కల్లుగీత వృత్తిని ఆధునికీకరించాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:58 AM
పెట్టుబడిదారీ విధానం, కార్పొరేట్ శక్తుల విస్తరణ కారణంగా నేడు గ్రామీణ ప్రాంతాల్లోని అనేక సంప్రదాయ వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి వృత్తులపై...
పెట్టుబడిదారీ విధానం, కార్పొరేట్ శక్తుల విస్తరణ కారణంగా నేడు గ్రామీణ ప్రాంతాల్లోని అనేక సంప్రదాయ వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి వృత్తులపై కార్పొరేట్ శక్తుల ప్రభావం పడటంతో, ఆయా రంగాల వారు ఉపాధి కోల్పోయి కంపెనీలలో దినసరి కార్మికులుగా మారుతున్నారు. నేడు ఇదే పరిస్థితి క్రమంగా కల్లుగీత వృత్తికి కూడా విస్తరిస్తోంది. సరైన ఆదాయం లేకపోవడం, వృత్తి పట్ల సామాజిక గౌరవం తగ్గడం, ప్రమాదాల బారిన పడటం, అమ్మకాలపై ఉన్న ఆంక్షల కారణంగా గీత కార్మికుల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తోంది.
తెలంగాణలో ప్రకృతి సిద్ధంగా పెరిగిన తాటి, ఈత చెట్లు దాదాపు ఒక కోటి వరకు ఉన్నాయి. ఇవి పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, లక్షలాది మంది గీత కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు, కృత్రిమ ప్రక్రియలు లేకుండా స్థానిక వృత్తిదారులు సేకరించే ఏకైక సహజ పానీయం కల్లు. నాటి గ్రామీణ ప్రాంతాల్లో శ్రమజీవుల అలసటను తీర్చేందుకు ఈ ప్రకృతి పానీయం ఎంతో దోహదపడింది. మన సంస్కృతిలో అంతర్భాగమైంది.
గ్రామాల్లోకి సారాయి, వైన్ షాపుల ప్రవేశంతో కల్లుగీత వృత్తిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా ఎక్సైజ్‌శాఖ ద్వారా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ, లిక్కర్ విక్రయాలను పెంచుతున్నాయి. దీనికి తోడు, బహుళజాతి కంపెనీల ఉత్పత్తులైన పలు సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా మన సహజ పానీయం అమ్మకాలు పడిపోయాయి. ఆరోగ్యానికి హానిచేసే ఆయా రసాయన పానీయాలను సేవించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు.
కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు ఆర్గానిక్, సహజ సిద్ధమైన ఉత్పత్తులను వాడేందుకు మొగ్గుచూపుతున్నారు. శాస్త్రీయంగా చూస్తే ఒక్క తాడి చెట్టు 100 వాటర్ ఫిల్టర్లతో సమానం. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి చెట్లలో ప్రస్తుతం కేవలం 20శాతం మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 80 లక్షల లీటర్ల ఉత్పత్తి జరుగుతూ, 40 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. కానీ మిగిలిన 80శాతం వృక్ష సంపద ఎలాంటి వినియోగం లేక వృథాగా ఉంది.
కల్లును కేవలం దిగువ తరగతుల పానీయంగా చూసే అపోహలను, అపరిశుభ్రమైనదనే ముద్రను తొలగించాలి. పర్యాటక ప్రాంతాల్లో సంప్రదాయ ఆహార పానీయాల జాబితాలో దీనికి సముచిత స్థానం కల్పించాలి. ‘నీరా’ను ఒక బ్రాండెడ్ సాఫ్ట్ డ్రింక్‌గా మార్చి, దాని అమ్మకాలను సరళీకరించాలి. రెస్టారెంట్లు, శీతల పానీయాల దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఇది లభ్యమైతే కచ్చితంగా ఇదొక ట్రెండ్ సృష్టిస్తుంది. ఈ వృత్తిని నమ్ముకున్న లక్షలాది మందికి ఉపాధి కల్పించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
‘నీరా’తో పాటు తాటిబెల్లం, చక్కెర వంటి అనుబంధ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తేవాలి. కల్లు, నీరా సేకరణలో చెట్లు ఎక్కేందుకు సురక్షితమైన పరికరాలు, నిల్వ ఉంచేందుకు శీతలీకరణ (కోల్డ్ స్టోరేజ్) వంటి ఆధునిక పద్ధతులు అవలంబించాలి. గీత కార్మికుల భద్రత దృష్ట్యా తక్కువ ఎత్తు ఉండి, ఎక్కువ ఉత్పత్తినిచ్చే హైబ్రిడ్ రకం తాటి, ఈత చెట్లను పెంచేలా రీసెర్చ్ విభాగాలు పనిచేయాలి. ప్రకృతి మనకిచ్చిన ఈ గొప్ప సంపదను సద్వినియోగం చేసుకుంటే అటు కార్మికులకు ఉపాధి, ఇటు ప్రజలకు ఆరోగ్యం చేకూరతాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వృత్తిని ఆధునికీకరించి, పూర్వ వైభవం తీసుకురావాలి.
యం.వి. రమణ
రాష్ట్ర అధ్యక్షులు, కల్లుగీత కార్మిక సంఘం
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే