నాటి జెన్‌జీ వేదిక నౌ జవాన్ భారత్!
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:24 AM
దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులు ఉద్యమస్ఫూర్తితో రాజకీయ చైతన్యాన్ని చాటుకుంటున్న నేటి సందర్భంలో సరిగా వందేళ్ల క్రితం భారతదేశంలో యువజనులకు....
దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులు ఉద్యమస్ఫూర్తితో రాజకీయ చైతన్యాన్ని చాటుకుంటున్న నేటి సందర్భంలో సరిగా వందేళ్ల క్రితం భారతదేశంలో యువజనులకు దేశభక్తిపూరిత విప్లవ లక్ష్యం గల ప్రణాళికను అందించిన ‘నౌ జవాన్ భారత్ సభ’ను గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం.
‘‘మన దేశం అస్తవ్యస్తతల మధ్య ప్రయాణం సాగిస్తున్నది. ప్రతిచోటా పరస్పర అనుమానాలు, నిస్పృహ ఆవరించి ఉన్నాయి. పెద్ద నాయకులు మన గమ్యంపై విశ్వాసం కోల్పోయారు. వారిలో చాలామంది ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.’’ – ఈనాటికీ వర్తించేలా ఉన్న ఈ వాక్యాలు సరిగ్గా వందేళ్ల క్రితం 1926లో ఏర్పడిన ‘నౌ జవాన్ భారత్ సభ’ (పంజాబ్) రూపొందించుకున్న ప్రణాళికలోని మొదటి వాక్యాలు. ఈ ప్రణాళికకు రూపకర్తలు భగవతీ చరణ్ వోహ్ర, భగత్‌సింగ్‌లు. భగత్‌సింగ్ నిర్వహించిన విప్లవోద్యమ కార్యకలాపాలలో ‘నౌ జవాన్ భారత్ సభ’ ఏర్పాటు చెప్పుకోదగినది. కాకోరి కుట్ర కేసు పేరుతో విప్లవకారుల ఉరితీతలు, దీర్ఘకాలిక జైలు శిక్షలు, క్రూరమైన హింసాకాండ అమలు జరిగిన పిదప విప్లవకారులు చెల్లాచెదురైపోయారు. వారందరినీ తిరిగి కూడగట్టి, నూతన లక్ష్యాలతో సంస్థను పునర్నిర్మాణం కావించిన ఘనత భగత్‌సింగ్‌ది. 1926 మార్చిలో లాహోర్ కేంద్రంగా భగత్‌సింగ్ ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రజాసంఘం పంజాబ్, సింధు రాష్ట్రాలలో కార్యకలాపాలను నిర్వహించింది. దీనికి ఒక స్పష్టమైన ప్రణాళికను 1928లో రూపొందించుకున్నారు. అప్పటికి దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వీరికున్నంత స్పష్టమైన అవగాహనా, వైఖరీ కలిగిన యువజన సంఘం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రజా కార్యకలాపాలు, పోరాటాలను నిర్వహించడానికి విద్యార్థి, యువకులను కూడగట్టాలన్నది ‘నౌ జవాన్ భారత్ సభ’ ప్రధాన లక్ష్యం. ఈ సంఘం ‘బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి’ అనే డిమాండ్‌ను స్పష్టంగా, సూటిగా దేశం ముందుకు, యువజనుల ముందుకు తెచ్చింది. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న సింధు రాష్ట్రంలోను, ముఖ్యంగా రెండు దేశాలలోని పంజాబ్‌లలోను బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశభక్తిపూరిత చైతన్యాన్ని అందించటానికి, కర్తారుసింగ్ శరభ లాంటి అమరుల్లో త్యాగపూరిత స్ఫూర్తిని నింపటానికి నిర్మాణమైనదే నౌ జవాన్ భారత్ సభ!
‘‘ఎటువంటి భయమూ లేకుండా, ఎటువంటి సంకోచమూ లేకుండా, ఎటువంటి పురస్కారాలూ శోకతప్త నివాళులూ ప్రశంసలూ ఉండబోవని తెలిసి కూడా ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డవాళ్లు మనకు అవసరం’’ అని నౌ జవాన్ భారత సభ వందేళ్ల నాటి తమ ప్రణాళికలో ప్రకటించుకుంది. దేశభక్త యువవీరులు రూపొందించుకున్న ఆ ప్రణాళిక సారాంశాన్ని నేటి యువతరం కూడా తెలుసుకుని అన్వయించుకోవాల్సి ఉంది!
బ్రిటిష్ వారిని తరిమేసిన తరువాత భారతదేశం ఎలా ఉండాలన్న స్పష్టత అప్పటి నాయకులలో తక్కువగా ఉండేది. నూతన ప్రభుత్వ లక్ష్యాల ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ స్థూలంగా ప్రజా శ్రేయస్సు అనేవారే తప్ప అసమానతలతో కూడిన భారత సమాజాన్ని కొత్తగా ఎలా నిర్మించాలో ఎవరూ మాట్లాడేవారు కాదు. మాట్లాడినా పైపై వాగ్దానాలతో సరిపుచ్చేవారు. అలాంటి సమయంలో, నాటి సోవియట్ రష్యాను ‘నౌ జవాన్ భారత్ సభ’ తమ ప్రణాళికలో ప్రస్తావించింది: ‘‘పదేపదే అణచివేత ఉప్పెనను ఎదుర్కొన్నా, నాటి సోవియట్ యువత ధైర్యం కోల్పోలేదు. అలాంటి యువజనులే ఎక్కడైనా సరే దేన్నీ ఆశించకుండా నిర్భయంగా నిస్సంశయంగా పోరాడగలరు. ఈ రోజు మనం మహత్తర రష్యాలో ప్రపంచ విముక్తిని కనగలుగుతున్నాం’’ అని రాశారు. ఆ విధంగా ‘నౌ జవాన్ భారత్ సభ’ సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కావాలి అనే ప్రత్యామ్నాయ ఆశయాన్ని దేశస్థుల దృష్టికి తెచ్చింది. సోషలిస్ట్ ఆదర్శాన్ని యువజనుల ముందుకు తెచ్చింది. దాన్ని సాధించటానికి విద్యార్థి యువజనుల్ని మాత్రమే గాక కార్మిక–కర్షకులను కూడా చైతన్యవంతం చేయటాన్ని తమ లక్ష్యాలలో వారు భాగంగా చేసుకున్నారు. ‘‘రష్యా యువజనుల మాదిరే మన లక్ష్యం సాధించటానికి వేలాది అత్యంత ప్రజ్ఞావంతమైన మన యువజనం వారి విలువైన జీవితాలను గ్రామాల్లో గడుపుతూ నిజమైన భావంలో భారతీయ విప్లవం అంటే ఏమిటో ప్రజలకు అర్థం చేయించాలి. రానున్న విప్లవం పాలకుల మార్పు మాత్రమే కాదు అన్నది వారికి అర్థమయ్యే విధంగా తెలియజెప్పాలి. దశాబ్దాల అనన్యమైన ఆత్మత్యాగం ఆ మహత్తర లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలను సంసిద్ధం చేయగలుగుతుంది. యువకులు మాత్రమే ఆ పని చేయగలరు. విప్లవకారుడు అంటే తప్పనిసరిగా బాంబులు, రివాల్వర్లు కలిగిన మనిషి అని అర్థం కాదు.’’ (నౌ జవాన్ భారత సభ ప్రణాళిక నుంచి) ఈ ప్రణాళికలోని సోషలిస్టు లక్ష్యం అనే భావనను ప్రతిఫలించేలా తరువాత రెండేళ్లకు 1928 సెప్టెంబరులో ఈ సభకు మూలమైన ‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ పేరును ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’గా మార్పు చేశారు.
‘‘మత మూఢ విశ్వాసాలు, మతోన్మాదం మన ప్రగతికి పెద్ద అవరోధాలు. వీటిని మనం వదిలించుకోవాలి’’ అని కూడా ఈ ప్రణాళికలో స్పష్టంగా చేర్చారు. లౌకికవాదంలో మతసామరస్య భావం ముఖ్యమైనదే అయినా రాజకీయ రంగంలోనూ, విద్యను అందించడంలోనూ, రాజ్యపాలనలోనూ మత ప్రమేయం ఉండకూడదు అనేది అత్యంత స్పష్టంగా భగత్‌సింగ్ బృందం తమ విధానంగా చేసుకున్నారు. మత విభజన రాజకీయాలను అసహ్యించుకున్నారు.
‘‘యువకుల జీవిత లక్ష్యం భారతదేశంలో స్వాతంత్ర్య సాధన. అందుకని సేవా తత్పరత, బాధలను అనుభవించడం, త్యాగం చేయటం (Service, Suffering and Sacrifice) అనే మూడు లక్ష్యాలతో వారు నిజాయితీగా పనిచేయాలి. వ్యక్తిగత సౌఖ్యం కన్నా దేశానికి సేవ చేయడం అనేది ముఖ్యం. ఇలా ఆలోచించే యువతీ యువకులు దేశానికి కావాలి,’’ అన్న ‘నౌ జవాన్ భారత్ సభ’ స్ఫూర్తిని నేటి జెన్‌జీ తరం సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.
చెరుకూరి జ్యోతి
(‘నౌ జవాన్ భారత్ సభ’ వందేళ్లు పూర్తయిన సందర్భంగా)
Also Read:
హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక
ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్