మైనారిటీవాదం అంటే మతవాదమా?
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:12 AM
మైనారిటీ వాదం అంటే మైనారిటీలను వాళ్ల మత విశ్వాసాలతో పాటు దత్తత తీసుకుని చూడాలి అనేది ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే, అసలు మైనారిటీల గురించి మాట్లాడడం అంటేనే...
మైనారిటీ వాదం అంటే మైనారిటీలను వాళ్ల మత విశ్వాసాలతో పాటు దత్తత తీసుకుని చూడాలి అనేది ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే, అసలు మైనారిటీల గురించి మాట్లాడడం అంటేనే వాళ్ల మతాలకు మద్దతు పలకడం అన్నది ఇంకో ఎక్స్‌ట్రీమ్. మన దేశంలో (రెలిజియస్) మైనారిటీ అన్న మాట సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ మతమైన ఇస్లాం నుంచి చిన్న చిన్న మతాలైన జైన్, జొరాష్ట్రియన్ మతాల వరకూ వర్తిస్తుంది.
ఈ దేశంలో మైనారిటీ మతాల పట్ల ఉండాల్సిన వైఖరిని సుస్పష్టంగా చూపించిన మొట్టమొదటి వ్యక్తి అంబేడ్కర్. కాన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అంబేడ్కర్ ‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్’ సహాయం తీసుకున్నాడు. అంతేకాదు, మహద్ సత్యాగ్రహం సమయంలో జరిగిన దాడుల్లో ఆయన మద్దతుదారులు అప్పట్లో ముస్లింల ఇళ్లల్లో ఆశ్రయం తీసుకున్నారు. కానీ అదే అంబేడ్కర్ ‘పాకిస్థాన్ అండ్ పార్టిషన్’ అనే తన పుస్తకంలో ఇస్లాం గురించి రాయవలసి వచ్చినప్పుడు నిర్ద్వంద్వంగా ‘‘Islam is worldwide regressive’’ (ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా తిరోగామి మతంగానే ఉన్నది) అని రాశాడు. అంతేగాక, హిందూత్వంలో ఉన్న అవలక్షణాలు ఇస్లాంలో కూడా ఉన్నాయనీ, అదనంగా ‘హిజాబ్’ దురాచారం కూడా ఆ మతంలో ఉన్నదని మహిళా పక్షపాతిగా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించాడు. మళ్లీ అదే అంబేడ్కర్ 1931 మైనారిటీ ఒప్పందంలో ముస్లింల భద్రత కోసం తగిన రక్షణ ఉండాలని కోరాడు. అంబేడ్కర్‌కు ఇస్లాం పొలిటికల్ ఐడియాలజీతో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, మైనారిటీ హక్కుల విషయానికొస్తే ఏమాత్రం వెనుకంజ వేయకుండా మద్దతు ఇచ్చాడు.
మొన్న సౌదీలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక యువ జంటను అక్రమ సంబంధం ఉన్న జంటగా భావించి చంపేశారు (ఉరి తీశారో, పబ్లిక్‌గా తల నరికి చంపారో– నిర్ధారించే ఋజువులు దొరకలేదు). మొదట ముద్దు పెట్టుకున్నందుకు చంపేశారని ఇస్లామోఫోబిక్, జియోనిస్ట్ సంస్థలు అబద్ధపు ప్రచారం చేశాయి. కానీ వాళ్లు మక్కాలో ఒక ‘ఇండీసెంట్ యాక్ట్’ (అశ్లీల చర్య)కు పాల్పడినందువల్ల శిక్షకు గురయ్యారని తేలింది. ‘అది ఎంత అశ్లీలం’ అన్నదానిపైన ఇస్లాంను ప్రచారం చేసే కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు పలు కథనాలు వినిపించాయి. మొత్తం మీద ఆ జంట పవిత్రమైన దైవ సన్నిధిని అపవిత్రం చేసింది అన్నది సారాంశం. వారికి వేసిన శిక్ష ఇస్లామిక్ చట్టం ప్రకారం విధించినది. మనుషులు దేవుడిని అపవిత్రం చేయడం, అందుకని ‘‘తక్కువ అపవిత్రమైన’’ మనుషులెవరో బయల్దేరి వీళ్లను ‘‘ఎక్కువ అపవిత్రం’’గా నిర్ధారించి చంపడం, తద్వారా దేవుడిని రక్షించడం... ఇదంతా ఏమిటో ఎవరికీ అర్థం కానిది. మొదటగా ఇదొక Disproportionate punishment (తప్పుకు పొసగని శిక్ష).
హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 800 మంది పౌరులను పొట్టనబెట్టుకుంటే, అందులో 40 మంది పిల్లలు, 300 మంది ఆడవాళ్లు కాగా... ఇజ్రాయెల్ ప్రతీకారంగా 70,000 మంది పౌరులను మట్టుబెట్టింది. ఈ డిస్‌ప్రొపోర్షనేట్ కిల్లింగ్‌ను ప్రపంచమంతా జెనోసైడ్ (జాతిపై హత్యాకాండ)గా వర్ణించింది. ఏ పేరుతో పిలిచినా ఇది విచక్షణారహితమైన ప్రతీకార చర్య, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ డిస్‌ప్రొపోర్షనేట్ పనిష్మెంట్ గురించి గగ్గోలు పెట్టే సెక్యులరిస్ట్ లిబరల్స్ నుంచి ఇప్పుడు అమాయకులను ‘ఇండీసెంట్ యాక్ట్’ పేరుతో తల నరికి/ ఉరి తీసి చంపేస్తుంటే కిక్కురుమన్న శబ్దం లేదు. దేవుడి పేరుతో మనిషిని బతికించాల్సిన మతం, చంపడం దాకా వస్తే– అది మైనారిటీ అయినా, మెజారిటీ అయినా ఆ మత అంధ విశ్వాసాలను కచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. అది ఇజ్రాయెల్ అయినా, పాలస్తీనా అయినా, భారత్ అయినా ఏ మినహాయింపు ఉండకూడదు.
ఈ సందర్భంలో మన దేశంలో జరగని దానికి మనమెందుకు హైరానా పడాలి అని చాలామంది సెక్యులరిస్ట్ లిబరల్స్ ఒక సాంత్వన వెతుక్కుంటారు. అది కొంతవరకు నిజమే. అయితే, ఇజ్రాయెల్ – పాలస్తీనా అంశం మీద ఇంచుమించు ప్రతి దేశంలోనూ ఒక రాజకీయ విభజన చోటు చేసుకుంది. ప్రపంచ మానవులుగా నేడు మనం మన దేశ లోటుపాట్లకు అతీతంగా ఏ ప్రాథమిక విలువల కోసం పోరాడుతున్నాం? అన్నది బలంగా చాటాల్సిన సందర్భంలో ఉన్నాం. దానర్థం ఈ దేశం నుంచి వెళ్లిపోయి, ఆ దేశంలో పోరాడాలి అని కాదు. ఒక ‘ప్రాపంచిక స్వరం’ వినిపించాల్సిన అవసరం ప్రతి బుద్ధిజీవికీ ఉంది. కానీ అఫ్ఘానిస్థాన్‌లో మతం పేరుతో అమ్మాయిలకు చదివే హక్కు లేదని చట్టం చేసినప్పుడు మార్క్సిస్టులు, లిబరల్ ఫెమినిస్టులు కనీస మద్దతుగా ఆ దేశపు మహిళల తరఫున గొంతు విప్పలేదు. అక్కడి దేశ ప్రజలు ఎలాగూ తిరగబడలేరు. తిరగబడాలంటే వారికి బయటి నుంచి సామ్రాజ్యవాద కాంక్షతో వచ్చే మద్దతు తప్ప మరే ఇతర నైతిక మద్దతూ లేదు.
ఈ రోజు మైనారిటీల తరఫున నిలబడటం అంటే మైనారిటీ మతాలను కూడా ఒడిలో పెట్టుకుని లాలించడంలా తయారైంది. ఏ మతమైనా వ్యక్తిని దాటి రాజకీయ పాలనను ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే, అది ఎంత పరిపూర్ణ మతమైనా తిరోగమన సమాజాన్ని సృష్టించడం ఖాయం. అసలు అంత బలవంతుడైన దేవుడికి ప్రభుత్వ ఆలనా పాలనా ఎందుకు అవసరం? ప్రతి మతం వ్యక్తి విశ్వాసం మీదనే నిలబడాలి. ఆ వ్యక్తుల సామూహిక ఆధ్యాత్మిక సరిహద్దును దాటి వెళ్లకూడదు.
ఈ బంగ్లాదేశ్ యువ జంట తప్పు చేసిందని ఒకేసారి ప్రాణాలు తీసేయడం, అది కూడా బంగ్లాదేశ్‌కు ఏ మాత్రం చెప్పకుండా చంపడం గర్హనీయమైన విషయం. ఒక ఆటవిక నీతి తరహాలో ఈ మనుషులను చంపారు. ఇందులో దేవుడు ఒక పావు మాత్రమే! ఈ సందర్భంలో అక్కడ ఉన్నది అమెరికా పౌరులు అయి ఉంటే– అది ముస్లిమ్ అయినా, క్రిస్టియన్ అయినా, హిందువైనా సరే కళ్లకద్దుకుని దౌత్య రాయబారాలు జరిగేవి. చిన్న దేశాలకు అంత దౌత్యబలం ఉండదు. అటువంటి నిరాయుధులను, నిస్సహాయులను దారుణ స్థాయిలో చంపడం కిరాతకం!
ఇది మానవ సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన. దీన్ని ఖండించాల్సిన బాధ్యత మతంతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషి పైనా ఉన్నది. అలాగే మతాన్ని రాజ్యాంగం నుంచి, రాజ్యం నుంచి వేరు చేయాల్సిన అవసరాన్ని మరింత స్పష్టంగా మనమంతా గ్రహించాల్సిన సందర్భమిది.
పి. విక్టర్ విజయ్‌కుమార్
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ