Share News

పరీవాహక ప్రాంతాన్ని బట్టి నీటి పంపకాలా?

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:10 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ, గోదావరి నదీ జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య వివాదం. మరొక వైపు రెండు రాష్ట్రాలలో అధికార–ప్రతిపక్ష పార్టీల...

పరీవాహక ప్రాంతాన్ని బట్టి నీటి పంపకాలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ, గోదావరి నదీ జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య వివాదం. మరొక వైపు రెండు రాష్ట్రాలలో అధికార–ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న వివాదం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా, గోదావరి నదీజలాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని ప్రయత్నిస్తున్న తరుణంలో ‘‘రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు ధారపోస్తున్నారని– కృష్ణాలో తెలంగాణకు 763 టీఎంసీలు, గోదావరిలో 1951 టీఎంసీలు తెలంగాణకు రావాలని’’ బీఆర్‌ఎస్ పార్టీ ఒక వితండవాదం చేస్తున్నది. రాష్ట్ర విభజన నాటి నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో ఇదే వాదన చేసింది. కేంద్ర జలసంఘానికి, కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై అనేక అడ్డంకులను సృష్టిస్తూ వచ్చింది. ప్రభుత్వం మారినా నేటికీ అదేవిధానం కొనసాగుతూ ఉన్నది.

భారతదేశంలో నదీ జలాలపై ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు మునుపు 1951లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర సమావేశంలో, కేంద్ర జల విద్యుత్ సంఘం కృష్ణ–గోదావరి జలాల వినియోగం నివేదిక ఆధారంగా, సంబంధిత రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించి పంపకాలు చేసింది. ఆ తరువాత బచావత్ ట్రిబ్యునల్‌ కృష్ణానదిలో 100 సంవత్సరాల ప్రవాహాన్ని 75శాతం లభ్యత ప్రకారం రాష్ట్రాలకు పంచింది. కృష్ణాలో మిగులు జలాలను ఆఖరునున్న ఆంధ్రప్రదేశ్ వాడుకొనే ‘స్వేచ్ఛ’ను కల్పించింది, కానీ హక్కును కల్పించలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ 2013లో అంతిమ తీర్పు ఇస్తూ బచావత్ ట్రిబ్యునల్‌ పంచిన 811 టీఎంసీల కృష్ణా జలాలను యథాతథంగా ఉంచి, మరో 448 టీఎంసీలు అదనంగా నికర, మిగులు జలాలుగా తేల్చి వాటిని ఆయా రాష్ట్రాలకు పంచింది. ఈ తీర్పు రెండు రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించింది. కృష్ణాలో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్‌కు లేకుండా పై రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలకు 258 టీఎంసీలు పంచడం. రెండవది– కర్ణాటక వాటాగా వచ్చిన నీటినంతటినీ ప్రాజెక్టులవారీగా పంపకాలు చేయడం. ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన 190 టీఎంసీలలో ప్రాజెక్టుల వారీ కేటాయింపులు పోగా మిగిలిన 150 టీఎంసీలను మిగులు జలాలపై కట్టిన ప్రాజెక్టులకు పంచకుండా కింద డెల్టా ప్రాంతంవారు వాడుకోవటానికి, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో క్యారీ ఓవర్‌గా పెట్టాలని బ్రిజేష్ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుతో రాయలసీమ, దక్షిణ తెలంగాణలలో మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది.


2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్–తెలంగాణల మధ్య కృష్ణా–గోదావరి జల వివాదాల పరిష్కారానికి విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి సెక్షన్ 91 వరకు దాదాపు 50 అంశాలతో విధివిధానాలను పొందుపరిచారు. కృష్ణాజలాలను ఇరు రాష్ట్రాలకు పంచటానికి సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను నియమించారు. 2013 డిసెంబర్‌లో జీఓఎం రూపొందించిన విభజన చట్టం ముసాయిదా బిల్లు విడుదలయింది. ఈ సందర్భంగా– విభజన వల్ల కృష్ణా జలాలలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, రాయలసీమ నాయకులు వెంకయ్యనాయుడు విభజన చట్టం రూపొందించిన జైరామ్‌ రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ, తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ప్రాజెక్టులను చేర్చి వాటికి చట్టబద్ధత కల్పించారు. ఈ ప్రాజెక్టులు ప్రకటించిన పథకం ప్రకారం పూర్తి చేయాలని, వాటికి నీటి కేటాయింపులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ‘‘విభజన చట్టంలో ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను జాబితాలో చేర్చాలని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు కావాల’’ని, తెలంగాణకు నీటి కేటాయింపులలో అన్యాయం జరిగిందని ఆ ప్రాంత పార్టీలు, రాజకీయ నాయకులు ఎందుకు అడగలేదు?

కృష్ణానదిపై నాగార్జుసాగర్ ప్రాజెక్టు (1967) నిర్మించే వరకు తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ప్రాజెక్టు (ప్రకాశం బ్యారేజ్), కేసీ కెనాల్ 150 సంవత్సరాల క్రితమే నిర్మించారు. 75 సంవత్సరాల క్రితమే తుంగభద్ర డ్యాం నిర్మాణం వల్ల రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి. 1951–1963లో కేంద్ర ప్రభుత్వం జరిపిన నీటి పంపకాలు, 1967లో బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు చేసిన ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నీటి వాటా దక్కింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా లెక్కగట్టిన దాని ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయి. దీని ఆధారంగా 2015లో ఆంధ్రప్రదేశ్–తెలంగాణల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది.


దేశంలో అన్ని ట్రిబ్యునళ్ళు ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు చేశాయి తప్ప, నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి పంపకాలు చేయలేదు. నేడు ‘‘కృష్ణా జలాలు నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి తెలంగాణకు 763 టీఎంసీలు వస్తాయని, కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌లో రాయలసీమ ప్రాజెక్టులకు తరలించకూడదని... తెలంగాణ రాష్ట్రం వాదించటంలో అర్థం లేదు. దబాయింపులు తప్ప దానికి ఏ ప్రాతిపదికా లేదు. 150 ఏళ్ల నుంచి కేసీ కెనాల్ ద్వారా, 75 ఏళ్ల నుంచి తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు పారుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్‌ రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు చేసింది. పెన్నా బేసిన్‌లోని రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా నీటిని తరలించకూడదనే కర్ణాటక అభ్యంతరాన్ని బచావత్ ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. తెలంగాణ ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు నదీ జలాల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

రాజ్యాంగంలోని 262 అధికరణాన్ని అనుసరించి 1956 అంతరాష్ట్ర జలవివాదాల చట్టానికి, మార్చి 2002లో సవరణలు చేసి, అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం ట్రిబ్యునల్‌ తీర్పులు మార్చటానికి వీలులేదు. ఇదే విషయం విభజన చట్టంలోనూ పొందుపరిచారు. ‘‘వివిధ ప్రాజెక్టులకు కేటాయింపుల విషయమై నదీ జలాల ట్రిబ్యునళ్లు హామీ ఇచ్చిన నీరు యథాతథంగా ఉంటుందని’’ విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

విభజన చట్టం సెక్షన్ 89పై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్‌కు గాని, బచావత్ ట్రిబ్యునల్‌ పంచిన 811 టీఎంసీల కృష్ణా జలాలు పునఃపంపిణీ చేయాలని 2023లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వేసిన ట్రిబ్యునల్‌కు గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి బచావత్ ట్రిబ్యునల్‌ కేటాయించిన కృష్ణా జలాలను మార్చటానికి వీల్లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ క్యారీ ఓవర్‌గా పెట్టిన 150 టీఎంసీల కృష్ణా జలాలను, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిలో ఉమ్మడి ఏపీ వాటా 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంచటానికి మాత్రమే అవకాశం ఉన్నది.

2013లో కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై 2014 నుంచి 11 ఏళ్లుగా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంది? విభజన చట్టం సెక్షన్ 89పై బ్రిజేష్ ట్రిబ్యునల్‌ విచారణ 11 ఏళ్లు గడిచినా ఎందుకు పరిష్కారం కాలేదు? దీనికి కారకులెవరు? విభజన చట్టం సెక్షన్ 84 ప్రకారం కేంద్ర జలశక్తిమంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పడిన ‘అపెక్స్‌’ కౌన్సిల్‌లో పరిష్కారం కాని సమస్యల్ని... రెండు రాష్ట్రాల జలవనరుల అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ పరిష్కరించడం సాధ్యమా?

మాయకుంట్ల శ్రీనివాసులు

జలసాధన సమితి

ఇవి కూడా చదవండి

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

Updated Date - Mar 03 , 2026 | 02:10 AM