Share News

మామిడి పిందెల కల

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:22 AM

నేను అమ్మకు రాసిన ఉత్తరం ఇంకా అందిందో లేదో దామెర చెరువు కాడ అలుగు తెగిపోయిందని రాత్రి కల వచ్చింది...

మామిడి పిందెల కల

నేను అమ్మకు రాసిన ఉత్తరం

ఇంకా అందిందో లేదో

దామెర చెరువు కాడ అలుగు

తెగిపోయిందని రాత్రి కల వచ్చింది

ఆ ఇంట్లో చీకటి ముసుగు దొంగలా

ఎప్పుడూ కాపు కాసే వుందని తానెరగదు కదా

బుజ్జికి తెచ్చిన పట్టీల మామిడి పిందెలు

అక్కడక్క రాలిపోయాయని

ఆ ఆకాశపు చుక్కలల్లో

మూడు కాళ్ళ జీవి వెతుకుతునే వుంది.

నిన్న పడమరకెళ్ళిన పక్షులు

నేడు తూరుపు వాకిట్లోని

వరికంకుల మీద వాలుతాయో లేదో

కవి రాసిన అక్షరాలు పోగేసిన వెన్నెల

ఆ గుడిసె ముందు దీపకాంతి పూలై మెరుస్తున్నాయి

నిన్నటి నిశబ్ధం గడప దాటి

కొత్త వేకువ చిగురిస్తుందన్న ఆశ నిజమో కాదో

వడలిన దేహం వాడిపోయిన చెట్ల కింద

అడవి చిగురించాలని నీళ్ళు పోస్తుందా ప్రాణం

తోకలేని పక్షి మనసు వాకిట్లో వాలి

గుస గుసగా చెవిలో

చెప్పిన ఊసులన్నీ నిజమో అబద్ధమో

అన్న మీమాంసలోనే వుంది

నాన్న పొలం నుండి తెచ్చిన ధాన్యం

నుదుట పూసిన సూర్య బింబంలో చూసుకుంటుంది

కల తీయగా మూలుగుతూ

వాసం మీది కొక్కెం ఎక్కి ముడుచుకుంటుంది

వజ్జీరు ప్రదీప్

99895 62991

ఇవి కూడా చదవండి..

శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు

మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Jan 26 , 2026 | 05:22 AM