భావాల తుఫాను ఇప్పుడే వచ్చిందా?
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:52 AM
ఇస్లాం, క్రైస్తవాలను దేశ సాంస్కృతిక ఐక్యతకు నిరోధకాలుగా భావించటం మనకు కొత్తకాదు. 125 ఏళ్లకు పైగా ఆ రెండు మతాలకు వ్యతిరేకంగా ఎన్నో రూపాల్లో...
పాశ్చాత్య దేశాల నుంచి ఒక తుఫాను వచ్చింది. అది అన్నిరకాల వ్యవస్థలనూ, మర్యాదలనూ, శుభప్రదమైన విలువలనూ, సంస్కృతినీ, సంస్కారాలనూ వ్యతిరేకిస్తోంది.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్
దేశ గౌరవానికీ, ప్రతిష్ఠకూ భంగం కలిగించే శక్తులూ, సమాజాన్ని విభజించే వ్యక్తులూ, మన సంస్కృతిపై ద్వేషం చూపించే మనస్తత్వం కలిగిన వాళ్లు.. దేశానికి శత్రువులు.
ప్రధాని మోదీ
దసరా పండుగ సందర్భంగా భగవత్, మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. పదునైనవి. మరో కోణం నుంచి చూస్తే మన సంస్కృతిలోని మంచిచెడుల వివేచనకు ఒక సందర్భాన్ని సమకూర్చేవిగానూ భావించొచ్చు!
ఇస్లాం, క్రైస్తవాలను దేశ సాంస్కృతిక ఐక్యతకు నిరోధకాలుగా భావించటం మనకు కొత్తకాదు. 125 ఏళ్లకు పైగా ఆ రెండు మతాలకు వ్యతిరేకంగా ఎన్నో రూపాల్లో విమర్శలూ వ్యాఖ్యలూ వినపడుతూనే ఉన్నాయి. ఆ మతాలను తీవ్రంగా వ్యతిరేకించటానికే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించటానికి రాజకీయపార్టీలూ అవతరించాయి. మన సాంస్కృతిక జీవితాన్ని ఏ రకంగానూ ప్రభావితం చేయలేని స్థాయికి ఆ మతాలను తీసుకెళ్లాలన్న లక్ష్యం దిశగానూ పనిచేశాయి. 1990ల తర్వాత వాటి కార్యాచరణలో అనూహ్యంగా వేగం పెరిగింది. రాజకీయాలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. హిందూత్వ అనేది మతం కాదనీ, అదొక జీవన విధానమనీ సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించటంతో ఆ రాజకీయాలకు బాగా ఊపూ వచ్చింది. మన జాతీయ ఐక్యత సురక్షితంగా ఉండాలంటే హిందూత్వను అందరూ ఆమోదించాలనీ, దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను అనుమానంతో చూడాల్సిందేనన్న దృక్పథానికి గత మూడున్నర దశాబ్దాల కాలంలో గణనీయంగా బలం పెరిగింది. భారత్‌లో ఉన్న వాళ్లందరూ మాతృభూమిని పుణ్యభూమిగా చూడాలనీ, దేశభక్తికి అదే కొలమానమనీ చెప్పటం కొంతకాలంగా మామూలైపోయింది. దేశ సరిహద్దుల అవతల పుణ్యభూములనూ, పవిత్రస్థలాలనూ (మక్కా, జెరూసలెం) చూసే వ్యక్తుల విధేయతను శంకించాల్సిన అవసరం ఉందన్న ప్రచారం కూడా చాలా దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు దానికి మించిన పరిణామాలు జరుగుతున్నాయి. కాక్రోచ్ పార్టీ పేరుతో ఆందోళనలు సాగిస్తున్న యువతను కూడా ఇప్పుడు దేశ సంస్కృతికి వ్యతిరేకులుగా భావించటం మొదలవుతోంది. భగవత్, మోదీ విమర్శలను ఈ నేపథ్యం నుంచి చూస్తేనే వాటి సందర్భశుద్ధి ఏమిటో కొంతైనా అర్థమవుతుంది. భగవత్ అయితే ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన పరిణామాలను కూడా తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. ఆ పరిణామాల వెనుక విదేశీశక్తుల హస్తం ఉందనీ విమర్శించారు.
పాశ్చాత్య సంస్కృతి నుంచి మంచిని స్వీకరించి.. స్వేచ్ఛ, సౌభ్రాత్రం, సమానత్వం, లౌకికవాదం కావాలనీ, సమన్యాయపాలనను అమలుచేయాలనీ కోరుతున్న వాళ్లందరినీ విదేశీశక్తులుగా పరిగణిస్తే మనం మధ్యయుగాల నాటి ఆలోచనల్లోకి వెళ్లిపోతాం. అప్పుడు మన రాజ్యాంగం పునాదులనే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు అందరూ సమానులేనన్న భావన.. మనం గతంలో అనుసరించిన సంప్రదాయక సామాజిక నీతిలో ఎప్పుడూ భాగం కాదు. ధర్మాన్ని కాపాడటం ముఖ్యకర్తవ్యంగా మన సంప్రదాయ రాజనీతి ఉండేది. ఆ నీతిలో ఒక నేరానికి అందరికీ ఒకే విధమైన శిక్షను ఊహించలేం. కులాన్ని బట్టి, వర్ణాలను బట్టి శిక్షలు ఉండేవి. మనుస్మృతితో పాటు ఇతర స్మృతుల్లో అవి చాలా స్పష్టంగానే ఉన్నాయి. వర్ణ ధర్మాన్నీ కుల కట్టుబాట్లనూ కాపాడటమే రాజుల ప్రథమ కర్తవ్యమని స్మృతులు బోధించాయి. ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కత్తిఎత్తిన వీరులు కూడా హైందవమత సామాజిక నీతినీ, వ్యవస్థనూ పునరుద్ధరించటమే లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అధికారం కోసం జరిగిన ఏ పోరాటంలోనైనా ఏదో ఒక నీతినీ, ధర్మాన్నీ పునరుద్ధరించటానికే అన్నట్లుగా ప్రకటనలూ ఉంటాయి. ఆ దిశగా ప్రజలను ప్రేరేపించటమూ ఉంటుంది. తన స్వార్థం కోసమే, తను అనుభవించటానికే అధికారాన్ని కోరుకుంటున్నట్లు ఏ రాజూ చెప్పడు. సామాజిక సమానత్వ భావనను మన భక్తికవుల్లో కొందరు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ అది ప్రచారస్థాయిని దాటి స్థిరమైన రాజకీయ రూపం సంతరించుకుని, రాజ్యాంగనీతిలో, నడవడిలో ఎప్పుడూ ప్రధానభాగం కాలేదు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలపటం.. దానికి మించి ప్రభుత్వాలను గద్దెదింపే స్థాయిలో ఆందోళనలు చేయటం ప్రజాస్వామ్యంలో అతి సహజం. రాజ్యాంగ పరిధిలో వాటిని చేయాలనటంలో తప్పేమీ లేదు. అలాగే హింసకు తావివ్వకుండా ఆందోళనలు చేయాలని కోరటంలో అనౌచిత్యమూ లేదు. ఆందోళనకారులందరినీ దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే వాళ్లుగా భావించటంలోనే ప్రమాదం ఉంది. పాశ్చాత్య భావాల స్ఫూర్తితో ఆందోళనలు చేపట్టడం ఏ రకంగానూ తప్పుకాదు. ఏ భావం ఎక్కడ పుట్టినా అది ఎక్కువ మందికి పనికొచ్చేదైతే పనిగట్టుకుని వ్యతిరేకించాల్సిన అవసరమే ఉండకూడదు. అంతదాకా ఎందుకు.. మన రాజ్యాంగమే పాశ్చాత్య భావాల స్ఫూర్తితో రూపొందింది. రాజ్యాంగసభలో ఎన్నో చర్చలు చేసి దాన్ని రూపొందించారు. మన సంప్రదాయ రాజనీతికీ, కులాల అంతస్తుల ప్రాతిపదికన ఏర్పడిన హెచ్చుతగ్గుల భావనలకు రాజ్యాంగంలో చోటు కల్పించకుండా చూడటానికే పెద్ద కసరత్తు జరిగింది. గోవధ నిషేధం, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం వంటివి రాజ్యాంగంలో ఉన్నా వాటికి పెద్దపీట వేయలేదు. భారత రాజ్యాంగ రచనను నిశితంగా పరిశీలిస్తే మనం ఎరువు తెచ్చుకున్నవే ఎక్కువగా కనపడతాయి. 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో నుంచి తీసుకున్నవే అందులో అధికంగా ఉన్నాయి. బ్రిటన్, అమెరికా, ఐర్లాండు, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్సు, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా రాజ్యాంగాల నుంచి ఎన్నో తీసుకున్నాం. ఎరువు తెచ్చుకున్న వాటిని కొన్ని మార్పులతో మన రాజ్యాంగంలో పొందుపరచటాన్నీ అంబేడ్కర్ కూడా గట్టిగా సమర్థించారు. హిందూ మహాసభ లాంటి సంస్థలు రాజ్యాంగాన్ని అప్పుడే వ్యతిరేకించాయి. సంప్రదాయ మూలాల్లేని రాజ్యాంగమూ ఒక రాజ్యాంగమేనా అంటూ విమర్శలు కురిపించాయి. హిందూ సంస్కృతినీ, వారసత్వాన్నీ నిర్లక్ష్యం చేసిందనీ గర్హించాయి. అన్ని మతాలను సమానంగా చూసే లౌకిక విధానమూ వాటికి నచ్చలేదు. మనుస్మృతి లాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకపోవటాన్నీ తిట్టిపోశాయి.
దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయటానికి విదేశీ భావాలతో ప్రేరణపొంది అసమ్మతిని రాజేస్తున్నారని విమర్శించటం రాజకీయ అవసరంగానే ఉండొచ్చు. కానీ మన ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న మన రాజ్యాంగమే అలా ప్రేరణ పొందేలా చేస్తోంది. మన సంప్రదాయాల నుంచి మాత్రమే ప్రేరణ పొందాలని నిర్దేశిస్తే రాజ్యాంగానికి ఆత్మగా ఉన్న ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది. ప్రాథమిక హక్కులు కలిగించే భావనలు అంతర్థానం అవుతాయి. పాశ్చాత్య భావాలకు అనుగుణంగా రాజ్యాంగ రూపకల్పన చేసినవాళ్లను విమర్శించాలనుకుంటే ఆనాటి ప్రధాన పాత్రధారులనే తప్పుపట్టాల్సి వస్తుంది. నెహ్రూతో పాటు సర్దార్‌పటేల్ కూడా ఆ యజ్ఞంలో ముందువరుసలోనే ఉంటారు. మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేని సంప్రదాయాలనూ, సంస్కృతినీ విమర్శించటమూ ప్రజాస్వామ్య ఆలోచనల్లో చాలా కీలకమైనది. చాలా సహజమైనది. మార్పులు కావాలనుకునే వాళ్లందరినీ విచక్షణ లేకుండా సంస్కృతిని విచ్ఛిన్నం చేసేవారుగా చిత్రీకరించటం రాజ్యాంగం పెద్దపీట వేసిన భావనలకు వ్యతిరేకమే అవుతుంది. కాక్రోచ్ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నవారు ప్రత్యేకంగా విదేశీ భావాలతో ప్రేరణ పొందాల్సిన అవసరంలేదు. మన రాజ్యాంగానికే అటువంటి భావాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఒక మతమూ, ఒక భాషా, ఒక సంస్కృతీ, భౌగోళిక ఐక్యతా పునాదులుగా ఉండే జాతీయభావం కూడా ముందుగా పాశ్చాత్య దేశాల్లోనే బలపడింది. ఆధునిక భావాల వ్యాప్తిలో భాగంగానే భారత్‌లోనూ జాతీయవాదం వేళ్లూనుకుంది. కాకపోతే ఒక భాష, మతం ఆధారంగా ఉండే జాతీయవాదం స్థానంలో బహు భాషలనూ, బహు సంస్కృతులనూ సమానంగా చూసే జాతీయవాదం భారత్‌లో రూపుదిద్దుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. మనుషులందరినీ విశ్వకుటుంబంలో భాగమనుకుంటే, విభిన్న సంస్కృతుల మధ్య ఇచ్చిపుచ్చుకోటాలు చరిత్ర పొడవునా జరగటాన్ని విస్మరించలేని వాస్తవంగా గుర్తిస్తే.. ఆందోళనకారులను విచ్ఛిన్నశక్తులుగా భావించలేం. మన సంస్కృతికి చేటుతెచ్చే సమూహాలుగా ముద్రవేయలేం. ఇతర సంస్కృతులతో ప్రభావితం కాని దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న పాశ్చాత్య భావాలతో సంప్రదాయ సంస్కృతి ఒక్కటే మారటం లేదు. మన ఆర్థిక వ్యవస్థను కూడా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఎప్పుడో అనుసంధానం చేశాం. 1991 తర్వాత అది అనూహ్యస్థాయిలో పెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థలోకి ఎంత ఎక్కువగా విదేశీపెట్టుబడులు వస్తే అంత గొప్పని భావించుకునే పరిస్థితుల్లో, బయట దేశాలతో ప్రేరణపొందిన శక్తులు దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నాయని భావించటంలో సహేతుకత ఒకపట్టాన కన్పించదు. ఆర్థిక వ్యవస్థలతో పాటు సంస్కృతులూ ప్రయాణం చేస్తాయి. ఆ ప్రయాణంలో భాగంగా సంప్రదాయాలూ మారతాయి. రాజ్యాంగస్ఫూర్తిని మనం నిక్కచ్చిగా ఒంటబట్టించుకుంటే మన సంప్రదాయాల్లో మంచినీ చెడునీ విడదీయకుండా ఉండలేం. సంస్కృతిని వ్యతిరేకించేవాళ్లు అందులో ఏ అంశాలను విమర్శిస్తున్నారో చూడకుండా, స్పష్టంగా చెప్పకుండా ప్రచార ఉధృతితో వాళ్లను కొంతకాలం దోషులుగా బోనులో నిలబెట్టొచ్చు. అదిప్పుడు సాగుతూనే ఉంది.
భగవత్ వ్యాఖ్యానించిన విధంగా పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన భావ తుఫాను అంటూ ఏమీలేదు. అలాంటి భావ తుఫానులు ఎన్నో వచ్చిన తర్వాత, మన నేలను ఎంతో ప్రభావితం చేసిన తర్వాతే మన రాజ్యాంగం రూపొందుకుంది. మన సంస్కృతి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కొన్ని అంశాలపై సహేతుక ద్వేషమూ, కోపమూ కలిగిన వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అంబేడ్కర్ అటువంటి వాణిని బలంగానే విన్పించారు. ఆ వాణి మన సమాజంలో మంచి మార్పులకే దారితీసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రగతిశీల భావాలను అక్కున చేర్చుకున్నవాళ్లు మన సంస్కృతిలోని కొన్ని అమానవీయ, అప్రజాస్వామ్య అంశాలపై విమర్శలను ఎక్కుపెడుతూనే ఉంటారు. రాజకీయ వ్యవస్థలోని అవినీతినీ, నిరంకుశ ప్రవర్తనలనూ, సమాజ సంపదను కొద్దిమంది చేతుల్లో పెట్టే ఆర్థిక వ్యవస్థనూ ప్రశ్నించేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రాజ్యాంగస్ఫూర్తి ఆ ప్రశ్నలను ఏదోరకంగా రగుల్చుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యానికి అంతకుమించిన రక్ష ఏముంటుంది?
gరాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు