మానవ విలువల కథా దర్పణం
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:51 AM
ఉత్తరాంధ్రలో తొలి తరం కథకులుగా నలుగురిని చెప్పుకోవచ్చు. గురజాడ, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం. ఐతే వీరందరూ భిన్న కాలాలకు చెందినవారు. గురజాడ 1910లో ‘దిద్దుబాటు’ కథను ప్రచురిస్తే...
ఉత్తరాంధ్రలో తొలి తరం కథకులుగా నలుగురిని చెప్పుకోవచ్చు. గురజాడ, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం. ఐతే వీరందరూ భిన్న కాలాలకు చెందినవారు. గురజాడ 1910లో ‘దిద్దుబాటు’ కథను ప్రచురిస్తే, కాళీపట్నం ‘యజ్ఞం’ 55ఏళ్ళ తర్వాత వచ్చింది. 1960 దశాబ్ది తర్వాత ఎంతో మంది ఉత్తరాంద్ర కథకులు వారివారి సృజనాత్మక నైపుణ్యంతో వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆ కోవలోని విలక్షణ కథకులు బెహరా వెంకట సుబ్బారావు. ‘‘మేం చదువుకొనే రోజుల్లో ఎన్నో శవాల్ని కోసి చూశాం! అవి ఏ కులానికి చెందినవో తెలీదు. అది మా కనవసరం. అందరి శరీరాలు ఒక్కలాగే ఉంటాయి. స్నానం చేయమని మీరెప్పుడూ దండించలేదు. స్నానం రెండు పూటలా చేస్తాను కాబట్టి. కానీ మీరన్నట్టు వారెవరినో తాకినందుకు కాదు. శవాల్ని ముట్టినందుకూ కాదు! శరీర పరిశుభ్రత కోసం! ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు చెప్పండి?’’ అని ఒక పాత్రచేత ఒక కథలో కథకుడు పలికించిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని మానవీయ గుణాన్ని ప్రతిబింబిస్తాయి. బెహరా కథల్లో ప్రగతిశీల భావాలను, నాటి సమాజం పోకడలపై ఆయన అవగాహనను, ప్రధానంగా మధ్యతరగతి జీవితాలపై నిశిత పరిశీలనను చూడవచ్చు. ఇటీవల వెలువడిన బెహరా వారి కథా సంపుటి ‘మధ్యతరగతి మందహాసం’లో 73 కథలు, ‘నిశ్శబ్ద సంగీతం’ నవల, ‘దారి తప్పకు అనే బాలల కథ చోటు చేసుకున్నాయి.
1935 జూన్ 6 తేదీన తూర్పు గోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో బెహరా విజయలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు జన్మించిన సుబ్బారావు తపాలా శాఖలో ఉద్యోగం చేసి హెడ్ పోస్టుమాస్టర్‌గా పదవీ విరమణ చేశారు. 1957 నుంచి మొదలుపెట్టి సుబ్బారావు రాసిన రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి, విజయ, స్వాతి, మయూరి, విజయ, నీలిమ, భారతి, యువ, యోజన మొదలైన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి.
ఏ మనిషికైనా ప్రాణం విలువ ఒకటే. డబ్బులు కోసం ఒక పేదవాడి భార్యకు ఆపరేషన్ చెయ్యలేదు డాక్టర్. అదే డాక్టర్ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే రిక్షా లాగి సమయానికి ట్రైన్‌కి అందించాడు ఆ రిక్షా కార్మికుడు. ధనం కన్నా మానవత్వం ఎంత గొప్పదో చెప్పే ‘ప్రాణం ఖరీదు’ కథ 1986లో భారతిలో వచ్చింది. ‘ఇంట గెలుపు’ దళిత సమస్యపై రాసిన కథ. అంటరానితనంపై ఒక దళిత యువకుడు కొత్త పద్ధతిలో చేసిన పోరాటం ఒక కోణమైతే, దళితుల్లోనే ఒక జాతి ఇంకో జాతిని తక్కువగా చూసే స్థితి మరో కోణం. ఇవాళ్టి వర్గీకరణ సమస్య మూలాలు ఈ కథలో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చాయి. ‘
విలువలు’ శీర్షికన రెండు కథలు వచ్చాయి. మధ్యతరగతి కుటుంబాల్లోని అన్నదమ్ముల అనుబంధాన్ని చిత్రీకరిస్తూ తనకు సాయం చెయ్యని తమ్ముణ్ణి సమయానికి ఆదుకున్న అన్నయ్య కథ ఒకటి అయితే, మరో కథలో ‘‘మనిషికి విలువ లేదండి! అతని మాటకే విలువండి’’ అని టాక్సీ డ్రైవర్ ఓబులేసుతో చెప్పిస్తూ మాటకు కట్టుబడడం ఎవరికైనా జీవితంలో ఒక గొప్ప విలువ అని, ఆ విలువను పాటించడానికి చదువు హోదాలతో పని లేదని మరో ‘విలువలు’ కథలో కనిపిస్తుంది. ‘ఆంతర్యం’ కథ మనుషుల స్వభావాల్లోని వైచిత్రిని చూపిస్తుంది. కోడలిపై ప్రేమ, అభిమానం ఉన్నా తన అత్త తనను సాధించేది గనక తానూ కోడల్ని ఏదో అంటూ ఉండాలని అనుకునే అత్తగారి ఆంతర్యం, స్వంత ఊరికి బదిలీ అడిగితే తాను ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేశానని తన కష్టాలు చెప్పుకొని కింది ఉద్యోగి అడిగిన బదిలీకి అంగీకరించని అధికారి ఆంతర్యం ఒక్కటే. ‘తన దాకా వస్తే’ కథ హక్కులు ప్రభుత్వ ఉద్యోగులకే కాదు పని మనుషులకూ ఉంటాయని చెబుతోంది ‘‘నేనూ మీలాంటి మడిసినే. ఒంట్లో సుకంగా లేకపోతే అయ్యగారు ఆఫీసు కెళ్తున్నారేటి? సెలవు పెడ్తున్నారు అలాగే నేనూను,’’ అంటుంది పని మనిషి. తనను మానిపిస్తే ఇంకొకరిని రాని వ్వనంటుంది. ‘‘కట్నాలు బేరమాడే వాళ్లంటే నాకు నచ్చదు. నాన్నగారూ. అలాంటి వారిని చూస్తే అసహ్యం,’’ అని తెగేసి చెప్పి నిజాయితీ పరుడైన ఆనందారావుకి రెండో భార్యగా అతడి పిల్లలకు తల్లిగా ఉంటూ తన మాతృత్వాన్ని త్యాగం చేసిన స్త్రీ పాత్రను ‘మాతృమూర్తి’ కథలో చిత్రించారు. మరణించిన వాడిది ఏ కులం అని చర్చించిన పెద్దలు, బడుగు వర్గాల్లోనూ ఐక్యత లేకుండా తమలో తాము జాతి భేదాలు పాటించే దుస్థితిని చిత్రిస్తూ కొందరు యువకులు గ్రామంలో తీసుకు వచ్చిన సామాజిక విప్లవాన్ని ‘నదీనాం సాగరో గతి’ కథలో ఆవిష్కరించారు. తన కొడుక్కి యోగ్యతకు మించి సహాయం చేసి ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని ఒక పేద ఉపాధ్యాయుడు అధికారంలో ఉన్న శిష్యుడికి చెప్పడం ‘కర్తవ్యం’ కథ.
దాంపత్య జీవితానికి సంబంధించిన కథలు, సాధారణ మానవుల్ని కలవరపరిచే సమస్యలపై కథలు... ఏ వస్తువు తీసుకున్నా ఒక నైతిక సందేశం, విలువల ప్రబోధం అంతర్లీనంగా మానవతావాదం ప్రవహిస్తూ బెహరా గారి కథలు ఏ కథకా కథ విశిష్టంగా గోచరిస్తుంది. సిద్ధాంత రాద్ధాంతాలతో నిమిత్తం లేకుండా తన చుట్టూ ఉన్న మనుషుల్ని సరైన కోణంలో అవగాహన చేసుకొని తెలుగుదనం ఉట్టిపడేలా సరళమైన శైలిలో ఆద్యంతం చదివించే కథలు బెహరావారివి.
దామెర వెంకట సూర్యారావు
98483 18204
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా