కాలమే వసంతాలను వాగ్దానం చేస్తుంది
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:25 AM
కాలమే వసంతాలను వాగ్దానం చేస్తుంది సూర్యోదయం.. ఓ ప్రాకృతిక ప్రసవ వేదన సూర్యాస్తమయం.. రేపటి ఉదయానికై పరితపించే శోధన...
కాలమే వసంతాలను వాగ్దానం చేస్తుంది
సూర్యోదయం..
ఓ ప్రాకృతిక ప్రసవ వేదన
సూర్యాస్తమయం..
రేపటి ఉదయానికై పరితపించే శోధన
ఉదయాస్తమయాల లీలలు
జ్వలనాజ్వలన దగ్ధకేళీ కీలలు
కాలగతుల కల్లోల చలనాలన్నీ
కార్యకారక సంబంధ బింబ ప్రతిబింబాలు
చీకటికి చిందులాటల తొందరెక్కువ
వెలుగును మింగానని తెగ రంకెలేస్తుంటది
నిశాంత సంకేత స్థలి సాక్షిగా
తిమిరం కడుపుని చీల్చిన కిరణాల కథను
ఎప్పటికప్పుడు వర్తమానం
కొత్తగా చెబుతుంది
ఆకురాలు కాలం అశాశ్వతమే
కాలమే వసంతాలను వాగ్దానం చేస్తుంది
కొంత నీరు.. కొంత నిప్పు తోడవ్వాలి
రాయి రాయి రాసుకునే రాపిడిలోని
నిప్పును కప్పి ఉంచిన ప్రకృతే
రాలిపడిన గింజల్లో రాతిగోడల్ని
చీల్చుకొని మొలకెత్తే
జీవ లక్షణాన్ని దాచి ఉంచింది
నదికి నడవడమొక్కటే తెలుసు
నేరుగానో.. లేదంటే
అడ్డంకులను అధిగమిస్తూ అటూఇటుగానో
ఎంత పరుగులెత్తే నదైనా
అనివార్యతల ఆనకట్టలు ఎదురైనప్పుడు
గతిని శృతి చేసుకోవాలి
గమనానంతర గాయాలకు విశ్రాంతినివ్వాలి
వరద భీకర రొదై ఎదురెక్కినప్పుడు
బంధించిన తలుపులు
బార్లా తెరుచుకుంటాయి
రువ్వడి రువ్వడిగా పరవళ్ళు తొక్కిన నది
బీడు భూములను
బీజ భూములుగా మార్చుతుంది
అలలు ఎగిసిపడలేక అలసిపోతుంటే
కలలుకనే కనులు కలత నిదురలో జోగుతుంటే
నవవసంతాలు నయాగరా జలపాతాలై
తుళ్ళి పడుతుంటే
రుతువులన్నీ ఘనీభవించిన స్మృతులవుతుంటే
లిప్తపాటు సమయం
సంయమన రాగమాలాపించాలి
గాయపడి నెత్తురోడిన కాలం
వేల బాహువులతో వేడుకోలు పలికే
ఏడవ రుతువు కోసం ఎదురు చూడాలి
గాజోజు నాగభూషణం
98854 62052
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు
మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి