Share News

‘పంచాయతీరాజ్’ బలోపేతానికి సంస్కరణలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:04 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి పాలనను బలోపేతం చేయడానికి పలు సానుకూల చర్యలు చేపట్టడం అభినందనీయం. గ్రామసభలను చురుకుగా నిర్వహించడం, ప్రజల ప్రత్యక్ష...

‘పంచాయతీరాజ్’ బలోపేతానికి సంస్కరణలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి పాలనను బలోపేతం చేయడానికి పలు సానుకూల చర్యలు చేపట్టడం అభినందనీయం. గ్రామసభలను చురుకుగా నిర్వహించడం, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువలు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అదేవిధంగా ఈ–పంచాయతీ వ్యవస్థ, డిజిటల్ డాష్‌బోర్డులు, ఆన్‌లైన్ మానిటరింగ్, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల డిజిటల్ నమోదు వంటి చర్యల ద్వారా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకాలతో సమన్వయం చేసి గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడం కూడా ప్రశంసనీయమైన పరిణామం.

అయితే, ఈ పురోగతితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో కొన్ని సమస్యలు కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం పంచాయతీరాజ్ విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగాలు వేర్వేరుగా పనిచేయడం వల్ల సమన్వయ లోపం, పనుల పునరావృతం, నిర్ణయాలలో ఆలస్యం, అధికారులపై అదనపు భారం, ఉద్యోగుల సేవా సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఈ రెండు విభాగాలను విలీనం చేసి ‘కమిషనరేట్ ఆఫ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి’గా ఏర్పాటు చేయడం అవసరం. దీని ద్వారా పరిపాలనా సామర్థ్యం, ఆర్థిక నియంత్రణ, పర్యవేక్షణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతాయి. శాఖలో స్థిరమైన కేడర్ వ్యవస్థ లేకపోవడం మరో ప్రధాన సమస్య. అనేక కీలక పోస్టులు డిప్యుటేషన్ లేదా తాత్కాలికంగా ఏర్పాటై నడుస్తున్నాయి. దీనివల్ల బాధ్యతాయుత పరిపాలనకు భంగం కలుగుతోంది. కాబట్టి డిప్యుటేషన్ విధానాన్ని పరిమితం చేసి, శాశ్వత కేడర్ పోస్టులను క్రమబద్ధమైన నియామకాల ద్వారా భర్తీ చేయాలి. 2003లో జగన్నాథం కేసులో వచ్చిన తీర్పు ఆధారంగా ప్రభుత్వం జారీ చేసిన మెమోను అమలు చేస్తూ సిక్స్ పాయింట్ ఫార్ములా, స్థానిక కేడర్, జోనల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. శాఖలో ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడానికి ప్రత్యేక అంతర్గత ఆడిట్ విభాగం ఏర్పాటు చేయాలి. ట్రెజరీ, అకౌంట్స్ శాఖకు చెందిన అర్హులైన సిబ్బందిని వినియోగించి ఆడిట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అలాగే ఫైనాన్షియల్ కమిషనర్ పోస్టును సృష్టించి, సీనియర్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ స్థాయి అధికారిని నియమించాలి. దీని ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజా నిధుల వినియోగంపై సమర్థవంతమైన పర్యవేక్షణ, బడ్జెట్ నియంత్రణ, ఆర్థిక పారదర్శకత సాధ్యమవుతుంది. ప్రాంతీయ స్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం డిప్యూటీ కమిషనర్ హోదాలో జోనల్ అధికారుల పోస్టులను కూడా సృష్టించాలి.


స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, అధికార సంబంధిత వివాదాల పరిష్కారంలో ప్రస్తుతం సమర్థవంతమైన అప్పీల్ వ్యవస్థ లేకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, ఇతర స్థానిక సంస్థలకు సంబంధించిన అనేక కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల న్యాయం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ‘లోకల్ బాడీస్ ట్రైబ్యునల్’ ఏర్పాటు చేయడం అవసరం. ఎన్నికైన ప్రజాప్రతినిధుల అనర్హతలు, తీర్మానాల రద్దు, ఆర్థిక అధికారాలకు సంబంధించిన వివాదాలు, పరిపాలనా నిర్ణయాలపై అప్పీలు, ఇతర స్థానిక సంస్థల సమస్యలను ఈ ట్రైబ్యునల్ నిర్దిష్ట కాలపరిమితిలో విచారించి పరిష్కరించగలదు. దీని ద్వారా సాధారణ న్యాయస్థానాలపై భారం తగ్గడమే కాకుండా స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది.

గ్రామస్థాయి పరిపాలనలో సమన్వయం, బాధ్యతాయుత వ్యవస్థను నెలకొల్పేందుకు అన్ని గ్రామ సచివాలయాలను పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులకు అప్పగించాలి. దీని ద్వారా గ్రామస్థాయి సేవల అమలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం మరింత మెరుగుపడతాయి. ప్రస్తుతం కమిషనర్, పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల ప్రజా నిధులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనను నిర్ధారించేందుకు పై సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయాలి. ఇవి అమలులోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత పటిష్ఠమై, గ్రామ స్వరాజ్య లక్ష్యాల సాధనకు బలమైన పునాది ఏర్పడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తుంది.

టి.ఎం.బి. బుచ్చిరాజు

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్

ఈ వార్తలనూ చదవండి:

దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..

Updated Date - Jul 04 , 2026 | 01:04 AM