Jack London World Literature: జీవితాన్ని శాసించిన అక్షర యోధుడు
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:16 AM
ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన విలక్షణ రచయిత జాక్ లండన్. లెక్కలేనన్ని సార్లు పడి లేచిన ప్రవాహ కెరటం అతడి జీవితం. ఎన్నో ఎదురుదెబ్బలు తిని కూడా పట్టు విడవని...
ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన విలక్షణ రచయిత జాక్ లండన్. లెక్కలేనన్ని సార్లు పడి లేచిన ప్రవాహ కెరటం అతడి జీవితం. ఎన్నో ఎదురుదెబ్బలు తిని కూడా పట్టు విడవని మొండి పంతం అతడి సొంతం. బతుకు విసిరిన సవాళ్లపై సవారీ చేసి, ఆ సంఘర్షణలని అక్షరీకరించిన అరుదైన రచయిత. బాల్యం నుంచి భరించిన కష్టాలతోనే పుస్తక రచనలు చేసిన విశిష్ట వ్యక్తి. అసంఖ్యాక అనుభవాల సముద్రాన్ని ఆత్మవిశ్వాసమనే ధైర్యంతో ఒంటరిగానే ఈదిన సాహసి.
1876, జనవరి 12న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జాన్ గ్రిఫిత్ చానీ (జాక్ లండన్) జన్మించాడు. బాల్యంలో ఒక్క డాలరు కోసం తిండి లేకుండా ఒళ్ళు హూనం చేసుకుని రోజంతా పని చేసిన జాక్, ఆ తర్వాత రోజుకు వేల డాలర్లు సంపాదించే స్థాయికి చేరాడు. బాల కార్మికుడిగా, రోజువారీ వేతన కూలీగా, సముద్రపు దొంగగా, ఆకతాయిగా, బొగ్గుగని పనివాడిగా, జ్యూట్ మిల్లు కార్మికునిగా, మంచుకొండల్లో బంగారపు గని శ్రామికుడిగా, నావికుడిగా, పాత్రికేయుడిగా, ప్రజాపక్ష ఉద్యమకారుడిగా, జంతు ప్రేమికుడిగా ఎన్నో అవతారాలు ఎత్తాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థిగా ప్రవేశించినా ఎక్కువ కాలం ఉండలేదు. పద్దెనిమిదేళ్లకే జైలు పాలయ్యాడు.
యుద్ధ విలేఖరిగా పని చేస్తున్నపుడు పలుమార్లు అరెస్టయ్యాడు. జపాన్ సైన్యం కూడా ఓసారి అదుపులోకి తీసుకుంది. ఇలా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఇన్నింటిలోకి అతడు నిరంతరం కొనసాగించిన వ్యసనం రచనా వ్యాసంగం. రోజుకి వెయ్యి పదాలకి తగ్గకుండా తన జీవన ప్రస్థానానికి కాల్పనికత జోడించి గుప్పించిన జాక్ లండన్ రచనలన్నీ దట్టించిన మందుగుండులా పేలాయి. అతడిని తిరుగులేని మహా రచయితను చేశాయి. ముప్పై ఏళ్ళకే ప్రపంచ వ్యాప్తంగా రచయితగా గుర్తింపు పొందాడు. వందేళ్ల క్రితమే అక్షరాలా ఇరవై ఐదు వేల డాలర్లు పుచ్చుకుని పత్రికలకి వ్యాసాలు రాసి, అమెరికా లోనే అత్యంత ఖరీదైన రచయితగా ఎదిగాడు. రచనకి కాకుండా రాసిన పదానికి ఇంత పారితోషికమని డిమాండ్ చేసిన ఏకైక వ్యక్తి ఆయన. అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ హోదాను పొందిన తొలి అమెరికన్ రచయితగా ఎర్నెస్ట్ హెమ్మింగ్వే నుంచి జాన్ స్టెయిన్ బ్యాక్ వరకూ, అప్టన్ సింక్లైర్ మొదలుకొని జార్జ్ ఆర్వెల్ దాకా ఎందరో మేధావుల్ని ప్రభావితం చేశాడు. బడా కార్పొరేట్ కంపెనీలు సైతం వ్యాపార ప్రకటనలతో జాక్ ఆకర్షణను సొమ్ము చేసుకున్నాయి.
జీవితాన్ని గాఢంగా కాచి వడబోసిన జాక్ లండన్, స్పష్టంగా తాను సోషలిస్టునని ప్రకటించాడు. ‘హౌ ఐ బికం సోషలిస్ట్?’ (నేనెలా సామ్యవాదిని అయ్యాను) అనే వ్యాసంలో జీవితమే తనను సోషలిస్టుగా మలిచిందని రాశాడు. ద కాల్ ఆఫ్ ది వైల్డ్ (ప్రకృతి పిలుపు), ద ఐరన్ హీల్ (ఉక్కుపాదం), వైట్ ఫాంగ్, టు బిల్డ్ ఎ ఫైర్, లవ్ ఆఫ్ లైఫ్, సీ వోల్ఫ్ వంటి రోమాంచిత నవలలే కాకుండా అనేక కథలు, కవితలు, ఆత్మ కథాత్మక రచనలు... మొత్తం 300 వరకూ చేశాడు. సాహితీ చరిత్రలో మొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ రాశాడు. ఒక దశలో జాక్ రచనలని సినిమాలుగా రూపొందించడానికి పోటీ పడే స్థితి నెలకొంది. వాటిల్లో కొన్ని చిత్రాలకి అతడే స్వయంగా స్క్రీన్ ప్లే కూడా రాశాడు.
అలా అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బుతో సోనోమా లోయలో పరవశింప చేసే ప్రకృతి ఒడిలో ఏకంగా పద్నాలుగు వందల ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం నిర్మించాడు. అక్కడే వందలాది నిపుణుల పర్యవేక్షణలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ కళాత్మక కలల సౌధానికి ‘వోల్ఫ్ హౌస్’ అని పేరు పెట్టుకున్నాడు. మర్నాడు గృహప్రవేశం అనగా, ఆ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడ్డ జాక్ కృంగిపోలేదు. పైగా అక్కడే రెట్టించిన ఉత్సాహంతో చివరి వరకూ జీవించాడు. అసలు నిరాశ అనే పదం అతడి జీవితంలో లేనే లేదు. అందుకే మద్యపానానికి బానిసై, అనారోగ్యం వెంటాడి వేధిస్తున్నా సరే, కాలానికి ఎదురీదాడే కానీ ఎన్నడూ వెన్ను చూపలేదు. రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. వైవాహిక జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జీవితాంతం అలుపెరుగని చైతన్యంతో అద్వితీయ సాహిత్యాన్ని సృష్టించిన జాక్ లండన్, 1916, నవంబర్ 22న అనారోగ్యంతో మరణించాడు. అతడి జీవితం లాగానే మరణం కూడా వివాదాస్పదమైంది.
తదనంతర కాలంలో అతడి వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడే అతడి స్మృతిలో, ‘జాక్ లండన్ స్టేట్ హిస్టారిక్ పార్క్’ అభివృద్ధి చేసింది. కాలి బూడిదైన జాక్ లండన్ ఇంటి శిథిలాలు, అతడి సమాధితో పాటు అక్కడే ఉన్నాయి. తదనంతరం కూడా అతడి భార్య, పిల్లలతో పాటు ఎందరో పరిశోధకులు జాక్ జీవితం, కృషి గురించి ఎన్నో పరిశోధనాత్మక, కాల్పనిక రచనలు చేశారు. తెలుగులో కూడా ఆయన రచనలు అనువాదం అయ్యాయి. కొడవటిగంటి కుటుంబరావు తదితరులు అతడి రచనల్ని తెలుగులో పరిచయం చేశారు. అలా అతి తక్కువ కాలంలో దేశదేశాల్లోని ఆలోచనాపరులను తన అక్షరాలతో ప్రభావితం చేసిన యువ రచయిత మరొకరు లేరు. దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి జాక్ రచనలు అనువాదం అయ్యాయి. రాహుల్ సాంకృత్యాయన్, మాక్సిం గోర్కీ వంటి వారితో మాత్రమే పోల్చదగ్గ రచయిత జాక్ లండన్. అవిశ్రాంతంగా సాగిన జీవనయానంలో అతడు ఎన్ని పాత్రలు పోషించినా అంతిమంగా మానవీయ యాత్రికుడిగా, సామ్యవాద స్వాప్నికుడిగానే మిగిలాడు. ఒకచోట అతడు అన్న మాటలే బహుశా మానవాళికి ఆయన ఇచ్చిన ఆత్మీయ సందేశం కావొచ్చు. అది
‘‘నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను. కుళ్లి, కృశించి, నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతి కావాలని అనుకుంటాను. మందకొడిగా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండటం కంటే, దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలని అనుకుంటాను. మనిషన్నవాడు జీవించాలి, బతుకీడ్చడం కాదు!’’
గౌరవ్
(జనవరి 12: జాక్ లండన్ 150వ జయంతి)
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్