Share News

తెలంగాణ హృదయంలో ఓ మౌన గానం!

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:13 AM

హైదరాబాద్‌ పాత గల్లీల్లో బిర బిరా నడిచే అడుగుల సడుల కంటే, బిగ్గరగా అరిచే మాటల కంటే మౌనాలే ఎక్కువగా వినిపిస్తాయి! ఆ మౌనాల మధ్య ఒక కిటికీ నెమ్మదిగా తెరుచుకుంటుంది. అది బయట ప్రపంచాన్ని...

తెలంగాణ హృదయంలో ఓ మౌన గానం!

హైదరాబాద్‌ పాత గల్లీల్లో బిర బిరా నడిచే అడుగుల సడుల కంటే, బిగ్గరగా అరిచే మాటల కంటే మౌనాలే ఎక్కువగా వినిపిస్తాయి! ఆ మౌనాల మధ్య ఒక కిటికీ నెమ్మదిగా తెరుచుకుంటుంది. అది బయట ప్రపంచాన్ని చూడటానికి కాదు, లోపల బంధించబడిన ఒక స్త్రీ మనసును మనకు చూపించటానికి. ఆ కిటికీ పేరు జిలానీ బానో.

ఉర్దూ సాహిత్యంలో జిలానీ బానో ఒక శకాన్ని సృష్టించారు. హైదరాబాద్ నగర చారిత్రక, సాంస్కృతిక మూలాల నుంచి మొలకెత్తిన ఆమె రచనలు– స్త్రీ జీవితం, దేశ విభజన కలిగించిన వేదన, మధ్యతరగతి సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. ఆమె కేవలం నవలలు, కథలు మాత్రమే రాయలేదు, జీవితాన్ని కాగితంపై చిత్రించారు. ఆమె సృష్టించిన ప్రతి పాత్ర, ప్రతి దృశ్యం, ప్రతి సంభాషణ అన్నీ వాస్తవంగా జరిగినట్టు అనిపించే సహజత్వం తన రచనల ప్రత్యేకత. అదే ఆమెను ఉర్దూ సాహిత్యంలో సజీవంగా నిలబెట్టింది.

20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో భారత ఉర్దూ కథా సాహిత్యానికి కొత్త దిశను చూపిన రచయిత్రులలో జిలానీ బానో ప్రముఖులు. ఆమె అసలు పేరు జైనత్ సాజిదా. జిలానీ బానో 1936 జూలై 14న ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్‌లో జన్మించారు. బానో తండ్రి హైరత్ బదాయూని ప్రసిద్ధ ఉర్దూ కవి. దక్కన్ సంస్కృతి, నిజాం కాలపు హైదరాబాద్ వాతావరణం ఆమె మనసులో లోతైన ముద్ర వేసింది. ఈ వాతావరణమే రచనలలో పదే పదే ప్రతిధ్వనించింది. చిన్నప్పటి నుంచే సాహిత్యం పట్ల ఎంతో మక్కువ కలిగిన జిలానీ బానోకు ఉర్దూ కవిత్వం, కథలంటే ఎంతో ఇష్టం. తండ్రి ద్వారా ఉర్దూ సాహిత్యంతో ఆమెకు పరిచయమేర్పడింది. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన బానో ఉర్దూ భాషలో ఉన్నత విద్య అభ్యసించారు. 1950 దశకంలో సాహిత్య రచన ప్రారంభించారు. మొదట కవితలు, తర్వాత కథలు రాశారు. అప్పటి ఉర్దూ సాహిత్య సంస్కరణ ఉద్యమాల ప్రభావం బానో రచనలపై కనిపిస్తుంది. ప్రగతిశీల రచయితల సంఘంతో సాన్నిహిత్యం ఆమె రచనా విధానాన్ని ప్రభావితం చేసింది. ప్రముఖ రచయితలైన సాదత్ హసన్ మంటో, ఇస్మత్ చుగ్తాయి తదితరుల రచనలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.


బానో తన సాహిత్య ప్రయాణంలో అనేక విశిష్ట నవలలు, కథా సంకలనాలు, వ్యాసాలు రాశారు. ఆమె రచనలు ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, తెలుగు సహా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. జిలానీ బానో సాహితీ యాత్రలో ‘ఐవాన్–ఎ–గజల్’ ప్రత్యేకమైనది. ఈ రచన ఉత్తమ నవలగా ఎంపికై ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది. ‘పాత హవేలీల గోడలు పగిలిపోతున్నప్పుడు వాటితో పాటు కూలిపోయింది ఒక ఆధిపత్య సంస్కృతి. కానీ ఆ గోడల మధ్య ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉన్నది ఒక జ్ఞాపకం!’ ఆ జ్ఞాపకాలనే ఆమె తన నవల ఐవాన్–ఎ–గజల్‌లో సంగీతంలా పలికించింది. ఇది కేవలం ఒక కుటుంబ గాథ కాదు, తెలంగాణలో మార్పుల గాథ. సామంతపు నీడలు పొడవుగా పడినప్పుడు మధ్యతరగతి ఆశలు ఎలా మొలిచాయో ఆమె నవల చెబుతుంది. ఇక ‘బేగమాత్ కే ఆంసూ’ రచన స్త్రీల అంతర్యాత్రను, పురుషాధిక్య సమాజంలో వారి నిస్సహాయతను పరిశీలించే నవల. ‘ఇస్ బస్తీ కే లోగ్’ హైదరాబాద్ పాతనగర మురికివాడల జీవితాన్ని చిత్రించిన నవల. ఇక జిలానీ బానో కథా సంకలనాల విషయానికి వస్తే... పత్తర్ కీ ఆవాజ్, దర్ద్ కే ఫూల్, రాత్ కే బాద్, మీరాఠ్ ఏ ఖయాల్, కహానియాన్ ముఖ్యమయినవి. వీటితో పాటు బానో అనేక వ్యాసాలు రాశారు. ఆమె కథల్లో స్త్రీలు మౌనంగా ఉండరు, వాళ్లు ప్రశ్నిస్తారు.. అది కూడా మౌనంగా! పరదా ఒక గుడారం కాదు, ఒక గోడ కాదు, ఒక అద్దం. ఆ అద్దంలో వాళ్లు తమను తాము చూసుకుంటారు. వారి కళ్లలో ఒక చిన్న వెలుగు ఉంటుంది. అది తిరుగుబాటు కాదు, కానీ తలవంచని ఆత్మగౌరవం.

తెలంగాణ గ్రామాల్లో భూమి కోసం పోరాడిన మహిళలను, హైదరాబాద్‌ పాతబస్తీలో గౌరవం కోసం పోరాడిన వనితలను జిలానీ బానో తన కథల ద్వారా మనకు పరిచయం చేస్తారు. ఆమెకు సాహిత్య అకాడమి అవార్డుతో పాటు సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, పద్మశ్రీ పురస్కారం లభించాయి. ఆమె రాసిన ‘నర్సయ్యా కీ బావ్డీ’ కథను ఆధారం చేసుకుని శ్యాం బెనెగల్ ‘వెల్డన్ అబ్బా’ సినిమా తీశారు.


నాటి హైదరాబాద్‌ నగరంలోని అణచబడిన స్త్రీల హృదయపు నిశ్శబ్ద గుండె చప్పుడును తన రచనల్లో జిలానీ బానో చిత్రించారు. ఆమె రచనల్లో సంస్కృతుల మధ్య వెలిసిన గోడలు, స్త్రీ పురుషుల నడుమ అన్యాయం చూస్తాం. కానీ అదే వెలుగులో మనం ‘మార్పు అనివార్యం’ అని కూడా చూస్తాం. జిలానీ బానో దృష్టిలో అస్తిత్వం అంటే ఒక స్త్రీ తన కథను చెప్పగలిగే హక్కు. ఒక నగరం తన గాయాలను దాచుకోకుండా చూపించగలిగే ధైర్యం. ఒక సంస్కృతి తన పాత ముసుగులను విప్పి కొత్త వెలుగులో నిలబడగలిగే నిబద్ధత. హైదరాబాద్‌ పాత హవేలీలో ఒక దీపం ఇన్నేళ్ళూ వెలిగింది. ఆ వెలుగు అందరి కంటికి అంతగా కనిపించకపోయినా మనసుకు మాత్రం దారి చూపుతుంది. ఆ వెలుగే జిలానీ బానో.

వారాల ఆనంద్

కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కార గ్రహీత

ఇవి కూడా చదవండి

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

Updated Date - Mar 03 , 2026 | 02:13 AM