Share News

జయహో జితేంద్ర!

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:28 AM

లిక్కర్‌ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, కల్వకుంట్ల కవిత ప్రభృతులు అప్పట్లో అరెస్టయి సుదీర్ఘంగా జైల్లో ఉండటం సంచలనం సృష్టించగా...

జయహో జితేంద్ర!

లిక్కర్‌ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, కల్వకుంట్ల కవిత ప్రభృతులు అప్పట్లో అరెస్టయి సుదీర్ఘంగా జైల్లో ఉండటం సంచలనం సృష్టించగా, ఇప్పుడా కేసులో కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని, ఊహాజనిత కథలతో కేసు కట్టారని నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు అంతకంటే సంచలనం కలిగిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను సీబీఐ–ఈడీ కేసులతో వేధిస్తున్నారంటూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు అనేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చేయని నేరానికి తనను ఆరు నెలల పాటు జైల్లో నిర్బంధించి అవినీతిపరుడిగా ముద్ర వేశారని తీర్పు అనంతరం కేజ్రీవాల్‌ విలపించగా, ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేకుండా కేసు కట్టిన సీబీఐకి చెందిన దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయాధికారి తన తీర్పులో పేర్కొనడం విశేషం. ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ అప్పీలు దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఇలాంటి సంచలనతీర్పులు అప్పుడప్పుడూ రావడం మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా పటిష్ఠంగానే ఉందన్న అభిప్రాయం కలిగిస్తూ ఉంటుంది. తీర్పులో భాగంగా న్యాయాధికారి జితేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బట్టి దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ విశ్వసనీయత మసకబారుతోంది. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి లేదా అణచివేయడానికి సీబీఐ లేదా ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను పాలకులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం దేశ ప్రజల్లో కొంత కాలంగా ఉంది. ఈ తీర్పుతో సదరు అభిప్రాయానికి బలం చేకూరుతోంది. లిక్కర్‌ కేసు కారణంగా ఢిల్లీలో తాము అధికారం కోల్పోయామని, దమ్ముంటే మళ్లీ ఎన్నికలు జరపాలని తీర్పు అనంతరం కేజ్రీవాల్‌ సవాలు చేశారు. అటువంటి సవాలు చేసే హక్కు ఆయనకు ఉంది.


ఎందుకంటే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేతగా ఆయన ఈ కేసు కారణంగా ఎన్నో కోల్పోయారు.ఆకాశం కూలినా సరే న్యాయం జరగాలి అని న్యాయాధికారి జితేంద్రసింగ్‌ తన తీర్పులో భాగంగా వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. న్యాయ వ్యవస్థకు కూడా అవినీతి చెద పట్టిందన్న అభిప్రాయం బలపడుతున్న వేళ ఇటువంటి తీర్పులు దేశ ప్రజల్లో నైరాశ్యాన్ని తొలగిస్తాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీఈఆర్‌టీ సంస్థ ఎనిమిదవ తరగతి సిలబస్‌లో ఏకంగా ఒక పాఠ్యాంశాన్ని చేర్చడం, దానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం, దరిమిలా సదరు పాఠ్యాంశాన్ని తొలగించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఏ ఉద్దేశంతో అటువంటి పాఠ్యాంశాన్ని రూపొందించారో తెలియదు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మాత్రమే అవినీతిమయం అవుతున్నదా? మిగతా వ్యవస్థలు పవిత్రంగా ఉన్నాయా? రాజకీయ వ్యవస్థ మాటేమిటి? దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న అధికారుల అవినీతి కొత్త పుంతలు తొక్కుతోందని వార్తలు వస్తున్నాయి కదా? ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్న కేసులు, వాటిపై వెలువడుతున్న తీర్పుల విశ్వసనీయతపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. మొత్తంగా చూస్తే అవినీతి మన ప్రజా జీవితంలో భాగంగా మారిపోయింది. ప్రజలు కూడా అవినీతిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో నిజంగా అవినీతికి పాల్పడినవారు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితులలో శుక్రవారం నాడు ఢిల్లీ లిక్కర్‌ కేసులో న్యాయాధికారి జితేంద్రసింగ్‌ వెలువరించిన తీర్పు కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కేజ్రీవాల్‌ను తాడూ బొంగరం లేని కేసులో అరెస్టు చేసి దాదాపు ఆరు నెలల పాటు జైల్లో ఎలా ఉంచగలిగారు? ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అంతకాలం జైల్లో నిర్బంధించడం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దర్యాప్తు సంస్థలు ఎవరిపైన అయినా కేసులు కట్టగానే న్యాయస్థానాలు వారికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడం పరిపాటే.


తొలుత పద్నాలుగు రోజుల పాటు రిమాండ్‌ విధిస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తుంటారు. ఈ కారణంగా నేరం చేయకపోయినా సిసోడియా దాదాపు ఏడాదిన్నర పాటు, కేజ్రీవాల్‌ 156 రోజుల పాటు, కవిత 165 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు సమయంలో కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవా? అని పరిశీలించాల్సిన బాధ్యత న్యాయాధికారులు, న్యాయమూర్తులపై ఉండదా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దర్యాప్తు సంస్థలు చార్జిషీటు రూపొందించి దానిపై ట్రయల్‌ జరిగి తీర్పు వచ్చే వరకు నిందితుల పరిస్థితి ఏమిటి? నేరం జరగలేదని తీర్పు వచ్చే పక్షంలో నిందితులు కోల్పోయేదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా నెల రోజులు దాటి జైలులో ఉంటే వారు తమ పదవులు కోల్పోయే విధంగా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తలపోస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ కేసు నేపథ్యంలో ఈ ప్రతిపాదిత చట్టం సమర్థనీయమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి నెల రోజులకు మించి వారిని జైలుకే పరిమితం చేయడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ కేసులో యాభై రోజులకు పైగా జైల్లో ఉండాల్సి రాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉండి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవినీతి కేసులలో పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరెన్‌ కూడా జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గిట్టని వారిని పదవి నుంచి తొలగించడానికి వారికి ఎంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రతిపాదిత చట్టం మార్గం సుగమం చేయదా? లిక్కర్‌ కేసులో నిర్దోషిగా కోర్టు ప్రకటించిన కేజ్రీవాల్‌ సంధించిన ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఎవరినైనా నెల రోజుల పాటు జైల్లో పెట్టడం పెద్ద కష్టం కాదు అని న్యాయవాద వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.


లిక్కర్‌ కేసు కారణంగా అరవింద్‌ కేజ్రీవాల్‌, సిసోడియా వంటి వారు విలువైన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. అవినీతిపరులుగా వారిపై ముద్ర పడింది. అందుకే నిబ్బరంగా కనిపించే కేజ్రీవాల్‌ శుక్రవారంనాడు విలేకరుల సమావేశంలో విలపించారు. అంటే ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మీడియా కూడా గతంలో లాగా లేదు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి ఒకప్పుడు పెద్దపీట వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీడియా సంస్థల నిర్వహణ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల నిర్వహణ వ్యయం నానాటికీ పెరిగిపోతున్నది. ఫలితంగా అధికార వ్యవస్థలను ఎదిరించి నిలబడలేని స్థితికి మీడియా సంస్థలు చేరుకున్నాయి. జాతీయ మీడియా మొత్తం పాలకులకు దాసోహం అయిపోయిందని రాహుల్‌గాంధీ వంటివారు ఆరోపించడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం ద్వారా మీడియా పాఠకుల, వీక్షకుల ఆదరణ కోసం పాటుపడేది. అప్పట్లో ప్రభుత్వాలు స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకొనేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాలకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి ఎదురుదాడిని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలను బయటపెడితే సదరు మీడియా సంస్థకు దురుద్దేశాలు అంటగడుతున్నారు. ఆయా మీడియా సంస్థల యజమానులకు కులం, ప్రాంతం అంటగడుతున్నారు. తెలుగునాట ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పరిస్థితులు వికృతంగా మారడంతో అనేక మీడియా సంస్థలు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి స్వస్తి చెప్పాయి. జర్నలిస్టులు కూడా ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ఢిల్లీ లిక్కర్‌ కేసును కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. కేజ్రీవాల్‌ తదితరులను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు జాతీయ మీడియా కేసు మెరిట్స్‌పై పరిశీలన చేయలేదు. కేవలం సంఘటనలను మాత్రమే రిపోర్ట్‌ చేసింది. అదే సమయంలో దర్యాప్తు సంస్థల నివేదికలను ఆసరా చేసుకొని కేజ్రీవాల్‌ ప్రభృతులను అవినీతిపరులుగా భావించి ఎలక్ర్టానిక్‌ మీడియా చర్చలు నిర్వహించింది.


శుక్రవారంనాడు కేజ్రీవాల్‌ విలపించడానికి ఇదే కారణమైంది. టీవీ చర్చలలో తనను అవినీతిపరుడుగా చిత్రీకరించడాన్ని తట్టుకోలేకపోయానని ఆయన అన్నారు. ఈ లిక్కర్‌ కేసు కోర్టు విచారణలో నిలవదని పలువురు ఇదివరకే అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి కేసులు వీగిపోతాయని న్యాయ నిపుణులు అప్పుడే చెప్పారు. అయితే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. కానీ, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటుంది. ఈ లిక్కర్‌ కేసులో న్యాయస్థానం తీర్పు త్వరగానే వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి వంటి వారిపై నమోదైన అవినీతి కేసులలో పుష్కర కాలం గడచినా విచారణ కూడా ప్రారంభం కావడం లేదు. కనీసం లిక్కర్‌ కేసులోనైనా తీర్పు వచ్చింది. కేజ్రీవాల్‌ ప్రభృతులు నిర్దోషులని స్పష్టమైంది. జగన్‌రెడ్డి వంటి వాళ్లు దోషా? నిర్దోషా? అన్నది ఎప్పటికి తేలుతుందో చెప్పలేని పరిస్థితి.


అడ్డగోలుతనానికి చెక్‌ పెట్టాలి!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో మూడు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించింది. మంచిదే.. ఇలాంటి గడువు ఉండాల్సిందే! అయితే న్యాయ వ్యవస్థలకు కూడా ఇలాంటి గడువు ఉండాలి కదా? గడువు లేకుండా కేసుల విచారణను సాగదీసుకుంటూ పోవడం వల్ల దోషులు నిర్దోషులుగా, నిర్దోషులు దోషులుగా చలామణి కారా? న్యాయ వ్యవస్థ ఈ దిశగా ఆలోచించాలని కోరుకోవడం కోర్టు ధిక్కరణ కాదు కదా? రిమాండ్‌లను నిరవధికంగా పొడిగించడం ద్వారా కేజ్రీవాల్‌, సిసోడియా వంటి నిర్దోషులను నెలల తరబడి జైల్లో నిర్బంధించే పరిస్థితి ఉంటున్నందున ఈ పరిస్థితిని అధిగమించడం కోసం మార్గదర్శకాలను రూపొందించే బాధ్యతను సర్వోన్నత న్యాయస్థానం తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో అధికారంలో ఉన్నవారు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. ఆయా కేసుల్లో బలం ఉన్నా లేకపోయినా నిందితులు జైలు జీవితం గడపాల్సి వస్తోంది. నిందితులకు కొంత కాలానికి బెయిల్‌ రావొచ్చు గానీ ఆ తర్వాత సదరు కేసులకు అతీగతీ ఉండదు. సంచలనం సృష్టించిన కేసులు కూడా ప్రభుత్వాలు మారగానే అటకెక్కుతాయి. చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన స్కిల్‌ కేసును ఇప్పుడు మూసివేశారు. ఆ కేసును ఉపసంహరించుకోవడానికి న్యాయస్థానం కూడా ఆమోదించింది. అంటే సదరు కేసులో బలం లేదని న్యాయ వ్యవస్థ కూడా నమ్మినట్టే కదా! అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేని కేసులో చంద్రబాబును యాభై రోజులకుపైగా జైల్లో పెట్టినట్టే కదా! కేజ్రీవాల్‌ ఏకంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్దోషి అని తేలిపోయింది. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు అన్నది న్యాయ వ్యవస్థలోని ప్రాథమిక సూత్రం.


అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. దర్యాప్తు సంస్థలకు, ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. మేం మీపై అభియోగాలు మోపుతాం, నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నట్టుగా ఈడీ వ్యవహరిస్తోంది. ఈ అభియోగాలలో పస ఉందో లేదో తేలేవరకు నిందితులు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఇది సహజ న్యాయ సూత్రానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధం కాదా? కేసు నమోదు చేసిన వారికి దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత లేకపోవడం ఏమిటి? అభియోగం ఎదుర్కొంటున్న వారే నిర్దోషులమని రుజువు చేసుకోవాల్సి రావడం ఏమిటి? ఈడీకి ఈ ప్రత్యేకమైన మినహాయింపు ఎందుకిచ్చారో తెలియదు. నేరాభియోగాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత సీబీఐ వంటి సంస్థపై ఉంటుంది. కేజ్రీవాల్‌ ప్రభృతులపై దాఖలైన కేసును సీబీఐ రుజువు చేయలేకపోవడం వల్లనే నిందితులందరూ నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసు నమోదు నుంచి తీర్పు వరకూ అన్నీ సంచలనాలే! కేంద్ర హోం శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాసిన లేఖ ఆధారంగా సీబీఐ రంగంలోకి దిగింది. ఆ లేఖ ఆధారంగా సీబీఐ కేసు కట్టి కేజ్రీవాల్‌ ప్రభృతులను అరెస్టు చేసింది. సదరు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తన తీర్పులో ఆదేశించింది. దీన్నిబట్టి దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు పైవారిని సంతృప్తిపరచడం కోసం నిర్దోషులపై కూడా చర్యలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. తీర్పులో భాగంగా న్యాయాధికారి పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం సీబీఐపై కచ్చితంగా ఉంటుంది. ప్రతిష్ఠాత్మకంగా ఉండాల్సిన సీబీఐ వంటి సంస్థల విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ అడ్డగోలుగా వ్యవహరించిందని మరోమారు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో న్యాయాధికారులు రిమాండ్లను పొడిగించే ముందు కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తుచేయడం లేదా? ఏది ఏమైనా న్యాయాధికారి జితేంద్రసింగ్‌ ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేస్తోంది.


న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో ఉన్నవారు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న అభిప్రాయం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పులు సామాన్య ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఆశలను చిగురింపజేస్తాయి. దర్యాప్తు సంస్థలకు కూడా ఇలాంటి తీర్పులు చెంపపెట్టులా ఉంటాయి. ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా తన తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసిన న్యాయాధికారి జితేంద్రసింగ్‌ను అభినందించాల్సిందే. వ్యవస్థలలో ఇటువంటి వారు ఇంకా మిగిలి ఉన్నందునే ఈ దేశంలో ధర్మం, న్యాయం ఇంకా మిగిలి ఉన్నాయి. న్యాయాధికారి లేదా న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించని పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాగతాలకైనా పాల్పడవచ్చునని ఢిల్లీ లిక్కర్‌ కేసులో రుజువైంది. విచారణ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. పంజరంలో చిలకలా మారిన సీబీఐ వంటి సంస్థలకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అధికారంలో ఉన్న వారి సేవలో తరించడానికి కాదు వ్యవస్థలు ఉన్నది. ఒకవేళ ఎవరైనా తరించాలనుకున్నా తమను కట్టడి చేయడానికి మరో వ్యవస్థ ఉంటుందని హెచ్చరించడానికి ఈ తీర్పు దోహదపడుతుంది. అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటైన సంస్థలు నిర్దోషులను దోషులుగా, దోషులను నిర్దోషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం క్షమించరాని నేరమే కాదు.. మహా పాపం కూడా. కేజ్రీవాల్‌ ప్రభృతులు అనుభవించిన మానసిక క్షోభకు సీబీఐ డైరెక్టర్‌ బాధ్యత తీసుకుంటారా? అధికారానికే కాదు.. అంతరాత్మకూ జవాబుదారీగా ఉండాలని అధికారులు గుర్తించాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడే పాలకులకు కూడా ఈ తీర్పు ఒక హెచ్చరిక. ఈ కేసులో ఏ స్థాయిలో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలను సీబీఐ చూపించలేకపోయిందని, కట్టుకథలతో చార్జిషీట్‌ను రూపొందించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించడాన్ని మించిన అవమానం సీబీఐకి ఇంకేం ఉంటుంది? ఇలాంటి తీర్పుల వల్ల ఇతర వ్యవస్థల్లో కొరవడిన జవాబుదారీతనం మళ్లీ వస్తుందని ఆశిద్దాం.


అడుగుకో జితేంద్ర కావాలి!

తాజా తీర్పు దేశ రాజకీయాలలో మార్పునకు దారితీసే అవకాశమూ ఉంది. ప్రతిపక్ష శిబిరం బలహీనపడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రతిపక్షాలకు నైతిక బలం చేకూర్చినట్టు అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులను కేసులతో వేధిస్తున్నారని తాము ఇంతకాలంగా చేస్తున్న ఆరోపణలు నిజమని ఈ తీర్పుతో రుజువైందని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఈ తీర్పు దోహదపడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ కేంద్ర ప్రభుత్వం పెద్దలు మాత్రం ఈ తీర్పుతో ఎంతో కొంత ఆత్మరక్షణలో పడతారని చెప్పవచ్చు. అతి సర్వత్రా వర్జయేత్‌ అని అంటారు. అధర్మం పెచ్చరిల్లినప్పుడు నేనున్నాను అని దేవుడు కల్పించుకుంటాడు అని మనం నమ్ముతాం. ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అన్నట్టుగా అన్యాయం హద్దులు దాటినప్పుడు న్యాయం చేయడానికి ఎవరో ఒకరు పుట్టుకొస్తారు. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి జితేంద్రసింగ్‌ రూపంలో కేజ్రీవాల్‌ ప్రభృతులకు జరిగిన అన్యాయం సరిదిద్దినట్లయింది. యావత్‌ న్యాయ వ్యవస్థ ఇంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తే అధికార దుర్వినియోగానికి ఎవరు మాత్రం సాహసిస్తారు? కాలాన్ని వెనక్కు జరిపి కేజ్రీవాల్‌ ప్రభృతులు కోల్పోయిన దాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరు గానీ ఈ తీర్పుతో ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ పార్టీ అధికారం కోల్పోవడానికి ఈ లిక్కర్‌ కేసు ప్రధాన కారణం అన్న అభిప్రాయం ఉన్నందున తెలంగాణలో తాము అధికారం కోల్పోవడానికి కూడా కవితపై పెట్టిన ఈ కేసే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే ఆయన సోదరి కవిత మాత్రం ఈ అభిప్రాయంతో విభేదించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల అహంకారం వల్లనే బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందని ఆమె ప్రతిస్పందించారు. ఆ ఇంటి పంచాయితీ ప్రస్తుతం అప్రస్తుతం.


ఇకనైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరిస్తాయని, వ్యవహరించాలనీ కోరుకుందాం. రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలు ఏ దశలో కూడా వారికి ఉపయోగపడకూడదని ఆశించడంలో తప్పు లేదు కదా? దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం వల్లనే దోషులు బుకాయిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే న్యాయ వ్యవస్థలో అడుగుకో జితేంద్రసింగ్‌ ఉండాలి. ఉంటారని ఆశిద్దాం!

ఆర్కే

main.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - Mar 01 , 2026 | 01:54 AM