Share News

పాత్ర చెప్పే కథలో రచయిత జాడలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:52 AM

నబొకొవ్ నవల ‘లొలిత’ను గురించి మాట్లాడటం మర్యాదస్తులకు ఇప్పటికీ నిషిద్ధమే. నలభై యేళ్ళ హంబర్ట్ హంబర్ట్‌ తన కూతురు వరసయ్యే పన్నెండేళ్ళ పాపను నిర్బంధించి ఆమెను పాడు చేసిన కథ చెప్పిన పుస్తకం...

పాత్ర చెప్పే కథలో రచయిత జాడలు

నబొకొవ్ నవల ‘లొలిత’ను గురించి మాట్లాడటం మర్యాదస్తులకు ఇప్పటికీ నిషిద్ధమే. నలభై యేళ్ళ హంబర్ట్ హంబర్ట్‌ తన కూతురు వరసయ్యే పన్నెండేళ్ళ పాపను నిర్బంధించి ఆమెను పాడు చేసిన కథ చెప్పిన పుస్తకం కాబట్టి మాత్రమే కాదు, ఆ కథను ఎంతో ఒప్పిదంగా ఆ నేరస్థుడి చేతనే చెప్పించిన పాపానికి కూడా.

కథకు సంబంధించిన ఈ రెండు దోషాలను ఉపేక్షించి అందులోని సమ్మోహకమైన వచనాన్ని ప్రేమించి, సాహిత్యపరంగా ఈ రచన ఒక కళాఖండం అని ఒప్పుకున్న పాఠకులు కూడా, నవలను నెరేట్‌ చేసే ఈ చెడు పాత్రనైనా క్షమించారు కానీ, నవల రాసిన రచయితను మాత్రం ఇప్పటికీ ఒక అశ్లీల రచన చేసాడని నిందిస్తూ నిలదీస్తూనే ఉన్నారు. నిజానికి నవలలో ‘‘అశ్లీల వర్ణన’’ కేవలం రెండు సందర్భాలకు మించి కనపడదు. ఆ రెండు సందర్భాలలోనైనా ఆ ప్రస్తావన కీలకం కాబట్టి.

నబొకొవ్ ఆత్మ తన కోటు భుజం మీద వాలిన ఈ ఆరోపణను చిటికెనవేలుతో విదిలిస్తుందేమో, బతికి ఉన్నప్పుడు మాత్రం ఆయన జవాబు ఇది: ‘‘విచక్షణ, విజ్ఞత గల పాఠకులు ఎందరో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకున్నారు, నా నవల గురించి ఇంతకంటే సమర్థనీయమైన వివరణ ఇవ్వవలసిన అవసరం లేదనుకుంటున్నాను.’’

నవలలోనే భాగమైన John Ray అనే కల్పిత ‘‘ఎడిటర్, పబ్లిషర్’’ ఈ నవలకు ‘‘ముందుమాట’’లో హంబర్ట్‌ హంబర్ట్‌ను, ‘‘వాడు దారుణమైనవాడు, పరమ నీచుడు, నైతికతకు పట్టిన కుష్టువ్యాధి, వాడు పడుతున్న నరకం కనపడుతూనే ఉన్నా, వాడిని పాపం అనటానికి వీలులేనంత హేయమైన వెధవ. ఎంత నిజాయితీగా వాడు తన పాపిష్టి నేరాలను ఒప్పుకున్నా, అవి క్షమార్హాలు కాలేవు,’’ అంటాడు. ఈ ఎడిటర్‌ను ప్రచ్ఛన్న నబొకొవ్ అనుకుంటే పాఠకుల ఆగ్రహానికి మరికొంత ఉపశమనం. పుస్తకం చదవటానికి ఈ ఉపశమనం అవసరం. ఈ చిన్న ‘ముందుమాట’ తర్వాత పుస్తకం ఆసాంతం హంబర్ట్ హంబర్ట్ ఉత్తమపురుషలో (ఫస్ట్‌ పెర్సన్‌లో) నడిపిన కథనమే ఉంటుంది.

ఒక నేరస్థుడైన పాత్రకు తన సాహితీ శక్తులన్నీ ధారపోసి, అతని చేతనే కథ చెప్పిస్తూ రచయిత తెర వెనక్కు తప్పుకున్నాడా? నబొకొవ్‌దీ, హంబర్ట్‌దీ ఒకటే స్వరమా? – ఈ ప్రశ్నలకు వెళ్ళేముందు, ఈ నవలను సాహిత్యంగా ఎందుకు చూడాలో, నెరేటర్‌ హంబర్ట్‌ హంబర్ట్ సాహిత్య జ్ఞానం ఎంతో, అతను తన నేరపు కథను ఒప్పించే విధంగా నిర్వహించేందుకు తన వచనాన్ని ఎలా వాడుకున్నాడో చూద్దాం.


ఈ అనైతిక కథను రచయిత ఎందుకు రాసినట్టు? ఇప్పుడు హంబర్ట్‌ను శపించాలా క్షమించాలా? అనే మీమాంసలు బేరీజు వేయటానికి కాదు ఈ నవలను చదవాల్సింది. ఈ నేరెటివ్‌లో సాహిత్యం ఏ స్థాయిది, హంబర్ట్ హంబర్ట్‌ నేరెటివ్‌కు ఉన్న శక్తి ఎటువంటిది, నేరెటివ్‌లో ‘‘ధ్వని’’ని ఎలా పట్టుకోవాలి అనేవి చూసేందుకు కాకుండా ఈ పుస్తకాన్ని సమీపిస్తే, నోటికి చిక్కం కట్టుకుని ఉలవల ఫలహారానికి వెళ్ళినట్టే!

కథ కన్నా ముందే కథనం రంగంలోకి దిగిన రచన ‘Lolita’. నవలలో హంబర్ట్ హంబర్ట్‌ పాత్ర రెండు మూడు భాషలలో పండితుడు, మనస్తత్త్వశాస్త్రం చదివినవాడు, పైగా సాహిత్య అధ్యాపకుడు, కథనానికి ఉన్న శక్తి తెలిసినవాడు. Dolores Haze అని లక్షణమైన పేరు ఉన్న పన్నెండేళ్ళ పిల్లకు ‘Lolita’ అని నామకరణం చేసి, ఆ పేరునే తన కథకు శీర్షికగా పెట్టిన హంబర్ట్ హంబర్ట్‌, నవల టైటిల్ దగ్గర నుంచే తన కథనపు వలను పాఠకుల పైకి విసురుతాడు.

‘Lolita’ పేరును తను ఎలా పలుకుతాడో, తన నాలుక ఆ మూడక్షరాలను ఎలా పుట్టిస్తుందో వివరిస్తూ, నిదానంగా ఉచ్చరిస్తూ, ఆ శబ్దాక్షరాల రుచి ఎరిగినవాడిలా పలికేటప్పుడు పాఠకులకు ఏమి వినపడుతుంది? అక్షరాలను, వాటి శబ్దాలను, వాటిని తనకు కావలసిన ధ్వనిని పలికించటానికి వాడుకునే కళ గొప్పగా తెలిసినవాడు అని తెలుస్తుంది. ‘Lo–lee–ta’ (‘t’, ఇక్కడ interdental sound అన్నాడు, పైగా రష్యన్ భాషలోనూ, ఈ లోలిత అనేది Dolores అనే ఆమె పేరుకు స్పానిష్ భాషలోని diminutive కావటం చేత, ఆ రెండు భాషల్లో ‘ట’ను ‘త’గా పలుకుతారు కాబట్టి) ‘లొ–లి–త’, సరిగ్గా ఆమెకు తను పెట్టిన పేరు. ‘‘లొ–లి–త నా జీవితానికి వెలుగు, నా కామంలో జ్వాల. నా పాపం, నా ఆత్మ.’’ – ఈ విధంగా మొదలవుతుంది హంబర్ట్‌ హంబర్ట్ కథన ప్రేలాపన. తర్వాత వచ్చే మూడో వాక్యంలోనే ‘నింఫెట్’ (పిల్ల వగలాడి) అనే పదాన్ని సృష్టించి లొలితకు ఆ ముద్ర వేసేస్తాడు. ఆమె ఒక నిమిషం తన guiding light Beatrice, మరో నిమిషం alluring nymphet! ఒక వాక్యంలో పసి వేశ్య, మరొక వాక్యంలో దివ్యబాలిక.

తను ఆమె పాలిటి పిశాచం అవుతూనే, ఇంతలో ఆమె కోసం విలపించే తండ్రిని (లొలితను రెండు చేతుల్లో వేసుకుని ఆమెను చూసి జాలి పడుతూ శోకిస్తున్నప్పుడు, కోర్టీలియా శవాన్ని చేతుల్లో మోస్తూ విలపించే కింగ్ లియర్‌ను) ధ్వనిస్తాడు. పన్నెండేళ్ళ Dolores Haze పట్ల తన అమానవీయ కోరిక, ఆమె నిస్సహాయతల విషాదాన్ని రెండు దివ్యాత్మల ప్రేమ కావ్యంగా గ్రంథస్థం చేసే ప్రయత్నం చేస్తాడు హంబర్ట్ హంబర్ట్.


‘లొలిత’ ఉనికిని ఒక అలౌకిక సాన్నిధ్యంగా భావిస్తున్నా డన్నట్టు ఉంటాయి ఆమెను గురించిన అతని వర్ణనలు. ఆమె భుజాల ఒంపుల వెంబడి జారే వెలుతురు రేఖలను, బంగారపు దారాలతో నేసినట్లున్న ఆమె తలకట్టు మెరుపునూ చూస్తున్నప్పుడు ఆమె తనకు ఒక అలౌకిక ఉనికి వలె తోస్తుంది అని పాఠకులను నమ్మిస్తాడు. ఇంతలోనే ఆమెను భౌతికంగా వాంఛిస్తాడు.

ఇక, హంబర్ట్ రచనా ప్రకర్ష విషయానికి వస్తే– పూర్వ సాహిత్య సాంప్రదాయ దశలైన మౌఖిక, నాటక పద్ధతులను, తర్వాతి దశలైన నవలరచనా శైలిని, ఒక్కటి వదలకుండా వాడుకున్నాడు. చివరకు తన కథనాన్ని అదొక వాంగ్మూలం అనే ధ్వనితోనూ వినిపిస్తాడు. పూర్వకవుల, కావ్యాల స్మరణా చేస్తాడు. వర్జిల్‌ను, బైబిల్‌ను, డాంటే జాడలను వాడుకుంటూ, ఇంగ్లిష్ కవులు రాబర్ట్‌ బ్రౌనింగ్‌, ఎడ్గార్‌ అలెన్‌ పో కవిత్వ సామగ్రిని అందుకుంటూ, తన కథనాన్ని రాచమార్గం మీదకు తెస్తాడు. హాస్యం, శోకం, మోహం, భయానకం, బీభత్సం, విషాదం, కరుణ అన్ని రసాలనూ ఆవిష్కరిస్తుంది కథనం. మరి, నబొకొవ్ ఇలా తన సాహిత్యవనరులన్నీ పూర్తిగా హంబర్ట్ హస్తగతం చేసి చూస్తూ ఊరుకున్నాడా చివరివరకూ, ‘‘లొలిత కథ నీవు చెప్పు’’ అని?

కథ చెప్పే పాత్ర స్వరానికి ఎంత స్వతంత్రత ఇస్తాడు సర్వసాక్షి రచయిత? ఎంత సార్వభౌమాధికారాన్ని చెలాయించగలడు ఉత్తమ పురుష (ఫస్ట్‌ పెర్సన్‌) కథకుడు? Author authority ని కథ నెరేట్‌ చేసే పాత్ర తప్పించుకోగలదా? రచయిత చేతిలోని కళ్ళాలు కథ నెరేట్‌ చేసే పాత్రను ఎంత నేర్పుతో పట్టి ఉంచుతాయి? – పుస్తకంలో ఈ ప్రశ్నల జవాబులను చూడటమే రచన ప్రయోజనం.

అందుకే ‘Lolita’ అశ్లీల కథ కాదు. కథనానికి ఉన్న శక్తిని తెలియచెప్పే కథనాన్ని కథగా అల్లిన రచన ఇది. Narrative of narratology.

Unreliable narrator ఐన హంబర్ట్ హంబర్ట్‌ తన కథనాన్ని చాలా విజయ వంతంగా నిర్వహించాడు అనటానికి సాక్ష్యం– ఈ కపట నెరేటర్‌పై జాలిపడే వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉండటమే. మరీ ఘోరమైన విషయం కొంతమంది పాఠకులు ‘లోలిత’ను హంబర్ట్ లాగే ఆరాధించారు, ఆమె పొందు మోక్షం వంటిది అని కవితలు రాశారు. ఇలాంటి పఠనాలన్నీ పాఠకుల ఓటమికి సాక్ష్యాలే.

మరి, రచయితగా నబొకొవ్‌ గెలుపు ఎక్కడెక్కడ ఉంది పుస్తకంలో?

కథనాన్ని నడిపే పగ్గాలను తన హస్తగతం చేసుకున్నాననుకున్న హంబర్ట్ హంబర్ట్‌ లోకి, వాడికే తెలియకుండా నబొకొవియన్ సెన్సిబిలిటీ దూరినప్పుడల్లా అది నబొకొవ్ గెలుపే.

పుణ్యకథలే కాదు, అబద్ధపు చరిత్రే రాద్దామని కూచున్నా రాసేవాడు మొత్తం పాపమే రాయలేడు, తన విస్మరణలో రచనను దాని జోలికి దాన్ని వదులుతాడు, అప్పుడు రచన తనను తాను రాసుకుంటుంది. రాత తాలూకు సత్వమూ, సత్యమూ అదే.

రచయిత త్రికరణశుద్ధిగా వ్యక్తిగా తనను త్యజించుకున్నప్పుడు (‘‘Extinction of the personality’’ – T.S. Eliot), అసలు రచన మొదలవుతుంది.

‘‘రచన ఒక నిర్మలీకరణక్రియ’’ – నవోయ షిగా.


అది ఈ నవలలో జరిగింది.

హంబర్ట్ హంబర్ట్‌ది మానసిక వైకల్యం అనీ, లొలిత దానికి బలి అయిపోయిందనీ గ్రహించే పఠనం ఈ నవలకు దొరికిన ప్రతి సందర్భమూ నబొకొవ్ గెలుపే!

హంబర్ట్ లొలిత అని పిలుచుకున్న పన్నెండేళ్ళ పిల్లకు నవలలో నబొకొవ్ పెట్టిన పేరు ‘Dolores Haze’ – ఈ పేరుకు అర్థం, దాని మహత్వం తెలిసినవారు హంబర్ట్‌ హంబర్ట్ కన్నా నబొకొవ్ ఆరాకులు ఎక్కువ చదివాడని, హంబర్ట్ వంటి పైశాచిక ప్రవృత్తి అతనిది అసలే కాదని గ్రహిస్తారు.

నవలను ముగింపులో ఒక సన్నివేశం ఉంటుంది. తన ప్రత్యర్థిని హత్య చేసి పారిపోతూ కారు ఫెయిల్ అవటం వల్ల ఒక కొండ మలుపులో ఆగిపోతాడు హంబర్ట్ హంబర్ట్‌. ఆ కొండ పక్కనే లోయ. అది సాయంత్రం సమయం. లోయలోకి తొంగిచూస్తే ఒక చిన్న టౌన్‌షిప్‌. అక్కడ నుండి అతనికి కనపడేది:

‘‘ఇళ్ళ నిర్దుష్టనిర్మాణాకృతులు, స్పష్టంగా వీధులు, పచ్చటి తలల చెట్లు, ఊరి చివర ముదురు రంగువీ లేత రంగువీ పంటపొలాలు, పోకవక్క రంగులో కొండలు... ఆ వర్ణాలన్నీ పరస్పర సాహచర్య సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాయి...’’ (అక్కడ అంతా అన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి, ఆ వ్యవస్థలో ఉన్న ఒక స్వస్థతను గ్రహిస్తున్నాడు హంబర్ట్ హంబర్ట్.)

కానీ వీటన్నిటినీ మించి ఒక శబ్దం వినపడుతుంది హంబర్ట్‌కు: ‘‘నేను విన్నది మరేదో కాదు, ఆడుకుంటున్న పిల్లల మధురసంగీతం. అప్పుడు గాలి ఎంత తేటగా ఉందంటే లోయలో శబ్దాలను ఒక పారదర్శక తెరలాగా మోసు కొస్తోంది వాటిని, కొన్ని గంభీరంగా ఉన్న గొంతులు, మంద్రంగా కొన్ని గొంతులు... అవన్నీ కలిసిపోయి వినిపిస్తూ ఉన్న ఆ సామూహిక స్వరాల ఆవిరితెరలో, మధ్యమధ్యలో స్పష్టంగా ఒక నవ్వు, బేస్‌బాల్‌ బేట్‌ విదిలింపు, బొమ్మరైలు లాగుతున్న చప్పుడూ వినపడుతున్నాయి. ఆ శ్రావ్యమైన శబ్దాన్ని వింటూ ఉండిపోయాను, తెరలు తెరలుగా అప్పుడొకటీ అప్పుడొకటీ మెరుపుల్లా ఒక పిల్లో పిల్లవాడో సంతోషంతో వేస్తున్న కేకలు, వాటికి నేపథ్యంగా మెల్లని మాటల ధ్వని... ఉన్నట్టుండి ఒక విషయం బాణంలా గుచ్చుకుంది, లొలిత నా పక్కన లేదన్న విషయం కాదది, కింద లోయనుంచి వినవస్తున్న ఆ సందోహపు ఏకతాళంలో లొలిత గొంతు లేదు కదా అనే స్పృహ.’’


ఈ వచనం కాళిదాసు స్థాయిది. షేక్స్‌స్పియర్‌ స్థాయిది, మనకు మనసొప్పకపోయినా ఒప్పుకోవాల్సిన మాట. పంచేంద్రియాలలో ఒక్కొక్కటీ తక్కిన నాలుగు ఇంద్రియాల పని కూడా చేసే కవి తప్ప రాయలేడు ఇలా. (‘‘హత్యలు చేసేవాడు చక్కని వచనమూ రాయగలడు’’ అని హంబర్ట్ ప్రగల్భం!)

కవిత్వ ప్రతిభ సరే, చివర్లో వచ్చిన ఈ స్పృహకు; స్వర్గతుల్యమైన బాల్యాన్ని ఆ పన్నెండేళ్ళ పిల్లకు లేకుండా చేసానన్న ఈ స్పృహకు, మూలాలు ఎక్కడ ఉన్నాయి? హంబర్ట్ హంబర్ట్ పైశాచికత్వంలోనా? నబొకొవియన్ సెన్సిబిలిటీ నిద్రలేపిన హంబర్ట్‌ లోని మానవత్వంలోనా?

హైగీలియన్ సింథసిస్ అనవచ్చా దీన్ని కూడా!

కలం తన చేతిలోనే ఉంది అనుకున్న హంబర్ట్‌ హంబర్ట్ పాత్ర చేత, చివరికైనా తను చేసిన పాపం తనకు తెలిసివచ్చే విధంగా కథనాన్ని కొండమలుపు తిప్పింది ఎవరు?

హంబర్ట్ హంబర్ట్ నడత, అది వాడి instinct; దాని కథను తనకు నచ్చినవిధంలో చెప్పిన హంబర్ట్‌లోని నెరేటర్‌ది intelligence; ఆ తెలివిని జాగరూకతతో తన పర్యవేక్షణలో ఉంచుకున్నది రచయితగా నబొకొవ్‌ తాలూకు wisdom. మొదటినుండీ నెరేషన్‌ను తన అధీనంలో ఉంచుకున్న నెరేటర్ చివరకు రచయితను గెలవనిచ్చిన నవల ఇది.

అదే ఈ రచన తాలూకు విజయం, దాని ప్రయోజనం కూడా.

పద్మజ సూరపరాజు

padmajasuraparaju@gmail.com

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 12:52 AM