రైతాంగంపై ‘పారాక్వాట్’ కాటు!
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:06 AM
కరీంనగర్ జిల్లాకు చెందిన మహేష్‌రెడ్డి అనే వైద్యునికి ఇటీవల ఒక హృదయవిదారకమైన ఘటన ఎదురైంది. పాతికేళ్ళ మహిళా రైతు భర్తతో గొడవపడి క్షణికావేశంలో గడ్డిమందు తాగింది. సమీప...
కరీంనగర్ జిల్లాకు చెందిన మహేష్‌రెడ్డి అనే వైద్యునికి ఇటీవల ఒక హృదయవిదారకమైన ఘటన ఎదురైంది. పాతికేళ్ళ మహిళా రైతు భర్తతో గొడవపడి క్షణికావేశంలో గడ్డిమందు తాగింది. సమీప బంధువులు ఆమెను వెంటనే మహేష్‌రెడ్డి వద్దకు తీసుకువచ్చారు. గడ్డి మందు తాగేటప్పుడు ఆ మహిళ ఆలోచన ఎలా ఉందో గానీ, డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి, ‘సార్ నేను లేకుంటే నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారు! దండం పెడుతాను, కాపాడండి’, అని బోరున ఏడుస్తూ ప్రాధేయడిందట! పాపం, డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? ఆమె తాగింది మామూలు గడ్డి మందు కాదు, విరుగుడు లేని విషం మందు ‘పారాక్వాట్’. తెలంగాణలోని ప్రతి జిల్లాలో నెలకు 10 నుంచి 20 మంది ఈ గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 80శాతం మంది ఈ మందే తాగుతున్నారని నా అధ్యయనంలో తేలింది.
పారాక్వాట్, గ్లైఫోసెట్, పెండిమిథాలిన్... ఇవన్నీ గడ్డిమందులు. పంటలోని కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన రసాయనాలు. ఇవి ఒడ్ల మీద ఉన్న గడ్డిని, పంటల్లో కలుపు మొక్కలను వేగంగా చంపేస్తాయి. లేదా కలుపు మొత్తం ఎండిపోయేలా చేస్తాయి. సులభంగా దొరకడం, కూలీల అవసరం లేకుండా ఒక్కరే పిచికారీ చేసే అవకాశం ఉండటంతో రైతులు కలుపు నివారణకు ఈ గడ్డిమందులను ఇటీవల ఎక్కువ వాడుతున్నారు. అయితే ఈ మందుల ప్రభావం ఆ కలుపు మొక్కలపైనే కాకుండా మనుషులపైన, పర్యావరణంపైన తీవ్రంగా ఉంటున్నది. ఈ విషయమై రైతుల్లో అవగాహన లోపించింది.
కలుపు నివారణ త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో రైతులు వాడుతున్న ఈ గడ్డి మందులు మట్టిలో ఎక్కువ కాలం అలాగే ఉండిపోతాయి. ఫలితంగా భూమి సారం దెబ్బతింటున్నది. నేల చచ్చుబడి దిగుబడి తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో పంటలకు పనికిరాకుండా పోతుంది. ఇక, వర్షాలు పడినప్పుడు పంటపొలాల్లోని వరద నీళ్లు వెళ్లి చెరువులో కలిసి ఆ నీళ్లు, తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. రైతులు ఈ మందులను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ మరో అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఈ గడ్డి మందులను ఒక సాధనంగా వాడటం. ముఖ్యంగా పారాక్వాట్ సులభంగా లభ్యం కావడమే కాదు, అత్యంత విషపూరితమైనది కూడా కావడంతో, క్షణికావేశంలో దీనిని సేవించిన వారిని వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించడం అసాధ్యంగా మారుతోంది.
పారాక్వాట్‌ను ఒక స్పూన్ మోతాదులో మింగినా మరణం సంభవించే అవకాశం ఉన్నది. దీనికి ఎటువంటి విరుగుడు లేదు. ఈ మందు శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఊపిరితిత్తులను, మూత్రపిండాలను, కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. శ్వాస కష్టంగా మారి బాధితుడు అత్యంత వేదనతో మరణిస్తాడు. పొలాల్లో మందు చల్లే సమయంలో ఇది చర్మం ద్వారా లేదా శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్షణ కవచాలు (PPE Kits) లేకుండా దీనిని వాడటం వల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మం కాలిపోవడం, గోర్లు రాలిపోవడం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం, పారాక్వాట్‌కు గురైన వ్యక్తుల్లో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం అధిక శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. అందుకే ఇప్పటికే 70కి పైగా దేశాల్లో దీనిపై నిషేధం విధించారు.
భారతదేశంలో రసాయన కలుపు మందులు రాకముందు, మన రైతులు ప్రకృతితో ముడిపడి ఉన్న పర్యావరణహితమైన పద్ధతులను అనుసరించేవారు. ఈ పద్ధతులు కేవలం కలుపును నివారించడమే గాక, భూసారాన్ని పెంచడానికి కూడా దోహదపడేవి. కూలీల సహాయంతో నేరుగా కలుపు మొక్కలను వేర్లతో సహా పీకివేయడం ఖర్చుతో కూడుకున్నదైనా, ప్రధాన పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చేస్తుంది. ఎడ్ల సహాయంతో లేదా చిన్న నాగళ్లతో వరుసల మధ్య ఉన్న కలుపును దున్నడం వల్ల నేల గుల్లబారి వేర్లకు గాలి అంది బలంగా పంట బాగా పెరిగేది. అంతర పంటలు, పంట మార్పిడి, మల్చింగ్.. ఇలా ఎన్నో సహజసిద్ధమైన కలుపు నివారణ పద్ధతులున్నాయి. వీటిద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి లభించేది. అయితే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో క్రమంగా ఇది తగ్గిపోయింది. ఒకప్పుడు పొలాల్లో ఒడ్ల మీద ఉన్న గడ్డిని పశువుల మేతకోసం కోసుకువెళ్లేవారు. ఇప్పుడు రైతుల దగ్గర పశువులు లేవు. గడ్డి అవసరం లేదు. కూలీలు దొరకట్లేదు. అందుకే కలుపు కనిపించిందంటే చాలు రైతులు గడ్డి మందులను ఆశ్రయిస్తున్నారు.
గడ్డి మందులపై పర్యావరణవేత్తలు, ఆరోగ్య శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల పంట ఉత్పత్తులు కూడా విషపూరితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గ్లైఫోసెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే గడ్డి మందు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘క్యాన్సర్ కారకం కావచ్చు’ అని గతంలోనే ప్రకటించింది. దీంతో, భారతదేశంలో దీని వాడకంపై ఆంక్షలు విధించారు. పెండిమెథాలిన్ అనే గడ్డి మందు విత్తనాలు మొలకెత్తక ముందే కలుపును నివారించడానికి దీనిని వాడుతుంటారు. ఇది జలచరాలకు (చేపలు, కప్పలు, వానపాములు) అత్యంత విషపూరితమైనది. పొలాల్లో ఇబ్బడి ముబ్బడిగా దీన్ని చల్లడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి భూసారం దెబ్బతింటుంది.
కేంద్ర ప్రభుత్వం 2020లో ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేస్తూ, పారాక్వాట్‌తో సహా మొత్తం 27 రకాల పురుగుల మందులను, గడ్డి మందులను నిషేధించాలని ప్రతిపాదించింది. కానీ, వేటిపైనా పూర్తి నిషేధం లేదు. అయితే, తెలంగాణలో గ్లైఫోసెట్ వాడకంపై అప్రకటిత నిషేధం/ కఠిన నియంత్రణ ఉంది. కానీ, పారాక్వాట్ సులభంగా దొరుకుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు పారాక్వాట్‌ను నిషేధిస్తున్న తరుణంలో, భారతదేశంలో దీనిని కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఆహార భద్రత ఎంత ముఖ్యమో, పౌరుల ఆరోగ్య భద్రత కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం తక్షణమే స్పందించి పారాక్వాట్ ఉత్పత్తి, విక్రయం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలి. అదే సమయంలో రైతులకు సహజసిద్ధ కలుపు నివారణ పద్ధతులపై అవగాహన కల్పించాలి.
బోయినపల్లి వినోద్‌కుమార్
పార్లమెంట్ మాజీ సభ్యులు
ఇవి కూడా చదవండి
పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్
ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి