మన సాహిత్యంలో మీ టూ!
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:33 AM
జూలియా మే జోనాస్ నవల ‘వ్లాదిమిర్’ ఆధారంగా అదే పేరుతో తీసిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఇటీవల విడుదలైంది. అందులో త్వరలో రిటైర్ అవ్వబోతున్న అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌పై అతను విద్యార్థినులతో హద్దు...
జూలియా మే జోనాస్ నవల ‘వ్లాదిమిర్’ ఆధారంగా అదే పేరుతో తీసిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఇటీవల విడుదలైంది. అందులో త్వరలో రిటైర్ అవ్వబోతున్న అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌పై అతను విద్యార్థినులతో హద్దు దాటి ప్రవర్తించాడని మీ–టూ నిందలు మొదలవుతాయి. అతనిపై న్యాయ విచారణ కూడా మొదలవుతుంది. అతను తన తరఫు న్యాయవాదిగా కూతురినే నియమించుకుంటాడు. తండ్రిపై అపారమైన నమ్మకంతో అతన్ని బయటపడేయటానికి ఆమె అన్నివిధాలా ప్రయత్నిస్తుంది. ఫిర్యాదు చేసిన ఒక పూర్వవిద్యార్థినిని కేసు వెనక్కి తీసుకోమని బలవంతపెడుతుంది, బెదిరిస్తుంది. న్యాయ విచారణ మొదలయ్యాక, ఒక్కొక్కరూ ప్రొఫెసర్ వ్యవహరించిన తీరును పంచుకుంటారు. ఏ ఆరోపణలోనూ బలం లేదు, కేసు వీగిపోతుందని దాదాపు ఖాయం అయిపోతుంది. తండ్రిని గెలుస్తున్నాడని కూతురు మురిసిపోతుంది. చివరిగా కూతురు కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి పెట్టిన అమ్మాయి తన కథ చెప్తుంది: ఆమె చిన్న ఊరు నుంచి ఎన్నో కలలతో పై చదువుల కోసం ఈ యూనివర్సిటీలో చేరింది. ప్రొఫెసర్‌ను ఆరాధించింది. అతని లాంటి విజయాలు సాధించాలని ఆశయంగా పెట్టుకుంది. ఎవరూ తెలియని, ఎలా మసలుకోవాలో తెలియని ఆ విద్యాసంస్థలో అతన్నే దిక్సూచిగా పెట్టుకుంటుంది. కానీ అతను దాన్నే అలుసుగా తీసుకుని, ఆమెకు మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యేలా వ్యవహరిస్తూ, చివరకు ఆమె చదువు మధ్యలో ఆపేయడానికి కారకుడవుతాడు. ఈ అమ్మాయి కథ విన్నాక కూతురికి తండ్రిపై అసహ్యం వేస్తుంది. కేసు వాళ్ళే గెలిచి ఉండచ్చు కానీ, ఇలాంటి ఆరోపణల వెనుక న్యాయ వ్యవస్థలు గుర్తించలేని నష్టాలెన్నో ఉంటాయని ఆమెకి అర్థమవుతుంది. తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరు కొందరి జీవితాలను కోలుకోలేని దెబ్బ కొట్టిందని గ్రహిస్తుంది.
***
మీ–టూ మూవ్‍మెంట్‌ను దాని చుట్టూ జరిగే గందరగోళపు వాదోపవాదాలను అర్థం చేసుకోడానికి ఈ కథ పనికొస్తుందని దీన్ని ఉటంకించాను. ఈ ఏడాది జ్ఞానపీఠ్ అవార్డును తమిళ రచయిత, గేయకర్త వైరముత్తుకు ఇవ్వడంతో పెద్ద దుమారమే లేచింది. ఆయన ఎందుకు అనర్హుడో చెప్పడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపించాయి: అతను రాసిన సాహిత్యం కన్నా తమిళంలో మరెంతో గొప్ప సాహిత్యం ఉందన్నది ఒక కారణం, ఆయనపై మీ–టూ ఆరోపణలు ఉన్నాయన్నది రెండో కారణం. చాలా విడ్డూరంగా, తమిళ సాహిత్యంలో హేమా హేమీలు అనదగ్గ వారి నుంచి కొత్తగా తమ గొంతులు వినిపిస్తున్నవారి దాకా (ఆడవారితో సహా) మొదటి కారణాన్నే ఎక్కువ ఎత్తిచూపారు. వైరముత్తుపై ఉన్న మీ–టూ ఆరోపణలు ఒకటీ రెండూ కావు, చిన్నాచితకవీ కావు. వాటి వల్ల కెరీర్లు పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నారు. అతని కెరీరూ వెనుకంజ వేసింది.
మీ–టూ నిందల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ‘‘నేర నిరూపణ జరగలేదు కదా? మరెందుకు అవార్డును ఇవ్వకూడదు/ వెనక్కితీసుకోవాలి?’’ లాంటి ప్రశ్నలు వినిపిస్తుంటాయి.
పదిమంది అపరాధులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదని మన న్యాయవ్యవస్థ నమ్ముతుంది. సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరీక్షించిన మీదటనే, వాటికి తిరుగులేదని నిర్ధారించుకున్నాకే శిక్షలు వేస్తుంది. అయితే మీ–టూ కేసుల్లో ఎక్కువగా న్యాయస్థానం వరకూ వెళ్ళనివే, వెళ్ళినా నిరూపించలేనివే ఉంటాయి. ఎందుకంటే మీ–టూ అనేది కేవలం ఏదో ఒక్క దారుణ ఘటనో, దాని పర్యవసానమో కాదు. మీ–టూలో భాగంగా వచ్చిన కథనాలను తరచి చూస్తే వాటిల్లో కామన్‌గా కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి:
మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు చేసినవాళ్ళల్లో అధికార బలం కలిగినవాళ్ళే ఎక్కువ. కంపెనీల అధినేతలు, అభిమానుల బలం ఉన్న సెలబ్రిటీలు, ఇతరుల కెరీర్లను నిర్ణయించగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు... ఇలా. ఇక దాడులకు గురైన మహిళలు కింద స్థాయి ఉద్యోగినులు అయ్యుంటారు. దాన్ని అదనుగా తీసుకుని వారిపై దాడి చేసి, ఆ విషయం బయట పెడితే కెరీర్లు నాశనం అవుతాయని బెదిరిస్తుంటారు. ఒకవేళ వారు బయటపెట్టినా కూడా, ఇలాంటి విషయాలపై మన సమాజంలో మళ్ళీ బాధితులపైనే రాళ్ళు పడుతుంటాయి. మన న్యాయవ్యవస్థలు ఈ మొత్తం తంతుని వీలైనంత జటిలంగా చేసి, దాడికి గురైన వారిని మానసికంగా, ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తుంటాయి.
అంటే, ఇది ఒక పవర్ గేమ్! ఇక్కడే కేన్సిల్ కల్చర్ అక్కరకు వస్తుంది. ఎవరైతే అధికారం/ హోదా/ ప్రజాదరణ వంటి పీఠాలపై కూర్చున్నారో, వారిని ఆ స్థానాల నుంచి కిందకు దింపడానికి, లేదా కాస్తయినా కదిలించడానికి ప్రజాగ్రహమూ, ఆయా సంస్థలు తీసుకునే చర్యలూ వగైరా పనికొస్తాయి. ఒకడు దుర్వినియోగం చేసిన బలాన్ని వాణ్ణి నుంచి లాక్కునే ప్రయత్నం ఇది. వైరముత్తు విషయంలో, కేరళ కల్చరల్ అకాడమీ ప్రకటించిన ‘‘ఓఎన్వీ’’ అవార్డు వెనక్కి తీసుకోడానికి కారణం నిరసనలే!
ఇలాంటి సందర్భాల్లో బాధితులు కేవలం ‘‘మాకు అన్యాయం జరిగింది!’’ అని ఆరోపించడం లేదు, అప్రమత్తం అవ్వండని హెచ్చరిస్తున్నారు కూడా! పితృస్వామ్య వ్యవస్థలో మగవారికి ఉండే అధికారాన్ని, హోదాని, ప్రివిలేజ్‌ను పూర్తిగా రూపుమాపడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. కానీ వాటిని ఇలా అవార్డులు, గుర్తింపులు ఇచ్చి పెంచుకుంటూ పోతే, బాధితుల నుంచి ఆ హెచ్చరికలు కూడా మూగబోయే ప్రమాదం ఉంది.
***
ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం: వైరముత్తులాంటి సెలబ్రిటీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు సంబంధించినప్పుడు మాత్రమే ఈ సమస్యను చర్చకు పెట్టి, మన చుట్టూ నిత్యం జరుగుతున్న దారుణాలను—ముఖ్యంగా చిన్నవాటిని, casual sexism ని—బేఖాతరు చేస్తూ పోతే, సమస్య మరీ పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా సాహిత్యలోకంలో కార్పొరేట్ల తరహా పాలిసీలు ఉండవు, వేరే పరిశ్రమల్లా యూనియన్లు ఉండవు. ఇంకెవరో ఈ విషయాలపై ట్రయినింగ్ ఇస్తారనో, అలా మసలుకోకపోతే జరిమానాలు వేస్తారనో అనుకోడానికి లేదు. కాబట్టి సాహిత్యకారులకే ఆ స్పృహ ఉండాలి.
ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో స్త్రీలకు సంబంధించినంత వరకూ అనారోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటి తెలుగు రచయిత్రులు మాటల దాడులకు, హింసకు గురవుతున్నారు. అందరూ, అన్ని వేళలా అని అనడం లేదు. కానీ జరుగుతున్నంతమేరకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
మరే ఇతర భాషలోనూ కనిపించని విషయం ఒకటి ఇక్కడ ఉంది: రచయిత్రి అందచందాలపైన, వస్త్రధారణపైన ఆమె రచనల ప్రతిభ, వాటికి వచ్చే స్పందన, తద్వారా పుస్తకాల అమ్మకాలు ఆధారపడి ఉంటాయన్న అతి హేయమైన వాదన సోషల్ మీడియాలో గత కొన్నేళ్ళుగా వినిపిస్తుంది. ఈ వాదనకు ప్రతివాదనల్లో కూడా రచయిత్రుల దుస్తులపై, రూపురేఖలపై, వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యానాలు చేయడం కనిపిస్తుంది.
టెక్నాలజీని వాడుకుని ఫేక్ అకౌంట్లు, కాల్ రికార్డింగులు, స్క్రీన్‍షాట్లు, ఫోటో మార్ఫింగుల సాయంతో ఇప్పుడు రచయిత్రులపై అభ్యంతరకరమైన పదజాలంతో దాడులు వికృత రూపాలు దాల్చుతున్నాయి. ‘‘దొరికితే దొంగ, దొరక్కపోతే దొర’’ చందాన ఆడవాళ్ళతో స్నేహం చేస్తూ, కలిసి పనిజేస్తూనే వాళ్ళపైనే ఆన్‍లైన్‍లో దాడులు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి.
ఒక రచయిత స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించాడు, లేదా ఫేక్ అకౌంట్ పెట్టి దాడులు చేశాడు, లేదా లైంగిక దాడికి ప్రయత్నిం చాడు/ చేశాడు అని తేటతెల్లమవుతున్నా కూడా దాని గురించిన చర్చ ఏవో మూడు ఫేస్‌బుక్ పోస్టులు, ఆరు కామెంట్లతో ముగిసిపోతున్నదే తప్ప, ఆ రచయితకు అప్పటి దాకా ఇచ్చిన అవార్డులు, గుర్తింపులు వెనక్కి తీసుకుంటున్నామన్న ప్రకటనలు కానీ, కనీసం ఆ వ్యక్తితో పనిచేసిన సంస్థల నుంచి ‘‘ఖండిస్తున్నాం’’ అన్న నామమాత్రపు అధికారిక ప్రకటనలు కానీ ఉండడం లేదు. బాధితులను జీవితాంతం వెంటాడే ఈ పీడ మరో నలుగురి నోట గాసిప్‌గా మిగిలిపోతున్నదంతే! చప్పుడంతా సద్దుమణిగాక రచయితకు మళ్ళీ అవకాశాలూ, అవార్డులూ షరా మామూలే! పరిస్థితి ఇలా ఉండటంతో, మరో దిక్కులేక, రచయిత్రులు whisper networks (ప్రమాదమైన వ్యక్తుల గురించి స్త్రీలు రహస్యంగా ఒకరిని ఒకరు వారించుకోవడం) పైనే ఆధారపడుతున్నారు.
ఇలా నిబద్ధత లేని, ఆత్మపరిశీలన లేని మగవారు చేసే రచనల్లో ఎంత భావజాలాన్ని గుప్పించినా, ఎంతటి విప్లవ శంఖం పూరించినా ఆ సాహిత్యం ఎలా నిలబడుతుంది? అంతకంటే ముఖ్యమైన ప్రశ్న: ఇంతటి భయాందోళనపూరిత వాతావరణంలో మహిళలు ఎలా రాయగలుగుతారు?
నైతికానైతికల బేరీజు వేసే తీరిక లేక ఇలాంటి ఆమోదయోగ్యం కాని నడకలను సమర్థిస్తూనే పోతే, ఈ రచయితల రచనలు మరో భాషలోకి అనువాదమైనప్పుడో, ఇంకో రాష్ట్రంలో వేదికను అలకరించమని ఆహ్వానం వచ్చినప్పుడో, అప్పుడు–అక్కడివారికి జరిగిన దారుణాలు తెలిస్తే, అది ఆ రచయితకు వచ్చిన అపవాదుగానే మిగలదు; అనువాదకులు, ప్రచురణకర్తలు, ఆర్గనైజర్లు... ఇలా అందరూ దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన కథలో, తన తండ్రి వల్ల ఆడపిల్లలకు పూరించలేని నష్టాలెన్నో జరిగాయని గ్రహించాక ఆ కూతురు అతన్ని దూరం పెడుతుంది. ఆ మాత్రం సహృదయత, సహానుభూతి ఆమెకు ఉన్నాయి. మనుషుల అంతరంగాన్ని పట్టుకుని సాహిత్యాన్ని సృజిస్తామని చెప్పుకునే మనకు నిజానికి అంతటి సహానుభూతి ఉండకపోవచ్చు. కానీ, దీనికి ఒక ట్రెండింగ్ టాపిక్‌కు ఇచ్చే అటెన్షన్ మాత్రమే ఇస్తూ, ఈ దారుణాలన్నింటినీ చూసీచూడకుండా వదిలేసి మిన్నకుండి పోతే మనమందరమూ నేరంలో భాగం వహించినవారిగానే మిగిలిపోతాం.
పూర్ణిమ తమ్మిరెడ్డి
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు
చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక