Share News

పులిని బతకనివ్వండి!

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:55 AM

రక్తం మరిగిన పులి.. క్రూరంగా ప్రవర్తిస్తున్న పులి.. మనుషుల వెంట పడుతున్న పులి.. పశువులను చంపుతున్న పులి.. ప్రమాదకారిగా మారిన పులి... ఇలా రకరకాల పదాలు...

పులిని బతకనివ్వండి!

రక్తం మరిగిన పులి.. క్రూరంగా ప్రవర్తిస్తున్న పులి.. మనుషుల వెంట పడుతున్న పులి.. పశువులను చంపుతున్న పులి.. ప్రమాదకారిగా మారిన పులి... ఇలా రకరకాల పదాలు మనకీమధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఈ పదాల వెనక ఎంత వాస్తవం ఉంది? ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు దాన్ని పిచ్చిదని ముద్ర వేస్తే చంపడం సులభమవుతుంది.

పెద్దపులి పరిస్థితి కూడా ఇలాగే తయారైందనిపిస్తున్నది. వాటి ఆవాసాలు ధ్వంసమైపోయి అడివంటూ మిగలకపోయేసరికి దిక్కుతోచక వందల కిలోమీటర్లు నడిచి, తలదాచుకునే చోటు కోసం వెతుక్కుంటూ వస్తున్నాయి. తినడానికి తిండి లేక కాలే కడుపుతో అడవిని వెతుక్కుంటూ గ్రామాల వైపు నడిచి వస్తున్నాయి. వాటి ప్రయాణం మధ్యలో తగిలే జనావాసాలు, పంట పొలాలు, మానవ సంచారం... వాటిని మరింత ఆందోళనకు, భయానికి గురిచేస్తున్నాయి.

మనిషి శాకాహారం తినగలిగి కూడా రోజూ కోట్ల కొద్దీ కోళ్లు, మేకలను తన ఆహారం కోసం హతమారుస్తున్నాడు. మాంసాహార జీవి అయిన పెద్దపులి మాత్రం ఏం చేస్తుంది?! ఆకలి తీర్చుకోవడానికి, తనకు ఎదురైన జంతువులను వేటాడుతున్నది. తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. మనిషి తనకు హఠాత్తుగా ఎదురుపడితేనో లేదా తనకు హాని చేయజూస్తేనో ఆత్మరక్షణార్థం ఎదురు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నది.

రోజురోజుకూ అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంటే, అడవులన్నీ పోడుగా మారిపోతుంటే, వేటగాళ్లు అడవిలో ఉచ్చులు పెట్టి విచ్చలవిడిగా అటవీ ప్రాణుల్ని చంపి తింటుంటే పులులకు తినడానికి తిండి లేక సంచారం మొదలుపెట్టాయి. ఆహార పిరమిడ్‌లో పై భాగంలో పులి ఉంటుంది, అది బతికితేనే అడవి చల్లగా ఉంటుంది, అడవిలో సమతుల్యత ఉంటుంది... పర్యావరణం నిలబడుతుంది. అలాంటి అడవుల్ని రోజురోజుకూ ధ్వంసం చేస్తూ కొంత మంది ఆ భూముల్ని ఆక్రమిస్తుంటే ఒక మంత్రేమో, ఆ భూములకు పట్టాలిస్తాను అంటాడు! అటవీ శాఖ మంత్రేమో– అడవులు నరక వద్దంటాడు. ఒకే ప్రభుత్వంలో ద్వంద్వ వైఖరి ఇది. మనం తరచూ చూస్తున్న చోద్యమే!


మహారాష్ట్రలోని తడోబా, ముఖ్యంగా తిప్పేశ్వర్ అటవీ ప్రాంతాల వరకు మనం వెళ్లి చూడగలిగితే అక్కడ పెరుగుతున్న రిసార్టులతో పాటు గ్రామాలకు గ్రామాలే అడవిని ఆక్రమిస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. తిప్పేశ్వర్ కేవలం 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిన్న అడవి. అక్కడ ఈ పెద్దపులులు తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నానాటికీ కుంచించుకుపోతున్న అడవితో వాటికి నిలువనీడ లేక ప్రాదేశిక తగాదాలతో వాటిలో అవి పోరాటాలు చేసి, ఓడిన పులులు తాము తల దాచుకునే స్థలం కోసం వలసబాట పడుతున్నాయి. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అవి బతకడానికి అడవంటూ మిగిలితే కదా! ఒక పులి 600 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి పరిసరాలకు చేరుకున్న వైనం మీరు వినే ఉంటారు! సురక్షితంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ పులిని విశాఖ జూకు తరలించిన విషయం విని సంతోషించాను. ఎందుకంటే దాన్ని రక్తం మరిగిన పులి అనో.. ప్రమాదకారి అనో ముద్ర వేసి చంపలేదు.

ఇప్పుడు పడుతున్న ఆందోళన అంతా జనగామ, సిద్దిపేట ప్రాంతాల్లో తిరుగుతున్న పులి గురించి. దానినే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రమాదకారి అని, రక్తం మరిగిన పులి అని రకరకాలుగా ఆకతాయితనంతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఆ పులిని ప్రమాదకారిగానో లేదా మనుషుల్ని తినేదిగానో ముద్ర వేస్తే దాని కథ ముగిసిపోయినట్టే! మత్తు తూటాతో నిద్రపుచ్చి పెద్దపులిని సంరక్షించాల్సిన చేతులే, దాన్ని పట్టుకోవడం మా వల్ల కాదు అని చేతులెత్తేస్తే... రేపు జరగబోయేది ఇదే!

ఈ మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలోనైతే ఒక మంత్రి– చిరుత పులి వేషంలో వచ్చి, ‘అవి జన జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి, వాటిని చంపేయండి’ అని బహిరంగంగా అనడం ఆందోళనకరం. నిజంగా వాటిపై ఏదో ఒక ముద్ర వేసి చంపే హక్కు మనిషికి ఉందా? ఈ భూమిపై ప్రతి ప్రాణికి మనిషితో సమానంగా బతికే హక్కు ఉంది. కానీ మనిషి ఏదో ఒక ముద్ర వేసి వాటిని చంపజూడడం ఎంతవరకు న్యాయం? వాటి నోటికాడి కూడు లాగేసుకుంటూ వాటి ఆవాసాలను ధ్వంసం చేశాక ఆ అసహాయ జీవులు మాత్రం ఏం చేస్తాయి? వీధి కుక్కలు, కోతుల గురించి మాట్లాడే జంతు ప్రేమికుల గొంతు, పులి పట్ల ఎందుకు మూగబోయింది? కుక్కలు, కోతులు మాత్రమే జంతువులా? మనిషి వల్ల రోజూ అనేక రకాల జీవజాతులు శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.


పులి ఠీవీకి, రాజసానికి, అందమైన మేని ఛాయకు పెట్టింది పేరు. అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛకు ప్రతీక. దానిని జూలలో సంరక్షణ పేరిట బంధించకండి. స్వేచ్ఛగా అడవులలో తిరగనివ్వండి. పులి అడుగుల సవ్వడి వినిపించని అడవులు శ్మశానంతో సమానం. ఆ అందమైన జంతువును బతకనివ్వండి. అడవిని సంరక్షించాలని, జంతువుల్ని రక్షించాలని కలలు కని ఫారెస్ట్ ఆఫీసర్లుగా మారిన నిజాయితీ గల అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వండి, అడవుల విస్తీర్ణాన్ని కాపాడండి. కవ్వాల్, నల్లమల అడవుల్లో పులిగర్జన వినిపించనీయండి!!

డా. అంబటి శ్రీనివాస్‌రాజు

ఈ వార్తలు కూడా చదవండి:

ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ

దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..

Updated Date - Feb 15 , 2026 | 01:55 AM