Share News

సంఘటిత పోరాటాన్ని తప్పనిసరి చేస్తున్న లేబర్‌ కోడ్లు!

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:34 AM

మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు మేలు చేస్తుంటే కమ్యూనిస్టులు కార్మికులను రెచ్చగొడుతున్నారని కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా..

సంఘటిత పోరాటాన్ని తప్పనిసరి చేస్తున్న లేబర్‌ కోడ్లు!

మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు మేలు చేస్తుంటే కమ్యూనిస్టులు కార్మికులను రెచ్చగొడుతున్నారని కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ లేబర్ కోడ్‌లలోని కార్మిక వ్యతిరేక అంశాలను కమ్యూనిస్టులు మాత్రమే వ్యతిరేకించటం లేదు. కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్టీయూసీ, తదితర సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్‌ కార్మిక విభాగం అయిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్) కూడా ఈ కోడ్లలో రెండింటిని, ‘‘కార్మికులకు వ్యతిరేకమూ, యాజమాన్యాలకు అనుకూలమూ’’ అని వ్యతిరేకించింది. వీటిలో ‘‘యూనియన్లను మొత్తంగా తుడిచిపెట్టే అంశాలు వున్నాయి’’ అని 2025 ఫిబ్రవరి 12న తీర్మానించింది.

వలస పాలన కాలం నాటి కార్మిక చట్టాలను మార్చామని బీజేపీ పాలకులు జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ కొత్త లేబర్‌ కోడ్లలో కూడా తేడా ఏమీ లేదు. పైగా కార్మికుల ట్రేడ్ -యూనియన్ హక్కుకు, సమ్మె హక్కుకు మరిన్ని సంకెళ్ళు వేసారు. యాజమాన్యాలపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత బలహీనం చేసారు. గతంలో కొన్ని షెడ్యూల్ పరిశ్రమల్లో మాత్రమే వర్తించే ‘కనీస వేతనాలను’ ఇప్పుడు కార్మికులందరికీ వర్తింపచేసాం అని కేంద్ర ప్రభుత్వం గొప్పలు పోతోంది. నిజమే. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం కూడా కనీస వేతనాలను అనేక యాజమాన్యాలు అమలుచేయటం లేదు. అమలుకు ప్రభుత్వాలూ సరైన చర్యలు తీసుకోవటం లేదు. ఈ కనీస వేతనాల్లో మూలవేతనాన్ని ప్రభుత్వం కనీసం అయిదేళ్లకు ఒకసారి పెంచాలి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పరిశ్రమల్లో 2007, మరికొన్ని పరిశ్రమల్లో 2011 తరువాత నేటికీ వీటిని ప్రభుత్వాలు సవరించలేదు. ఇక ఈ కనీస వేతనాలు నిర్ణయించడానికి సంబంధించి అనేక సమస్యలున్నాయి. ఉదాహరణకు ఈ రోజు ఉద్యోగంలో చేరినవారికీ, రేపు రిటైర్ అయ్యేవారికీ ఒకటే కనీస వేతనం! ఇటువంటి అనేక సమస్యలకు కొత్త లేబర్ కోడ్‌లలో కూడా ఎలాంటి పరిష్కారమూ లేదు.


ఇక గిగ్, ప్లాట్‌ఫాం తదితర అసంఘటితరంగ కార్మికులకు కొత్త కోడ్‌లలో కల్పించామన్న ‘సామాజిక భద్రత’ సంగతి కూడా ఇంతే. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు ఇప్పటికే లక్షలాది కార్మికులకు అమలు కావటం లేదు. వీటిలోని వివిధ సీలింగులను కొనసాగించడంవల్ల అవి చాలా శాతం కార్మికులకు వర్తించవు. ఇక ఈ ‘సామాజిక భద్రత’ గతి ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఒక సంవత్సరం పని చేస్తే గ్రాట్యుటీ చెల్లించే విధంగా చట్టాన్ని మార్చామని అంటున్నారు. ఇది కార్మికులందరికీ వర్తించదు. కేవలం ‘ఫిక్స్‌డ్‌ టర్మ్’ కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గ్రాట్యుటీ చక్కెరపూతతో ‘ఫిక్స్‌డ్‌ టర్మ్’ చేదుమాత్రను మింగిస్తున్నారు. నిజానికి చాలా కాలంగానే అనేక యాజమాన్యాలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఏపీఎస్‌ఆర్టీసీలో కూడా దీన్ని అమలు చేసారు. ఇప్పుడు ఈ పద్ధతికి మరింత గట్టి చట్టబద్ధతను కల్పించారు. కార్మికులకు ఎలాంటి ఉద్యోగ భద్రతా లేకుండా చేసే మార్పు ఇది.

కొత్త కోడ్‌లలో ‘కోర్’ (కీలక) విభాగాల్లో కాంట్రాక్టు కార్మికుల నియామకాన్ని నిషేధించామని అంటున్నారు. ఈ ‘కోర్’ విభాగాలేమిటో చట్టంలో చెప్పలేదు. వీటిని మళ్ళీ ఆయా ప్రభుత్వాలు నిర్ణయించాలి. కాగా, సంవత్సరమంతా కొనసాగే లోడింగ్, అన్‌లోడింగ్, శానిటేషన్ వగైరా ముఖ్య విభాగాలు ‘కోర్’ విభాగాలు కాదని లేబర్ కోడ్‌లలో ప్రకటించేసి, ఆ పనుల్లో కాంట్రాక్టు కార్మిక విధానాన్ని చట్టబద్ధం చేసేసారు. వందమందికి పైగా ఉన్న పరిశ్రమలను మూత పెట్టడానికి పాతచట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి కావాలి. ఈ సంఖ్యను 300 చేసారు. దీంతో అత్యధిక శాతం పరిశ్రమల్లో కార్మికులు దీని పరిధిలోకి రారు.‌ యాజమాన్యం పరిశ్రమ మూసివేతకు అనుమతి కోసం దరఖాస్తు చేసిన 90 రోజుల తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఇచ్చినట్లే భావించాలని అదే చట్టంలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా వేలాది పరిశ్రమలు మూతపెట్టబడి, చట్టం ప్రకారం పరిహారం దక్కక, దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరిగే కార్మికుల కథలకు కొదవలేదు. పరిహారం ఇవ్వకుండా కార్మికులను తొలగించడానికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలతో సహా అనేక యాజమాన్యాలు కార్మికులనే రాజీనామాలు చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నాయి. బ్యాంకు బకాయిలు తీర్చలేక దివాలా తీసిన పరిశ్రమల్లో కార్మికుల బకాయిల వసూలు అసాధ్యం అయ్యేలా కొత్త దివాలా చట్టాలు, నిబంధనలు తెచ్చారు. పాత, కొత్త కార్మిక చట్టాల్లో కార్మికుల హక్కుల గురించిన వాస్తవ పరిస్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ కారణంగానే కార్మిక సంఘాలు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడవలసివస్తోంది.


ఎనిమిది గంటల పనిదినం, శ్రమకు తగిన న్యాయమైన వేతనం, భద్రతగల పనిపరిస్థితులు, న్యాయబద్ధమైన సర్వీసు రూల్స్, రిటైర్మెంట్ తర్వాత తగిన కనీస పెన్షన్ వగైరాలు వేటినీ చట్టాలు, నిబంధనలు లోగడ గ్యారంటీ చేయలేదు; రేపూ చేయలేవు. కార్మికుల, ప్రజల ప్రయోజనాలు మాత్రమే లక్ష్యంగా పనిచేసే నిజమైన ప్రజాస్వామిక రాజకీయవ్యవస్థ మాత్రమే వాటిని గ్యారంటీ చేయగలుగుతుంది. అటువంటి వ్యవస్థకోసం రైతాంగం, గ్రామీణ పేదలు, తదితర కోట్లాది శ్రమజీవులతో భుజం భుజం కలిపి పోరాడటం తప్ప కార్మికవర్గానికి మరో ప్రత్యామ్నాయం లేదు.

సిహెచ్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి

ప్రధాన కార్యదర్శి, ఎఫ్.ఐ.టి.యు

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

Updated Date - Feb 06 , 2026 | 01:34 AM