Share News

మానవతామాణిక్యమే మన ‘మండలి’

ABN , Publish Date - Aug 04 , 2026 | 02:24 AM

ప్రజాసేవకు ప్రతీకగా, గాంధేయ జీవనానికి సజీవ రూపంగా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామాగా నిలిచిన జీవితం మండలి వెంకటకృష్ణారావుది. అధికారం లక్ష్యంగా కాదు, ప్రజలే...

మానవతామాణిక్యమే మన ‘మండలి’

ప్రజాసేవకు ప్రతీకగా, గాంధేయ జీవనానికి సజీవ రూపంగా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి శాశ్వత చిరునామాగా నిలిచిన జీవితం మండలి వెంకటకృష్ణారావుది. అధికారం లక్ష్యంగా కాదు, ప్రజలే గమ్యంగా సాగిన జననేత ఆయన. రాజకీయాన్ని ప్రజాసేవకు బాటగా భావించారు. ప్రజల తీర్పును సేవకు ఆదేశంగా స్వీకరించి, ప్రజాహితమే ప్రమాణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాధనాన్ని ప్రజల నమ్మకంగా భావించి, దాని వినియోగంలో అపారమైన జాగరూకత చూపారు.

అధికారం ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. మంత్రి అయినా బస్సులోనే ప్రయాణించారు; పల్లెలను కాలినడకన పలకరించారు. సమస్యలను అధికారపత్రాల్లో కాదు, మనుషుల ముఖాల్లో చదివారు; ప్రజల గుండెచప్పుళ్లు విన్నారు. ప్రకృతి విపత్తుల వేళ ప్రభుత్వం తరఫున మాత్రమే కాదు, కుటుంబ పెద్దలా బాధితుల వద్దకు చేరుకున్నారు. సేవ ఆయనకు కార్యక్రమం కాదు, జీవన సహజధర్మం. సామాజిక న్యాయం పట్ల వారి నిబద్ధత విశిష్టమైనది. భూదానోద్యమానికి మద్దతుగా తన భూమిలో కొంత భాగాన్ని నిరుపేదలకు పంచిపెట్టి త్యాగానికీ ఆదర్శానికీ అర్థం చెప్పారు. విద్యను సామాజిక పరివర్తనకు సాధనంగా భావించిన ఆయన, విద్యాశాఖ మంత్రిగా క్రమశిక్షణ, నైతిక విలువలు, పౌరస్ఫూర్తికి పెద్దపీట వేశారు.

తెలుగు భాషను జాతి ఆత్మగా, సాహిత్యాన్ని దాని స్వరూపంగా, సంస్కృతిని దాని శ్వాసగా భావించారు. ప్రపంచమంతటా విస్తరించిన తెలుగువారిని ఒకే సాంస్కృతిక వేదికపై నిలబెట్టాలనే సంకల్పంతో 1975లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించి, ప్రపంచ తెలుగు భావనకు బీజాలు వేశారు. ఆ మహాసభలే తరువాతి భాషోద్యమాలకు దిక్సూచిగా నిలిచాయి. 1983లో తన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి, జిల్లా రచయితలందరికీ సంఘటిత వేదిక అవసరమని సూచించారు. అలా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం ఏర్పడింది.

ఆయన జీవితంలో రాజకీయాలు, విలువలు వేర్వేరు కావు; విలువలే రాజకీయాలుగా వికసించాయి. రాజకీయ భేదాల మధ్య సంభాషణను, సంఘర్షణల మధ్య సహకారాన్ని నెలకొల్పడం ఆయన నాయకత్వ విశిష్టత. దివిసీమ ఉప్పెన సమయంలో వైరిపక్షాల వారిని ఒకే సేవాయజ్ఞంలో నడిపించిన సమన్వయశక్తి ఆయనది. అదే దృక్పథం సాహిత్యరంగంలోనూ ప్రతిఫలించి, భిన్న భావాల రచయితలను ఒకే వేదికపై నిలబెట్టింది. అందుకే మిత్రుల అభిమానాన్నే కాదు, ప్రత్యర్థుల గౌరవాన్నీ పొందారు. మనుషులను కలపడం నాయకత్వమని, సేవను సంస్కృతిగా మలచడం మహనీయత్వమని జీవించి చూపించిన అరుదైన మహనీయుడు కృష్ణారావు.

డా. జి.వి.పూర్ణచందు

(నేడు మండలి వెంకటకృష్ణారావు

శతజయంత్యుత్సవాల ముగింపు)

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 02:24 AM