పతనానికి ‘పరాభవ’మే నవ యుగాది!
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:13 AM
పరాభవ... ఈ పేరు వినగానే సహజంగానే అందరిలో ఆందోళన, భయం, సందేహం కలగడం సహజం. ఎందుకంటే ఇలా ఒక సంవత్సరం పేరే పరాభవం అనే ప్రతికూలాత్మక నామంతో ఉండడం...
పరాభవ... ఈ పేరు వినగానే సహజంగానే అందరిలో ఆందోళన, భయం, సందేహం కలగడం సహజం. ఎందుకంటే ఇలా ఒక సంవత్సరం పేరే పరాభవం అనే ప్రతికూలాత్మక నామంతో ఉండడం బుద్ధిజీవులను, మేధావులను అందరినీ కలవరపరచడం కూడా సహజమే. అయితే అసలు పరాభవ నామ సంవత్సరం గురించి, అందులో మానవులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి తెలుసుకోవడం అవసరం.
పరాభవం అనే పదానికి నిఘంటువులలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి. వాటిలో– ఓటమి, వినాశనం, పతనం, అవమానం, గాయం... లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మనిషి ప్రగతికి ఆటంకాలుగా, మానవజాతి వికాసానికి ప్రతిబంధకాలుగా నిలిచే అంశాలు. అందుకే మానవులు విజయాన్ని, ఆనందాన్ని, గెలుపును ఆశించినంతగా ఓటమిని, పతనాన్ని కోరుకోరు. అయితే ఒక సంవత్సరం పేరే ‘పరాభవ’ అనే నిర్ధారించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా పరాభవం అనే మాట పట్ల మహాభారతం, రామాయణం, భాగవతం, ఇతర పురాణాలు, ఉపనిషత్తుల్లో వేర్వేరు ఉదంతాలను కథలు కథలుగా చెప్పారు. నారద గర్వభంగం మొదలుకొని వివిధ మునులు, ఋషులు, తాపసుల గర్వభంగాల వరకు; అలాగే మహా శక్తిసంపన్నులైన రావణుడు, బలి, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వంటి వారు భంగపడ్డ తీరును, పరాభవం పొందిన స్థితిని మనకు మన పురాణాలు వివరించాయి.
బుద్ధిజంలో కూడా పరాభవం అనే భావనను మరింత లోతుల్లోకి వెళ్లి వివరించిన తీరు ఆలోచనాత్మకంగా ఉంటుంది. బౌద్ధ ధర్మంలో ‘త్రిపీటకాలు’– వినయ, సుత్త, అభిధమ్మ అనే పేర్లతో జ్ఞానాన్ని ప్రబోధిస్తుండగా, బుద్ధధర్మంలో ‘పరాభవ సుత్త’, ‘మంగళ సుత్త’ ప్రధానాంశాలుగా చెప్పవచ్చు. అందులో ‘పరాభవ సుత్త’ అనేది మనిషి పతనానికి కారకాలను సోదాహరణంగా, సహేతుకంగా వివరిస్తోంది. దీని ప్రకారం, మానవ పతన కారకాలుగా 12 రకాల ప్రవర్తనలను బౌద్ధ ధర్మం సూచిస్తోంది. ధర్మంపై ద్వేషం, దుష్టులతో స్నేహం, ఆకస్మిక–అనాలోచిత ఆగ్రహం, సోమరితనం నిద్ర, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం, అబద్ధాలు చెప్పడం, స్వార్థం, పిసినారితనం, అహంకారం, దుర్వ్యసనాలు, భాగస్వామితో తృప్తి లేకపోవడం, దుష్ట జనుల పరిపాలనకు సహకరించడం... వంటివి మనిషి వ్యక్తిగత, సామూహిక పతనానికి దారి తీసే ప్రవర్తనలుగా బౌద్ధ ధర్మం వివరించింది. సంస్కృత భాషలో ‘పరా’, ‘భవ’ అనే రెండు పదాలకు... జన్మకు అతీతమైన అనే అర్థం ఉంది. భవ అనే పదానికి– జన్మ, సృష్టి, ప్రాపంచిక ఐహిక జీవితం అనే అర్థాలు ఉన్నాయి. ఇక ‘పరా’ అనే పదానికి– అతీతమైన అనే అర్థం ఉంది. ఈ లెక్కన పరా భవ అని విశ్లేషిస్తే జన్మకు, మానవునికి అతీతమైన అంశాల ప్రభావం వల్ల మనిషి జీవితంలో ఏర్పడే పరిణామాలు, మార్పులు, సాఫల్య వైఫల్యాలు దీనిలో గోచరమవుతాయి.
పరాభవ నామ సంవత్సరం మానవాళికి ఒక హెచ్చరికగా, మనల్ని మనం మరొక్కసారి పునర్మూల్యాంకనం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యతను గుర్తుచేస్తున్న నినాదంగా భావించాలి. ఇక మరో కోణం నుంచి ఈ పరాభవ నామ సంవత్సరం చెబుతున్న సందేశం– ఈ ఏడాది పరాభవం అనేది మూలమంత్రం అయితే ఈ పరాభవం దేనికి? ఏ వెలుగులకి? మన వ్యక్తిత్వ వికాసానికి ఆటంకాలుగా నిలిచే అగౌరవం, అసూయ, ద్వేషం, ఆగ్రహం, అణిచివేత, అక్రమం, అన్యాయం, దోపిడీ, దుర్మార్గం దుర్జనత్వం, దుష్టత్వం, దుర్భాషలు, దౌర్భాగ్యం, పేదరికం, కరువు–కాటకాలు, దుఃఖం, మాంద్యం, సంక్షోభం, సంక్లిష్టత, విలంబం, విధ్వంసం, వినాశనం, వికృతి, తిరస్కృతి, తిరోగమనం, శతృత్వ భావన లాంటి అంశాలకు పరాభవం కలగాలని, తద్వారా మానవ ప్రగతికి, దోహదపడాలనే సందేశాన్ని మనం స్వీకరించవచ్చు.
డాక్టర్ మామిడి హరికృష్ణ
(సంచాలకులు, బీసీ స్టడీ సర్కిల్, తెలంగాణ)
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన