సాక్ష్యంగా నిలవడం కూడా ఒక ప్రతిఘటనే!
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:12 AM
భారతీయ సమకాలీన సాహిత్యంలో కె. సచ్చిదానందన్ ఒక విశిష్ట స్వరం. ఆయన మలయాళం, ఇంగ్లీషు భాషల్లో రాస్తారు. కవి, విమర్శకుడు, అనువాదకుడు, నాటకకర్త. ముప్పైకి పైగా కవితా సంపుటాలను వెలువరించారు...
భారతీయ సమకాలీన సాహిత్యంలో కె. సచ్చిదానందన్ ఒక విశిష్ట స్వరం. ఆయన మలయాళం, ఇంగ్లీషు భాషల్లో రాస్తారు. కవి, విమర్శకుడు, అనువాదకుడు, నాటకకర్త. ముప్పైకి పైగా కవితా సంపుటాలను వెలువరించారు. ప్రజాస్వామ్యం, మానవ స్వేచ్ఛ, ప్రకృతి, సాంస్కృతిక వైవిధ్యం వంటి అంశాలు ఆయన కవిత్వంలో నిరంతరం ప్రతిధ్వనిస్తాయి. ఈ ఇంటర్వ్యూలో సచ్చిదానందన్ యుద్ధాలు, కృత్రిమ మేధస్సు, పర్యావరణ సంక్షోభం, క్షీణిస్తున్న ప్రజాస్వామిక విలువల మధ్య కవిత్వం పాత్రను లోతుగా విశ్లేషించారు. సాంకేతికత ప్రపంచాన్ని ఎంతగా మార్చినా, మనిషిలోని కరుణను, జ్ఞాపకాన్ని, ఊహాశక్తిని, సత్యాన్వేషణను సజీవంగా ఉంచేది కవిత్వమేనని హృద్యంగా చెప్పారు. సినారె విశ్వంభర పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనతో ఈ ప్రత్యేక ముఖాముఖి.
మీరు తరచుగా కవిత్వాన్ని ‘స్వరం లేనివారికి స్వరం ఇవ్వడం’గా నిర్వచిస్తారు. ప్రచార యంత్రాంగం, తప్పుడు సమాచారం, కోలాహలంతో నిండిన ఈ కాలంలో కవిత్వం ఇంకా సత్యాన్ని కాపాడగలదా?
మన కాలంలో కవిత్వం నిర్వర్తించాల్సిన ప్రధాన బాధ్యతల్లో ఒకటి వినిపించని స్వరాలను వినిపించడం, కనిపించని వాస్తవాలను కనిపించేలా చేయడం. అణగారినవారికి స్వరమవడం ద్వారా కవిత్వం ప్రజాస్వామ్యాన్ని మరింత సజీవంగా చేస్తుంది. నిజమే, కవిత్వం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. రాజకీయ, ఆర్థిక, వ్యవస్థాగత మార్పులు కూడా అవసరం. అయినప్పటికీ అబద్ధాల కోలాహలం, మీడియా విక్రయించే అర్ధసత్యాలు, ప్రయోజనాల కోసం సృష్టించబడే అసత్యాల మధ్య సత్యాన్ని నిలబెట్టే నైతిక శక్తిగా కవిత్వం మరింత అవసరమవుతోంది. అది కేవలం సత్యాన్ని చెప్పడమే కాదు, అసత్యాన్ని బహిర్గతం చేయాలి.
ఇప్పటికీ ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేసే శక్తి కవిత్వానికి ఉందా?
కవిత్వం ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదని నమ్మను. అలా అయితే శతాబ్దాలుగా న్యాయం కోసం స్వరం వినిపించిన కవుల కారణంగా ప్రపంచం ఇప్పటికే మారిపోయి ఉండేది. కానీ కవిత్వం మనుషులను మారుస్తుంది. అది ఇతరుల బాధలను అర్థం చేసుకునే సున్నితత్వాన్ని పెంచుతుంది. సత్యం పట్ల దాహాన్ని, న్యాయబద్ధమైన ప్రపంచం పట్ల ఆకాంక్షను మనసుల్లో నాటుతుంది. ఈ సున్నితత్వం మనుషులకే పరిమితం కాదు. చెట్లు, పక్షులు, జంతువులు, నదులు, కొండలు, ప్రకృతి ప్రపంచం మొత్తంపట్ల మన అనుబంధాన్ని మరింత గాఢం చేస్తుంది.
యుద్ధకాలంలో రాజకీయ ప్రసంగాలు, దౌత్య చర్చలు చేయలేని పనిని కవిత్వం ఏమి చేయగలదు? హింస, జాతీయవాదం, ద్వేషానికి వ్యతిరేకంగా అది ప్రతిఘటనగా మారగలదా?
సాక్ష్యంగా నిలవడం కూడా ఒక ప్రతిఘటనే! కవి తాను చూసిన సత్యాన్ని నిజాయితీగా చెప్పినప్పుడు అది అసత్యానికి వ్యతిరేకంగా నిలిచే శక్తిగా మారుతుంది. కులం, మతం, జాతి, వర్గం, లింగం, జాతీయత పేరుతో ఏర్పడే అన్ని రకాల ఆధిపత్యాలను కవిత్వం ప్రశ్నిస్తుంది. కవిత్వం సత్యం పక్షాన, న్యాయం పక్షాన, మానవ గౌరవం పక్షాన నిలిచే ఒక సృజనాత్మక ప్రతిఘటన. అది చరిత్రను నమోదు చేయడమే కాదు, చరిత్రలోని అన్యాయాలను ప్రశ్నించే ధైర్యవంతమైన స్వరంగా కూడా నిలుస్తుంది.
నేడు యుద్ధాలు ప్రత్యక్షం అనుభవంగా కంటే తెరల ద్వారా, అల్గారిథమ్ ద్వారా ఎక్కువగా తెలుస్తున్నాయి. అలాంటి సమయంలో కవులు ఎలా స్పందించాలి?
కవులు ఆయుధాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కానీ ‘కవిత్వం’ మనుషుల్లో, వారి మనసుల్లో యుద్ధం పట్ల వ్యతిరేకతను పెంచగలదు. గాజాపై ప్రపంచవ్యాప్తంగా రాయబడిన కవితలను చూడండి. వాటిలో ఆగ్రహం ఉంది, కరుణ ఉంది, ముఖ్యంగా అమాయక చిన్నారుల పట్ల ప్రేమ, బాధ ఉన్నాయి. ఇలాంటి కవితలు గణాంకాల వెనుక దాగి ఉన్న మనుషులను మన ముందుకు తీసుకొస్తాయి. అవి పాఠకుల హృదయాలను కరిగిస్తాయి, అణచివేతపై ఆగ్రహాన్ని రగిలిస్తాయి, బాధితుల పట్ల సంఘీభావాన్ని పెంచుతాయి. అల్గారిథమ్‌లు సంఖ్యలను చూపిస్తే, కవిత్వం ఆ సంఖ్యల వెనుక జీవితాలను చూపిస్తుంది.
కృత్రిమ మేధస్సు (AI)ను మీరు సాహిత్యానికి ముప్పుగా చూస్తారా?
ఒకవేళ కృత్రిమ మేధస్సు నిజమైన ఊహాశక్తిని, స్వతంత్ర సృజనాత్మకతను పొందితే అది మానవ సృజనకు సవాలుగా మారవచ్చు. కానీ మానవ సృజన అనేది అనుభవం, జ్ఞాపకం, ఊహ, భాషల సమ్మేళనం. యంత్రాలు సమాచారాన్ని విశ్లేషించగలవు, భాషను అనుకరించగలవు. కానీ ప్రేమలో పడవు, బాధను అనుభవించవు, విశ్వం ముందు ఆశ్చర్యపోవు.
యంత్రాలు భాషను సంపూర్ణంగా అనుకరించగలిగినా, శాశ్వతంగా కవితాత్మకంగా మిగిలేది ఏమిటి?
ఈ పదాన్ని వాడేందుకు అనుమతిస్తే, దానిని నేను ‘ఆత్మ’ అని పిలుస్తాను. మనలోని అత్యంత లోతైన స్థాయిలో ఉండే, పూర్తిగా వ్యక్తం చేయలేని ఒక అంతరంగ సత్యం అది. అదే మనల్ని ఈ విశ్వంతో, సమస్త జీవంతో ముడిపెట్టే అదృశ్య అనుబంధం.
అనేక భాషల కవిత్వాన్ని అనువదించారు. అనువాద రచన గురించి చెప్పండి?
భాషలు వేరైనా, మానవ అనుభవాల గుండెకాయ ఒకటేనని అనువాదం నాకు నేర్పింది. ప్రేమ, దుఃఖం, ఆనందం, కోపం, వియోగం, సంఘర్షణ ఇవి ప్రతి సంస్కృతిలో వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతాయి. కానీ వాటి మూలభావం ఒక్కటే. అందుకే నేను కవిత్వాన్ని ‘‘మానవజాతి పంచుకునే ఉమ్మడి భాష’’గా భావిస్తాను.
కవిత ఒక భాష నుంచి మరొక భాషలోకి ప్రయాణించినప్పుడు ఏమి కోల్పోతుంది? ఏమి పొందుతుంది?
అనువాదం ఒక పునర్జన్మ. మూల కవిత కొన్ని ధ్వనులను, లయలను, సాంస్కృతిక సూచనలను కోల్పోవచ్చు. కానీ అదే సమయంలో మరో భాష స్వరాన్ని, నాదాన్ని, భావ సంపదను పొందుతుంది. అందువల్ల అనువాదం కేవలం పదాల మార్పు కాదు. అది ఒక సృజనాత్మక పునర్నిర్మాణం.
ప్రపంచీకరణ యుగంలో స్థానిక భాషలు పరిస్థితి?
ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు అంతరించిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో చివరి వ్యక్తి మరణించగానే ఆ భాష కూడా అంతరించిపోయింది. అయినప్పటికీ భారతదేశ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి భాషా వైవిధ్యం అపారం. భాషలు కేవలం సంభాషణ సాధనాలు కావు; అవి జ్ఞాపకాలు, సంస్కృతి, ఆత్మగౌరవం, చరిత్రల నిలయాలు. అందుకే అవి ప్రతిఘటనకు, పునరుజ్జీవనానికి కేంద్రాలుగా మారగలవు.
ప్రకృతి మీ కవిత్వంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది. నేటి పర్యావరణ సంక్షోభాన్ని మీరు ఎలా చూస్తారు?
భూతాపం, ధ్రువ ప్రాంతాల మంచు కరుగుదల, సముద్ర మట్టాల పెరుగుదల, అడవుల విధ్వంసం ఇవన్నీ మనుషుల స్వార్థం, మానవ అత్యాశ ఫలితాలు. మనిషి ప్రకృతికి యజమాని కాదు. ప్రకృతిలోని అనేక జీవరాశుల్లో ఒక భాగం మాత్రమే. ప్రకృతితో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించడంలో కవిత్వానికి ప్రత్యేక పాత్ర ఉంది. విశ్వం అనే మహారహస్యం పట్ల ఆశ్చర్యాన్ని నిలబెట్టడం కూడా కవిత్వం చేసే పని.
మున్ముందు కవిత్వం మరింత అంతర్జాతీయమవుతుందా? లేక స్థానికతలోనే మూలాల్ని పెంచుకుంటుందా?
ఈ రెండూ పరస్పర విరుద్ధాలు కావు. ఒక స్థానిక అనుభవం గొప్ప కవిత్వంలో విశ్వమానవీయ అనుభవంగా మారుతుంది. స్థానికతను అధిగమించి విశ్వవ్యాప్త మానవ పరిమాణాన్ని సంతరించుకోవడమే కవిత్వం ప్రత్యేకత.
కవిత్వం మీకు ఏమి నేర్పింది? యువ కవులకు మీ సందేశం ఏమిటి?
కవిత్వం నాకు అనేక రకాల సంభాషణలను నేర్పింది. ఆ సంభాషణ తనతో తానే కాకుండా, ఇతరులతో, ప్రకృతితో, విశ్వంతో కలిసే, మాట్లాడే అర్హతను అవకాశాన్ని ఇచ్చింది. ఇవే మనిషిగా ఉండటానికి అవసరమైన మార్గాలు.
యువ కవులకు నా సందేశం ఒక్కటే: సృజనాత్మకతకు సరిహద్దులు లేవు. అది ప్రతి సంక్షోభాన్ని అధిగమించి నిలిచి ఉంటుంది.
ఇంటర్వ్యూ : వి ప్రదీప్
94405 01281
ఇవి కూడా చదవండి:
దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్
ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన