అరణ్య స్వప్నం
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:49 AM
ఆదిమ శతాబ్దాల గర్భగుడిలో మనిషి అడవిని విడిచి ఏ తీరానికీ ప్రయాణించలేదు. సహస్ర వృక్షాల చైతన్యమే రూపం మార్చుకుని నరరూపమై నడిచింది. ఇప్పటికీ మన అస్తిత్వపు ఎముకల లోతుల్లో వృక్షాల...
ఆదిమ శతాబ్దాల గర్భగుడిలో మనిషి అడవిని విడిచి ఏ తీరానికీ ప్రయాణించలేదు. సహస్ర వృక్షాల చైతన్యమే రూపం మార్చుకుని నరరూపమై నడిచింది. ఇప్పటికీ మన అస్తిత్వపు ఎముకల లోతుల్లో వృక్షాల శతాబ్దాల ఆయుష్షు నిద్రిస్తోంది. ధమనుల రుధిరధారల్లో తొలి తొలకరి వర్షాల సువాసన తన ప్రాచీన జ్ఞాపకాలను మోస్తూనే ఉంది.
ఎప్పుడో ఒక దశలో మనం పటాలు గీశాం. స్వార్థాల పదునైన అంచులతో భూమి గుండె మీద రేఖలు చెక్కాం. దేశాలు పుట్టాయి. మతాలు గోడలయ్యాయి. జాతులు కంచెలయ్యాయి. యాజమాన్యాలు నేలపై పేర్లు రాశాయి. భూమి వాటిలో దేన్నీ జ్ఞాపకం పెట్టుకోలేదు. ప్రతి సరిహద్దు కొంతకాలానికి గడ్డితో కప్పబడింది. ప్రతి కంచె మీద పక్షులు ఒకే స్వరంతో వాలాయి.
ఒక నిబిడ రాత్రి కాలాతీత అరణ్యాల అంతరాళం నుంచి ఒక పులి గాండ్రింపు లేచింది. ఆ శబ్దం చెట్ల మధ్యగా, కొండల మీదుగా, మనిషి తన ఆత్మ చుట్టూ పేర్చుకున్న ఇనుప గోడలను దాటి అంతరంగంలోకి దిగింది. శతాబ్దాలుగా మూసివున్న ఒక అంతర్గర్భ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. పులి అడవిలో సంచరించే శరీరాన్ని దాటి, భయాన్ని అధిగమించిన ప్రతి సత్యం ధరించిన రూపంగా నిలిచింది.
పులి చర్మం మీద నల్లటి చారలు కాలం తన దంతాలతో చెక్కిన గాయాల భాష. ప్రతి చారలో ఒక ఆదివాసి గీతం ఇంకా పూర్తికాక మిగిలి ఉంది. ప్రతి అడుగులో గొడ్డలికి బలైన వృక్షాల నీడ నడుస్తోంది. ప్రతి చూపులో హత్యకు గురైన నది తన ప్రవాహాన్ని తిరిగి గుర్తు చేసుకుంటోంది. ఆ కళ్లలో యుగాల జ్ఞాపకం తన స్వంత అరణ్యాన్ని వెతుక్కుంటోంది.
ఒక పులిని చూస్తున్న కళ్లకు ఒక అడవి కనిపిస్తుంది. కవిత్వం అదే చూపులో భూమిని కోల్పోయిన గిరిజన గుండె చప్పుడును వింటుంది. తన మాతృభాషను మౌనంలో దాచుకున్న శిశువు శ్వాసను చూస్తుంది. అనంత ఆకాశాన్ని వెతుక్కుంటూ తిరిగే పక్షి చివరి వలయాన్ని చదువుతుంది. పులి వెనుక వేల సంవత్సరాల అరణ్య సంస్కృతి తన అదృశ్య పాదముద్రలను మోస్తూ వస్తుంది.
మనిషి నాగరికత తన విజయాలను రాతి గోడల మీద చెక్కుకుంది. అడవి వాటిని నిశ్శబ్దంగా నాచుతో కప్పేసింది. చెట్లు పడిపోయాయి. నదులు కాంక్రీటు గొంతుల్లో నెమ్మదిగా శ్వాసించడం నేర్చుకున్నాయి. పర్వతాలు ధూళిగా మారి గాలిలో కలిశాయి. గాలి కూడా ఒక రోజు ధరతో కొలవబడింది. ఆ సమయాన పులి చూపు మాత్రం మార్కెట్ భాషను తిరస్కరించలేదు.. దానిని ఎప్పుడూ నేర్చుకోనేలేదు.
ప్రకృతి తన చరిత్రను ఆకుల మీద రాస్తుంది. గాలిలో పలుకుతుంది. ఎండిపోయిన నదీగర్భాల్లో దాచిపెడుతుంది. వినగలిగిన ప్రతి హృదయంలో ఒకే వాక్యం మెల్లగా మొలుస్తుంది. మనిషి తనలో మిగిలి ఉన్న అరణ్యాన్ని ప్రతిరోజూ కొద్దికొద్దిగా ఖననం చేస్తున్నాడనే స్పృహ.
ఒక ఉదయం పులి నగరంలోకి ప్రవేశించదు. అడవి కూడా వలస రాదు. కాంక్రీటు సమాధుల మధ్య నిలబడ్డ మనిషి తన కళ్లలోంచి అదృశ్యమవుతున్న చివరి పచ్చని ఆకును చూస్తాడు. భూమి సాక్షిగా నిలుస్తుంది. గాలి మౌనంగా దాటిపోతుంది. ప్రతిధ్వని మాత్రమే మనిషిని అతనికి తిరిగి పరిచయం చేస్తుంది.
అడవిని ప్రేమించడం మనిషిలో ఇంకా జీవించి ఉన్న కరుణకు ఆశ్రయం నిర్మించడం. పులిని కాపాడడం భూమి ఇంకా కలలు కనగలదనే విశ్వాసాన్ని జీవించి ఉంచడం. ప్రతి అడవిలో ఒక భవిష్యత్తు మొలుస్తుంది. ప్రతి పులిలో ఒక నాగరికత తన మనస్సాక్షిని ఎదుర్కొంటుంది.
మన చర్మం అనంత కాలం రాసుకున్న తాత్కాలిక వాక్యం. మన శరీరం కాస్మిక్ గాలి వచ్చి కూర్చునే చైతన్య కిటికీ. వర్షం తన ఆదిమ జ్ఞాపకాలను దాచుకునే తడి నేల. నక్షత్రాలు తమ కాంతిని భద్రపరుచుకునే నిశ్శబ్ద అరణ్యం.
మనిషి తనలోని అరణ్యాన్ని మరచిపోయిన ప్రతిసారీ ప్రపంచం కొద్దిగా చీకటిని సేకరిస్తుంది. తనలోని అరణ్యాన్ని తిరిగి స్పృశించిన ప్రతిసారీ ఒక పులి గాండ్రింపు రక్తంలో వినిపిస్తుంది. ఆ గాండ్రింపు భయాన్ని దాటి జ్ఞాపకంలో నివసించే ఆదిమ ప్రతిధ్వని. భూమి తనను తాను గుర్తుపట్టుకునే క్షణం. మనిషి జీవజాతుల మధ్య మరోసారి తన స్థానాన్ని గుర్తుచేసుకునే అనంత అరణ్య స్వప్నం.
మెర్సీ మార్గరెట్
90528 09952
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!