ఈ ‘అబద్ధాల ప్రవాహం’ ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:37 AM
‘ఆంధ్రజ్యోతి’లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య (12.08.2026న) ‘వరి వృద్ధికి కారణం కాళేశ్వరం కాదు’ అనే శీర్షికన రాసిన ఒక వ్యాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...
‘ఆంధ్రజ్యోతి’లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య (12.08.2026న) ‘వరి వృద్ధికి కారణం కాళేశ్వరం కాదు’ అనే శీర్షికన రాసిన ఒక వ్యాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేస్తూ.. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంట పండిందని, దానికి కారణం రైతు రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంటు, పెరిగిన నీటి లభ్యతే కారణమని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు.
వాస్తవం ఏమిటంటే.. 2014కు ముందున్న వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి, ఆయా రంగాలలో మౌలిక సదుపాయాలను కల్పించింది. రైతులను ఆదుకునేందుకు పలు రైతు సంక్షేమ పథకాలను అమలు చేసింది.
రాష్ట్రంలో బోరు బావుల కింద వ్యవసాయం పెరగడానికి ప్రాథమికమైన అవసరాలు రెండు. 1. నాణ్యమైన కరెంటు సరఫరా, 2. భూగర్భ జలాల లభ్యత. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలుపరచిన మొదటి flagship ప్రోగ్రాం– మిషన్ కాకతీయ. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసం అయిపోయిన చెరువుల పునరుద్ధరణ కోసం సర్కారు ఈ పథకాన్ని చేపట్టింది. దీని ద్వారా నాలుగు దశల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 28 వేల చెరువులను, కుంటలను పునరుద్ధరించింది.
రెండో దశలో ఈ చెరువులన్నింటినీ మేజర్, మీడియం ప్రాజెక్టులతో అనుసంధానించాలని సంకల్పించింది. దీని కోసం కాలువల మీద సుమారు 3 వేల కొత్త తూములను నిర్మించింది. ఈ ప్రోగ్రాం ద్వారా మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద సుమారు 20 వేల చెరువులు అనుసంధానం అయ్యాయి. ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగా మత్తడి దుంకిన దృశ్యాలను రాష్ట్ర ప్రజలు చూసి ఉన్నారు.
మూడో దశలో వాగుల పునరుజ్జీవన పథకం కింద రాష్ట్రంలో ఉప నదులు, ప్రధాన వాగులపై 1500 చెక్ డ్యాంలను నిర్మించింది. ఈ చర్యలు రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 5 మీటర్లు పైకి రావడానికి దోహదం చేశాయని భూగర్భ జలశాఖ తన అధ్యయనంలో నిర్ధారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నిర్మించిన భారీ జలాశయాలు కూడా ఆ చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాల లభ్యతకు దోహదం చేశాయి.
‘గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోయండి’ అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టులను నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలను జలయజ్ఞంలో ప్రారంభించి పూర్తి చేయకుండా వదిలేస్తే, వాటిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి, పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దేవాదులలో ప్రస్తుతం తొమ్మిది పంపులు నడుపుతున్నామని ప్రస్తుత పాలకులు గొప్పలకు పోతున్నారు. అందుకు కారణమైన దేవాదుల మూడో దశ పంపింగ్ వ్యవస్థను పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? సీతారామా ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ను, పంపింగ్ వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తేనే కదా ఈ రోజు నాగార్జునసాగర్ కాలువకు నీరు ఇవ్వగలుగుతున్నారు.
ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసేవి కాళేశ్వరం నీళ్లు కావని ఇంకా రేవంత్‌రెడ్డి, అతని తాబేదారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో విడదీయలేని కాంపోనెంట్స్. ఎవరు కాదన్నా ఇదే నిజం. కేంద్ర జల సంఘం వారు ఆమోదించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతిలో ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే 20 టీఎంసీల నీళ్లను కూడా లెక్కలోకి తీసుకున్న సంగతి వీరికి ఎవరు చెప్పాలి? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, అక్కడి నుంచి పైన ఉన్న అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, మల్కపేట, బస్వాపూర్ జలాశయాలకు నీరు పారుతున్నది కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన పంపింగ్ వ్యవస్థ నుంచి కాదా? కాళేశ్వరం Multi Sources కలిగి ఉన్న ప్రాజెక్టు అన్న సంగతి తెలియకపోవడం వీరి అజ్ఞానానికి సూచిక.
శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు సాగునీరు సరఫరా మొదలయ్యింది కాళేశ్వరం ప్రారంభం అయిన తర్వాతనే అన్నది అబద్ధమా? కాళేశ్వరం కట్టిన తర్వాతనే నిజాంసాగర్ మొత్తం ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం అయ్యిందనేది అబద్ధమా? కాళేశ్వరంలో నిర్మించిన మూడు వరుస బ్యారేజీల వలన 150 కిలోమీటర్ల పొడవున గోదావరి నది సజీవం అయినది అబద్ధమా? ఆ సజీవ నది సాధించిన ప్రయోజనాలు వారి ఆలోచనలకు అందనివి.
‘చరిత్రను ఎంత దాచిపెట్టినా దాగదు’ అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రైతాంగానికి అన్నీ తెలుసు. వారిని ఇక ఎంతమాత్రం ఇటువంటి వ్యాసాలతో, రీట్వీట్లతో మభ్యపుచ్చలేరు. హామీలు ఇచ్చి అమలు మరిచిన రుణమాఫీ బండారాన్ని, రైతు భరోసా మోసాన్ని, 24 గంటల కరెంటు సరఫరా బూటకాన్ని, రైతు బీమా అబద్ధాన్ని తెలంగాణా రైతాంగం అర్థం చేసుకున్నది. సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు.
చరిత్రను మరుగునపెట్టి అబద్ధాలను ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేసినట్లు... మన ఏడు ప్రాజెక్టులకు శరాఘాతం చేసేలా ఏపీ ప్రతిపాదించిన అంశాలను జీఆర్‌ఎంబీ ఎజెండా నుంచి రద్దు చేసేలా పోరాటం చేయండి. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జీఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం దండుగా కదులుతాం!
ఎర్రోళ్ల శ్రీనివాస్
బీఆర్ఎస్ నేత
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..