Share News

నాటి తెలంగాణ పల్లెల ఆర్తనాదం

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:44 AM

నా బాల్యం, చదువు మొదలు, ఉద్యోగం, యవ్వనమంతా అడివంచు గ్రామాల్లోనే గడిచింది. నా కవిత్వం, కథలు అన్నీ అక్కడ పుట్టినవే. మణుగూరు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేస్తుండగా...

నాటి తెలంగాణ పల్లెల ఆర్తనాదం

నా బాల్యం, చదువు మొదలు, ఉద్యోగం, యవ్వనమంతా అడివంచు గ్రామాల్లోనే గడిచింది. నా కవిత్వం, కథలు అన్నీ అక్కడ పుట్టినవే. మణుగూరు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేస్తుండగా 1995 డిసెంబర్‌లో ‘ఇక ఊరు నిద్రపోదు’ కవితా సంపుటిని ప్రచురించాను. ఆనాటి తెలంగాణా పల్లెల ఆర్తనాదం వస్తువు.

రాసిన కవితలన్నీ దొరక్కపోవటం వల్ల అందిన కాడికి చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చాను. నా ఉద్యమ సహచరుడు, మిత్రుడు సతీష్ చందర్, అఫ్సర్ ముందుమాటలతో వచ్చింది. ఈ కవితా సంపుటి తేవటంలో అఫ్సర్ సహకారం మరవరానిది. చల్లా శ్రీనివాస్ (జర్నలిస్ట్) ద్వారా నారాయణగుడాలో ఉన్న కుబేరా టవర్స్ ‘సాయి గ్రాఫిక్స్’లో ప్రచురించాను. నిత్యం వెంటాడే అక్షర దోషాలతో బాధిస్తూ నా చేతిలోకి వచ్చింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి చెందిన జావేద్ చేత ముఖచిత్రం వేయించాను. బహుశా జావేద్‌ పుస్తకాలకు వేసిన తొలి ముఖచిత్రం కూడా ఇదే కావచ్చు. పుస్తకావిష్కరణ సభ బ్యానర్ కూడా జావేద్‌తోనే రాయించాను. సీతాఫల్ మండీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మరీ పనులన్నీ చేసిపెట్టిన జావేద్, చెల్లెలు మున్నీకి రుణపడి వున్నాను.

-1995 డిసెంబర్ 30న ‘ఇక ఊరు నిద్రపోదు’ ఆవిష్కరణ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ప్రముఖ కవి నమ్ము అధ్యక్షత వహించారు. చేకూరు రామా రావు చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అదృష్టం. సభలో ప్రముఖ కథకులు కేతు విశ్వనాథరెడ్డి, సతీష్ చందర్, కొండవీటి నాగవాణి పాల్గొన్నారు.


తెలంగాణా వెనుకబాటుతనం, ప్రాంతీయ వివక్ష, ఆంధ్ర రాజకీయ ఆదిపత్యం, తెలంగాణలో నాటి ప్రభుత్వాల దమనకాండ, నిర్బంధం, నీళ్ళు, నిధులు కొరతపై ఈ కవిత్వం. 1995 నాటికే స్పష్టమైన అవగాహనతో దళిత, ముస్లింవాద కవిత్వం ఇందులో వుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నినాదంతో ‘తెలంగాణా రాష్ట్ర సమితి’ ఏర్పాటుకు ఐదేళ్ళ ముందు నా కవితా సంపుటి వచ్చింది. అంతకుముందు తొలి దశ, ఎన్నో దశల ఉద్యమాల ప్రేరణతో కొన సాగిన పోరాటాలు, ఎందరో ఉద్యమ కార్యకర్తల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో, అప్పటి పరిస్థితులకు అద్దంపట్టే భావాల ప్రతిస్పందనే ఏ కవిత్వమైనా, ఏ స్పందనైనా! గాలిలో ఎవరూ ఉద్యమాలు నిర్మించజాలరు. అప్పటి నా కవిత్వం కూడా అంతే, మరొకటి కాదు.

ఈ సంపుటిపై 1996 ఫిబ్రవరి ‘ఈనాటి ఏకలవ్య’ సంచికలో అంబటి సురేంద్రరాజు ‘The burden of a song’ అనే శీర్షికతో మంచి విశ్లేషణ వ్యాసం రాశారు. అద్దేపల్లి రామమోహనరావు, ఒమ్మి రమేష్ బాబు, థింసా, ఎ.ఎ.వి. ప్రసాద్, పుప్పాల రాజిరెడ్డి సమగ్రమైన సమీక్షలు చేశారు.

92475 80946

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 01:44 AM