పరిశ్రమల బలం పెంచిన పాతికేళ్ల పాలన
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:19 AM
సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలన్నా, దీర్ఘకాలం కొనసాగాలన్నా పరిశ్రమలకు విశ్వాసంతో కూడిన వాతావరణం అవసరం. మొదట గుజరాత్‌లోను...
సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలన్నా, దీర్ఘకాలం కొనసాగాలన్నా పరిశ్రమలకు విశ్వాసంతో కూడిన వాతావరణం అవసరం. మొదట గుజరాత్‌లోను, తర్వాత దేశవ్యాప్తంగానూ మొత్తం తన పాతికేళ్ల పాలనలో నరేంద్ర మోదీ అలాంటి వాతావరణాన్ని సృష్టించారు.
2003లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ సదస్సు ఆయన వ్యాపార విధానానికి తొలి నిదర్శనం. పరిశ్రమలను ప్రోత్సహించడానికి, వ్యాపార సంస్థల సమస్యలను తెలుసుకోవడానికి, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక వేదికగా మారింది. రాష్ట్ర స్థాయిలో పెట్టుబడుల సదస్సులు పెట్టాలన్న ఈ ఆలోచనను ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాయి. అలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మోదీ ప్రభావం గుజరాత్ సరిహద్దులు దాటింది.
కర్మాగారాలను ఏర్పాటు చేస్తూ పోవడమే గుజరాత్ విధానం కాదు. అంతకంటే ముఖ్యంగా సమగ్ర పారిశ్రామిక వ్యవస్థలను నిర్మించడంపై గుజరాత్ విధానం దృష్టి పెట్టింది. ఓడరేవులు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు, పారిశ్రామిక వాడలు, క్లస్టర్లను సమన్వయంతో అభివృద్ధి చేశారు. మౌలిక సదుపాయాలు, వ్యాపార విధానాలు పరస్పర సమన్వయంతో ఒకే దిశగా సాగినప్పుడు తయారీ రంగం వేగంగా స్పందిస్తుందనేది గుజరాత్ నేర్పిన ప్రధాన పాఠం. మోదీ 2014లో గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లినప్పుడు పరిశ్రమలు, తయారీ రంగంపై తనకున్న అవగాహనను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఆయనకు లభించింది.
మోదీ తెచ్చిన పలు సంస్కరణలు పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచాయి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మరింత సమగ్ర జాతీయ మార్కెట్‌ను సృష్టించి, అనేక పన్నులతో కూడిన సంక్లిష్ట వ్యవస్థను తొలగించింది. దివాలా చట్టం (ఐబీసీ) ద్వారా పెట్టుబడులు, ఉత్పాదక ఆస్తులను తిరిగి వినియోగించే చట్రం ఏర్పడింది. డిజిటలీకరణ, వ్యవస్థీకరణతో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు అధికారిక వ్యవస్థ పరిధిలోకి వచ్చాయి. నాలుగు కొత్త కార్మిక చట్టాలు అప్పటికే ఉన్న కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి, హేతుబద్ధంగా మార్చాయి. ఈ మార్పులన్నీ వ్యాపార సంస్థల నిర్వహణను, వృద్ధిని సులభతరం చేశాయి.
వస్తువుల రవాణాకు పట్టే సమయం, అయ్యే ఖర్చు భారత పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యల్లో అత్యంత పాత సమస్య. మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చుపెట్టడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఆర్థిక వ్యవస్థకు జీవనాడులుగా మారాయి. తూర్పు, పశ్చిమ ప్రత్యేక కారిడార్లు సరకు రవాణాకు వెన్నెముకగా నిలిచాయి. సొంత రవాణా వ్యవస్థలు, వాహన శ్రేణులను నిర్మించుకోలేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది ఎంతో కీలకం.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత పరిశ్రమకు విదేశీ మార్కెట్లలోనూ విస్తృత అవకాశాలు లభించాయి. భారీ దేశీయ మార్కెట్‌కు తోడు ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అవకాశాలు భారత ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. దశాబ్దం క్రితం కూడా ఇలాంటి వాతావరణాన్ని ఊహించడమే కష్టం అన్నట్టు ఉండేది.
భారత్ పారిశ్రామిక ప్రస్థానంలో ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక కార్యక్రమం’ (పీఎల్ఐ) ఒక ముఖ్య ఘట్టం. 14 రంగాల్లో రూ.2.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలతో పీఎల్ఐ పథకం దేశ తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధిని సృష్టించి, విభిన్న పరిశ్రమల్లో ఎగుమతులను పెంచుతోంది.
పారిశ్రామిక పునాది ఎంత వేగంగా మారగలదో ఎలక్ట్రానిక్స్ రంగం స్పష్టంగా చూపుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు రెండంకెలు, మూడంకెల స్థాయిలో పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ప్రస్తుతం భారత్‌లో ఫోన్లను తయారు చేస్తున్నాయి.
సెమీకండక్టర్ల తయారీ మరింత ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు. దశాబ్దం క్రితం సెమీకండక్టర్ తయారీ రంగంలో భారత్ పాత్ర దాదాపు కనిపించేది కాదు. ఇప్పుడు మన దేశం చిప్‌ల తయారీతోపాటు, వాటికి అవసరమైన డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, ముడిసామగ్రి, నైపుణ్యం వరకు అన్ని విభాగాలనూ అభివృద్ధి చేస్తోంది. మోదీ దార్శనికత విడివిడి కర్మాగారాలకు పరిమితం కాదు. ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగాల్లో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడం వరకు విస్తరించింది.
తయారీ సామర్థ్యం ఇప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా కూడా మారుతోంది. ఈ దృక్పథంతోనే మోదీ రక్షణ ఉత్పత్తుల తయారీని చూస్తున్నారు. స్వదేశీ పరిశోధన & అభివృద్ధితో రక్షణ సాంకేతికతను పెంచి, దేశీయ పరికరాలను ఉత్పత్తి చేసి ఈ రంగంలో భారత్‌ను ప్రపంచ సరఫరాదారుగా మార్చడంపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత పన్నెండేళ్లలో రక్షణ ఎగుమతులు 56 రెట్లు పెరిగాయి.
భారత పరిశ్రమ తదుపరి దశలో ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగగల మధ్య తరహా కంపెనీలు మరెన్నో అవసరం. ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూ కాలక్రమంలో సామర్థ్యాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉండే పెట్టుబడిదారులు, సంస్థలు వాటికి కావాలి. అంకుర సంస్థలు, పరిశోధనలో పెట్టుబడులు ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయి. రక్షణ, అంతరిక్షం, డ్రోన్లు, అధునాతన సాంకేతిక రంగాల్లో కొత్త కంపెనీలు అడుగుపెడుతున్నాయి. గతంలో ఈ రంగాలు వాటికి అందుబాటులో ఉండేవి కావు, లేదా ప్రవేశానికి తీవ్రమైన అడ్డంకులు ఉండేవి.
పారిశ్రామిక అభివృద్ధిపై మోదీ ఆసక్తి ఎలాంటిదో, పరిశ్రమల ప్రముఖులతో చర్చించేందుకు ఆయన ఎంత సుముఖంగా ఉంటారో, దశాబ్దాలుగా ఆయనను వ్యక్తిగతంగా గమనించిన నాకు అర్థమైంది. కంపెనీలు ఏం నిర్మిస్తున్నాయి, ఇతర దేశాలు ఏం చేస్తున్నాయన్న విషయాలపై ఆయన ఎంతో ఆసక్తి చూపుతారు. విదేశీ పర్యటనల్లో ఆసక్తికరమైన అంశం కనిపిస్తే వెంటనే దాని గురించి భారత పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు. సంప్రదాయ పరిధులను దాటి ఆలోచించాలనీ, తమ కృషిని దేశ నిర్మాణంలో భాగంగా చూడాలనీ ఆయన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారు.
మోదీ 25 ఏళ్ల నాయకత్వం నుంచి ఒక విస్తృతమైన ఆలోచనా ధోరణి రూపుదిద్దుకుంటోంది. ఆయన పరిశ్రమను కేవలం ఆర్థిక కార్యకలాపంగా కాకుండా జాతీయ సామర్థ్యానికి ప్రతిరూపంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత పరిశ్రమ మరింత ధైర్యంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. పరిశోధన, ఆవిష్కరణల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. స్వల్పకాలిక ఆర్థిక లాభాలకు బదులుగా దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రదర్శించాలి. వికసిత భారత్‌పై మోదీ దృష్టి భారత పరిశ్రమకు స్పష్టమైన పిలుపునిస్తున్నది. భారత్ అవసరాల కోసం ఉత్పత్తి చేయడమే కాక, ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగాలని అది సూచిస్తోంది.
ఉదయ్ కోటక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్
(నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించి నేటికి పాతికేళ్లు)
ఈ వార్తలు కూడా చదవండి
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్