Share News

సదుపాయాలు కల్పించాలి.. అవగాహన పెంచాలి

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:58 AM

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200కు పైగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు...

సదుపాయాలు కల్పించాలి.. అవగాహన పెంచాలి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200కు పైగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వీరికి ఈ గురుకులాల ద్వారా ప్రభుత్వం విద్యనందిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సర్కారు ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. పదో తరగతిలోనూ, ఇంటర్మీడియట్‌లోనూ కొన్ని మైనారిటీ గురుకులాలు ‍మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా, మరికొన్ని మాత్రం ఫలితాల సాధనలో చాలా వెనుకబడి ఉన్నాయి. దీనికి కారణాలు అనేకం. హాస్టళ్లలో సదుపాయాల లేమితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడం... వంటి అంశాలు విద్యార్థుల అభ్యసనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పలు గురుకులాల్లో వసతులు, మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నప్పటికీ వాటిలో సీట్లు పూర్తిగా భర్తీ కావడం లేదు. రెసిడెన్షియల్ విధానం పట్ల తల్లిదండ్రుల సంకోచం, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యపై మక్కువ, హాస్టల్ సదుపాయాలు, భోజన నాణ్యత, భద్రతపై సందేహాలు... వంటి కారణాల వల్ల ఆయా గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. గతంతో పోలిస్తే ముస్లిం సమాజంలో విద్యపై ఆసక్తి పెరుగుతున్నా, ప్రభుత్వ విద్యపై పూర్తిస్థాయి నమ్మకం ఇంకా ఏర్పడలేదనే భావన కనిపిస్తోంది. మైనారిటీ గురుకులాల్లో అన్ని సదుపాయాలు కల్పించి, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నమ్మకం కలిగించాలి. అప్పుడే ‘సమాన విద్య–సమాన అవకాశాలు’ అనే లక్ష్యం కేవలం నినాదంగా కాకుండా, ఒక సామాజిక వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది.

ఎండి. ఉస్మాన్‌ఖాన్

ఇవి కూడా చదవండి

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

Updated Date - Mar 03 , 2026 | 01:58 AM