అహంకార పాలనకు సమాధి కట్టిన రోజు!
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:53 AM
ఐదేళ్ల పాటు అహంకారం తలకెక్కి, చట్టాలను చుట్టాలుగా మార్చుకుని, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాలకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో నిరూపించిన చరిత్రాత్మక రోజు 2024 జూన్ 4...
ఐదేళ్ల పాటు అహంకారం తలకెక్కి, చట్టాలను చుట్టాలుగా మార్చుకుని, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాలకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో నిరూపించిన చరిత్రాత్మక రోజు 2024 జూన్ 4.
2019 ఎన్నికల్లో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు 2024లో తమ తీర్పును తిరగరాశారు. ఎలాంటి వారు ముఖ్యమంత్రి కాకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం ప్రజలనే శత్రువులుగా చూడడాన్ని, అభివృద్ధి చేయాల్సిన పాలకులు విధ్వంసాన్ని ఎంచుకోవడాన్ని, సంక్షేమం పేరుతో అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టడాన్ని జనం గ్రహించారు. అందువల్లే అభివృద్ధి రాజకీయాలకు నాంది పలికారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళాభివృద్ధి వంటి అంశాలపై ప్రజలు కొత్త ప్రభుత్వానికి బాధ్యతలను అప్పగించారు. ఓటర్లు సృష్టించిన ఈ నిశ్శబ్ద విప్లవంలో చంద్రబాబు చెప్పినట్లు ప్రజలు గెలిచారు, రాష్ట్రం నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో జగన్‌పై నమ్మకం పెట్టుకుని ఆయన పార్టీకి 151 సీట్లు ఇచ్చారు, ఐదేళ్ల ఆయన పాలనలో ఆ నమ్మకాన్ని కోల్పోయి, అదే ప్రజలు 2024లో 164 స్థానాలను తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్‌ను పరిమితం చేశారు. ఇంత జరిగినా ఓటమికి కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ప్రజలే వెన్నుపోటు పొడిచారని జగన్ ప్రచారం చేస్తూ ప్రజల తీర్పును అపహాస్యం చేయడం దురదృష్టకరం. అంతేకాకుండా రెండేళ్లుగా ప్రజల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టకుండా, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు మాత్రం పెట్టి వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వెన్నుపోటు అంటూ జగన్నాటకాలు ఆడుతున్నారు.
అధ్వాన ఆర్థిక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం సృష్టిం చారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్న కంపెనీలను తరిమేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అభివృద్ధి నిలిపివేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. పోలవరం ప్రాజెక్టును సమస్యల్లోకి నెట్టి, పనులు సాగకుండా చేశారు. మూడు రాజధానుల ముసుగులో ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. సంక్షేమం పేరుతో సంకెళ్లు వేశారు. ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి, మరో చేత్తో వంద రూపాయలు లాక్కునే బటన్ నొక్కుడు నాటకాలకు పాల్పడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా, యువతకు ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేశారు.
గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, సంస్కృతి, హింస, రక్తపాతం, ఆటవిక ప్రవృత్తి, పగలు ప్రతీకారాలు ప్రతి ప్రాంతానికీ విస్తరించాయి. ప్రశాంతతకు నెలవైన పచ్చని సీమలు సైతం భగ్గున మండాయి. విషపూరితమైన జె బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని ఆస్పత్రులపాలు చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టిన జగన్ ముఠాను రాష్ట్ర ప్రజలు అథఃపాతాళానికి తొక్కారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. యువత, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యావంతులు, వ్యాపారులు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అవినీతి, అసమర్థ పాలనకు చరమగీతం పాడారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలలో ఒకే విధమైన విజయాన్ని కూటమి సాధించింది. చీకట్లు కమ్మిన సీమాంధ్రలో వెలుగులు నింపేది చంద్రబాబు నాయుడేనని, కష్టాల సుడిగుండం నుంచి తమను ఒడ్డుకు చేర్చే బాధ్యతను కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టిన ఆంధ్రా ఓటర్ల విజ్ఞత అభినందనీయమైనది.
నీరుకొండ ప్రసాద్
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే