Share News

సంక్షోభాల్లోనే పొదుపు గుర్తుకు వస్తుందా?

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:09 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలు పొదుపు చర్యలను పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని సూచనను...

సంక్షోభాల్లోనే పొదుపు గుర్తుకు వస్తుందా?

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలు పొదుపు చర్యలను పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని సూచనను శిరసావహిస్తూ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. గత నెల హైదరాబాదులో జరిగిన సభలో ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలనీ, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకోవాలనీ పిలుపునిస్తూనే, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కూడా చెప్పారు.

పొదుపు పాటించాలని ప్రజలకు పాలకులు పిలుపునివ్వడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చిక్కుల్లో పడినా, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఏ ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినా అప్పటికప్పుడు పొదుపు చర్యల వైపు పరుగులు పెట్టడం మనకు అలవాటే! నిజానికి ప్రజలు, ప్రభుత్వాలు పొదుపు పాటించడం మంచిదే! అయితే పొదుపు అన్నది మన జీవితంలో ఓ అంతర్భాగం కావాలి. కానీ వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడే పొదుపు గుర్తుకు రావడం, మిగతా సమయాల్లో దుబారా చేయడం భారతీయులకు అలవాటైపోయింది.

దేశంలో కొనుగోళ్ల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత– ఎక్కువ మంది ప్రజలు అంతకుముందులా కొద్దిగా పాడైన వస్తువులను బాగు చేయించుకొని తిరిగి వాడటం లేదు. పాతవి పడేసి కొత్తవి కొంటున్నారు. ఉదాహరణకు గతంలో ప్రజలు తాము ధరించే చెప్పులు పాడైతే వాటిని కుట్టించుకొని మరికొంత కాలం వాడేవారు. కానీ ఇప్పుడు దాదాపు ఆ పరిస్థితి లేదు. నేటి కొనుగోళ్ల సంస్కృతిలో అన్ని రకాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దానివల్ల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయన్న మాట నిజమేగానీ, ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన పూర్తిగా లోపించింది. ప్రభుత్వాలు సైతం ప్రజలను పొదుపు పట్ల చైతన్యవంతం చేయడం లేదు.


ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే పొదుపు మంత్రం జపించడం, మిగతా సమయంలో దానిపై దృష్టి పెట్టకపోవడం ఏ ఆర్థిక వ్యవస్థకూ మేలు చేయదు. నిజానికి నేడు ప్రపంచంలో భారత్‌ సహా మెజార్టీ దేశాలు బడ్జెట్ లోటుతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ రాబడి కంటే ఖర్చులు పెరిగిపోయినప్పుడు బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేయడానికి పన్నులు పెంచడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో కోత పెట్టడం అనివార్యం. అయితే అధికారంలో ఉండేవారు నిరంతరం రాబోయే ఎన్నికలలో ఎలా గెలవాలన్న అంశం మీదే దృష్టి పెడతారు. కాబట్టి ఇలాంటి చర్యలతో ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందన్న భయంతో ఆ నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు. అందుకే ప్రస్తుతం లోటు బడ్జెట్‌ను కొనసాగిస్తూనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ప్రతి ఏటా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆర్థిక సంక్షోభమే. కానీ, ఈ నిజాన్ని ఏ ప్రభుత్వమూ బహిరంగంగా చెప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అప్పు ఇవ్వడానికి కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. 1998 నుంచి దాదాపు నాలుగేళ్ల పాటు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న అర్జెంటీనాను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఐఎంఎఫ్ ఆ దేశానికి అనేక షరతులు విధించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత, పెన్షన్‌దారులకు పెన్షన్‌లో కోత మొదలుకొని పలు సంక్షేమ కార్యక్రమాలకు కత్తెర వేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అర్జెంటీనాతోపాటు ఐర్లాండ్, పోర్చుగల్, తుర్కియే తదితర దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు సైతం ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు ఆ దేశాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేశాయి.

1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయి విలువను తగ్గించారు. లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారు. పరిశ్రమలు, వ్యాపారాలలో ప్రభుత్వ జోక్యం తగ్గినప్పుడు అవి ఉత్తమంగా పనిచేస్తాయన్న లైసెజ్–ఫెయిర్ (Laissez– faire) మార్గాన్ని అనుసరించారు. ఫలితంగానే రెండేళ్ల వ్యవధిలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కోలుకుంది. ఉదార ఆర్థిక విధానాలు అమలుచేయడం వలన దేశంలో సంపద పెరిగింది. అదే సమయంలో కొనుగోళ్ల సంస్కృతి విస్తరించింది. మూలధనాన్ని కూడబెట్టడం కంటే విలాస వస్తువులు వాడటం పట్ల ప్రజల్లో మోజు పెరిగిపోయింది. హోదాను ప్రదర్శించుకొనేందుకు మధ్యతరగతి ప్రజలు సైతం విలాస వస్తువులను కొనుగోలు చేయటం ఎక్కువైంది. ఫలితంగా దేశంలో సంపన్నులు మొదలుకొని మధ్యతరగతి ప్రజానీకం వరకు బంగారు ఆభరణాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాజంలో నిరాడంబరత, పొదుపు అనే వాటికి స్థానం లేకుండా పోయింది.


ప్రజలు పొదుపు పాటించడం వల్ల ముడి చమురు, బంగారం కొనుగోళ్లకు వినియోగించే విదేశీ మారకద్రవ్యం పరిమాణం తగ్గుతుంది. దానివల్ల అనేక రంగాల్లో డిమాండ్ తగ్గుతుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. అలాగే వస్తు వినిమయం పడిపోతుంది. ఫలితంగా దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్షీణిస్తాయి. పొదుపు వల్ల ఫిస్కల్ కన్సాలిడేషన్ (ద్రవ్య లోటు నియంత్రణ) జరగదు. దేశంలోని వాస్తవ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు జరిగినప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. ఈ నిజాన్ని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పాల్ క్రూగ్ మెన్ పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. ఐఎంఎఫ్‌ కూడా దీనిని చాలా వరకూ అంగీకరించింది.

ప్రధాని పొదుపు పిలుపు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు ఆదా అయిందో ఇప్పటికిప్పుడు లెక్కలు బయటకు రావు. కానీ, ఆ పిలుపుతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల, బంగారంపై తాజాగా విధించిన అదనపు పన్నులు వగైరా చర్యల వల్ల పేద, మధ్యతరగతి వర్గాల వారి జీవనం దుర్భరం అవుతుంది. ఎనిమిది కీలక రంగాలలోని పరిశ్రమలలో సాలీనా 7శాతం అభివృద్ధి కనబడాల్సి ఉండగా అది కేవలం 1.7శాతానికి పరిమితమైందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి పొదుపు ఒక్కటే తారక మంత్రం కాదని అనుభవంలో అందరికీ అర్థమవుతోంది.

సి. రామచంద్రయ్య

ఏపీ శాసనమండలి సభ్యులు

ఇవి కూడా చదవండి..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

Updated Date - Jun 09 , 2026 | 01:09 AM