Share News

అధిక జనాభా వరంగా మారేది ఎప్పుడు?

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:08 AM

వివిధ రంగాలలో భవిష్యత్తులో చోటుచేసుకునే మార్పులను ముందుగానే అంచనా వేసే రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరు. ఇందుకు అనేక ఉదాహరణలు....

అధిక జనాభా వరంగా మారేది ఎప్పుడు?

వివిధ రంగాలలో భవిష్యత్తులో చోటుచేసుకునే మార్పులను ముందుగానే అంచనా వేసే రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 2024లో అధికారంలోకి వచ్చాక, జనాభా పెరుగుదలకు సంబంధించి ఆయన ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ప్రతి యువజంట ముగ్గురు పిల్లల్ని కనాలని గట్టిగా చెబుతున్నారు. చెప్పడమే కాదు, అందుకు అనుగుణంగా ప్రభుత్వపరంగా ‘జనాభా నిర్వహణ’ విధానాన్ని రూపొందించారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో జనాభా నిర్వహణపై ఓ ముసాయిదా పత్రాన్ని విడుదల చేశారు. నెల రోజుల పాటు దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ జనాభా నిర్వహణ విధానంలో కొన్ని కీలక అంశాలు: మూడో బిడ్డను కంటే ప్రసవ సమయంలోనే ఒక్కో బిడ్డకు రూ.25వేల చొప్పున తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఉచిత విద్య అందించడం, ఇద్దరు పిల్లల్ని మించి కనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వడం.. వంటివి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ జనాభా నిర్వహణ విధానం ప్రస్తుతం అనేక విమర్శలకు గురవుతున్నది. చంద్రబాబునాయుడు అనుసరించే విధానాలకు తొలుత మెజారిటీ ప్రజలలో అనుకూలత రాదు. కానీ, క్రమంగా వాటి ఫలితాలు అనుభవంలోకి వచ్చాక ప్రజలు తన విధానాలను అర్థం చేసుకుంటారని ఆయన విశ్వాసం. అసలు ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపుదలపై చంద్రబాబునాయుడు ఎందుకు దృష్టి సారించినట్లు?

జనాభాలో మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రథమ స్థానంలోకి వచ్చి నాలుగైదేళ్లు అవుతోంది. కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరనున్నది. ఆ సమయానికి, అంటే మరో పదేళ్లకు దేశంలో 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల సంఖ్య బాగా తగ్గుతుంది. 50 నుంచి 80 ఏళ్ల వయసు కలిగిన వారి సంఖ్య ఇంతకు ముందు కంటే గణనీయంగా పెరగనుంది. అంటే, వృద్ధుల సంఖ్య సగటున 60 శాతం మేర పెరుగుతుందని అంచనా. ఇదే క్రమం కొనసాగితే ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఉన్న యువశక్తి క్షీణించిపోతుంది. ఈ పరిస్థితి సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య పడిపోవటానికి కారణం జనాభా వార్షిక వృద్ధిరేటు తగ్గిపోవడమే. 1971లో గరిష్ఠంగా 2.2శాతంగా ఉన్న ఈ సగటు 2036 నాటికల్లా 0.58శాతానికి పడిపోతుందని ‘విమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024’ నివేదిక వెల్లడించింది.


అభివృద్ధి చెందిన చైనా, జపాన్‌, ఇటలీ వంటి దేశాలలో జనాభా సంఖ్య వేగంగా క్షీణిస్తోంది. చివరకు అదొక సంక్షోభంగా మారనున్నదని అక్కడి వారు భయపడుతున్నారు. ఐరోపా దేశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఐక్యరాజ్య సమితి విశ్లేషణ ప్రకారం, ప్రపంచంలోని 63 దేశాల్లో ఇప్పటికే జనాభా గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ దశ నుంచి క్రమంగా కిందకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని దేశాలు తమ ప్రజలకు ప్రోత్సాహకాలు అందించి, ప్రతి జంట ఎక్కువ మందిని కనాలని కోరుతున్నాయి.

ఇక భారత్‌ విషయానికొస్తే దేశంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతను కొన్ని రాజకీయ పార్టీల నేతలు విభిన్న కోణాల్లో చూస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. దేశంలో ముస్లిం మైనారిటీల జనాభా పెరుగుతూ, హిందువుల జనాభా తగ్గుతోంది కనుక ప్రతి హిందూ జంట ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ కొన్ని సంస్థల ప్రతినిధులు చాలా కాలం నుంచి ప్రచారం చేస్తున్నారు. అలాగే, కొన్ని దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాలను చేపట్టి జనాభాను అదుపు చేస్తే, వాటికి ఫైనాన్స్‌ కమిషన్‌ తక్కువ నిధులు కేటాయిస్తూ జనాభాను పెంచుతున్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వడం న్యాయం కాదన్న వాదన దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉంది. జాతీయ జనాభా నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గించడమేమిటని, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చంద్రబాబునాయుడు అనేక జాతీయ వేదికల నుంచి కేంద్రాన్ని ప్రశ్నించారు.

కాగా, గత రెండు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ విధానాలను సమర్థవంతంగా అనుసరించి సత్ఫలితాలు సాధించిన తమిళనాడు సైతం నేడు జనాభా పెరుగుదలను సమర్థించే బాటలో నడుస్తోంది. క్రిందటేడాది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘‘మనకు 16 మంది పిల్లలు ఉండాలని ప్రతి జంటకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని వాఖ్యానించడంతో కలకలం రేగింది. జనాభా నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణలో అన్యాయం జరుగుతోందనే భావంతో ఆయా రాష్ట్రాల్లో జనాభా పెంచాలని నేతలు చెప్పినట్లుగా అందరూ భావించారు. కానీ తాజాగా, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో సగటున లోక్‌సభ, శాసనసభ సీట్లను జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా 50శాతం మేర పెంచాలని నిర్ణయించడంతో ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వ్యత్యాసానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన జనాభా నిర్వహణ విధానాన్ని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా సామాజిక ప్రయోజనాలను సాధించడానికే ఏర్పరిచారని అనుకోవాలి.


అయితే, ఈ విధానం విజయవంతం కావాలంటే ముందుగా కొన్ని అంశాలపై ప్రజలకు స్పష్టత రావాలి. ముఖ్యంగా పిల్లల సంరక్షణ, చదువులు, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు... తదితర అంశాలపై ప్రజల్లో భరోసా ఏర్పడాలి. పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించగలగాలి. ఎక్కువ మందిని కనాలని అనేక దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలను వేడుకొంటున్నా, నానాటికి పెరుగుతున్న జీవన వ్యయం వల్ల దంపతులు ఎక్కువ మందిని కనడానికి సుముఖంగా లేరని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సర్వే వెల్లడించింది. పోషణ భారం అవుతుందనే భయమే.. సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి కారణమని ఈ సర్వేలో తేలింది.

ప్రజల్లో అవగాహన లేనప్పుడు పేదరికాన్ని లెక్క చేయకుండా పిల్లల్ని కనేవారు. కానీ.. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం పెరిగింది. పిల్లల్ని కంటే సరిపోదని, వారిని బాధ్యతతో పెంచాలని, అందరిలో గ్రహింపునకు వచ్చింది. నిజానికి, ఒకరిద్దరు పిల్లలు ఉన్న పేద కుటుంబాలు కూడా పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. దేశంలో 57శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆడపిల్ల పుడితే భారమనే భయంతో ఇప్పటికీ కొందరు భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దాదాపు 20శాతం మంది మంచినీరు, పారిశుధ్య సౌకర్యాలు లేని మురికివాడల్లో బ్రతుకీడుస్తున్నారు. మధ్యలో బడి మానేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. డిగ్రీలు చదివినా, తగిన నైపుణ్యాలు లేక ఉపాధి లేని నిరుద్యోగులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పూడ్చలేనంతగా ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీలో దేశం నేల చూపులు చూస్తోంది. ఇటువంటి అనేక సమస్యలను పరిష్కరించకుండా రాబోయే రోజుల్లో యువత సంఖ్యను పెంచాలనే ఏకైక కారణంతో ఎక్కువ మంది పిల్లలను కనాలనుకోవడం సమంజసమా? చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 17 , 2026 | 02:08 AM