Share News

ఇజ్రాయెల్‌తో ఆ ఒక్కదానితోనే మనకు పోటీ!

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:06 AM

లోకమంతా తమకు వ్యతిరేకంగా ఏకమైనట్లు భావించే వ్యక్తులూ, దేశాలూ ఏంచేసినా అతిగానే ఉంటుంది. ఇజ్రాయెల్‌ను చూస్తే ఇది స్పష్టంగా కనపడుతుంది. ఈ అతి వల్లే సమస్యలను సరైన కోణంలో

ఇజ్రాయెల్‌తో ఆ ఒక్కదానితోనే మనకు పోటీ!

లోకమంతా తమకు వ్యతిరేకంగా ఏకమైనట్లు భావించే వ్యక్తులూ, దేశాలూ ఏంచేసినా అతిగానే ఉంటుంది. ఇజ్రాయెల్‌ను చూస్తే ఇది స్పష్టంగా కనపడుతుంది. ఈ అతి వల్లే సమస్యలను సరైన కోణంలో చూడటం ఇజ్రాయెల్‌ ఎప్పుడో మరచిపోయింది. ఇటీవల అక్కడి చట్టసభకు (నెస్సెట్‌) జరిగిన ఎన్నికల్లో అరబ్‌ పార్టీలు 19 సీట్లను గెలుచుకోవటం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఘోరమైన అతిగానూ, కుట్రగానూ కనపడుతోంది. విదేశీ డబ్బుతోనే అరబ్బు పార్టీలు ఎన్నికల్లో విజయాన్ని సాధించాయని ఆరోపించారు. అంతటితో ఆగలేదు. ఎన్నికల్లో విదేశీ డబ్బు ప్రభావంపై విచారణ జరిపి, అరబ్బు ప్రతినిధుల గెలుపుపై అనర్హత వేటువేయాలనే కోరికను కూడా వ్యక్తంచేశారు. నెతన్యాహు ప్రభుత్వం వేలాది మందిని చంపి గాజాలో దారుణ మారణహోమానికి పాల్పడినా, ఇరాన్‌పై అక్రమ యుద్ధానికి దిగినా ఆశించిన విధంగా ఎన్నికల్లో ప్రజాతీర్పు రాలేదు. పార్లమెంట్‌లో పాలకకూటమికి అవసరమైన మెజారిటీ దక్కకుండా ప్రజలు తీర్పునిచ్చారు.

ఇజ్రాయెల్‌ జనాభాలో అరబ్బులు 21.5శాతం వరకూ ఉంటారు. వాళ్లకు 19 సీట్లు రావటంలో అసహజం ఏమీలేదు. ఇజ్రాయెల్‌లోని అరబ్బులు బయట నుంచి వచ్చి అక్కడ స్థిరపడలేదు. అట్లా అనుమతించే ఉదారతను అరబ్బుల విషయంలో ఇజ్రాయెల్‌ ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి విరుద్ధంగా ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న 1948 మే 14 నాటికి అక్కడ భూభాగాల్లో మిగిలిపోయిన అరబ్బులే నిజమైన భూమిపుత్రులు. వీలైనంత మంది స్థానిక అరబ్బులను ఇజ్రాయెల్‌ నుంచి బయటికి పంపించటానికి 1948లోనూ, ఆ తర్వాతా ఎన్నిచేయాలో అన్నీ చేశారు. ఊళ్లకు ఊళ్లనే తగులపెట్టారు. జీవనోపాధులను దెబ్బతీశారు. అరబ్బులకు ముఖ్యమైన ప్రతిదాన్నీ ధ్వంసం చేశారు. వందలేళ్ల నాటి నివాస ప్రాంతాలను నామరూపాల్లేకుండా చేశారు. చివరికి దేశం విడిచి శరణార్థులుగా పారిపోయే పరిస్థితిని కల్పించారు. అలా ఎన్ని దారుణాలకు ఒడిగట్టినా ఇజ్రాయెల్‌ అధికారికంగా ప్రకటించుకున్న సరిహద్దుల్లోనే కొన్ని చోట్ల అరబ్బులు మిగిలిపోయారు. దేశాన్ని వీడలేకపోయారు. అట్లా వీడలేని వాళ్ల వారసులే నేటి ఇజ్రాయెల్‌లో ఉన్న అరబ్బులు. ఈ అరబ్బుల్లో ముస్లింలు కానివారూ ఉన్నారు. వారి శాతం మాత్రం జనాభాలో బాగా (2.9) తక్కువ. మొత్తంగా అరబ్బులను అనుమానంగా చూడటం, వారి దేశ విధేయతను శంకించటం చుట్టూనే అక్కడి లికుడ్‌ పార్టీ రాజకీయాలు తిరుగుతాయి. నెతన్యాహు ప్రధాని అయిన తర్వాత ఈ ధోరణి మరింతగా వెర్రితలలు వేస్తోంది.


ఒక మతానికీ, ఒక సమూహానికీ పెద్దపీటవేసే సంకుచిత జాతీయవాదానికి ఎప్పుడూ దేశం లోపలా బయటా శత్రువులు కావాలి. దేశ సాంస్కృతిక జీవితాన్నీ, మతాన్నీ విచ్ఛిన్నం చేసే వారిగా మైనారిటీలపై శత్రుముద్రలు వేయాలి. దేశ విధేయత లేని సమూహంగా మైనారిటీల గురించి ప్రచారం చేయటం ఇజ్రాయెల్‌కే పరిమితం కాలేదు. దేశభక్తి అంటే మతభక్తే అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్న చోట్ల ఇది విస్తృతంగా సాగుతోంది. మతాధిక్యత, జాతి ఆధిక్యత భావజాలంతో కూడిన జాతీయవాదం ఎప్పుడూ ప్రమాదకరమే. కిందటి శతాబ్దంలోనూ ఈ శతాబ్దంలోనూ ప్రపంచంలో హింసాగ్నులకు ఈ వాదమే ప్రేరణ. నియంతలందరూ ఈ తరహా జాతీయవాదంతోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పుకోవాలంటే ఇలాంటి సంకుచిత జాతీయవాదమే నియంతలను సృష్టిస్తుంది. ఆ తరహా జాతీయవాదంతో ప్రజలను ప్రేరేపించటానికి చరిత్ర రచన చాలా పనికొస్తుంది. ప్రస్తుత ఇజ్రాయెల్‌ భూభాగాలన్నీ ఒకప్పుడు యూదులవేననీ, గాజా, వెస్ట్‌బ్యాంకు కూడా వాళ్లవేననీ చెప్పే విధంగా చరిత్ర పుస్తకాలు రూపొందుతాయి. పురాతన గాథలనూ, కథలనూ ఉటంకిస్తూ చరిత్ర రచనను దాని చుట్టూ తిప్పుతారు. అరబ్బులకు ఆ భూభాగాల్లో సమాన స్థానం ఉందనే విషయాన్ని ఏరకంగానూ అంగీకరించరు. పిల్లలకు చిన్నతనం నుంచీ దీన్నే నూరిపోస్తారు. అందుకే జాతి, మత ఆధిక్యత భావాల ఆధారంగా రాజకీయాలు చేసేవాళ్లు మొదటగా చరిత్రపైనే దృష్టి పెడతారు. గతం నుంచి స్ఫూర్తిపొందని జాతి అంటూ ఉండదు. ఆ గతం తాలూకూ చిత్రం ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలా వరకూ సమకాలీన రాజకీయ అవసరాలే నిర్దేశిస్తాయి. చరిత్రలో కొందరిని నాయకులు గానూ, మరికొందరిని ప్రతినాయకులు గానూ వర్ణించటం రాజకీయ అవసరాల ప్రకారమే జరుగుతుంది. విలన్లుగా ముద్ర వేసిన వాళ్లను కొత్త ఆధారాలతో భిన్న కోణం నుంచి చూడటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. ప్రజల మనస్సుల్లో విలన్లు, హీరోల జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. శాస్త్రీయ దృక్పథంతో చరిత్రకారులెవరైనా ఆ పనికి పూనుకుంటే వాళ్లపైనే బురదచల్లుతారు. పెడార్థాలు అంటగడతారు.

ఇజ్రాయెల్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అరబ్బులపై నిషేధం లేదు. కానీ అరబ్బులు పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొన్నప్పుడల్లా వాళ్లకు దురుద్దేశాలను ఆపాదించటం నెతన్యాహుకు పరిపాటి. 2015 ఎన్నికల్లో కూడా అరబ్బు ఓటర్లతో ఇజ్రాయెల్‌కు ప్రమాదం ముంచుకొస్తోందని విమర్శించారు. అరబ్బు పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం జాతి ప్రయోజనాలకు విపత్తుగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ చేపట్టే ఏ సైనిక చర్యనైనా అరబ్బు పార్లమెంటేరియన్లు సమర్థించకపోతే వాళ్లను దేశ ప్రయోజనాలకు గండికొట్టే వారిగా ప్రచారం చేయటం లికుడ్‌ పార్టీకి సర్వసాధారణం. పాలస్తీనా అరబ్బులకు సంఘీభావం ప్రకటించినా, 1948కు పూర్వపు తమ గతాన్ని గుర్తుచేసుకున్నా, ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా రాజ్యం ఏర్పాటే శాంతికి పరిష్కారమని మాట్లాడినా దేశద్రోహులైపోతారు. ఇజ్రాయెల్‌లోని అరబ్బులకు ఇప్పుడు సాధారణ పౌరుల్లాగా అన్నీ హక్కులు ఉన్నట్లు కనపడుతున్నా చాలా విషయాల్లో వాళ్లు వెనుకబడే ఉన్నారు. 1966 వరకూ ఇజ్రాయెల్‌లోని అరబ్బు ప్రజలు సైనిక పాలన కిందే మగ్గిపోయారు. ప్రయాణాలకు అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. నివాసప్రాంతాలపై ఆంక్షలు ఉండేవి. రాజకీయ కార్యకలాపాలపై నిఘా ఉండేది. ఉద్యోగాలు, విద్య వ్యవహారాలపై కఠిన నియంత్రణలు ఉండేవి. ఆ పాలనా కాలంలోనే అరబ్బుల నుంచీ వివిధ చట్టాల ద్వారా భూములను స్వాధీనం చేసుకున్నారు. సైనిక పాలన ముగిసిన తర్వాత కూడా చాలా విషయాల్లో పక్షపాతం చూపారు. అరబ్బులు ఎక్కువగా ఉన్నచోట పెట్టుబడులను తక్కువగా కేటాయించారు. అందుకే పాలస్తీనా సమస్య అంటే గాజాలోనూ, వెస్ట్‌బ్యాంకులోనూ ఉన్న ప్రజల ఇబ్బందులుగానే భావించకూడదు. ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ప్రజల సమానహక్కుల ఆకాంక్షను కూడా ముఖ్యమైందిగానే పరిగణించాలి.


యూదు ప్రజల కోసం ఒక రాజ్యం ఏర్పడటం అనేది ఒకనాడు అవసరంగా మారింది. అందులో సందేహం ఏమీ లేదు. యూదులు ఎక్కువగా ఉన్న దేశాల్లో అణచివేతలూ, ఊచకోతలూ ఒకప్పుడు సర్వసాధారణం అయ్యాయి. ఆ నేపథ్యంలో యూదులకు ఒకదేశం ఉండాలనే డిమాండు ఊపందుకుంది. దానికి బ్రిటన్‌ మద్దతు పలకటంతో ఇజ్రాయెల్‌ ఏర్పడటానికి పునాదులు పడ్డాయి. పాలస్తీనాలో అప్పటికే వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్న అరబ్బుల హక్కులకు భంగం కలగకుండా ఆ దేశం ఏర్పడుతుందని బ్రిటన్‌ చేసిన వాగ్దానాలు గాలికికొట్టుకుపోయాయి. అరబ్బులతో సహజీవనం చేయాలన్న ఆలోచనలను యూదుల్లో అతివాదులు తొలి నుంచీ వ్యతిరేకించారు. అందుకే ఏదో ఒక కారణంతో పాలస్తీనా శరణార్థులను ఇజ్రాయెల్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. స్వస్థలాల నుంచీ తరిమివేసిన ప్రజలకు తిరిగివచ్చే హక్కులను తోసిపుచ్చారు. ఇది చాలదన్నట్లుగా 2018 జూలైలో ఇజ్రాయెల్‌ రాజ్య నిర్వచనాన్నే మార్చేస్తూ మౌలిక చట్టాన్ని తీసుకువచ్చారు. యూదు ప్రజలకే ఇజ్రాయెల్‌ రాజ్యమంటూ (ద నేషన్‌ స్టేట్‌ ఆఫ్‌ ద జూయిష్‌ పీపుల్‌) కొత్త నిర్వచనం ఇచ్చారు. 21.5శాతంగా ఉన్న అరబ్బుల పరిస్థితి ఏమిటి అన్నదాన్ని పట్టించుకోలేదు. యూదు ప్రజల రాజ్యమనటంలోనే ఇతర ప్రజలు ద్వితీయ పౌరులుగా మారిపోయారు. ఇజ్రాయెల్‌లో మౌలిక చట్టాన్ని రాజ్యాంగంగానే పరిగణిస్తారు. 1948 నుంచి పాలస్తీనా అరబ్బుల హక్కులను ఒక్కొక్కటిగా హరించటమో, పరిమితం చేయటమో మొదలైనా 2018 నాటి మౌలిక చట్టంతో పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. దీన్ని ఎదుర్కోటానికే ఇప్పుడు అరబ్బుల్లో రాజకీయ క్రియాశీలత పెరిగింది. అందుకే ఎన్నికల్లో అరబ్బులు పెద్దఎత్తున పోలింగులో పాల్గొన్నారు. ఎన్నడూలేని సంఖ్యలో అరబ్బులు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు.

దేశంలోపల అరబ్బుల, గాజా, వెస్ట్‌బ్యాంకులోని పాలస్తీనా ప్రజల న్యాయపరమైన హక్కులను విస్మరించి.. వాళ్లను శాశ్వతంగా ఇజ్రాయెల్‌కు పాదక్రాంతులుగా చేసుకోవాలన్న నెతన్యాహు కోరిక నెరవేరటం ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో అంతతేలిక కాదు. గాజా, వెస్ట్‌ బ్యాంకులను కూడా కలుపుకొని అఖండ ఇజ్రాయెల్‌ను ఏర్పాటుచేయటమే లక్ష్యంగా రాజకీయాలను నడుపుతూ, యుద్ధాలను చేస్తూ నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటి వరకూ సాధించింది శూన్యం. పశ్చిమాసియా ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడిపోయింది. ఇరాన్‌ ప్రతిఘటన అనూహ్యస్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్‌ను దెబ్బతీసింది. రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్‌, అమెరికాలు ఏకాకులుగా మిగిలాయి. అరబ్బులకు న్యాయపరంగా దక్కాల్సిన భూభాగాలను ఇవ్వకుండా, పాలస్తీనా స్వతంత్ర రాజ్యం ఏర్పాటుకు మోకాలడ్డుతూ ఎన్ని దారుణాలు చేసినా ఇజ్రాయెల్‌కు భద్రతతో కూడిన స్థిరత్వం రాదు. శత్రువులు అన్నివైపులా చుట్టుముట్టి ఉన్నారన్న పరిస్థితిని చేజేతులా తెచ్చుకోవటం నిరంతరం ఎదుర్కోవాల్సిన ముప్పుగానే పరిగణించక తప్పదు.


అరబ్బు ముస్లింలతో సయోధ్యపడకుండా ఎంత సైనికశక్తిని సమకూర్చుకున్నా సాధించేదేమీ ఉండదు. ఒకనాడు యూదులు ఎదుర్కొన్న దారుణాలకూ ఊచకోతలకూ అరబ్బు ముస్లింల పాత్ర ఏమీలేదు. యూదులను అణగదొక్కటంలో, నరమేధం సాగించటంలో యూరోపియన్లదే ప్రధానపాత్ర. మధ్యయుగాల్లో యూదులకు క్రైస్తవ రాజ్యాలతో పోల్చితే ముస్లిం రాజ్యాల్లోనే ఎక్కువ భద్రత ఉండేది. 1900 సంవత్సరంలో యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా కోటీ పది లక్షలు ఉంటే అందులో యూరపులోనే 90 లక్షలు ఉండేవారు. ఆనాటి రష్యను సామ్రాజ్యంలో 40 లక్షల దాకా నివసించేవారు. పాలస్తీనాలో అప్పటికి కేవలం 78,000 మంది మాత్రమే యూదులు ఉన్నారు.

ఇజ్రాయెల్‌ యూదులతో పోల్చితే అరబ్బులు అన్నిరంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారనటంలో సందేహం లేదు. అన్ని విషయాల్లోనూ ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలనే మన దేశ నాయకులు కొందరికి రుచించని విషయాలు కూడా అక్కడ ఉన్నాయి. భారత్‌లో ముస్లిం లోక్‌సభ సభ్యులు 4.42శాతం మాత్రమే ఉన్నారు. కానీ ఇజ్రాయెల్‌లో అరబ్బు ఎంపీలు 15.83శాతం ఉన్నారు. పౌర ఉద్యోగాల్లో 13.2 శాతాన్ని అరబ్బులు సాధించారు. సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.9శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారు. అరబ్బుల ప్రాతినిధ్యం కిందిస్థాయి ఉద్యోగాల్లో ఇజ్రాయెల్‌లో ఫర్వాలేదని అనుకుంటున్నా వారు దేశాన్నే కోల్పోయారు. దాంతో దేన్నీ వెలకట్టలేం. కానీ ఇజ్రాయెల్‌తో ఒక విషయంలో మాత్రం మనం పోటీపడుతున్నాం. అది చరిత్ర రచనల్లో ప్రస్ఫుటంగా కనపడుతోంది. ముస్లింల ఘనకార్యాలన్నీ పోయి క్రమేపీ వారి ఘోరచరిత్రలు మాత్రమే నమోదవుతున్నాయి! ఈ విషయంలో భారత్‌ ఇజ్రాయెల్‌కు గట్టిపోటీని ఇస్తోంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలూ చదవండి

‘పేస్‌’తో కొట్టారు

పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ

Updated Date - Nov 06 , 2026 | 05:06 AM