పక్కదారి పట్టిన మూసీ ప్రక్షాళన!
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:19 AM
మూసీ నది (ముచుకుంద నది) జన్మస్థానం అయిన వికారాబాద్ పరీవాహక ప్రాంతాల్లోని మెడిసినల్ ప్లాంట్ల ఆకుల నుంచి జారి, నేలరాలిన ఆకులనూ రంగరించుకుంటూ, ఆ చెట్ల వేర్ల గుండా....
మూసీ నది (ముచుకుంద నది) జన్మస్థానం అయిన వికారాబాద్ పరీవాహక ప్రాంతాల్లోని మెడిసినల్ ప్లాంట్ల ఆకుల నుంచి జారి, నేలరాలిన ఆకులనూ రంగరించుకుంటూ, ఆ చెట్ల వేర్ల గుండా ప్రవహించిన ఔషధ గుణం ఉన్న నీరు చిన్నప్పుడు తాగడం వల్ల, నాకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువ. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు నాకు సోకడం అరుదు. అటువంటి మూసీ నది నీరు నేడు ఔషధ గుణాలు కోల్పోయి విషతుల్యంగా మారింది.
మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభినందనీయం. కానీ, మూసీనది ప్రక్షాళన నేడు సుందరీకరణగా మారిపోయింది. మూసీ ప్రక్షాళన అంటే ఆ నది నీటి కాలుష్య నివారణ, నీటిశుద్ధి అనే రెండు అంశాలు. మిగతా విషయాలు సంబంధం లేనివి. 1985 వరకు భీమలింగం వద్ద (సంగెం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా) మూసీ నీటిలో ఈతలు కొట్టి, ఆ నది నీటితో వండుకుని తిన్నవాళ్ళం మేము. మరి అటువంటి నీరు, ఈ రోజు విషతుల్యంగా మారడానికి కారణం ఏమిటి? మూసా, ఈసీ వాగుల సంగమం వల్ల మూసీ నది ఏర్పడింది. హైదరాబాద్ నుంచి మొదలైన ఈ నదీ ప్రవాహం ముందుకు సాగుతున్న కొద్దీ మరింత కాలుష్యం ఆ నీటిలో చేరుతోంది. హైదరాబాదు మహానగరం, రంగారెడ్డి జిల్లాలు దాటే సమయానికి నిండు గర్భిణి లాగా కాలుష్యాన్ని నింపుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి అడుగు పెడుతోంది. ప్రధానంగా మూసీ నది నీటిని కలుషితం చేస్తున్నవి... 1) పారిశ్రామిక వ్యర్థ నీటి ప్రవాహాలు– వాటిని గుర్తించడం, విశ్లేషించడం, ఆయా పారిశ్రామిక కేంద్రాల వద్ద తగిన రసాయనాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. 2) గృహ సంబంధిత వ్యర్థ జలాలు– వీటిని గుర్తించి నీటి శుద్ధి కోసం ఆయా కాలనీల్లో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. 3) ట్యాంకర్ల ద్వారా విషపూరిత రసాయనాలు– వీటిని వదులుతున్న కంపెనీలను గుర్తించి, వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఆయా కంపెనీల రసాయన జలాలను నిబంధనల మేరకు శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని బయటకు వదలడం... ఈ మూడు అంశాలే మూసీ నది కాలుష్య ప్రక్షాళనకు ప్రధానం. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ ఈ అంశాలపై ఉన్నత స్థాయిలో దృష్టి సారించలేదు, చర్చించలేదు, కాలుష్య కారకాల గుర్తింపు జరగలేదు.
ఎన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయని గానీ, నది పొడవునా కాలుష్య గాఢత పరిమాణం పరిశీలన గానీ, దాని నివారణపై గానీ సర్కారు దృష్టి పెట్టలేదు. అసలు ప్రస్తుత నీటి కాలుష్యంపై ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదు. మూసీ నది ప్రక్షాళన విషయం పక్కదారి పట్టి, మూసీ సుందరీకరణగా రూపాంతరం చెందింది. ‘‘మూసీ నదిలో ప్రవహిస్తున్న నీరు’’ అనే విషయం, ‘‘మూసీ ఒడ్డున నివసిస్తున్న వారి విషయం’’గా ప్రస్తావనకు రావడం గమనార్హం. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మూసీ నది సుందరీకరణ అంశాన్ని మాత్రమే ధ్రువీకరిస్తున్నారు. కానీ ప్రజలు కోరుకుంటున్నది తక్షణం మూసీ నది నీటి కాలుష్య ప్రక్షాళన మాత్రమే!! కానీ కాలుష్య కారకాల గుర్తింపు, పారిశ్రామిక రసాయనాల గుమ్మరింపు, గృహ జలవ్యర్థాల మురుగు, వ్యర్థ జల శుద్ధి, నీటి శుద్ధి కేంద్రాలు... వీటి గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం, చర్చలు, సమీక్షలు నిర్వహించకపోవడం విడ్డూరం. ఈ విషయాల మీద ప్రణాళిక గానీ, కార్యాచరణ గానీ, నామమాత్రపు బడ్జెట్ కాకుండా నిర్ధారిత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వంటివి మూసీ నది ప్రక్షాళనపై సందేహాలు కలుగజేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా– హాని కలిగించే కాలుష్య భూగర్భ జలాలు, నది పరీవాహక ప్రాంతాలలో నీటి, వాయు కాలుష్యాన్ని నివారించి, స్వచ్ఛమైన నీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించడం నేటి తరం బాధ్యత. నేను మళ్లీ నా ఇమ్యూనిటీని పెంచగల మూసీ నది నీటిని తాగడం కలగానే మిగిలిపోతుందేమో?!
చెరుకుపల్లి శ్రీనివాసు
(అధ్యక్షులు, రావి నారాయణరెడ్డి సేవా సంస్థ)
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన