ఉద్యోగ కల్పనలో లోకేశ్ మార్క్!
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:08 AM
యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అత్యంత దగ్గరగా చూశారు. అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగాన్ని...
యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అత్యంత దగ్గరగా చూశారు. అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగాన్ని రూపుమాపుతాం అని హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకుంటూ ప్రతిష్ఠాత్మక వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. పారదర్శకమైన రీతిలో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు. పాదయాత్రలో ఉపాధ్యాయ అభ్యర్థులకు హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలు పైన పెట్టారు. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ తెచ్చి అంతమందికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారు. యువత భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీలు చాలాసార్లు రాజకీయ వాగ్దానాలుగానే మిగులుతాయి. కానీ ఐటీ మంత్రి, విద్యాశాఖా మంత్రిగా లోకేశ్ ప్రకటించిన ఉద్యోగ కల్పన లక్ష్యాలు కేవలం మాటలకే పరిమితం గాక కార్యాచరణలోకి బదిలీ అవుతున్నాయి.
రాజకీయాల్లో హామీ ఇవ్వడం సులభం, కానీ దాని అమలు కష్టం. ఆ కష్టాన్ని స్వీకరించి, ఫలితాల రూపంలో చూపించినప్పుడు మాత్రమే నాయకుడి విశ్వసనీయత పెరుగుతుంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను నిలబెట్టుకునే దిశగా లోకేశ్ ముందుకు సాగుతున్న తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది. యువతను ఉపాధి దిశగా నడిపించడం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ప్రైవేటు పరిశ్రమలు, ఐటీ రంగం, స్టార్టప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి విభిన్న మార్గాల ద్వారా అవకాశాలను సృష్టించడం ముఖ్యం. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు మాట నిలబెట్టుకోవడం అనే భావనకు నిజమైన అర్థాన్ని ఇస్తున్నాయి.
లోకేశ్ గతంలో ఐటీ శాఖా మంత్రిగా ఉన్న అనుభవంతో మళ్లీ అదే శాఖ బాధ్యతలు చేపట్టి అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంపై దృష్టి పెట్టారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి దిగ్గజ సంస్థలను విశాఖపట్నానికి రప్పించడం వెనుక ఆయన కృషి మరువలేనిది. దీనివల్ల వేలాది మంది ఐటీ నిపుణులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గత ఐదేళ్లలో వెనక్కు వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తున్నారు. కొత్త పెట్టుబడుల ద్వారా తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, వారిని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుతున్నారు. లోకేశ్ తన పాదయాత్రలో విన్న ప్రతి నిరుద్యోగి గోడునూ గుర్తుంచుకుని, నేడు వారి కళ్ళల్లో ఆనందం చూసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదే కొనసాగితే రాష్ట్రం ఉపాధి రంగంలో ఆదర్శంగా నిలవడం ఖాయం.
విశాఖపట్నం, అమరావతి వంటి నగరాలను ఐటీ హబ్‌లుగా తీర్చిదిద్దడం; ఆటోమొబైల్ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం; నూతన పారిశ్రామిక విధానం ద్వారా పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించడం; రాయితీలను సకాలంలో అందించడం ద్వారా పారిశ్రామిక రంగంలో ఒక సానుకూల వాతావరణాన్ని లోకేశ్ సృష్టించారు. యువగళం వేదికగా ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంధనంగా మారుతోంది. ఉద్యోగాలతోపాటు, యువత జీవితాల్లో స్థిరత్వాన్నీ, ఆశనూ, భరోసానూ నింపినప్పుడే ఒక నాయకుడు నిజమైన విజయం సాధించినట్టు. యువశక్తిని సరైన దిశలో మలిస్తే అభివృద్ధి వేగంగా సాగుతుంది. లేకపోతే నిరుద్యోగం రూపంలో సమస్యగా మారుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన నాయకత్వమే ఉపాధి అవకాశాలను ప్రాధాన్యంగా తీసుకుంటుంది. నారా లోకేశ్ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ కూడా ఆ దిశలో ఒక స్పష్టమైన ఆలోచనతో కూడుకున్నదే.
రాష్ట్ర ఆర్థిక పురోగతి, సామాజిక స్థిరత్వం, యువత భవిష్యత్తు ఈ మూడు అంశాలూ ఒకే దారిలో నడవాలంటే ఉద్యోగాల సృష్టి కేంద్ర బిందువుగా మారాల్సిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘జాబ్ ఫస్ట్’ విధానం కేవలం ఒక నినాదం కాదు, రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వ్యూహాత్మక నిర్ణయం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. గత ఐదేళ్లలో గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడంతో పాటు, నిరుద్యోగ యువతకు భరోసానివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాబ్ ఫస్ట్ విధానాన్ని ప్రకటించడం అభినందనీయం. సంక్షేమం బాధ్యత అయితే, ఉపాధి కల్పన హక్కు అన్న కోణంలో ఈ విధానం ఉన్నది. మౌలిక సదుపాయాల కల్పన ఎంత ముఖ్యమో, యువతకు ఉద్యోగం దొరకడం కూడా అంతే ముఖ్యం. జాబ్ ఫస్ట్ అనేది కేవలం ఒక నినాదం కాదు, అది నవ్యాంధ్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది. ఏది ఏమైనా లోకేశ్ విధానాలు హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పన రూపంలో ఆయన మార్క్ కనిపిస్తోంది.
నాదెండ్ల బ్రహ్మం
కమ్మ కార్పొరేషన్ చైర్మన్
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్