పల్లె పద్యం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:43 AM
చెలకలన్నీ కలెదిరిగి పరిగె ఏరుకొచ్చి చేతివేళ్ల చర్మం వొల్సుకపోతే రాలిన మక్క ఇత్తులే నా అక్షరాలు నాయిన వలసబోతే అమ్మ నాట్లేయవోతే...
చెలకలన్నీ కలెదిరిగి
పరిగె ఏరుకొచ్చి
చేతివేళ్ల చర్మం వొల్సుకపోతే
రాలిన మక్క ఇత్తులే
నా అక్షరాలు
నాయిన వలసబోతే
అమ్మ నాట్లేయవోతే
సాయింత్రం బడి యిడ్సినంక
బోరింగ్ కాన్నుంచి
నీళ్లు మోసుకొచ్చిన
గులాబీ పాదాలే
నా యీ కవితా పాదాలు
కట్టెల పొయ్యి మీద
వంట జేస్తున్న అమ్మకు
కట్టెలు ఎగనూకుతూ
నే దోసిలి వట్టిన
అమ్మ నొస్టి మీద రాలుతున్న
సెమట పలుకులే
నా సరళ అలంకార శిల్పం
ఎండాకాలం సెలవులల్లా
మట్టిల కంకరమాలు కల్పుతూ
ఎగశ్వాస దిగశ్వాస
దీసుకుంటున్నపుడు
నా ఎనిమిదో తరగతి గుండె కొట్టిన డప్పె
నా కవితకు అంతర్ లయ
పదిలా మండలంలా
సెకండొచ్చినా
ఏ భువనగిరికో, నాందేడుకో
పారకాడుగా పంపుతూ
బస్టాండ్‌లో నాయిన కార్చీన కన్నీళ్లే
నా కవిత్వంకు తడి
పుట్టిన రోజని
ఫించన్ పైసల్తో
కొత్త బట్టలు కొనుక్కోమనే
నాయిన లాంటి ఆరివారమున్నా
చుట్టూరా జీవితాలే
నా కవితా వస్తువులు
సల్ల సలికాలంలా
వోకిట్ల పయ్యంతా తూట్లు వడ్డ దుప్పటిలో
కాళ్లు ముడ్సుక పడుకున్న
పసితనమే నా కవిత్వం
అతినారపు హరిశంకర్
88863 63249
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు నిధులు కేటాయించని కేంద్రం
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్