‘అమ్మా నొప్పిలే! అమ్మమ్మా నొప్పిలే!’’ అని పాడుతూ గంతులేస్తాడు.

సినిమాలో ఒక చిన్న పిల్లవాడితో చెప్పించిన ఈ మాటల వల్ల, పరీక్షలు అంటే అదేదో భూతం లాగా, భీతిగొలిపే పరిస్థితి లాగా పూర్వం నించీ ఒక అనుభవం ఉందని అర్థమవుతోంది. ఈనాటికీ, ఎంసెట్ అనీ, నీట్ అనీ, రకరకాల ప్రవేశ పరీక్షలప్పుడు, పిల్లలతో పాటు పెద్దవాళ్లు పడే ఆందోళన చూస్తే, జ్ఞానాన్ని కొలిచే సాధనంగా ఇప్పుడున్న పరీక్షా విధానం ఎంత డొల్లో తెలిసిపోతుంది.

బి.ఆర్. బాపూజీ

Also Read:

హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక

ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్

Updated Date - Sep 29 , 2026 | 03:29 AM