Share News

రాజకీయ రొంపిలోకి పాఠ్యపుస్తకాలు!

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:21 AM

ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌) పాఠ్య పుస్తకాలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. గతంలో 6 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలలో ఏరికోరి చేసిన...

రాజకీయ రొంపిలోకి పాఠ్యపుస్తకాలు!

ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌) పాఠ్య పుస్తకాలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. గతంలో 6 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలలో ఏరికోరి చేసిన తొలగింపులు, కత్తిరింపులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 8వ తరగతి సోషల్ స్టడీస్ పాఠ్య పుస్తకంలోని జోడింపులు పెనుదుమారాన్ని లేపుతున్నాయి.

కోవిడ్ కాలంలో ‘రేషనలైజేషన్’ పేరుతో పాఠ్యపుస్తకాల్లో చేసిన తొలగింపులు, కత్తిరింపుల జాబితా చాలా పెద్దది. ఉదాహరణకు, మొఘలులకు సంబంధించిన పాఠ్యాంశాలను చరిత్ర పాఠ్య పుస్తకం నుంచి పూర్తిగా మటుమాయం చేశారు. అలాగే సైన్సు నుంచి డార్విన్ జీవ పరిణామం, మెండలీవ్ ఆవర్తన పట్టికను తొలగించారు. ఇక ప్రస్తుతం రివైజ్ చేసిన ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకంలో– వివిధ కోర్టులలో పెండింగ్ కేసుల గురించి, న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి వివరించే ‘మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అధ్యాయాన్ని తెచ్చిపెట్టారు. ఈ అధ్యాయంలోని అంశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసును విచారణకు స్వీకరించి, ఆ పుస్తకాలను వెంటనే వెనక్కు జప్తు చేయాలని ఆదేశించింది. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు, కేంద్ర విద్యాశాఖకు నోటీసులు జారీ చేసింది.

సదరు పాఠ్య భాగంలోని విషయాల్లో సత్యాసత్యాల మాట అటుంచితే, అసలు ఎన్‌సీఈఆర్‌టీ ఒక అకడమిక్, అటానమస్ బాడీగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయగలుగుతోందా? పాఠ్య ప్రణాళిక రూపకల్పన లేదా పాఠ్యపుస్తకాల రివిజన్ అనేది బయటి శక్తుల జోక్యం లేకుండా సబ్జెక్టు నిపుణుల పరిధిలో జరుగుతోందా? ఇవీ చర్చ జరగాల్సిన ప్రశ్నలు.


ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదాల చరిత్ర నేటిది కాదు. 1977–79 జనతా ప్రభుత్వ కాలంలో మొట్టమొదటి వివాదం జరిగింది. జనతా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసంఘ్ (బీజేపీ పూర్వ రూపం) ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన చరిత్ర పాఠ్యపుస్తకాలు లెఫ్ట్ వింగ్ మేధావులు రాసినవని ఆరోపిస్తూ, వాటిని తొలగించాలని ఒత్తిడి చేసింది. అయితే ఆనాడు ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారులతో కూడిన కమిటీ లోతుగా అధ్యయనం చేసిన తరువాత అవే పుస్తకాలను కొనసాగించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి అవే పుస్తకాలు ప్రతి ఏటా రివైజ్ అవుతూ వచ్చాయి. 1998లో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే తిరిగి వివాదం తలెత్తింది. అప్పటి వాజపేయి ప్రభుత్వం ఉనికిలోనున్న పాఠ్యపుస్తకాలకు బదులు కొత్తవి తయారు చేయాలని ఆదేశించింది. అయితే ఆ ప్రయత్నం నెరవేరకముందే ఆ ప్రభుత్వం దిగిపోయింది. అనంతరం పాత పాఠ్యపుస్తకాల స్థానంలో కొత్త వాటిని, ప్రత్యేకించి సోషల్ స్టడీస్ పుస్తకాలను గతంలో రాసిన వారితో కాకుండా సబ్జెక్ట్‌ నిపుణులైన ఇతరులతో రాయించారు. ఇవి కూడా సంఘ్‌ పరివార్ సమర్థకులను సంతృప్తిపరచలేకపోయాయి. అందుకే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ప్రత్యక్ష రాజకీయ జోక్యం ప్రారంభమైంది. ఇక 2014లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తరువాత ఎన్‌సీఈఆర్‌టీ అకడమిక్ స్వయం ప్రతిపత్తి పూర్తిగా అడుగంటింది. పాఠ్యపుస్తకాల ప్రమాణాలు దిగజారిపోయి కొన్ని పాఠ్యభాగాలు తప్పుల తడకగా అవాస్తవాలతో కూడుకొని ఉన్నాయి.

వాస్తవానికి పాఠ్యపుస్తకాలనేవి లెఫ్ట్ వింగ్ లేదా రైట్ వింగ్ అనే భావజాలాల వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా పరిశోధనలు, ఆధారాలు, శాస్త్రీయ నిర్ధారణలపై రూపొందాలి. పాఠశాల పాఠ్యపుస్తకాల రూపకల్పనకు సంబంధించి ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ మూడు మార్గదర్శకాలను ప్రతిపాదించారు: ఒకటి– సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని పొందుపర్చాలి. ఈ సమాచారం ఉన్నత తరగతులకు వెళ్లేకొద్దీ మరింత లోతైన అవగాహనకు తోడ్పడాలి. రెండు– మంచి పాఠ్యపుస్తకాలు పిల్లల్లో ప్రశ్నలు రేకెత్తించి, ఎందుకు? ఏమిటి? అని అడిగే విధంగా ప్రోత్సహించాలి. ప్రశ్న అనేది జ్ఞానార్జనకు సోపానం. మూడు– పాఠ్య పుస్తకం అనేది ఉపాధ్యాయునికి ఒక బోధనా పనిముట్టుగా ఉపయోగపడాలి. ప్రొఫెసర్ థాపర్ చెప్పిన ఈ మూడు మార్గదర్శకాలను అంగీకరించడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయంటే వారి ఉద్దేశాన్ని అనుమానించాల్సిందే.


ఈ నేపథ్యంలో ‘ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉద్దేశించిన సదరు పాఠ్య పుస్తకంలోని వివాదాస్పద భాగం ఏ ఉద్దేశంతో రాయబడింది?’ అనే ప్రశ్నను సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. దీనికి కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచారం వ్యక్తం చేస్తూ, న్యాయ వ్యవస్థను అగౌరవపర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మీడియా ముఖంగా చెప్పాడు. అలాగే ఎన్‌సీఈఆర్‌టీ కూడా పశ్చాత్తాపం వ్యక్తంజేస్తూ ‘‘జడ్జిమెంట్ తప్పిదం. అనుకోకుండా చోటుచేసుకున్నది’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో కోర్టులో ప్రభుత్వం తరఫున మాట్లాడిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం ఎన్ని కమిటీలు, ఎన్ని అంచెలగుండా పాఠ్యపుస్తకాలు రూపొందుతాయో సవివరంగా తెలియజేశారు. మరి ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ‘‘అనుకోకుండా చోటుచేసుకోవడం’’ జరిగే అవకాశం ఉంటుందా?

ఏదిఏమైనా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మునుపటి ప్రామాణికతను, విశ్వసనీయతను కోల్పోయాయి. కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలవంచి పనిచేసే వారినే అందలం ఎక్కిస్తున్నారు. ఇదే ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020కి అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను రివైజ్ చేసిందని కూడా చెబుతున్నారు. అయితే ఎన్ఈపీ–2020 రూపకల్పనే ఎలాంటి క్షేత్రస్థాయి వివరణాత్మక అధ్యయనం లేకుండా, వ్యక్తుల స్వీయ పరిజ్ఞానంతో, ఇతర దేశాల మోడళ్లను కాపీ చేయడం ద్వారా జరిగిందనే విమర్శలు వచ్చాయి.

ప్రస్తుత సమస్య న్యాయవ్యవస్థపై ఒక పాఠానికి సంబంధించినది కాదు. కేవలం సదరు పాఠ్యపుస్తకాన్ని నిషేధించినంత మాత్రాన వివాదం సమసిపోదు. ఈ పాఠ్యపుస్తకం రచనలో పాలుపంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకున్నంత మాత్రానా సమస్య పరిష్కారం కాదు. వీటికంటే ముఖ్యంగా, పాఠ్యపుస్తకాల రూపకల్పనకు అనుసరించవలసిన మార్గదర్శకాలు, ఎన్‌సీఈఆర్‌టీ స్వయం ప్రతిపత్తి... తదితర అంశాలపై కోర్టు విచారణ జరగాలి. లేదంటే న్యాయవ్యవస్థపై విమర్శలు వచ్చాయి కాబట్టి కోర్టు తీవ్రంగా స్పందించిందని భావిస్తారు.

ఎస్.గోవిందరాజులు

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ

ఇవి కూడా చదవండి..

ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

Updated Date - Mar 18 , 2026 | 01:21 AM