Share News

మూర్తీభవించిన శ్రామిక శక్తి సయ్యదా

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:04 AM

తొమ్మిదేళ్ళ అధ్యయనం, దాదాపు 900 మందిని కలిసిన అనుభవం, అనేక గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, సరదాగా చెప్పుకొన్న కబుర్లు, వందల గంటల లైబ్రరీ అధ్యయనం....

మూర్తీభవించిన శ్రామిక శక్తి సయ్యదా

తొమ్మిదేళ్ళ అధ్యయనం, దాదాపు 900 మందిని కలిసిన అనుభవం, అనేక గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, సరదాగా చెప్పుకొన్న కబుర్లు, వందల గంటల లైబ్రరీ అధ్యయనం ఫలితంగా వెలువడిన ఆంగ్ల పుస్తకం ‘The story of unknown Indian’ అనే టాగ్‌లైన్‌తో నేహా దీక్షిత్ రాసిన ‘The Many lives of Syeda X’. అదిప్పుడు మలుపు బుక్స్ ద్వారా ‘సయ్యదా X, ఒక అపరిచిత భారతీయురాలి కథ’ పేరుతో తెలుగులోకి వచ్చింది.

సయ్యదా ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ, ఒక పేద ముస్లిం మహిళ. ఈ దేశంలో అత్యంత వల్నరబుల్ అస్తిత్వ మిశ్రమం ఇది. నేహా తన పుస్తకం ద్వారా సయ్యదా లాంటి లక్షలాది అథో జగత్ మనుషులను పరిచయం చేసారు.

హిందువుల పుణ్యక్షేత్రం బెనారస్ పట్టణంలో ముస్లిం యువతిగా సయ్యదా జన్మిస్తుంది. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత నుండి 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణకాండ వరకూ ఆమె పయనాన్ని మనకు చెబుతారు నేహా దీక్షిత్. ఈ 28ఏళ్లలో మారిన భారత ముఖచిత్రాన్ని ఆమె అర్థం చేసుకొన్న తీరూ, పాఠకులకు ప్రెజెంట్ చేసిన పద్ధతీ– ఈ పుస్తకానికి పాఠకుల అల్మారాల్లో గర్వంగా నిలబడే స్థానాన్ని ఇచ్చాయి.

1992–2020 మధ్య కార్యశీలకంగా ఉన్న వాళ్లకు భారతదేశం ఎలా మారుతూ వచ్చిందో తెలుసు. నేహా ప్రస్తావించిన ఘటనలన్నీ అప్పటివే. మనం బలవంతంగా స్మృతిపథంలో మరుగున పరిచిన ఆ స్మృతులను నేహా బయటకు లాగి– ‘ఇదిగో ఈ కాలంలో, ఇక్కడ, ఇలా సయ్యదా ఉంద’ని చెబుతారు. అక్కడ, అప్పుడు బాధితులుగా, సాక్షులుగా ఉన్నది సయ్యదాలు, జరీనాలు, జాకీయాలు, జహీరాలు, బిల్కిస్ బానోలే.


పట్టు, వెండిదారాలతో సొగసైన చీరలు నేసే బెంగాల్ ముస్లింల ఇళ్లు సయ్యదా పుట్టినిల్లు, మెట్టినిల్లు. మగ్గాన్ని కట్నంగా తీసుకొని సగర్వంగా అత్తారింటి అడుగు పెట్టి, బెనారస్ చీరలలో కూడా అరుదైన చీరలు నేసే అక్మల్ ప్రేమను పొందింది. ఆ కాలంలో నేత నైపుణ్యం ఉన్న ముస్లింల చేతిలో బెనారస్ చీరల తయారీ ఉండేది. కాశీ అన్నపూర్ణకు కట్టే చీరలు కూడా ముస్లిములే అనేక దశాబ్దాలుగా నేస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ మసీదు ధ్వంసం కలిగించిన ప్రకంపనాలు బెనారస్‌ను కూడా తాకాయి. జ్ఞానవాపి మసీదు అక్కడ ఉండటం, నేత పని ముస్లింల చేతిలో ఉండటం– ఈ రెండు విషయాలు బెనారస్ సరిహద్దుల్లో ఉన్న మదన్ పురా దాడులకు కారణం అయ్యాయి. ప్రతి మత కల్లోలం వెనక ఆర్థిక, రాజకీయ కారణాలు ఉంటాయని ఈ సందర్భంగా పట్టిచూపారు రచయిత్రి. బాబ్రీ మసీదు ధ్వంసంతో పాటు, బెనారస్ ముస్లింల మగ్గాలు కూడా ధ్వంసం అయ్యాక వాళ్ళకు బతకలేని పరిస్థితులు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాల తరువాత పవర్ లూమ్స్ ఉనికిలోకి వచ్చాక ఆకలి, దుఃఖం వారికి అనుభవం అయినవే కానీ, బాబ్రీ మసీదు ధ్వంసం తరువాత మొదటిసారిగా ఆ కుటుంబాలకు భయోత్పాతం అనుభవం అయింది. పొట్ట చేతబట్టుకొని ముగ్గురు పిల్లలతో ఆ కుటుంబం కనబడిన రైలు ఎక్కి ఢిల్లీ చేరుతుంది.

6666-Vividha-edit.jpg

ఇక్కడ నుండి కథన వైశాల్యం విస్తృతం అవుతుంది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల నుండి బతకలేకనో, లేక బతకనివ్వకపోవటంతోనో అనేక ముస్లిం కుటుంబాలు వలసలుగా ఢిల్లీ చేరాయి. పట్టు చీరలు అల్లిన కళాకారుడు అక్మల్ రిక్షా కూలి అయ్యాడు. ఇల్లు దాటని సయ్యదా అవిశ్రాంత, అసంఘటిత కార్మికురాలు అయ్యింది. రోజుకు 16 గంటలు, ఒక్కోసారి నాలుగు ఉద్యోగాలు (అంటే పనులు) చేస్తూ కుటుంబాన్ని లాగింది. ఢిల్లీ నగరం పరిశుద్ధం కావాల్సిన ప్రతిసారీ వలస వచ్చిన వాళ్లు నగరం అంచులకు నెట్టబడ్డారు. అలా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ఒక సరిహద్దుగా కల్మష యమునా నది ఒడ్డును ఒరుసుకొని ఈశాన్య ఢిల్లీ ఏర్పడింది. కనీస వసతులు లేని, పక్షి గూళ్ల లాంటి అపరిశుభ్ర నివాస గృహాలు అక్కడ మొలిచాయి. అవే సయ్యదా కుటుంబం లాంటి వేలాది కుటుంబాలకు ఆవాసం అయ్యాయి.

ఐదుగురు మనుషులకు కనీసం రెండుపూట్ల అయినా నాలుగువేళ్లు లోపలికి పోవాలంటే ఎంత కష్టపడాలి? జీన్స్ దారాలను కుట్టటం దగ్గర నుండి తినుబడరాలు తయారు చేయటం, బాదంకాయలను పగల కొట్టటం దగ్గర నుండి టీ ఫిల్టర్స్, తలుపు కొక్కేలు, కుక్కర్లు, ఫోటో ఫ్రేములు తయారు చేయటం– సయ్యదా చేయని పని లేదు. బొట్టు బిళ్లలు, సాఫ్ట్ టాయ్స్, వెడ్డింగ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వస్తువులు– కారు చౌక శ్రమ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ సయ్యదా ఉంటుంది. కనీసవేతన చట్టాలు, కార్మిక రక్షిత చట్టాలు కాగితాలకే పరిమితమైన చోట– లక్షలాది సయ్యదాలు తమ చెమటనూ, ఆరోగ్యాన్ని ధారబోసి ఢిల్లీ నగరాన్ని, భారతదేశాన్ని భాగ్యవంతం చేశారు.


సామాన్య మానవుడికి అవసరమైన ఆహారం, చిరుతిళ్లు, సౌందర్యసాధనాలు, స్టేషనరీ, దుస్తులు, వాహనాల విడి భాగాలు, పుస్తకాలు, ప్రింట్లు, స్పేర్ పార్టులు, అలంకరణ వస్తువులు, బొమ్మలు, వంటగది ఉపకరణాలు, హార్డ్‌వేర్, వడ్రంగి పరి కరాలు, పైపుల సామాను, భవన నిర్మాణ సామగ్రి, భక్తి సంబంధిత సరంజామా, పండగ దినుసులు, వైద్య సంబంధిత వస్తువులు, ఎలక్ట్రిక్ మెటీరియల్స్ –మహిళలు వీటన్నిటిని ఇక్కడ విడివిడిగా తయారు చేస్తారు. అవన్నీ అంచెలంచెల కాంట్రాక్టర్ల ద్వారా కనబడని యజమాను లకు చేరుతాయి. వాళ్లే బహుళజాతి కంపెనీ ఓనర్లు. భారత దేశపు పేదకార్మికురాల్ని కొల్లగొట్టి, మల్టీమిలియనీర్లు అయినవాళ్లు.

నేహా దీక్షిత్ మహిళల శ్రమదోపిడీ గురించి క్షుణ్ణంగా, వ్యక్తులను నిలబెట్టి మరీ సోదాహరణంగా వివరిస్తుంది. ఇంటి దగ్గర చేసే పీస్ వైజ్ పని పనే కాదనీ, ఆడవాళ్లు ఒళ్లు విరుచుకొని అహర్నిశం పడే కష్టం వేడినీళ్లకు చన్నీళ్లనే లాంటి సిద్ధాంతాలను బయటవాళ్లు కాదు, ఆడవాళ్లే నమ్ముతారని వాళ్ల మాటల్లోనే చెబుతారామె. ఈ పుస్తకంలో నేహా వర్ణించినలాంటి వందలాది శ్రమలతో తయారైన వస్తువులు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు ఉంటాయి. మెత్తని దిండును తడిమి చూస్తే, దాని వెనుక సయ్యదా నల్లటి గట్టిపడిన వేళ్ల శ్రమ ఉంటుంది. పొద్దున్నే పూజకు వెలిగించే అగరబత్తి సువాసనతో సయ్యదా చెమట వాసన కలగలిసి ఉంటుంది. సయ్యదా అంటే ఒక వ్యక్తి కాదు. అనేక శ్రామికశక్తుల మూర్తిమత్వం.

బాదంపప్పు ఒలిచే కర్మాగారంలో జరిగిన సమ్మెలో పాల్గొన్న మహిళల గురించి రాసిన ‘బాదంపప్పు’ అనే అధ్యాయం ఈ పుస్తకానికి తలమానికం. సమ్మెలో పాల్గొనటానికి మొదట సంసిద్ధత లేని మహిళలు అంచెలంచెలుగా ఎలా ఎదుగుతారో వివరంగా రాశారామె. సమ్మె విజయవంతం అయిందా లేదా అనే ప్రశ్న కాదు. సమ్మె చేయాల్సిన పరిస్థితికి వాళ్లు ఎలా నెట్టబడతారు, సమ్మె తరువాత వాళ్లు ఎలా మారతారు అనే విషయాలను– వంద ఎకనామిక్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలు వివరించలేనంత సరళంగా రచయిత్రి ఈ పుస్తకంలో వివరించారు. యాజమాన్యాన్ని ఎదుర్కోవటమే కాదు, సమ్మెకాలంలో ఇంట్లో పితృస్వామ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారో, ఎదుర్కొనే బలం వారికి ఎక్కడ నుండి వస్తుందో కూడా చక్కగా అరటిపండు వలిచి చేతికిచ్చినట్లు చెప్పారు.


బతుకీడ్చటానికి నిరంతరం శ్రమిస్తూ, నాలుగ్గోడల మధ్య బతుకుతున్న సయ్యదా కుటుంబం– ఆ గోడలను బద్దలు కొడుతూ కమ్ముకుని, చొచ్చుకొని వచ్చే బయటి రాజకీయ, ఆర్థిక పెనుమార్పుల నుండి తప్పించుకోగలదా? మసీదులు కూలిపోతుంటే ‘ప్రార్థనకు నాకు అనుమతి ఇవ్వని మసీదు కూలిపోతే ఏమిలే’ అని సయ్యదా కూతురు రేష్మ అనుకోవచ్చు. కానీ అది మసీదు మీద ద్వేషం కాదు, మనుషులను విభజించే కుట్ర అని తెలుసుకోవటానికి ఎక్కువ కాలం కావాలా?

కూలిపోయిన శకలాల నుండి జీవితాన్ని పునర్నిర్మిచుకోవటంలో నిష్ణానితురాలైన సయ్యదా– లవ్ జిహాద్‌ల నుండీ, డిమానిటైజేషన్ నుండీ, జిఎస్టీ విధింపు నుండీ, ఎన్‌ఆర్‌సీ ఉద్యమం అయ్యాక ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణకాండ నుండీ, కోవిడ్ 19 కాలంలో జరిగిన విస్తాపన నుండీ బతికి బట్టకట్టి, టిఫిన్ చేతబట్టి, దిల్లీ ట్రోనికా సిటీకి పని పోవటానికి బస్‌స్టాండ్‌కు బయలుదేరటంతో కథ ముగుస్తుంది. అప్పటికే మొదలైన ఇంకో కొత్త తరహా శ్రామికురాలు ఆమె కూతురు రేష్మ కథ – ‘వెలిగిపోతున్న ఇండియా’ రాజధానిలో మరో చోట ప్రారంభం అవుతుంది.

చదువరులకు జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు, దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న విలువైన పుస్తకం ఇది.

రమాసుందరి

ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు నిధులు కేటాయించని కేంద్రం

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

Updated Date - Feb 02 , 2026 | 01:04 AM