Share News

ఇజ్రాయెల్ చరిత్ర... హిందూత్వ మూలాలు!

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:47 AM

సావర్కర్ ఇజ్రాయెల్‌ను, యూదు జాతీయవాదాన్ని (Zionism) హిందూత్వతో నేరుగా ముడిపెట్టారు. ‘యూదులకు పాలస్తీనా, ముస్లింలకు అరేబియా లాగే... హిందువులకు భరతఖండం పితృభూమి, పుణ్యభూమి’ అని రాశారు. ఇజ్రాయెల్‌కు, ఆధునిక హిందూత్వానికి సైద్ధాంతికంగా స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి.

ఇజ్రాయెల్ చరిత్ర... హిందూత్వ మూలాలు!

నేడు ‘హిందూత్వ’గా పిలుస్తున్న భావజాలానికి మూలాలు నిజానికి ఆధునిక పరిణామాల్లోనే ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలనలోకి మారిన భారత ఉపఖండ చరిత్ర, సంస్కృతులు పాశ్చాత్య వలసవాదం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పాశ్చాత్య సామ్రాజ్యవాద చరిత్రలో ఇజ్రాయెల్ ఏర్పాటు అత్యంత కీలకమైన ఘట్టం. మొదట బ్రిటిష్‌వారు, ఆ తర్వాత అమెరికా అండదండలతోనే ఇజ్రాయెల్ రూపుదిద్దుకుంది.

ఇజ్రాయెల్ ఆవిర్భావం గురించి చర్చలు, సంవాదాలు భారత ఉపఖండంలోనూ విస్తృతంగా జరిగాయి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయవాదులు... మొదటి నుంచీ ఒక భూభాగంలో నివసిస్తున్న స్థానిక ప్రజలను నిర్వాసితులను చేస్తూ ప్రత్యేక ఇజ్రాయెల్ ఏర్పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1938 నవంబరు 26న గాంధీజీ ‘హరిజన్’ పత్రికలో ‘The Jews’ పేరుతో రాసిన వ్యాసంలో నాజీల హింస పట్ల సానుభూతి చూపుతూనే, సైనిక బలంతో పాలస్తీనాను ఆక్రమించడాన్ని ఖండించారు. నాజీల నియంతృత్వానికి ఎదురొడ్డి జర్మన్ యూదులు అహింసాత్మక సత్యాగ్రహం చేపట్టాలని, తద్వారా నాజీల మనసు మార్చవచ్చని గాంధీ సలహా ఇచ్చారు. అయితే గాంధీ వైఖరిని యూదు మేధావులు తీవ్రంగా విమర్శించారు. యూదులు తమ మనుగడ కోసం ‘పాత నిబంధన’లోని భౌగోళిక–రాజకీయ ఆక్రమణ సూత్రాలను ఆశ్రయిస్తుంటే, గాంధీజీ మాత్రం వాటిని కొత్త నిబంధనలోని శాంతియుత క్రైస్తవ/ అహింసా మార్గంలో పరిష్కరించుకొమ్మని కోరారు. భవిష్యత్తులో నాజీల వల్ల పీడితులైన యూదులు నాజీలలాగే మారే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే గాంధీ హెచ్చరించారు.


మార్టిన్ బూబర్, హయీమ్ గ్రీన్‌బర్గ్, హెన్రీ పోలక్, హెర్మాన్ కల్లెన్‌బాక్ వంటి యూదు మేధావులు గాంధీజీ అహింసా వాదాన్ని విమర్శించారు. నాజీలు వ్యవస్థీకృతంగా ఒక జాతి నిర్మూలనకు పాల్పడుతున్నప్పుడు అహింసాత్మక నిరసనలు, ఆత్మబలిదానాలు పనిచేయవని, హిట్లర్ లాంటి క్రూరుడికి మనస్సాక్షి ఉండదని మార్టిన్ బూబర్ అన్నారు. అలాగే, ఐరోపాలో తమ ‘గెట్టో’ (Ghetto) స్థితిని భారతదేశపు అస్పృశ్యతతో పోలుస్తూ, దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని గుర్తించిన గాంధీ, యూదుల స్వయం నిర్ణయాధికారాన్ని, పురాతన పితృభూమిపై ఉన్న దైవిక–చారిత్రక హక్కును నిరాకరించడాన్ని గ్రీన్‌బర్గ్ ప్రశ్నించారు. గాంధీజీ భారతీయ హిందూ–ముస్లిం ఐక్యత అనే స్వప్రయోజనం కోసమే జియోనిజాన్ని వ్యతిరేకించారని హెన్రీ పోలక్ విశ్లేషించారు. ఈ సందర్భంలో గాంధీ చేసే అహింసాత్మక వ్యాఖ్యానానికి భిన్నంగా, భగవద్గీత లాంటి హిందూ గ్రంథాలు కూడా హింసను సమర్థిస్తాయి అని యూదు మేధావులు కూడా వాదించడం విశేషం. ఇది నేటి హిందూవాదులు చేసే ‘ధర్మహింసా తథైవచ’ అనే వాదానికి సరిపోలుతుంది.

ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఇజ్రాయెల్ ఆవిర్భావానికి మద్దతు ఇవ్వాలని నెహ్రూను కోరారు. రాజ్యాంగంలో అస్పృశ్యతను నిషేధిస్తున్న భారత ప్రభుత్వం, ఐరోపాలో తీవ్ర వివక్షకు గురవుతున్న యూదులకు ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే నెహ్రూ కానీ, భారత ప్రభుత్వం కానీ దానికి సుముఖంగా లేవు. మధ్యప్రాచ్యంలో ఇటువంటి దేశ ఏర్పాటు అక్కడ నివసిస్తున్న అరబ్బుల ప్రాథమిక హక్కులకు ముప్పుగా పరిణమిస్తుందని నెహ్రూ స్పష్టం చేశారు. మరొకవైపు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ ‘జ్యూయిష్ అడ్వకేట్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ ఏర్పాటును సమర్థించారు. ఆయన సంకలిత రచనలలో ఐరోపాలోని యూదుల ‘గెట్టో’ (Ghetto) స్థితిగతులు, మోజెస్ నాయకత్వంలో.. పీడితులైన యూదులు ‘వాగ్దానం చేసిన భూమి’ని (Promised Land) చేరుకోవడం వంటి అంశాలను దళితుల విముక్తి పోరాట పోలికలుగా ప్రస్తావించారు. ఇటీవల ఇజ్రాయెల్ దురాక్రమణను దళిత మేధావులు, క్రైస్తవ దళితులు సమర్థించారు. ఈ వైఖరికి పాశ్చాత్య వలసవాద ప్రభావాలు కారణం.


అయితే, వినాయక్ దామోదర్ సావర్కర్ ఇజ్రాయెల్‌ను, యూదు జాతీయవాదాన్ని (Zionism) హిందూత్వతో నేరుగా ముడిపెట్టారు. 1923లో రాసిన ‘Essentials of Hindutva’ గ్రంథంలో సావర్కర్: ‘‘యూదులకు పాలస్తీనా, ముస్లింలకు అరేబియా లాగే... హిందువులకు భరతఖండం పితృభూమి, పుణ్యభూమి’’ అని రాశారు. యూదులు పాలస్తీనాపై చూపిన హక్కును, హిందూవాదులు భరతఖండాన్ని తమ సాంస్కృతిక –రాజకీయ భూమిగా క్లెయిమ్ చేసుకోవడానికి నమూనాగా ఉపయోగించారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు సావర్కర్ తక్షణ దౌత్య గుర్తింపు ఇవ్వాలని కోరారు. 1954లో ‘కేసరి’ పత్రికలో– శత్రు దేశాల నడుమ ఉన్నప్పటికీ స్వయం రక్షణ, సైనిక శిక్షణలో ఇజ్రాయెల్ చూపిన ధైర్యాన్ని భారతదేశం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆరెస్సెస్‌ అధికారిక వారపత్రిక ‘ఆర్గనైజర్’ దశాబ్దాలుగా ఇజ్రాయెల్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తూ వ్యాసాలు ప్రచురించింది. ‘పితృభూమి’, ‘పుణ్యభూమి’ సూత్రాలతో ఇజ్రాయెల్ దేశభక్తిని పెంపొందించుకున్నట్లే, భారతదేశం కూడా హిందూ రాష్ట్ర భావన ద్వారా సైనిక, సాంస్కృతిక బలాన్ని పునర్నిర్మించుకోవాలని వాదించింది. డా. సుబ్రహ్మణ్యస్వామి వంటి నాయకులు కూడా ఇరు దేశాల మధ్య బలమైన సైనిక, నిఘా కూటమి ఏర్పడాలని పదే పదే ప్రతిపాదించారు. ఒకప్పుడు నాజీయిజాన్ని సమర్థించిన హిందూవాదులు తర్వాత యూదు ఆధిపత్యాన్ని కూడా సమర్థించారు. ఈ విరుద్ధ దృక్పథాలలో ఉన్న సారూప్యత ఒక్కటే– అది నియంతృత్వం పట్ల ఆరాధనా భావం.


పాశ్చాత్య నమూనాకు ‘హిందూత్వ’ ప్రతిబింబం మాత్రమే అనేందుకు వీలుగా, ఇజ్రాయెల్‌కు, ఆధునిక హిందూత్వానికి సైద్ధాంతికంగా స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి: 1) ఇజ్రాయెల్ యూదులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి; భరతఖండం హిందువులకు పితృభూమి/ పుణ్యభూమి. 2) యూదులకు/ పాశ్చాత్యులకు, భారతీయ హిందూత్వవాదులకు ఉమ్మడి శత్రు రూపకల్పన జరగడం. వారే ముస్లింలు. 3) అలాగే జరూసలేంలో సలోమాన్ దేవాలయాన్ని అబ్దుల్ మాలిక్, ముస్లింలు ధ్వంసం చేయడం, తిరిగి ఆలయ నిర్మాణం డిమాండు– బాబర్ రామాలయ విధ్వంస వివాదం, రామాలయం. 4) అఖండ ఇజ్రాయెల్– అఖండ భారత్‌. బైబిల్ ‘పాత నిబంధన’లోని ‘దేశం–రక్తం–భూమి’ (Nation–Blood–Land) కేంద్రక భావనలతోను, పాశ్చాత్య జాతీయవాద నమూనాలతోను హిందూత్వానికి ఎక్కువ దగ్గరి పోలికలు ఉన్నాయి.

-రాణి శివశంకర శర్మ(ది లాస్ట్ బ్రాహ్మిన్)

Updated Date - Sep 13 , 2026 | 07:47 AM