Share News

మౌనమేల జగన్?

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:40 AM

రాజకీయాల్లో నైతిక జవాబుదారీతనం అనివార్యం. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ధోరణి అందుకు భిన్నం. తమ హయాంలోని ప్రతి శాఖలోనూ, ప్రతి నిర్ణయంలోనూ అవినీతి తిమింగలాలు రాష్ట్ర ఖజానాను ఎలా గుల్ల చేశాయో...

మౌనమేల జగన్?

రాజకీయాల్లో నైతిక జవాబుదారీతనం అనివార్యం. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ధోరణి అందుకు భిన్నం. తమ హయాంలోని ప్రతి శాఖలోనూ, ప్రతి నిర్ణయంలోనూ అవినీతి తిమింగలాలు రాష్ట్ర ఖజానాను ఎలా గుల్ల చేశాయో ఆధారాలతో సహా బయటపడుతున్నా మౌనం వహిస్తున్నారు.

మౌనం ఒక్కోసారి నేరాంగీకారం కూడా అయిపోతుంది. ఇసుక, తిరుమల నెయ్యి, మద్యం, ఏపీపీఎస్సీ... ఇలా వైసీపీ పరిపాలనా కాలంలో జరిగిన స్కాముల అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బైటపడుతుంటే, వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులు, మంత్రులు వరుసగా జైలుపాలవుతుంటే, సమాధానం చెప్పాల్సిన జగన్‌రెడ్డి మాత్రం మౌన ముద్రతో విదేశాలకు వెళ్లిపోయారు.

2019 ఎన్నికల ముందు మహిళల సెంటిమెంట్‌తో ఆడుకుంటూ ‘సంపూర్ణ మద్యనిషేధం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రలో హామీలు ఇచ్చిన వైసీపీ, అధికారంలోకి రాగానే మద్యాన్నే రాష్ట్ర ఖజానాను, ప్యాలెస్ గల్లా పెట్టెను నింపే ప్రధాన వనరుగా మార్చుకుంది. ఊరూరా ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టి, బ్రాండ్ల పేరుతో సాగిన ఈ రూ.3,500 కోట్ల భారీ కుంభకోణం కేవలం ఒక సాధారణ అవినీతి కాదు; ఇది వ్యవస్థలను పూర్తిగా లొంగదీసుకుని చేసిన వ్యవస్థీకృత దోపిడీ. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు గుట్టును రట్టు చేస్తూ, ఏపీబీసీఎల్ ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ కోర్టులో అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించింది. లిక్కర్ రవాణా, టెండర్ల అవకతవకలు, సిండికేట్ వ్యవహారాలన్నీ తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి నివాసం కేంద్రంగానే నడిచాయని, ఆ భారీ దోపిడీ మొత్తం నేరుగా పైస్థాయికి చేరిందని సత్యప్రసాద్ చెప్పాడు. జగన్ అత్యంత నమ్మకస్తుడు, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కాసిరెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారుల చురుకైన ప్రమేయంతో ఈ లూటీ సాగింది. ఈ లూటీ సొమ్మును రియల్ ఎస్టేట్, విదేశీ షెల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడమే గాక, 2024 ఎన్నికల్లో విచ్చలవిడిగా వాడారు. ఈ కేసులో ఇప్పటికే ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, నలుగురు ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం 19 మంది అరెస్ట్ కావడం, సీఐడీ–ఈడీ కలిపి వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం చూస్తుంటే– వేళ్లన్నీ నేరుగా జగన్ వైపే చూపిస్తున్నాయి. అయినా జగన్ నోరు విప్పక, ‘మౌనం అర్ధాంగీకారం’ అన్న సామెతను నిజం చేస్తున్నారు.


మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు అయిన యువత నమ్మకాన్ని ఏపీపీఎస్సీ వేదికగా పూర్తిగా ఖూనీ చేశారు. నాడు, రామాంజనేయులు సెక్రటరీగా, తర్వాత గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన ప్రతిభావంతులైన నిరుద్యోగుల జీవితాలను ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారం బలిపెట్టారు. డిజిటల్ వాల్యుయేషన్ పేరుతో, మాన్యువల్ వాల్యుయేషన్ల మార్పిడితో ఒకే జవాబు పత్రాన్ని పదే పదే దిద్దించడం, వైసీపీ అనుకూల అభ్యర్థులకు మార్కులు గుమ్మరించడం వంటి ఘోరాలు జరిగాయి. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ సెక్రటరీ పి.సీతారామాంజనేయులును సీఐడీ అరెస్ట్ చేసి జైలుకు పంపగా, అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవీ కాలం ఉండగానే అకస్మాత్తుగా రాజీనామా చేసి పారిపోయారు. హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దాఖలు చేసిన పూర్తి స్థాయి చార్జ్‌షీట్ నేరుగా తాడేపల్లి వైపే వేలెత్తి చూపిస్తున్నా జగన్ నుంచి స్పందన కరువయ్యింది.

జగన్‌ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారమే పెద్ద నిదర్శనం. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, శుద్ధ ఆవు నెయ్యికి బదులుగా రిఫైన్డ్ పామాయిల్, కెమికల్స్ కలిపారని దర్యాప్తులో తేలింది. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్‌ చంద్ మంగ్లాను, భోలే బాబా డెయిరీకి చెందిన విపిన్ జైన్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. 2019–2024 మధ్య కాలంలో దాదాపు రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని సరఫరా చేశారని, నకిలీ రికార్డులు సృష్టించి ఈ దందా నడిపారని ఈడీ చార్జ్‌షీట్లలో పేర్కొంది. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్లు వెతుక్కుని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఉదంతంలో టీటీడీలో సర్వాధికారాలు చలాయించింది జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ సన్నిహితులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఏవీ ధర్మారెడ్డి. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆధారాలు చూపిస్తుంటే మాత్రం జగన్‌ తనకేం తెలియనట్లుగా మౌన వ్రతం పూనడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.


ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ‘జె–బ్రాండ్’ ఇసుక పాలసీ ద్వారా రూ.5,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దొంగ చలానాలు, అక్రమ రవాణా ద్వారా దోచుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములను, ఆస్తులను లాక్కునేందుకు కుట్ర పన్నారు. వేల ఎకరాల అసైన్డ్ భూములు, విశాఖపట్నం దసపల్లా భూములు, రుషికొండ ప్యాలెస్... వంటి విధ్వంసాల వెనుక ఉన్న ల్యాండ్ స్కామ్స్ విలువ అక్షరాలా వేల కోట్లు. పల్నాడు నుంచి రాయలసీమ వరకు సాగిన మైనింగ్, క్వారీ రంగాలను జగన్‌ అనుచరులు పూర్తిగా దోచేసి ప్రభుత్వ ఖజానాకు భారీ గండికొట్టారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో, బటన్లు నొక్కడంలో చూపిన శ్రద్ధ, నేడు తమ హయాంలో జరిగిన స్కాములు బట్టబయలవుతుంటే సమాధానం చెప్పడంలో ఎందుకు చూపడం లేదు? ఇప్పటికైనా ఆయన తన అంతుచిక్కని మౌనాన్ని వీడాలి. మౌనం ఎప్పుడూ సమాధానం కాదు. ఒక్కోసారి నేరాంగీకారం కూడా!

నీలాయపాలెం విజయకుమార్

జాతీయ అధికార ప్రతినిధి– తెలుగుదేశం పార్టీ

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:40 AM