Share News

కాస్త సంస్కారం ఉండాలి!

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:09 AM

ట్రిపుల్‌ ఎక్స్‌ సబ్బు పేరు గుర్తుందా? దుస్తులు ఉతకడానికి వాడే ఈ సబ్బు ఉత్పత్తిదారులు తమ ట్యాగ్‌ లైన్‌గా సంస్కారవంతమైన సబ్బు అని పెట్టుకున్నారు. ఉత్పత్తిదారులు ఈ ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు గానీ, తెలుగునాట రాజకీయాలను....

కాస్త సంస్కారం ఉండాలి!

ట్రిపుల్‌ ఎక్స్‌ సబ్బు పేరు గుర్తుందా? దుస్తులు ఉతకడానికి వాడే ఈ సబ్బు ఉత్పత్తిదారులు తమ ట్యాగ్‌ లైన్‌గా సంస్కారవంతమైన సబ్బు అని పెట్టుకున్నారు. ఉత్పత్తిదారులు ఈ ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు గానీ, తెలుగునాట రాజకీయాలను ఈ ట్రిపుల్‌ ఎక్స్‌ సబ్బుతో ఉతికితే సంస్కారం వస్తుందేమో అన్న ఆశ కలుగుతోంది. తెలుగు రాష్ర్టాలలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో సంస్కారం పూర్తిగా కొరవడింది. మంచీ చెడూ అన్న తేడా లేకుండా ప్రతి దాన్నీ రాజకీయం చేస్తూ హద్దూపద్దూ లేని భాషను వినియోగిస్తున్నారు. రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న పేటీయం బ్యాచ్‌లు చెలరేగిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగా, వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న సోషల్‌ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్‌తో సృష్టించిన రచ్చ ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం మన తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈవోగా పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్‌ను బిల్‌ గేట్స్‌ ప్రారంభించారు. మూడు దశాబ్దాల క్రితం బిల్‌ గేట్స్‌ను కలుసుకోవడం మన రాజకీయ నాయకులు మహదవకాశంగా భావించేవారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ను కలవడానికి అష్టకష్టాలు పడ్డారు. మొత్తానికి ఆ సంస్థను ఎలాగోలా ఒప్పించి మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అప్పట్లో ఢిల్లీ వచ్చిన బిల్‌ గేట్స్‌ను కలవడానికి చంద్రబాబు కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంలో వయోభారం కారణంగా బిల్‌ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ సంస్థ నాది, నా వారసులే దాన్ని నడుపుతారు అని మన దేశంలో లాగా ఆయన భావించలేదు. తన శేష జీవితాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో సేవలు అందించడం ప్రారంభించారు. వారెన్‌ బఫెట్‌తో కలసి ఫౌండేషన్‌కు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దానం చేశారు. ఇందులో ఆరు లక్షల కోట్లు బిల్‌ గేట్స్‌ వ్యక్తిగత సంపదే. ఆయన ఇప్పుడు వ్యాపారవేత్త కాదు, కేవలం సంఘ సేవకుడిగానే వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో సేవలు అందించాలన్న బృహత్తర ఆశయంతో సొంత ఆస్తిని వితరణ చేసిన బిల్‌ గేట్స్‌ను గౌరవించాలా? వద్దా? మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే అపర కుబేరులు కొందరు ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. బిల్‌ గేట్స్‌ వంటి వారే వీరికి స్ఫూర్తి. ఇంత చరిత్ర ఉన్న బిల్‌ గేట్స్‌ నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. అది కూడా మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధిగా కాకుండా ఫౌండేషన్‌ ప్రతినిధిగా వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయడానికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టుకు ఈ ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇలాంటి బిల్‌ గేట్స్‌ పర్యటనపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ కోసం పనిచేస్తున్న పేటీఎం బ్యాచ్‌ చేస్తున్న విమర్శలు కంపరం పుట్టిస్తున్నాయి.


సహాయం చేయడం కోసం వచ్చిన వారిని తిట్టడాన్ని మించిన రోత రాజకీయం ఉంటుందా? జగన్మోహన్‌ రెడ్డికి గానీ, ఆయన మద్దతుదారులకు గానీ బిల్‌ గేట్స్‌ చేసిన అపకారం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే సమాధానం లభించదు. జగన్‌ రెడ్డి వంటి ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే కలుసుకోవడానికి బిల్‌ గేట్స్‌ వంటి వ్యక్తి అంగీకరించేవారు కారు. అలాంటి స్థాయి ఆయనది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌ గేట్స్‌ పేరు కూడా ఉంది. మనుషులు అన్నాక కొందరిలో బలహీనతలు ఉండటం సహజం. ఈ బలహీనతలు వేర్వేరుగా ఉంటాయి. జగన్‌ రెడ్డికి సంపద పోగేసుకోవడం అనే బలహీనత ఉండటం వల్లనే కదా ఆయన అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. వ్యక్తిగత బలహీనతలను అధిగమించలేకపోవడం వారి బలహీనత. నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దేశాలలో వ్యక్తిగత బలహీనతలకు లొంగిపోయిన వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే బిల్‌ గేట్స్‌ వైవాహిక జీవితం కూడా విచ్ఛిన్నమైంది. చేసిన తప్పులకు ఆయన తన భార్యకు, సమాజానికి క్షమాపణలు చెప్పుకొన్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. ఈ కారణంగానే ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సదస్సుకు ఆహ్వానం ఉన్నా ఆయన దూరంగా ఉండిపోయారు. అంటే జనంలోకి రావడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదన్న మాట! నిజానికి బిల్‌ గేట్స్‌ చేసిన పని వల్ల సమాజానికి గానీ, దేశానికి గానీ నష్టం ఏమీ జరగలేదు. కేవలం నైతికతకు సంబంధించి తప్పటడుగులు వేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. ప్రభుత్వ సంపదను దోచుకోలేదు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌కు గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ బిల్‌ గేట్స్‌ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయనను వైసీపీ గ్యాంగ్‌ తిట్టిపోయడానికి కారణం ఏమిటి? జగన్‌ రెడ్డికి బిల్‌ గేట్స్‌ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదే! అయినా ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది. పచ్చి బూతులు తిట్టారు. దీనికి అంతటికీ కారణం బిల్‌ గేట్స్‌కు విలువలు లేకపోవడం కాదు. ఆయన పర్యటన వల్ల చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట ప్రధాన కారణం. నైతిక విలువలే ప్రాతిపదిక అయిన పక్షంలో మన దేశంలో ప్రజా జీవితంలో కొనసాగే నైతిక అర్హత అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంత మందిపై ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ కేసులు నమోదు కాలేదు? అయినా ఏ పట్టింపూ లేకుండా వారంతా దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు కదా? జైలుకు వెళ్లి రావడం ప్రత్యేక అర్హతగా మార్చుకోలేదా? ఆంధ్రప్రదేశ్‌లో బిల్‌ గేట్స్‌ను విమర్శించిన వైసీపీ గ్యాంగ్‌లో ఎంత మందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతికత ఉంది? ఆ పార్టీ అధినేత జగన్‌ రెడ్డికే ఆ అర్హత లేదు కదా? నెత్తిన డజనుకు పైగా కేసులు మోస్తున్న జగన్‌ రెడ్డి నీతులు చెబుతుంటే భరిస్తున్నాం కదా! తనపై నమోదైన అవినీతి కేసుల విచారణకు రాకుండా ఆయన ఎన్ని కుటిల ఎత్తులకు పాల్పడుతున్నారో చూస్తున్నాం.


చివరికి సొంత బాబాయ్‌ హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లిని సైతం ఆస్తి కోసం దూరం చేసుకున్న జగన్‌ రెడ్డి నాయకత్వంలోని పార్టీ, లక్షల కోట్ల సంపదను తృణప్రాయంగా భావించి దానధర్మాలు చేస్తున్న బిల్‌ గేట్స్‌ను విమర్శించడం దుస్సాహసమే అవుతుంది. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మన దేశానికి చెందిన ఎంతో మంది పేర్లు ఉన్నాయి. వారి గురించి మాట్లాడే సాహసం చేయలేని వారు మన ప్రజలకు సహాయం చేద్దామని వచ్చిన వ్యక్తిని తిట్టిపోయడం వారి కుసంస్కారానికి నిదర్శనం కాదా? ఆంధ్రప్రదేశ్‌ దశా దిశా మార్చడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని చంద్రబాబు, ఈ క్రమంలోనే రాష్ర్టానికి వచ్చిన బిల్‌గేట్స్‌ను సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు కల్పించారు. ఏఐ ఆధారిత వ్యవసాయానికి, డిజిటల్‌ మ్యాపింగ్‌కు, రియల్‌ టైం గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించడానికి బిల్‌ గేట్స్‌ వచ్చారు. ఈ విషయమై గేట్స్‌ ఫౌండేషన్‌ అందించే సహాయానికి, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏమిటి? వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎంత మంది వైసీపీ నాయకులు, కూటమి నాయకులపై ఆరోపణలు రాలేదు? వారి అనైతికతను పట్టించుకోని వారు అమెరికా పౌరుడైన బిల్‌ గేట్స్‌కు మాత్రమే నైతికత ఉండాలని అనుకోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టుల కోసం బిల్‌ గేట్స్‌ రాలేదే? ఎవరితోనూ వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడానికి ఆయన రాలేదు. ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలన్న చంద్రబాబు అభ్యర్థన మేరకు మాత్రమే ఆయన వచ్చారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలైన సంజీవని పథకం విజయవంతమైంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తారు. ఇందుకోసం ఏఐని వినియోగిస్తున్నారు. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని అరికట్టడం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేస్తున్న వ్యక్తిని అతిథిగా గౌరవించకపోయినా ఫర్వాలేదు గానీ తిట్టిపోయడం ఏమిటి? బిల్‌గేట్స్‌ వంటి వారు సమాజ సేవకు పనికిరారు అనుకుంటే మన దేశంలో దాదాపు 95 శాతం మంది రాజకీయ నాయకులపై నిషేధమే విధించాలి. జగన్‌ రెడ్డి వంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందా?


33-eddd.jpg

ప్రత్యర్థులు.. శత్రువులు!

రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించడం ప్రస్తుతం తెలుగునాట మొదలైన రాజకీయ సంస్కృతి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రత్యర్థులను గౌరవించే వారిని కూడా శత్రువుగానే పరిగణిస్తున్నారు. ఈ కారణంగానే బిల్‌ గేట్స్‌ను కూడా జగన్‌ అండ్‌ కో తమ శత్రువుగా ప్రకటించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై చాలా కాలం క్రితం అమెరికాలో ఆరోపణలు నమోదయ్యాయి. అంతెందుకు అదానీ సంస్థ తాము ఉత్పత్తి చేసే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించడానికి 1,750 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చిందని అమెరికాలో కేసు నమోదు కాలేదా? ఆ లంచాల వ్యవహారం జరిగినప్పుడు జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? బిల్‌ గేట్స్‌ నేరస్థుడే అయితే, జగన్‌ రెడ్డిని మించిన నేరస్థుడైతే కాదు కదా? చంద్రబాబును విమర్శించడం వేరు. రాష్ర్టానికి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిని విమర్శించడం వేరు అన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా? ఇలాంటి దిక్కుమాలిన సలహాలు, సూచనలు ఎవరిస్తారో తెలియదు. రాష్ర్టానికి వెయ్యికోట్ల రూపాయల వరకు ఫౌండేషన్‌ తరఫున సహాయం చేస్తున్న బిల్‌ గేట్స్‌ ఎవరి జేబులూ కొట్టడానికి రాలేదు. ప్రజల జేబులు కొడుతున్న వారిని నెత్తిన పెట్టుకొని, సహాయం చేయడానికి వచ్చిన వారిని దూషించడం ఏమిటి? వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలను పక్కన పెడితే, బిల్‌ గేట్స్‌ పక్కన నిలబడటానికి జగన్‌ అండ్‌ కోకు అర్హత ఉంటుందా? గేట్స్‌ పర్యటన సందర్భంగా టీకి, సమోసాలకు, భోజనాలకు ఎంత ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని కోరడం రోతగా ఉంది. ఇలాంటి చెత్త మాటలకు వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పనిగట్టుకొని దళితులను వాడుకోవడం గమనార్హం. బిల్‌ గేట్స్‌ అపాయింట్‌మెంట్‌ కూడా పొందలేని వారు చవకబారు విమర్శలు చేయడం వల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. రాష్ర్టానికి కలిగే ప్రయోజనాలను కూడా చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలుగా పరిగణించడం వల్ల ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చేపడుతున్న ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచ దేశాలలో అమలు చేయవచ్చునని బిల్‌ గేట్స్‌ భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి కూడా విపరీతార్థాలు తీస్తూ నల్లజెండాలు పట్టుకోవడం వారి మనో వికారాలకు అద్దం పడుతోంది. చంద్రబాబును ‘హలో ఫ్రెండ్‌’ అని సంబోధించడం వల్ల బిల్‌ గేట్స్‌పై కొందరిలో అకారణంగా వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా ఉంది. ఇదే జగన్‌ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటా సత్య నాదెళ్లను తయారు చేస్తానని చెప్పుకొన్నారు. బిల్‌ గేట్స్‌ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్‌ లేకపోతే సత్య నాదెళ్ల గురించి జగన్‌ రెడ్డి ప్రస్తావించగలిగేవారా? ఏ అంశాన్ని రాజకీయంగా చూడాలి.. ఏ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విచక్షణ లేకపోవడం శోచనీయం. రాజకీయాలు ఇంత దరిద్రంగా మారడం మహా విషాదం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్‌ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. దురదృష్టవశాత్తు వారి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఈ ఇరువురికీ అభిమానులు ఎలా ఉంటారో వ్యతిరేకులూ అలాగే ఉంటారు. ఇద్దరి మధ్యా నెలకొన్న శత్రుత్వం వారిని అభిమానించే వారినీ ఆవహిస్తోంది. ఫలితంగానే బిల్‌ గేట్స్‌ వంటి వారు కూడా కొందరికి శత్రువులు అవుతున్నారు. విమర్శలు, దూషణలు ఇప్పుడు చంద్రబాబు–జగన్‌రెడ్డికి మాత్రమే పరిమితం కాకుండా వారి మద్దతుదారులకు కూడా వ్యాపిస్తున్నాయి. ఇందుకు సోషల్‌ మీడియా వేదిక అవుతోంది. స్వేచ్ఛ ఉంది కదా అని హద్దులు మీరి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిల్‌ గేట్స్‌ ముడి సరుకు అయ్యారు.


లాజిక్‌ ఏదీ.. ఎక్కడ?

బిల్‌ గేట్స్‌ పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ ఉత్పత్తులను వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు జగన్‌. మూడున్నర దశాబ్దాల క్రితం నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన హెరిటేజ్‌ సంస్థ విలువ ఇప్పుడు నాలుగు వేల కోట్లకు చేరింది. ఇది ఒక్కరోజులో సాధ్యం కాలేదు. 35 ఏళ్ల పాటు ఆ కుటుంబం పడిన శ్రమ అందుకు కారణం. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కావడానికి జగన్‌ రెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించిన నిబంధనలను సడలించడమే ప్రధాన కారణం అన్నది నిర్వివాదాంశం. తాడూ బొంగరం లేని కంపెనీలకు కూడా టెండర్‌ దాఖలు చేసే అవకాశం కల్పించారు. నాణ్యతకు పెద్ద పీట వేయాల్సింది పోయి ధరకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అమెరికా వంటి దేశాల్లో అంచనా వ్యయం కంటే తక్కువకు టెండర్లు వేసే కంపెనీలను పరిగణనలోకి తీసుకోరు. కారణం, నాణ్యత దెబ్బతింటుందని! తిరుమల ప్రసాదం విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించి ఉంటే లడ్డూ ప్రాశస్త్యం దెబ్బతిని ఉండేది కాదు కదా? గతంతో పోల్చితే తిరుమల లడ్డూ నాణ్యత రానురాను తగ్గిపోయింది. ఒకప్పుడు లడ్డూ ఉన్న ప్రాంతం సువాసనలతో నిండిపోయేది. అలా సువాసనలు వెదజల్లకపోవడానికి కారణం, ధరలకు ప్రాధాన్యమిచ్చి నాణ్యత విషయంలో రాజీపడటమే! జగన్‌ రెడ్డి హయాంలో ఈ విషయంలో నిబంధనలను సడలించడం వల్లే భోలే బాబా వంటి సంస్థలు రంగ ప్రవేశం చేయగలిగాయి. ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో తటస్థులుగా, మేధావులుగా చెప్పుకొనే కొంత మంది జగన్‌కు అనుకూలంగా రంగంలోకి దిగారు. అయినా డ్యామేజ్‌ కంట్రోల్‌ కాకపోవడంతో జగన్‌ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థను వివాదంలోకి లాగారు. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్న సంస్థలలో ఒకటైన ఇందాపూర్‌ డెయిరీలో సౌకర్యాలను హెరిటేజ్‌ సంస్థ వాడుకుందని చెబుతూ, హెరిటేజ్‌ ఉత్పత్తులు కూడా నాణ్యమైనవి కావనే అర్థం వచ్చేలా జగన్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఇందాపూర్‌ డెయిరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నదని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆ సంస్థ సమాధానం చెప్పుకొంటుంది గానీ, ఈ సందర్భంగా జగన్‌ రెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలలో లాజిక్‌ లేదు. అంతర్జాతీయంగా పేరొందిన బ్రాండెడ్‌ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల కోసం వివిధ ప్రదేశాలలోని సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. ఉదాహరణకు, పోలో బ్రాండ్‌ దుస్తులను ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లోని టైలర్స్‌ కుడతారు. తమ బ్రాండ్‌కు అనుగుణంగా వస్ర్తాలకు దారాన్ని పోలో కంపెనీయే సరఫరా చేస్తుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నర్సాపూర్‌లోని టైలర్ల సేవలను పోలో కంపెనీ వాడుకుంటోంది. విక్టోరియా సీక్రెట్‌ వంటి మహిళల లోదుస్తుల తయారీ బ్రాండ్‌ కంపెనీ కూడా విశాఖపట్నంలోని అచ్యుతాపురం అపరెల్‌ సిటీలో తమ ఉత్పత్తులను కుట్టిస్తుంది. హెరిటేజ్‌ కూడా ఇదే విధంగా ఇందాపూర్‌ డెయిరీలోని సౌకర్యాలను వాడుకొని ఉండవచ్చు.


..కొన్ని సరదాలు వదులుకోవాల్సిందే!

ఈ విషయం అలా ఉంచితే, విలేఖరుల సమావేశంలో మంత్రి లోకేశ్‌ గురించి జగన్‌ రెడ్డి చెప్పిన ఒక మాట నాకు నచ్చింది. ఏ ఉద్దేశంతో జగన్‌ రెడ్డి మంత్రి లోకేశ్‌ను విమర్శించారో తెలియదు గానీ ఆయన చెప్పిన దాంట్లో పాయింట్‌ ఉంది. ‘క్రికెట్‌ మ్యాచ్‌లను తిలకించడానికి లోకేశ్‌ విదేశాలకు వెళ్లడం ఎందుకు? ఇంట్లో కూర్చొని టీవీలో వీక్షించవచ్చు కదా’ అన్న ఆయన మాటల్లో అర్థం ఉంది. లోకేశ్‌ ఇటీవలి కాలంలో దుబాయ్‌, ముంబై, కొలంబోలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లకు వెళ్లారు. ఇలా వెళ్లడం వల్ల జరిగిన నష్టం కంటే ఎంపీ సానా సతీశ్‌ ఆయన పక్కన ఉండటం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే వ్యక్తిగత సరదాలు, అలవాట్లను వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని అందుకే అంటారు. రాజకీయాలలో ఉన్నవారికి ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునే తీసుకుందాం. ఆయన వ్యక్తిగత సరదాలు, విలాసాలు అన్నింటినీ వదులుకున్నారు. లోకేశ్‌ కూడా రాజకీయాలలో మరింత ప్రజాదరణ చూరగొనాలనుకుంటే తండ్రిని ఎంతో కొంత ఆదర్శంగా తీసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిని బట్టి ప్రజలు మనల్ని అంచనా వేస్తారన్న వాస్తవాన్ని కూడా లోకేశ్‌ గ్రహించాలి. సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ఫొటోలు అన్నింటిలో లోకేశ్‌ పక్కన సానా సతీశ్‌ ఉండటం వల్ల క్రికెట్‌ మ్యాచ్‌ తిలకించడానికి వెళ్లడం కన్నా ఆయన పక్కనే ఉండటం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. రాజకీయాలలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న లోకేశ్‌ ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్త తీసుకుంటే ఆయనకే మంచిది. జగన్‌ రెడ్డి అన్నారని కాదు గానీ, క్రికెట్‌ మ్యాచ్‌ చూడ్డానికి మంత్రిగా ఉండి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చులతో వెళ్లారా? ప్రభుత్వ ఖర్చుతో వెళ్లారా? అని కాదు, చంద్రబాబు తదనంతరం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలనుకుంటున్న వ్యక్తిగా లోకేశ్‌ కొన్ని సరదాలను వదులుకోవాల్సిందే. రాజకీయ ప్రత్యర్థులకు తనను విమర్శించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆయనకే మంచిది. ప్రత్యర్థులకు కాలు అందిస్తే పట్టుకోకుండా ఉంటారా?


కాలమే నిర్ణయిస్తుంది!

ఇక తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’లో ఓట్ల శాతం విషయమై పొరపాటు దొర్లింది. బీఆర్‌ఎస్‌, బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తారుమారు అయింది. ఈ పొరపాటును గుర్తించిన మేం మరుసటిరోజు ఎవరూ కోరకుండానే స్వచ్ఛందంగా సవరణ ప్రచురించాం. ఇలాంటి పొరపాట్లు మీడియాలో అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మానవ తప్పిదాలకు, సాంకేతిక లోపాలకు ఏ మీడియా కూడా అతీతం కాదు. అయితే ఈ పొరపాటును ఆసరాగా చేసుకొని భారత రాష్ట్ర సమితి సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోయింది. బ్రోకర్లు న్యూస్‌ పేపర్లను నడిపితే ఇలాంటి అబద్ధాలనే అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదులుతారు.. అందుకే ‘ఆంధ్రజ్యోతి’ని బీఆర్‌ఎస్‌ దూరం పెట్టిందని ఆ పార్టీ అధికారికంగా ఒక పోస్టు పెట్టింది. లోఫర్ల చేతికి పార్టీ పగ్గాలు వచ్చినప్పుడు ఇలాంటి భాషనే వాడతారు అని మేం కూడా అనవచ్చు కదా? ‘ఆంధ్రజ్యోతి’ని మీరు దూరం పెట్టడం కాదు, తెలంగాణలో 72 శాతం మంది ఓటర్లు మున్సిపల్‌ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని దూరం పెట్టారు. తెలంగాణ మా అడ్డా అని చెప్పుకొనే పార్టీకి ఈ దుస్థితి ఏమిటో తెలుసుకోకుండా మీడియాను దూరం పెట్టామని చెప్పుకోవడం చెరువు మీద అలిగి ఎండబెట్టుకోవడమే అవుతుంది. పొరపాటున జరిగిన ఒక తప్పు విషయమై భారత రాష్ట్ర సమితి ప్రతిస్పందన ఆ పార్టీ అహంకారానికి నిదర్శనం. ఎవరు బ్రోకర్లో.. ఎవరు లోఫర్లో కాలమే నిర్ణయిస్తుంది!

ఆర్కే

3-eddd.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - Feb 22 , 2026 | 03:09 AM