Share News

నిలువెత్తు నిరాడంబరతే ‘నర్రా’

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:01 AM

రాజకీయం అంటే సంపాదన మార్గం కాదు, త్యాగంతో కూడిన ప్రజాసేవ అని తన జీవితంతో నిరూపించిన అరుదైన నాయకుడు ఆయన. నిరాడంబరానికి, నిజాయితీకి, విలువల రాజకీయాలకు...

నిలువెత్తు నిరాడంబరతే ‘నర్రా’

రాజకీయం అంటే సంపాదన మార్గం కాదు, త్యాగంతో కూడిన ప్రజాసేవ అని తన జీవితంతో నిరూపించిన అరుదైన నాయకుడు ఆయన. నిరాడంబరానికి, నిజాయితీకి, విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. నకిరేకల్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మచ్చలేని మహానేత నర్రా రాఘవరెడ్డి. 1924లో జన్మించిన రాఘవరెడ్డి జీవితం కష్టసుఖాల మధ్య తిరిగిన పోరాట గాథ. పేదరికం కారణంగా చిన్నతనంలోనే చదువు ఆపి బొంబాయి బాట పట్టారు. అక్కడ జౌళి మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ కార్మిక వర్గాల జీవన సంగ్రామాన్ని దగ్గరగా చూశారు. ఆ అనుభవాలే ఆయనలో వర్గ చైతన్యాన్ని రగిలించాయి. ‘లాల్ బావుటా’ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వగ్రామానికి తిరిగి వచ్చాక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజా ఉద్యమాల్లో రాటుదేలారు.

1959లో శివనేనిగూడెం సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవకు శ్రీకారం చుట్టిన ఆయన, ఆపై నార్కట్‌పల్లి సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు... ఒక పాత మోటార్ సైకిల్, కొన్ని కరపత్రాలు, ప్రజలపై నమ్మకం– ఇవే ఆయన ఆయుధాలు. వాటితోనే ప్రజల్లోకి వెళ్లారు, విజయం సాధించారు. 1972లో స్వల్ప తేడాతో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉండి పోరాటం కొనసాగించారు. తర్వాత 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంతకాలం అధికారంలో ఉన్నా ఆయన జీవితంలో ఆర్భాటం కనిపించలేదు. అవినీతి మరక అంటని రాజకీయ జీవితం ఆయనది.

క్లిష్టమైన సమస్యలను సామెతలు, పిట్టకథలతో సరళంగా వివరించే అరుదైన వక్త ఆయన. ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ కోసం ఆయన గొంతు పదేపదే వినిపించింది. ఎస్‌ఎల్‌బీసీ ఎడమగట్టు కాల్వ సాధన, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారులు, విద్యుద్దీకరణ వంటి అభివృద్ధి పనుల్లో ఆయన విశేష కృషి చేశారు. జిల్లాలోని 65 గ్రామాలకు విద్యుద్దీకరణ కల్పించడంలో ఆయన పాత్ర మరువలేనిది. బీబీనగర్–నడికుడి రైలుమార్గం, గీత కార్మికులు, రైతాంగ సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో రావాలని పట్టుబట్టి సాధించిన భాషా ప్రేమికుడు ఆయన. ప్రజాప్రతినిధి అంటే సంపాదన కోసం కాదు, సేవ కోసం అని ఆయన నిరూపించారు.


ప్రజల విశ్వాసమే రాజకీయ మూలధనం అని తన జీవితం ద్వారా చూపించారు. పదవులు కాదు, విలువలు శాశ్వతం అని ఆయన జీవితం చెబుతుంది. 2015 ఏప్రిల్ 9న తన కన్నుమూసిన నర్రా రాఘవరెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు ఇంకా ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నాయి. ప్రజల కోసం బతికిన నాయకుడు ఎల్లకాలం ప్రజల్లోనే జీవిస్తాడనడానికి ఆయన జీవితం నిదర్శనం. ఆయన ఆశయాలను స్మరించుకోవడం, ఆ విలువలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

గడగోజు రవీంద్రాచారి

(ఏప్రిల్ 9: నర్రా రాఘవరెడ్డి వర్ధంతి)]

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 02:01 AM