గెలవలేని యుద్ధాల్లో అమెరికాకు తీరని దాహం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:04 AM
జంతువులనూ మనుషులనూ వేరుచేసేది మౌలికంగా భాషేనని మనందరమూ అనుకుంటాం. గతం, వర్తమానం, భవిష్యత్తుల గురించి ఆలోచించుకుని మంచికో చెడుకో అడుగులు వేసే సామర్థ్యం మనుషులకు...
జంతువులనూ మనుషులనూ వేరుచేసేది మౌలికంగా భాషేనని మనందరమూ అనుకుంటాం. గతం, వర్తమానం, భవిష్యత్తుల గురించి ఆలోచించుకుని మంచికో చెడుకో అడుగులు వేసే సామర్థ్యం మనుషులకు మాత్రమే ఉందని ఆధునిక విజ్ఞానం మనకు నేర్పింది. ఆ సామర్థ్యాన్ని సాధ్యంచేసింది భాషేనని అనేక విధాలా నిరూపణా అయ్యింది. మన ఆలోచనలన్నీ భాష ద్వారానే సాగుతాయి. సంస్కృతిలోని మంచిచెడులూ భాష ద్వారానే వ్యక్తం అవుతాయి. మనం వాడే పదాలు, వాక్యాలు మనం ఏమిటో తెలుపుతాయి. మనం ఎంతటి క్రూరులమో, దయాపరులమో మనం వాడే భాష ద్వారానే వెల్లడవుతుంది. దీనికి ఎవరూ మినహాయింపుకాదు. అమెరికా అధ్యక్షుడైనా, ఆటవికుడైనా ఈ నియమం నుంచి తప్పించుకోలేరు. ఇరాన్ నాగరికతను ఒక్క రాత్రిలో సర్వనాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. ఎన్నడో గతించిన రాతియుగానికి మళ్లీ ఇరాన్‌ను తీసుకువెళతాననీ చాలాసార్లు భయపెట్టారు. అత్యంత ఆధునాతన దేశానికి అధ్యక్షుడైన వ్యక్తి నుంచి ఇట్లాంటి భాష ఎట్లా వచ్చింది?
గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కంటికి కన్ను.. పంటికి పన్ను అనే రీతిలో యుద్ధదారుణాలెన్నో చరిత్ర నిండా నమోదయ్యాయి. ఆ రక్తసిక్త, అమానవీయ చరిత్రను దాటి సమాజం చాలా ముందుకూ వచ్చింది. రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకునే వర్గాన్నీ, దాని అదుపాజ్ఞల్లో ఉండే విశాల ప్రజానీకాన్ని వేరుచేసి చూసే విజ్ఞతనూ మనం ఎంతోకొంత సంపాదించుకున్నాం. కక్షలుంటే, ప్రతీకారాలుంటే రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వాళ్లమీదే గురిపెట్టాలి కానీ సామాన్య ప్రజానీకాన్ని వాటికి బలిచేయకూడదనే యుద్ధనీతులను మనం అభివృద్ధి చేసుకున్నాం. అందుకే ‘నాగరికతలను అంతం చేస్తాం... ఒక దేశం మొత్తాన్ని రాతియుగానికి తీసుకెళతాం’ అనే ప్రకటనలను హర్షించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. యూదులను సమూలంగా నాశనం చేస్తామని ఒకనాడు హిట్లర్ చేసిన ప్రకటన ఆధునిక యుగంలో క్రూరత్వానికీ, అనాగరికతకూ, అమానవీయానికీ ప్రతీకగా నిలిచిపోయింది. హిట్లర్ దృష్టిలో యూదు పెట్టుబడిదారులు తప్పుచేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవటానికీ, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తలెత్తటానికీ వారే కారణమని ఆరోపించాడు. మరో ప్రపంచ యుద్ధమంటూ వస్తే యూదు జాతే దానికి కారణమవుతుందనీ అందుకది తన అస్తిత్వాన్ని మూల్యంగా చెల్లించుకోవాలని హిట్లర్ చేసిన ప్రకటన ఎంతో హేయమైందిగా ఇప్పటికీ భావిస్తాం. కారణాలు ఏవైనా హిట్లరే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించి యూదులను ఊచకోతకోశారు.
ఇరాన్ పాలకవర్గం మీద ట్రంప్‌కూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకూ కక్ష ఉండొచ్చు. తామనుకున్న రీతిలో ఇరాన్ పాలకవర్గం వ్యవహరిస్తూ ఉండకపోవచ్చు. అక్కడి మతప్రేరిత పాలనా పద్ధతులు వారిద్దరికీ నచ్చకపోవచ్చు. అక్కడి ప్రభుత్వాన్ని ఉంచాలా తుంచాలా అన్నది ఆ పాలన ఫలితాలను అనుభవించే ప్రజలే నిర్ణయించుకోవాలి. ఆ హక్కుని హరించే అధికారం మరో దేశానికి ఉండకూడదు. ఆధునిక రాజనీతి చెప్పేదీ అదే! ఇరాన్ పాలకవర్గం తమకు పాదాక్రాంతం కాకపోతే ఆ దేశ నాగరికతనే వినాశనం చేస్తామంటూ ట్రంప్ పదేపదే చేస్తోన్న హెచ్చరికలు ఆనాటి హిట్లర్ ప్రకటననే గుర్తుకు తెస్తున్నాయి. ఎవరూ తోసిపుచ్చలేని కొన్ని సహజసిద్ధ హక్కులతో ప్రజలందరూ జన్మిస్తారనీ వాటిని ఏ రాజ్యమూ ఉపేక్షించలేదనీ, కాలరాయలేదనీ చెప్పటమే పరమోద్దేశంగా అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించారు. జీవించే హక్కు, స్వేచ్ఛగా బతికే హక్కు, సంతోషం కోసం ప్రయత్నించే హక్కు.. ప్రజలందరికీ ఉంటాయని ఘనంగా వ్యక్తంచేసిన ఆ ప్రకటన వెలుగులో ట్రంప్ వ్యాఖ్యలనూ, హెచ్చరికలనూ చూస్తే ఈనాటి అమెరికా ఏ స్థాయికి చేరుకుంటోందో స్పష్టంగానే తెలుస్తుంది.
నాగరికత అంతం గురించి ట్రంప్ నోటివెంట అంత యధాలాపంగా మాటలు రావటాన్ని భాషా ప్రయోగంలో వాచాలత్వంగానూ భావించలేం. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడూ ట్రంప్‌లాగా సొంతంగా పెట్టుకున్న ప్రసారసాధనాల్లో వాచాలత్వానికి నిదర్శనం అనిపించేలా వ్యాఖ్యలూ, విమర్శలూ చేయలేదు. కానీ ట్రంప్ వాచాలత్వాల వెనుక నిలకడలేని తనమే ఉంటుందని మనం సరిపెట్టుకోలేం. వాచాలత్వాలు, నోటిదురుసులు వెనుక శతాబ్దాల చరిత్ర దాగి ఉంటుంది. స్థానిక నాగరికతల విధ్వంసాల పునాదిపైనే అమెరికాలో యూరోపియన్ల ఆధిపత్యం మొదలైంది. భారత్‌కు సముద్రమార్గాన్ని కనుక్కోటానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా యాదృచ్ఛికంగా అమెరికా ఖండానికి చేరుకున్న యూరపు నావికులూ, సాహసగాళ్లూ అక్కడ నయానా, భయానా కాలక్రమంలో అనేక సంస్కృతులనూ, నాగరికతలనూ ధ్వంసం చేశారు. అక్కడి ప్రజలు ఎన్నడూ చూడని రోగాలనూ రొష్టులనూ వ్యాపింపచేసి నాగరికతలే కూలిపోవటానికి కారణమయ్యారు. యూరపు వాతావరణంలో ఉండే వైరస్‌లూ, సూక్ష్మక్రిములూ అమెరికా ఖండంలో ఒకప్పుడు లేవు. అందుకే అక్కడి ప్రజల్లో వాటికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తీ అభివృద్ధి కాలేదు. మనుషులకు వచ్చే వ్యాధులకు మూలాలు చాలా వరకూ జంతువుల్లో ఉంటాయి. ఆ జంతువులను ఉపయోగించుకునే ప్రజలకు వాటి ద్వారా సంక్రమించే రోగాలకు తట్టుకునే నిరోధక శక్తి కాలక్రమంలో పెరుగుతుంది. యూరపు, ఆసియా, ఆఫ్రికా (పాతప్రపంచం)ల్లో ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు, కోళ్లు, గాడిదలు, కుక్కలు, పిల్లులతో శతాబ్దాల పాటు ప్రజలు సహజీవనం చేశారు. వీటన్నిటినీ కొత్త ప్రపంచానికి (అమెరికా ఖండం) తీసుకువెళ్లటంతో వాటిల్లో రోగకారకాలుగా ఉండే సూక్ష్మక్రిములూ, వైరస్‌లూ అక్కడ అడుగుపెట్టాయి. వీటిని తట్టుకునే రోగనిరోధకశక్తి లేని స్థానికులు వాటి బారినపడి పిట్టల్లా రాలిపోయారు. ఇట్లా పాతప్రపంచంలోని జంతుకోటినీ, వృక్షకోటినీ అమెరికా ఖండంలో ప్రవేశపెట్టటాన్ని పర్యావరణ సామ్రాజ్యవాదంగా వర్ణిస్తూ అల్ర్ఫెడ్ క్రాజ్బీ మనందరమూ ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతంగా విశ్లేషిస్తూ ఒక పరిశోధనా పుస్తకాన్నే రాశారు.
యుద్ధాలతో, అంటించిన రోగాలతో అమెరికా ఖండంలోని మూడు మహానాగరికతలను (మాయా, అజ్టెక్, ఇన్కా) యూరోపియన్లు అంతం చేశారు. ఇక వందలాది స్థానిక జాతులూ అక్కడ అలాగే కనుమరుగయ్యాయి. యూరోపియన్లు రాకముందు అమెరికా ఖండంలో 5 నుంచి 6 కోట్ల మంది ప్రజలుంటే 17వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికీ వారిలో 90శాతం మంది కనుమరుగైపోయారు. బంగారం, వెండి, రాగి లోహాలు పుష్కలంగా ఉండే కొత్త ప్రపంచంలో ప్రజలకు ఇనుము గురించి తెలియదు. ఇనుములేదు కాబట్టి ఉక్కుని తయారు చేయటమూ నేర్చుకోలేదు. అందుకే ఉక్కు ఆయుధాలతో స్థానికులను లొంగదీసుకుని అక్కడి బంగారం, వెండి నిల్వలను భారీగా యూరపుకు తరలించుకుపోయారు. పారిశ్రామిక విప్లవానికి కావాల్సిన పెట్టుబడులను భారీగానే సమకూర్చుకున్నారు. అమెరికా ఖండంలో నాగరికతల, జాతుల విధ్వంసం అనేది ఎంత దారుణంగా జరిగిందో చరిత్రను పైపైన చదివినా తేలికగానే తెలుస్తుంది. ట్రంప్ నోటివెంట నాగరికత విధ్వంసం అనే మాట రావటానికి ఆయన పరిమిత మేధలో కూడా ఆ చరిత్ర ఏదో మూల కదలాడుతూ ఉండటమే కారణమై ఉండొచ్చు!
అమెరికా ఖండాన స్థానిక నాగరికతల విధ్వంసం తేలికగానే జరిగి ఉండొచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది సాధ్యమైంది. కాదనలేం. కానీ ఇరాన్ నాగరికతనూ అలా అంతం చేయగలమనే ఆలోచన రావటమూ, అందుకోసం ఎంతటి ఆయుధశక్తినైనా ప్రయోగిస్తామని ప్రకటించటమూ చూస్తే గత అనుభవాలనూ చరిత్రనూ ఎంత అల్పదృష్టితో చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వియత్నాం యుద్ధంలో ఏ జరిగిందన్నది అమెరికాకు గుర్తుకు రాకపోవటమే విచిత్రంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వివిధ దేశాల్లో ప్రయోగించిన మొత్తం బాంబుల కంటే ఎక్కువగా వియత్నాంలో ప్రయోగించారు. అడవులను దగ్ధం చేశారు. విషవాయువులను విచ్చలవిడిగా వెదజల్లారు. గ్రామాలకు గ్రామాలనే తగలపెట్టారు. 5 లక్షలకు పైగా సైన్యాన్ని దించారు. ఒళ్లంతా మండించే విషరసాయనాలతో ప్రజలు హాహాకారాలు చేసే దృశ్యాలను నిత్యకృత్యం చేశారు. 12,000 నుంచి 13,000 వరకూ విమానాలనూ, హెలికాప్టర్లనూ ఉపయోగించారు. వీటిల్లో 9,000 నుంచి 10,000 వరకూ విధ్వంసమూ అయ్యాయి. అమెరికను సైనికులు 58,000 మందికి పైగా మరణించారు. 3 లక్షల మంది దాకా గాయపడ్డారు. ఇక వియత్నాంకు కలిగిన నష్టం అంతా ఇంతా అని చెప్పలేం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఉత్తర వియత్నాంలో 9 లక్షల మంది సైనికులు చనిపోతే అమెరికా మద్దతుతో పాలన సాగిన దక్షిణ వియత్నాంలో 1,85,000 మంది మరణించారు. వియత్నాం పౌరులు 20 లక్షల దాకా చనిపోయారు. యుద్ధానికి మద్దతుగా దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సైన్యాలను అమెరికా రంగంలోకి దించింది.
కొంతకాలం పరోక్షంగా మరికొంతకాలం ప్రత్యక్షంగా 20 ఏళ్లపాటు ఏదో విధంగా వియత్నాంలో అమెరికా యుద్ధం చేసింది. చివరికి ఏమీ చేయలేక 1973లో సైన్యాలను వెనక్కి రప్పించుకోవాల్సి వచ్చింది. పత్రికల్లో వచ్చిన ఫోటోలు, టీవీల్లో ప్రసారమైన యుద్ధ బీభత్సాలను చూసి తమ ప్రభుత్వం సాగిస్తున్నది ధర్మయుద్ధం కాదన్న నిర్ణయానికి వచ్చిన అమెరికా విద్యార్థులూ యువకులూ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. విదేశీ పాలనను, నియంతృత్వాన్ని సహించలేని ఆలోచన వియత్నాం ప్రజల్లో బలంగా ఉండేది. అదే మొదట్లో ఫ్రాన్స్ వలసపాలనకు వ్యతిరేకంగా, ఆ తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించేటట్లు చేసింది. రాజకీయ సంకల్పబలం, జాతీయవాదం కలగచేసే ప్రేరణ, విశ్వసించిన భావజాలం కోసం ప్రాణాలొడ్డే త్యాగనిరతి ఉన్న ప్రజల ముందు ఆయుధబలం అంతిమంగా ఓడిపోతుందనే వియత్నాం చరిత్ర నిరూపించింది. నాగరికత విధ్వంసం చేస్తాం.. రాతియుగానికి దేశాన్ని తీసుకువెళతాం.. అనేవి నిజానికి యుద్ధనేరాల కిందకు వస్తాయి. జాతిహనన నేరం కింద కూడా వాటిని లెక్కించాల్సి ఉంటుంది. వియత్నాంలో యుద్ధం మొదలైన కొన్నేళ్ల తర్వాత అమెరికాలో నిరసన ప్రదర్శనలు మొదలైతే ఇప్పుడు ఇరాన్‌పై సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా కొన్ని రోజుల్లోనే అవి అమెరికాలో హోరెత్తాయి. 15 రోజుల కాల్పుల విరమణ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం. ఇంతవరకూ ఇరాన్ అనూహ్య సమరశీలతను ప్రదర్శించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ల ఏకపక్ష యుద్ధానికి నాటో దేశాలు సైతం సహాయనిరాకరణ చేయటం ఇరాన్‌కు నైతిక విజయమనే చెప్పాలి. ఇప్పటికైనా అంతర్గతంగా ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టి జనాభిమానాన్ని సంపాదించుకుంటానికి ఇరాన్ పాలకవర్గం ప్రయత్నించాలి. అది జరగనంత కాలం ఏదోరకంగా ప్రమాదం అంచున నిలబడటమే అవుతుంది. పశ్చిమాసియాలో ప్రజాస్వామ్య పోరాటాలకు ఒకనాడు అగ్రగామిగా ఉన్న ఇరాన్ ఆ వారసత్వం నుంచి ఎల్లకాలం తప్పించుకోలేదు! ప్రజలూ దాన్ని ఉపేక్షించి మౌనంగానూ ఉండరు!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News