Share News

కవిత్వానికి కొత్త జోళ్లు!

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:33 AM

‘నా పాఠకుడు మూడో తరగతి విద్యార్థి’ అని నిగర్వంగా ప్రకటిస్తారు ఎండ్లూరి సుధాకర్‌. అవును, చిన్న పదాలతో సరళమైన వాక్య నిర్మాణం వారిది. మెత్తని పదాలతో గట్టి భావాన్ని...

కవిత్వానికి కొత్త జోళ్లు!

‘నా పాఠకుడు మూడో తరగతి విద్యార్థి’ అని నిగర్వంగా ప్రకటిస్తారు ఎండ్లూరి సుధాకర్‌. అవును, చిన్న పదాలతో సరళమైన వాక్య నిర్మాణం వారిది. మెత్తని పదాలతో గట్టి భావాన్ని పలికించగల దిట్టకవి. ఆయన కవిత్వంలో తన జాతి పట్ల ప్రేమ ఉంటుంది. సమాజంలో అనాదిగా వేళ్ళునుకున్న అంటరానితనం, అసమానతల పట్ల వేదన ఉంటుంది.

‘కొత్తగబ్బిలం’ కవిత్వ సంపుటిలో ఎండ్లూరి తన ఆలోచనలకు, సంఘటనాత్మక పరిశీలనలకు కవితాత్మక సొబగులద్ది జాషువా గబ్బిలాన్ని కొత్తగా ముస్తాబు చేసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా ప్రయాణం చేయిస్తారు. తెల్లని ట్యూబ్‌లైట్ గదిలోకి నల్లబ్యాడ్జీతో వచ్చిన కుర్ర గబ్బిలాయి కన్నుల్లో కవికోకిల వారసత్వాన్ని పసిగట్టిన ఈ కవి, గబ్బిలాన్ని ప్రేమగా వాటేసుకొని, దాని గొడుగు రెక్కలు సవరించి తన గుండె గోడు వినిపిస్తారు. దాని మదిని మొత్తం దళిత జాతి చైతన్యంతో నింపి ఆకసానికి ఎగరేస్తారు.

ఈ పుస్తకంలో ‘కొత్త గబ్బిలం – కొంత నేపథ్యం’ అని రాసిన తన మాటలో రచనకు దారి తీసిన పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. 1995 సెప్టెంబర్ 28 నుంచి ఆ సంవత్సరం అంతా దేశవ్యాప్తంగా మహాకవి గుర్రం జాషువా శత జయంతులు జరిగాయి. ఆ శతజయంతి సందర్భంగా వినుకొండకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకొని 37 చోట్ల ప్రధాన వక్తగా ఉపన్యసించారు ఎండ్లూరి సుధాకర్. జాషువా పుట్టి పెరిగిన చాట్రగడ్డపాడును, జాషువా తల్లిదండ్రుల బంధువులను, జాషువా ‘నా కథ’లో వర్ణించిన వాతావరణాన్ని చూశారు. జాషువా మునిమనవళ్ళ రూపాలలో జాషువా ప్రతిబింబాన్ని పసిగట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే వారిలో ‘కొత్తగబ్బిలం’ ఆలోచన అంకురించింది. గబ్బిలాన్ని తలుచుకొని మనసులో దీపం ముట్టించారు.

& 94940 84576


1990లో ఉద్యోగం కోసం ఇద్దరు కూతుళ్ళతో హైదరాబాద్‌ను వదిలి రాజమండ్రి వెళ్లారు సుధాకర్. వెళ్లిన కొత్తలో ఇంటి కోసం వెదికేటప్పుడు ‘‘మీరేవుట్లు?’’ అని అడిగేవారట. కులం అన్ని రంగాల్లో మన అస్తిత్వాన్ని నిర్ధారిస్తుందని, దానికి ఎవరూ అతీతులు కారని చెప్తూ ‘కొత్త గబ్బిలం’లో ‘‘నా విన్నవి, నేను కన్నవి, నాకున్నవి కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశాను’’ అంటారు.

‘‘తండ్రీ! ఇది రాజమండ్రి/ కులం కలుగులోంచి బయటకురాని ఎండ్రి/ ఇక్కడి గోదావరి వేదంలా కాదు../ పచ్చి అవకాశవాదంలా/ సలసల కాగిన సీసంలా/ దళితుల చెవుల్లో ప్రవహిస్తుంది./ ఇక్కడ నీళ్లలో రకరకాల జల గుణాలున్నాయి/ ఈ రక్తంలో శతాబ్దాల మను కణాలున్నాయి’’ – ఇంత పదునైన కవిత్వం ఊరికే ఎవరూ రాయలేరు. ఎంతో లోతైన గాయాలు గుండెలో ముల్లులా గుచ్చుకుంటే తప్ప. అవమానాల్ని, అసమానతలని ఎదుర్కొని గాయపడిన నిషేధ మానవుని ఘోష ఇది. అట్టడుగుజాతుల బాధల్ని, గాథల్ని గుర్తించి ప్రశ్నించడంలో కవి సఫలీకృతుడయ్యాడు. పాఠకులదెప్పుడూ రసదృష్టి, కవులది ఎప్పుడూ రససృష్టి అంటారు. ‘కొత్త గబ్బిలం’లో ఎన్నో భాషా విశేషాలు, సంఘటనాత్మక సన్నివేశాలు ఉన్నాయి.

‘‘ఈ దేశం చెప్పును మింగేసింది/ ఈ దేశం డప్పును కోసేసింది/ ఇప్పుడు తిరగబడిన చెప్పులు జండాలై పైకి లేచాయి/ కవిత్వం నా కులవృత్తిలోని/ చర్మ తత్వ రహస్యం/ గబ్బిలమా!/ నీ పాదాలకు నా కవిత్వపు/ కొత్తజోళ్ళు తొడుగుతున్నాను/ ఇవి కన్నీళ్ళతో కుట్టిన నా గుండె జోళ్ళు/ కళంకిత అలంకారాలు’’

– సమాజంలో మనుషులందరూ మనుషులుగానే చూడబడాలని, కుల మత వర్గ లింగ వైషమ్యాలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ పేదవాడి ముఖంలో సంతృప్తి కోసం కలవరించి, పలవరించారు ఎండ్లూరి సుధాకర్. ‘కొత్తగబ్బిలం’లోని ప్రతి వాక్యం బరువుగానే ఉంటుంది. తన ఆగ్రహాన్ని, ఆవేదనను, దగ్ధ దళిత ఆక్రోశాన్ని గుండె లోపల నుంచి ఆవిష్కరిస్తున్నట్లే ఉంటుంది. గౌతముడి జీవన సూత్రాలను, అంబేడ్కర్‌ తాత్వికతను ఆకళింపు చేసుకున్న వైనం ఈ కవిత్వంలో కనబడుతుంది.


‘‘గబ్బిలమా! నా మనోబలమా!/ నువ్వు ఈ దేశ శ్వేతపత్రం మీద నల్లసంతకానివి/ తిరుగు ప్రయాణంలో/ మరొక్కమారు రహస్యంగా/ తథాగతున్ని కలిసిరా../ నా కలల రాజ్యానికి కొత్త సూత్రం చెబుతాడేమో/ అక్కడికి సమీపంలోనే/ రాజ్యాంగ పిత అంబేద్కర్/ నిలువెత్తు/ నమ్మకంలా నిలుచుంటాడు.’’

1959 జనవరి 21వ తేదీన నిజామాబాద్ జిల్లా పాములబస్తీలో జన్మించారు ఎండ్లూరి. హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్యనభ్యసించి ఎంఏ, ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీలోనూ, పీహెచ్డీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ అభ్యసించారు. 1990 అక్టోబర్ 6 నుంచి రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం ప్రాంగణంలో అసోసియేట్ ప్రొఫెసర్ గాను, పీఠాధిపతిగాను బాధ్యతలు నిర్వహించారు. 2018 నుంచి చివరి వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా కొనసాగారు. ఆయన రచనలు ‘వర్తమానం’ (కవితా సంపుటి), జాషువా ‘నా కథ’ మీద ఎంఫిల్‌ పరిశోధన, ‘జాషువా సాహిత్యం–దృక్పథం–పరిణామం’పై పీహెచ్‌డీ, ‘కొత్త గబ్బిలం’ (దీర్ఘకావ్యం), ‘మల్లెమొగ్గల గొడుగు’ (మాదిగల ఆత్మకథలు), ‘నల్ల ద్రాక్ష పందిరి’, ‘వర్గీకరణీయం’, ‘ఆటా జనికాంచె’ (అమెరికా యాత్ర కవితలు) మొదలైనవి.

‘‘ఆగ్రహం రాని అక్షరం జ్వలించదని/ ఆర్ద్రత లేని వాక్యం ఫలించదని/ నా అనుభవం నేర్పిన కవిత్వ పాఠం/ నాలుగు మెతుకులే నా అక్షరాలు/ నాలుగు మనుషులే నేను చదివిన ప్రబంధాలు/ నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు/ ఆకలి రసం నాలోని రచనా రహస్యం/ అవమాన విషం/ నా కంఠంలోని నీలామృత విశేషం/ మా బీద బస్తీలే నన్ను కవిని చేశాయి/ నాలోని భావుత్వానికీ/ బాధల తత్వానికీ బీటలు వేశాయి/ మా వీధి కుక్కలు జీవితాన్నీ జీవించడాన్నీ నేర్పాయి.’’


2022 జనవరి 28వ తేదీన– ఎవరో పిలిచినట్లు, ఇంకేదో పని ఉన్నట్లు, రాస్తూ రాస్తూనే పెన్ను, కాగితాలు పక్కనపెట్టి హడావిడిగా వెళ్లిపోయారు సుధాకర్. ఒక జ్వలన కవితాశిఖరం అర్ధాంతరంగా నేలకొరిగింది. ఆయన సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి. దయ, కరుణ, ప్రేమ, ఆత్మీయత మెండుగా కలిగిన నిండైన వ్యక్తి. భాష, సాహితీ పరిజ్ఞానం, గంభీరమైన కంఠస్వరం కలిగిన గొప్ప వక్త. అక్షరంతో అనేకమంది ఆత్మీయులని సంపాదించుకున్న ఈ సుకవి ప్రజల నాలుకలపై చిరకాలం సజీవంగా ఉంటారు!

(జనవరి 28 ఎండ్లూరి సుధాకర్ వర్ధంతి)

గంగవరపు సునీత

ఇవి కూడా చదవండి..

శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు

మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Jan 26 , 2026 | 05:33 AM