Share News

కొత్త రాజ్యాంగం ఎలా ఉండాలి?

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:52 AM

మానవ నాగరికతల గమనం అనూహ్య వేగంతో, ఆశ్చర్యకరమైన, అదే సమయంలో భయ విహ్వలమైన మార్పులతో సాగుతోంది. ఈ చారిత్రక దశ (21వ శతాబ్ది)లో ప్రజాస్వామ్య వ్యవస్థలకు మార్గదర్శకత్వం వహించే ఒక సరికొత్త...

కొత్త రాజ్యాంగం ఎలా ఉండాలి?

మానవ నాగరికతల గమనం అనూహ్య వేగంతో, ఆశ్చర్యకరమైన, అదే సమయంలో భయ విహ్వలమైన మార్పులతో సాగుతోంది. ఈ చారిత్రక దశ (21వ శతాబ్ది)లో ప్రజాస్వామ్య వ్యవస్థలకు మార్గదర్శకత్వం వహించే ఒక సరికొత్త రాజ్యాంగం ఎలా ఉండాలి? ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న భారతదేశ పౌరులమైన మనకు ఆ ప్రశ్న ఒక విధమైన ఆందోళన, భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉన్నందున. ట్రంప్‌ అమెరికాలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సంక్షోభం, యూరప్‌లో కరుడుగట్టిన మితవాదశక్తులకు క్రమేణా పెరుగుతున్న రాజకీయ ప్రాబల్యాన్ని గమనిస్తే ప్రజాస్వామ్యానికి దాపురిల్లుతోన్న దయనీయ స్థితి అవగతమవుతుంది. ఈ పరిణామాల దృష్ట్యా ‘21వ శతాబ్దానికి కొత్త రాజ్యాంగం ఎలా ఉండాలి? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఎంత అత్యవసరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగాన్ని ఒక నామవాచకంగా మాత్రమే కాకుండా ఒక క్రియగా చూడాలి. ఒక ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడం, నిర్మించడం అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరమున్నది. అలా ఆలోచిస్తే కొత్త రాజ్యాంగం అనే భావన ప్రజాస్వామ్య భవిష్యత్తును వినూత్నంగా ఊహించేందుకు అవకాశం కల్పిస్తుంది.

సదరు ప్రపంచ ప్రశ్నకు సమాధానమివ్వగల విశిష్టత భారత ప్రజాస్వామ్యానికి ఉందని నిశ్చితంగా చెప్పవచ్చు. నిజమే, మన ప్రజాస్వామ్యం ఇప్పుడు సవ్యంగా లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రజాస్వామ్య పతనానికి ఒక ఉదాహరణగా ఉంది. అయితే ప్రజాస్వామ్య పునరుజ్జీవానికి, ప్రభావదాయక వికాసానికి దోహదం చేసే కొత్త ఆలోచనలను అది అందించగలదని కూడా మనం నమ్మకంగా చెప్పగలం. పురానవ భారతీయ భావన స్వరాజ్‌నే తీసుకోండి. ప్రజాస్వామ్య ఆదర్శాన్ని సమున్నతపరిచే భావన అది, సందేహం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నను సాధారణంగా వివేచించినప్పుడు ప్రజల స్వయం పాలన, పాలకులతో ప్రజలకు ఉండే సంబంధాల తీరుతెన్నులు ప్రధానంగా ఆలోచనకు వస్తాయి. తమ పాలకులను ఎన్నుకునేందుకు, ఎన్నుకున్న తరువాత వారు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా జాగ్రత్త వహించేందుకు పౌరులకు సమాన హక్కు ఉండాలన్నది ప్రజాస్వామ్య భావన. అయితే పౌరుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే విషయమై మనం పెద్దగా శ్రద్ధ చూపం. ఇదిగో ఇక్కడే స్వరాజ్‌ భావనకు గాంధీజీ ఒక భిన్నమైన, మౌలిక అర్థాన్ని సమకూర్చారు. స్వరాజ్‌ అంటే కేవలం స్వయం పాలన మాత్రమే కాదని, అది మనల్ని మనం నియంత్రించుకోవడమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పౌరుడూ తన తోటి పౌరులతో నైతిక విలువల స్ఫూర్తితో సంబంధాలు నెరపడమే స్వరాజ్‌ అని గాంధీజీ అన్నారు. ఇటువంటి స్వరాజ్యమే ప్రజాస్వామ్య సమస్యలకు పరిష్కారాలను సమకూర్చగలదు. ఈ వినూత్న స్వరాజ్‌ భావన ప్రకారం ఒక ప్రజాస్వామిక సమాజం ఉమ్మడి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. నిష్పాక్షిక చర్చలు, స్వయం నియంత్రణ అనేవి అటువంటి ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ప్రాతిపదికలుగా ఉంటాయి. సౌభ్రాతృత్వం అనేది ప్రజాస్వామ్య పరిపుష్టికి ఒక ప్రాథమిక నిబంధన అని డాక్టర్‌ అంబేడ్కర్‌ సైతం నొక్కి చెప్పడం గమనార్హం. సమాజంలో సహోదరభావం లేనప్పుడు ప్రజాస్వామ్యం ఆచరణలో విజయవంతమవదని ఆయన స్పష్టం చేశారు.


ప్రజాస్వామ్యం అంటే కేవలం మంచి వ్యవస్థలు ఉండడం మాత్రమే కాదు, ప్రజాస్వామిక పద్ధతుల బలమైన ఆచరణ కూడా. ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్షలు సహజంగా ఉంటాయి. అయితే సమాజ సమష్టి జీవనంలో ప్రజాస్వామిక పద్ధతులను నియమబద్ధంగా పెంపొందించాల్సి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడమంటే ప్రజాస్వామిక పద్ధతులను పరిపుష్టం చేయడమే. పంటల సాగు కార్యకలాపాలు ప్రజాస్వామిక పద్ధతులు, సుగుణాలను ఎలా పెంపొందిస్తాయో మానవ శాస్త్రవేత్త ముకూలికా బెనర్జీ తన పరిశోధనా గ్రంథం ‘కల్టివేటింగ్‌ డెమొక్రసీ’లో వివరించారు. ప్రజాస్వామ్య సంస్కృతిని నిర్మించేందుకు, సుస్థిరం చేసేందుకు సమాజంలో పరస్పర సంబంధాలు సోదరభావంతో ఉండాలి. సమాజ సభ్యులందరికీ ఒక ఉమ్మడి లక్ష్యం ఉండాలి. నిత్య పరిణామశీల కాలంలో ప్రభవించే ప్రతి కొత్త తరానికీ ఆ ఉమ్మడి లక్ష్యాన్ని మళ్లీ మళ్లీ వివరించాలి. సద్వర్తనులు అయిన రాజకీయ నాయకులను రూపొందించుకోవాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలలో స్వార్థ ప్రయోజనాలకు యథాలాపంగా పాల్గొనే వారికి కాకుండా ఒక సమున్నత ఆశయానికి నిబద్ధమై, దాన్ని సాధించేందుకు అంకితమయ్యే ఆదర్శవాదులకు అధిక ప్రాధాన్యమివ్వాలి.

21వ శతాబ్దిలో ప్రజాస్వామిక వ్యవస్థల రూపకల్పన విషయమై పునరాలోచనకు 20వ శతాబ్ది భారతీయ రాజకీయ ఆలోచనాపరుల భావ స్రవంతి విశేషంగా దోహదం చేయగలదు. వారందరూ పరిపూర్ణ ప్రగతిశీలురు, స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల తీరుతెన్నుల సార్థకతను సంశయించినవారే. ‘ప్రజా స్వామ్య సాఫల్యతకు అంబేడ్కర్‌ నొక్కి చెప్పిన ప్రాథమిక నిబంధనలు, మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రతిపాదించిన పార్టీ రహిత ప్రజాస్వామ్యం, భారతదేశ రాజ్య పాలనా పద్ధతుల పునర్నిర్మాణం విషయమై జయప్రకాశ్‌ నారాయణ్‌ వాదనలు, అధికార వికేంద్రీకరణకు రామ్‌మనోహర్‌ లోహియా సూచించిన చౌకంభా రాజ్‌ (గ్రామం, జిల్లా, రాష్ట్రం, కేంద్రం అనే నాలుగు స్తంభాల రాజ్యం) మొదలైన విశిష్ట ఆలోచనలు ఏవీ వారి వారి జీవిత కాలంలో విస్తృత స్థాయిలో ఆమోదం పొందలేదు. ప్రస్తుత కాలంలోనూ ఆ భావాలను వాటి మౌలిక రూపంలో అనుసరించలేము. అయితే ఆధునిక ప్రజాస్వామ్యాలలో మనం ప్రశ్నించకుండా, సహజమైనవిగా భావించే కొన్ని ప్రాథమిక వ్యవస్థలను, విశ్వాసాలను సరికొత్తగా పునర్నిర్మించుకునేందుకు అవి తప్పక దోహదం చేస్తాయి.


ఆధునిక ప్రజాస్వామ్యాలలోని లోపాలు, లొసుగులు కొన్నిటిని నిశితంగా చూద్దాం. ఈ ప్రజాస్వామ్యాలు చాలా విస్తృతస్థాయిలో పనిచేస్తుండడంతో స్వయం పాలన అనేది అర్థవంతంగా అమలవడం అసాధ్యమవుతోంది. జాతి రాజ్యాలు, వాటిలోని పాలనా విభాగాలు సైతం అదుపు చేయలేనివిగా ఉంటున్నాయి. ప్రయోజనకరమైన స్వయం పాలనను అవి అనుమతించడం లేదు. ఒక సమస్య ఏ స్థాయిలో కనిపిస్తుందో, దానిని పరిష్కరించే శక్తి లేదా అధికారం అంతకంటే భిన్నమైన, సాధారణంగా చాలా పై స్థాయిలో ఉంటుంది. ఈ రెండిటి మధ్య పొంతన ఉండడం లేదు. ఫలితంగా ప్రజల సమస్యలు తీరకపోగా అవి మరింత సంక్లిష్టమవుతున్నాయి. ప్రజాస్వామిక పాలనా వ్యవస్థను క్రింది స్థాయి నుంచి వికేంద్రీకరించాలనే వాదన ఒకటి ఉన్నది. ఈ వికేంద్రీకరణ అనేది ‘సబ్సిడియారిటీ సూత్రం’ (ఒక సమస్యను పరిష్కరించడం లేదా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది దానికి అత్యంత సమీపంలో ఉన్న, సమర్థంగా పరిష్కరించగల లేదా మెరుగ్గా తీసుకోగల కింది స్థాయి అంటే స్థానిక పాలనా వ్యవస్థలే పరిష్కరించడం లేదా తీసుకోవడం) ప్రకారం జరిగి తీరాలి. ప్రతి 5 లేదా 4, లేదా 2 ఏళ్లకు జరిగే ఎన్నికల కాల పరిమితి ఒకే సమయంలో ఇది చాలా తక్కువగానూ, చాలా ఎక్కువగానూ ఉంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజాహిత పాలన చేస్తున్న ప్రభుత్వాలకు ఐదేళ్ల కాలం సరిపోదు. సమాజానికి జరగాల్సిన మేలు అసమగ్రంగా ఉండిపోతుంది. ఇక స్వార్థ ప్రయోజనాలకు ప్రజాకంటక పాలన చేసే ప్రభుత్వాలను అధికారం నుంచి తొలగించేందుకు ఐదేళ్ల వ్యవధి చాలా ఎక్కువ సమయం. ఆధునిక ప్రజాస్వామ్యాలలోని మరో ముఖ్యమైన లోపం ఎన్నికలలో సాధారణ మెజారిటీతో గెలిచిన రాజకీయ పక్షాలకు సర్వాధికారాలను అప్పగించడం. దీనివల్ల చాలా హాని జరుగుతుంది. నేడు పలు దేశాలలో మెజారిటేరియన్‌ పాలనాధోరణులు ప్రబలిపోవడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్య వ్యవస్థ దారి తప్పడం కానే కాదు. మనం ప్రజాస్వామ్యంగా పరిగణిస్తున్న వ్యవస్థ అంతర్గత రూపకల్పన నుంచే ఆ హానికర ధోరణులు ఉత్పన్నమవుతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే దానికే పూర్తి అధికారాలు అప్పగించాలని మనం నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య నియమమే నిరంకుశ పాలనకు దారితీస్తుందన్న సత్యాన్ని మనం గుర్తించాలి.


ప్రజాస్వామ్యానికి అవరోధమవుతున్న వ్యవస్థీకృత లోపాలు, లొసుగులను కూడా ఆధునిక భారత రాజకీయ ఆలోచనాశీలురు మన దృష్టికి తెచ్చారు. కులం, వర్గం మొదలైన సామాజిక అసమానతలు ప్రజాస్వామిక పద్ధతులను అపహాస్యం చేస్తున్నాయి. కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామాజిక, ఆర్థిక అధికారాల కేంద్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. సమాన హక్కులు ఉన్న పౌరుల స్వయం పాలన భావనకు ఆ అధికారాల కేంద్రీకరణ పూర్తిగా విరుద్ధమైనది. సమాచార, ప్రసార మాధ్యమాలు కార్పొరేట్‌ సంస్థల నియంత్రణలో ఉండడం వల్ల ప్రజాస్వామిక ప్రజాభిప్రాయం పెంపొందడానికి తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్పొరేట్‌ నియంత్రిత, పాలకవర్గాల అనుకూల పత్రికలు, టీవీలు మొదలైనవి అసంపూర్ణ సమాచారాన్ని, లేదా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా ప్రజాస్వామ్యం పథ భ్రష్టమవుతున్నది. ధనవంతులు, రాజకీయవేత్తలకు మాత్రమే అది ప్రధానంగా ఉపయోగపడుతోంది. దశాబ్దాలుగా పాత పద్ధతులకు, ఆలోచనా రీతులకు లోబడి మార్పును ఏ మాత్రం అంగీకరించలేని ఆస్తిపరులు, స్వార్థ రాజకీయవేత్తల సమూహ పాలనకు అది దారితీస్తోంది. సంపన్న కులీన వర్గాల పాలన శ్రామిక ప్రజల శ్రేయస్సును పూర్తిగా ఉపేక్షిస్తోంది. ఇరవయో శతాబ్దంలో ప్రజల హక్కులకు ప్రాధాన్యం పెరిగింది. తత్ఫలితంగా వాటి రక్షణకు చాలా దేశాలు తమ రాజ్యాంగాలలో ‘ప్రాథమిక హక్కుల’ పేరిట వివిధ నిబంధనలను పొందుపరుచుకోవడం అనివార్యమయింది. అలాగే 21వ శతాబ్దంలో కార్పొరేట్లలో ఆర్థిక అధికారాల కేంద్రీకరణ, జన మాధ్యమాలలో సమాచార ప్రవాహ నియంత్రణ, రాజకీయ పార్టీలలో నిర్ణయాధికారాల కేంద్రీకరణను నిరోధించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు ఉండడం అంతకంటే ముఖ్యం.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

(ఈ నెల 11న బోస్టన్‌ పబ్లిక్‌ లైబ్రరీలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో యోగేంద్రయాదవ్‌ వెలువరించిన ఉపన్యాసం ఈ వ్యాసానికి ఆధారం)

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:52 AM