Share News

యాభయ్యేళ్లుగా తేలని ఓ కేంద్రమంత్రి హత్య కేసు

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:35 AM

మన దేశంలోని కేంద్రమంత్రి ఒకరు బాంబుల దాడిలో హతుడై అర్ధశతాబ్దం దాటినా, ఆ కేసు ఇంకా ఉన్నత న్యాయస్థానంలో నలుగుతూనే ఉంది. న్యాయస్థానాల చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం నలుగుతున్న హత్య కేసు..

యాభయ్యేళ్లుగా తేలని ఓ కేంద్రమంత్రి హత్య కేసు

మన దేశంలోని కేంద్రమంత్రి ఒకరు బాంబుల దాడిలో హతుడై అర్ధశతాబ్దం దాటినా, ఆ కేసు ఇంకా ఉన్నత న్యాయస్థానంలో నలుగుతూనే ఉంది. న్యాయస్థానాల చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం నలుగుతున్న హత్య కేసు కూడా ఇదే. హతుడు నాటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా. 1975 జనవరి 2న బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మిశ్రాపై దుండగులు గ్రెనేడ్లు విసరగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ, రైల్వే ఉద్యోగి రామ్‌కిశోర్ ప్రసాద్ అక్కడికక్కడే మరణించారు, 25 మంది గాయపడ్డారు. దానాపూర్‌లో చికిత్స పొందుతూ జనవరి 3న మిశ్రా మరణించారు.

సీబీఐ దర్యాప్తు చేపట్టి, దాడికి బాధ్యులుగా ఆనంద్ మార్గ్ అనుచరులు నలుగురిని, న్యాయవాది రంజన్ ద్వివేదిని అరెస్టు చేసింది. వెంటనే ఆనంద్ మార్గ్‌ను కేంద్రం రెండేళ్లపాటు నిషేధించింది. 1977లో పాట్నాలో ఈ ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 1979లో కేసు ఢిల్లీకి బదిలీ అయింది. 2014 డిసెంబర్‌లో, అంటే ఘటన జరిగిన 39 ఏళ్లకు ఢిల్లీ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం, ఆనంద్ మార్గ్ నాయకుడు ప్రభాత్ రంజన్ సర్కార్ హత్య కేసులో జైల్లో ఉన్నాడు. అతడిని విడిపించేందుకు ఇందిర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ సంఘం నిర్ణయించింది. అందులో భాగంగానే మిశ్రాపై ఈ గ్రెనేడ్ దాడి జరిగింది. ట్రయల్ కోర్టు విచారణ కాలంలో 20 మందికి పైగా జడ్జిలు మారారు. మొత్తం 200 మంది సాక్షులను విచారించారు. 2014 డిసెంబర్ 18న తీర్పు వచ్చింది. ఒక నిందితుడు విచారణ దశలోనే చనిపోయాడు. సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్జీ, రంజన్ ద్వివేదిలకు యావజ్జీవ శిక్ష, జరిమానాలు విధించారు. నిందితులు 2015లో ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. మిశ్రా మనవడు, న్యాయవాది వైభవ్ మిశ్రా ఏళ్లుగా ఈ కేసు వెంట పడుతున్నారు. సీబీఐ నిర్లక్ష్యంగా దర్యాప్తు చేసిందని, అసలు సూత్రధారులను వదిలేసిందని వాదిస్తున్నారు.

2015 నాటి అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే వైభవ్ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ మిస్లేనియస్ అప్లికేషన్ దాఖలు చేశారు. అసలు సూత్రధారులను గుర్తించేందుకు కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకు 1978 బిహార్ పోలీస్ నివేదిక, 1979 తార్కుండే నివేదిక, సమస్తిపూర్ మేజిస్ట్రేట్ ముందు ముగ్గురు అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపారు. అనుమానితుల్లో ఇద్దరిపై హత్య అభియోగాలను ఉపసంహరించారని గుర్తుచేశారు. 2022 మార్చిలో సీబీఐకి సహాయపడేందుకు వైభవ్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. కానీ 2023లో పునర్‌ దర్యాప్తు డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సహకరించాలని వైభవ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2025 మార్చిలో పునర్‌ దర్యాప్తుకు సీబీఐ నిరాకరించింది. సీబీఐ నివేదికపై వాదనలు వినేందుకు 2026 మే 18కు కేసు వాయిదా వేశారు.


మిశ్రా హత్య దర్యాప్తుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియమించిన జస్టిస్ కెకె మాథ్యూ కమిషన్‌ను నమ్మని మొరార్జీ ప్రభుత్వం... 1977లో జస్టిస్ వీఎం తార్కుండే కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్‌ 1979 ఫిబ్రవరి 15న నివేదిక ఇచ్చింది. హత్య వెనుక లోతైన రాజకీయ కుట్ర ఉందని, ఆనంద్ మార్గీయులే కాక బడా రాజకీయ నాయకుల పేర్లు కూడా ఆ నివేదికలో ఉన్నాయని వైభవ్ వాదిస్తున్నారు. ఆ పేర్లను కోర్టులో బయటపెట్టలేదు.

1978 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఆదేశంతో బిహార్ సీఐడీ అక్టోబర్‌లో నివేదిక ఇచ్చింది. సీబీఐ దాన్ని పరిగణించలేదని వైభవ్ ఆరోపణ. సీబీఐ మొదట అరుణ్‌కుమార్ ఠాకూర్, అరుణ్‌కుమార్ మిశ్రా, ఉమాకాంత్, శివలాల్ శర్మలను అరెస్ట్ చేసింది. వారు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారు. 1975 నవంబర్‌లో ఇద్దరు అరుణ్‌లపై హత్య అభియోగాలు ఉపసంహరించారు. సీఆర్‌పీసీ 164 కింద నమోదైన వాంగ్మూలాలను పక్కనపెట్టి కేసును ఇతరులవైపు మళ్లించారని వైభవ్ ఆరోపిస్తున్నారు.

2026 మార్చిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వైభవ్ మాట్లాడుతూ, హత్యలో రాజకీయ ప్రముఖుల జోక్యం ఉందని, వారి పేర్లు వాంగ్మూలంలో ఉన్నాయని చెప్పారు. 1979లో పాత్రికేయుడు అరుణ్‌శౌరి రాసిన ‘ఎల్ఎన్ మిశ్రాను ఎవరు హత్య చేశారు’ పుస్తకంపైనే కుటుంబం ఆధారపడుతోంది. తార్కుండే నివేదికలో మాజీ ఎమ్మెల్సీ రామ్‌బిలాస్ ఝా పేరు ఉందని, పెద్ద రాజకీయ కుట్రను నివేదిక సూచించిందని శౌరి రాశారు. యశ్‌పాల్ కపూర్ ఇందిరాగాంధీ కార్యదర్శి. కాంగ్రెస్‌లో శక్తిమంతుడు. అతనికి రామ్‌భిలాస్ ఝా సన్నిహితుడు. ప్రస్తుతం కేసు 2026 మే 18 వరకు సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అర్ధ శతాబ్దానికి పైగా సాగుతున్న క్రిమినల్ కేసు ఇదే. ముంబై దాడుల నిందితుడు కసబ్ కేసులో ఎక్కువ సాక్షులు ఉన్నా, తీర్పు తొమ్మిదేళ్లకే వచ్చింది. లింకన్, కెనడి హత్య కేసులు నెలల్లోనే తేలాయి. ప్రపంచంలోనే ఇంతకాలం సాగిన క్రిమినల్ కేసు మిశ్రా హత్య కేసేనేమో.

కెఎస్ఎన్ ప్రసాద్

జర్నలిస్టు

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 05:35 AM