అంతిమ పరిష్కారం.. ‘నీట్’ రద్దు!
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:53 AM
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో జెన్ జీ యువత, విద్యార్థులు ఇటీవల ఒక అపూర్వ నిరసన చేపట్టారు. ఆ ఆందోళన ఫలితంగా కాలవాహినిలో మరుగున పడిన వివిధ అంశాలు మళ్లీ తెరపైకి వచ్చాయి...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో జెన్ జీ యువత, విద్యార్థులు ఇటీవల ఒక అపూర్వ నిరసన చేపట్టారు. ఆ ఆందోళన ఫలితంగా కాలవాహినిలో మరుగున పడిన వివిధ అంశాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వాటిలో ఒకటి– ‘నీట్’ రద్దు; మరొకటి– ‘విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి రాష్ట్రాల జాబితాలోకి తిరిగి చేర్చడం’.
వైద్యవిద్యా కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే ‘నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్’ (నీట్)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాటి నుంచీ అది వివాదాస్పదంగానే ఉన్నది. వైద్య విద్యలో శిక్షణ కోసం రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల వల్ల అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో పాటు విద్యార్థులపై విపరీతమైన ఆర్థిక భారం పడి, వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నందున జాతీయ స్థాయిలో ఒకే విధమైన ప్రవేశ పరీక్ష ఉండాలని కొందరు నిపుణులు సూచించారు. వైద్య విద్యలో ప్రవేశించడానికి అవసరమయ్యే అర్హతా పరీక్ష జాతీయ స్థాయిలో ఒకేవిధంగా ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సైతం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సూచనల మేరకు కేంద్రం 2013లో వైద్య విద్యకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టింది. అయితే, అప్పటి నుంచి ఈ ఏడాది వరకు 5 సార్లు ‘నీట్’ నిర్వహణలో పలు అక్రమాలు సంభవించాయి. ఆ అవకతవకలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వైద్య ప్రవేశ పరీక్షను పూర్తిగా రద్దు చేసి తిరిగి నిర్వహించిన సందర్భాలు... గతంలో 2015లో AIPMT విషయంలో, తాజాగా 2026లో నీట్ విషయంలో చోటుచేసుకున్నాయి. ఇది గమనార్హమైన వాస్తవం. ‘నీట్’కు ప్రతి ఏటా హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య సగటున 21 లక్షలు ఉంటుండగా, వారిలో 11 నుంచి 13 లక్షల మంది దాకా అర్హత సాధిస్తున్నారు. వీరిలో కేవలం 1 లక్షా 10 వేల నుంచి 1 లక్షా 25 వేల మంది వరకూ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశం పొందుతున్నారు. అంటే, ‘నీట్’ రాసిన వారిలో సీట్లు పొందేవారి సంఖ్య కేవలం 6 శాతంగా మాత్రమే ఉంటోంది.
విధానపరంగా చూసినప్పుడు జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం అన్నది సముచితంగా కనిపిస్తోంది. అయితే ‘నీట్’ నిర్వహణలో అనేక లోపాలు, వైరుధ్యాలు ఉన్నాయనేది ఒక వాస్తవం. లక్షలాది విద్యార్థుల జీవితాలతో ముడివడి ఉన్న ‘నీట్’ను లోపరహితంగా నిర్వహించలేకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది (2026) ‘నీట్’ పరీక్ష రద్దు కావడంతో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జీవితాన్ని పణంగా పెట్టి కష్టపడి చదివే విద్యార్థులకు పేపర్ లీకేజీ వంటి అక్రమాలు అశనిపాతంగా పరిణమిస్తున్నాయి. పరీక్ష రద్దు కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికిలోనై కుప్పకూలిపోతున్నారు. రెండోసారి ఫీజు లేకుండా పరీక్ష నిర్వహించినప్పటికీ.. అందుకు చాలామంది విద్యార్థులు సన్నద్ధం కాలేకపోవడం ఓ చేదు వాస్తవం.
‘నీట్’ను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే పరీక్షా పత్రాల లీకేజీలు, ఇతర అక్రమాల వంటివి మాత్రమే కాకుండా అసలు ఈ పరీక్షను నిర్వహిస్తున్న తీరే దేశ సమాఖ్య వ్యవస్థను సవాల్ చేసే విధంగా ఉండటం ప్రధానంగా కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేశంలోని 22 భాషల్ని అధికారికంగా గుర్తించింది. అయితే ఆశ్చర్యకరంగా ‘నీట్’ ప్రశ్న పత్రం 13 భాషల్లో మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశం కల్పించడానికే ‘నీట్’ అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈ లోపాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఈ 13 భాషలలో ప్రవేశం లేని విద్యార్థులు తమకు రాని ఏదో ఒక భాషలో లేదా ఇంగ్లీషును ప్రత్యామ్నాయంగా ఎంచుకొని అందులో పరీక్ష రాయాలి. అంటే, ‘నీట్’లో 9 భాషల విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.
‘నీట్’లో మరో కీలకమైన లోపం ఏమంటే ప్రశ్న పత్రాన్ని ‘సీబీఎస్‌ఈ’ సిలబస్‌ను ఆధారం చేసుకొని రూపొందిస్తున్నారు. విద్యార్థుల్లో అత్యధికులు తమ రాష్ట్రంలో అమలు చేసే రాష్ట్ర సిలబస్‌ను మాత్రమే చదువుతారు. అంటే, ‘నీట్’కు హాజరవుతున్న సీబీఎస్‌ఈ సిలబస్ విద్యార్థులకు ఇతరుల కంటే అదనపు ప్రయోజనం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నీట్’ రద్దు చేయాలని మొదటి నుంచీ పలు విధాలా పోరాటం చేస్తున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ‘2021లో వైద్య విద్యా ప్రవేశాలపై ఆ జాతీయ ప్రవేశ పరీక్ష ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ‘ఏకే రాజన్’ కమిటీని ఏర్పాటు చేసింది. కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందేవారికే ‘నీట్’లో దాదాపు 90 శాతం సీట్లు లభిస్తున్నాయని, ‘నీట్’ అన్నది వేల కోట్ల రూపాయల విద్యా వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని, మెడికల్ డాక్టర్ కావాలనుకుంటున్న పేద, వెనుకబడిన వర్గాల హక్కులను, ప్రయోజనాలను ఇది కాలరాస్తోందని ఏకే రాజన్ కమిటీ నివేదిక వెల్లడించింది. మరి ఈ పరిస్థితుల్లో ఒక ప్రశ్న సహజంగానే సర్వత్రా చర్చకు వస్తోంది: ‘విద్య అన్నది విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం కోసం నేర్చుకునేదా? లేక విజ్ఞానం, నైపుణ్యాలు సముపార్జించి, తద్వారా ఉపాధి పొందే మార్గంగా ఎంచుకునేదా?’ ‘నీట్’ పరీక్ష లేనప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్య విద్యనభ్యసించి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి ప్రసిద్ధ వైద్యులుగా భారతీయులు ఎంతో పేరు గడించారని కొందరు గుర్తు చేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో, ఇంగ్లాండ్‌లో ఉన్న వైద్యులలో 20శాతం మంది భారతీయులేనని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ‘నీట్’ మొదలయ్యాక గత కొన్నేళ్లుగా దేశంలో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులలో తగిన ప్రమాణాలు లేవన్న విమర్శ కూడా వినిపిస్తోంది.
పలు రాష్ట్రాలు, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన బిహార్, రాజస్థాన్ మొదలైనవి కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఈ రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గించడం కోసమే కీలకమైన ‘విద్య’ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి కేంద్రం ఇతోధికంగా రాష్ట్రాలకు నిధులు అందిస్తూ వస్తోంది. ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి కేంద్రం ‘సర్వశిక్షా అభియాన్’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే, దేశంలో ప్రతి రాష్ట్రానికీ తమదైన ప్రత్యేక భాషా సంస్కృతులు ఉన్న నేపథ్యంలో స్థానిక అవసరాల రీత్యా అవసరమైన విద్యా వ్యవస్థను, విద్యా విధానాన్ని తమకు తాముగా రూపొందించుకునే స్వేచ్ఛ కోసం విద్యను రాష్ట్ర జాబితాకు బదలాయించాలని తమిళనాడు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన సమాఖ్యవాద సూత్రాన్ని ‘నీట్’ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, ఆ జాతీయ ప్రవేశ పరీక్ష రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యా విషయమై నిర్ణయాలు తీసుకునే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ‘నీట్’ హరించివేస్తోందని కూడా ఆ పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా.. ‘నీట్’ పరీక్ష గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర బోర్డు విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నది కనుక అది రాజ్యాంగ అధికరణ 14 (చట్టం ముందు అందరూ సమానులే) ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించలేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి రాజ్యాంగ అధికరణ 131 సుప్రీంకోర్టుకు అధికారాలు కల్పించింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయం న్యాయ వ్యవస్థ వర్గాలలో వ్యక్తమవుతోంది. అమెరికాతోపాటు పలు దేశాలలో విద్యను స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్రస్థాయి ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఫెడరల్ ప్రభుత్వాలు విద్యలో జోక్యం చేసుకోవు.
మన దేశంలో కూడా విద్యను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చవలసిన అవసరమున్నది. దీనివల్ల రాష్ట్రాలు గతంలో వలే తమ సొంత విధానాలు, ప్రమాణాలను నిర్ణయించుకోవడానికి, స్వయం ప్రతిపత్తితో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ‘నీట్’ వల్ల ఒకే ఒక్క అవకాశం ఉంటోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగిస్తే ఇతర రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు వెళ్లే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థుల ప్రతిభకు అన్యాయం జరగదు. సామాజిక న్యాయానికి భంగం వాటిల్లదు. అదేవిధంగా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సామాజిక వర్గాలకు రాజ్యాంగ పరంగా లభించిన రిజర్వేషన్ విధానం రాష్ట్రాల స్థాయిలో సమర్థంగా అమలవుతుంది. అంతేకాకుండా రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య విధానం పటిష్ఠమవడమే కాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. అందువల్ల నీట్ పరీక్షను రద్దు చేయడం, విద్య అంశాన్ని రాష్ట్రాల జాబితాకు బదలాయించడం అన్ని విధాలా శ్రేయస్కరం.
సి. రామచంద్రయ్య
శాసనమండలి సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి
ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ
వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు