పదిలో నూరు శాతం ఫలితాలు రావాలా?!
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:18 AM
ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి శిక్షణలు, ఎన్నికల విధులు, ఇతర బోధనేతర కార్యక్రమాల్లోనే చాలాకాలం గడిచిపోయింది. అయినా డిసెంబర్ చివరి నుంచి జనవరి మధ్య...
ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి శిక్షణలు, ఎన్నికల విధులు, ఇతర బోధనేతర కార్యక్రమాల్లోనే చాలాకాలం గడిచిపోయింది. అయినా డిసెంబర్ చివరి నుంచి జనవరి మధ్య వరకు అన్ని పాఠశాలలో 10వ తరగతి సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించినట్లు ఇటీవల పదవ తరగతి విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ నిర్వహించిన టీసాట్ గైడెన్స్ మీటింగ్‌లో అధికారులు చెప్పారు. అందులో పాల్గొన్న ఓ పాఠశాల సీనియర్ హెడ్మిస్ట్రెస్ ఉదయం 4:30 గంటల నుంచి పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి వేకప్ కాల్స్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ పేరున నిరంతరం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు, గత సంవత్సరం 96శాతం ఫలితాలు వచ్చినట్టు చెప్పారు. దానిపై ఈసారి తప్పకుండా నూరు శాతం ఫలితాలు సాధించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఇలా ఫలితాలు సాధించడానికి ఈసారి పదవ తరగతి పరీక్షలను దాదాపు నెల రోజులు నిర్వహిస్తున్నారు.
అసలు ప్రాథమిక స్థాయి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల అభ్యసనం పట్ల మనం అనుసరించిన విధానాలు, శిక్షణలు ఏ మేరకు విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించాయో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే లాంటి నివేదికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. పాఠశాల స్థాయిలో ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాలేమిటో రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. పదవ తరగతి పూర్తి చేసిన పిల్లలు అటు తెలుగులో కానీ, ఇటు ఇంగ్లీషులో కానీ ఒక అప్లికేషన్ రాయలేని స్థితి ఉంది. ఈ పరిస్థితిలో నూటికి నూరు శాతం మెరుగైన ఫలితాలు ఆశించడం, అలాగే ఆ ఫలితాలు రావడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో అధికార యంత్రాంగం గుర్తించడం లేదు. దీంతో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు కేవలం అటు ప్రైవేటు కళాశాలలకు, ఇటు ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్‌లకు ముడిసరుకుగా దోహదపడుతున్నారే తప్ప, ఏ రకమైన ప్రావీణ్యాలను సాధించలేకపోతున్నారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షకు పరీక్షకు మధ్య నాలుగు రోజులు ప్రిపరేషన్ కావడానికి ఈసారి షెడ్యూల్‌ను పెంచినట్లుగా అందుకు అనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి అధికారులు ప్రణాళికను విడుదల చేయడం ఆహ్వానించదగ్గదే. అయినా, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అధికారులు గమనించకపోవడం మాత్రం విచారకరం.
గాంధీజీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు, తరగతి గదిలోకి వచ్చిన విద్యాధికారి ఐదు పదాలు డిక్టేట్ చేస్తే, క్యాటిల్ అనే పదాన్ని ఆయన సరిగ్గా రాయలేకపోయారు. అప్పుడు టీచర్... పక్కనున్న పిల్లవాడి దాంట్లో చూసి రాయమని సైగ చేసినా, ‘‘నాకు రానప్పుడు పక్కవాడి దాంట్లో చూసి రాయడం తప్పు కదా’’ అని టీచర్‌కి చెప్పారు. ఆ స్ఫూర్తి ఇవాళ విద్యారంగంలో కొరవడింది. దాంతో గాంధీ కోరుకున్న డిగ్నిటీ ఆఫ్ లేబర్, మానవీయ అహింస, జీవన విలువలు మృగ్యం అయ్యాయని మన విద్యా వ్యవస్థ, పరీక్ష విధానం గుర్తించలేకపోవడం వల్లే, మనకు నూరు శాతం ఫలితాల పట్ల మోజు తగ్గటం లేదు.
చదువు అంటే పుస్తకం చదవడం, చదివింది పరీక్షలో బట్టీయంతో రాయడం కాదు, జీవితంలో నిలదొక్కుకోవడానికి చదువు మార్గం చూపాలన్న సంకల్పంతో మన విద్యా విధానం, పరీక్ష విధానం మారితే ఎంతో బాగుంటుంది.
ప్రభాకర్ కస్తూరి
కన్వీనర్, మరో గ్రంథాలయ ఉద్యమం
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..