ఆధునిక రాజ్యం, అనాది నాగరికతల యుద్ధం
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:33 AM
‘ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తిమంతుడేమీ కానక్కర్లేదు, ఎదురుదెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు....
‘‘ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తిమంతుడేమీ కానక్కర్లేదు, ఎదురుదెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు.’’
ఇబ్న్ ఖల్దూన్, ముకద్దిమా (14వ శతాబ్దం)
2026, ఫిబ్రవరి 28 ఉదయం.. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేశాయి. 12 గంటల్లో ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలు, అణుకేంద్రాలు, సైనిక స్థావరాలపై 900 సార్లు బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం రెండుమూడు రోజుల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
పాతిక రోజుల తర్వాత.. హోర్ముజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున నిలబడింది. 1970లలో వచ్చిన రెండు చమురు సంక్షోభాల కంటే ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకటించింది. ఇరాన్ నౌకాదళం నాశనమైనా, నాయకులు హతమైనా, అణుకేంద్రాలపై మూడుసార్లు దాడులు జరిగినా.. ఆ దేశం ఇంకా పాలన సాగిస్తోంది, పోరాడుతోంది. ఇప్పటికీ అంతర్జాతీయ చర్చల్లో తన నిబంధనలనే విధిస్తోంది.
మార్చి 22న ట్రంప్– ‘48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తాం’ అని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్– ‘పర్షియన్ గల్ఫ్ మొత్తం మందుపాతరలతో నింపేస్తామని, చమురు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తామ’ని గట్టిగా బదులిచ్చింది. తను ఇచ్చిన గడువు ముగియడానికి మరో 12 గంటలు ఉందనగా.. అమెరికా, ఇరాన్ మధ్య ‘చాలా మంచి, ఉపయోగకరమైన చర్చలు జరిగాయని’, అందుకే దాడులను ఐదురోజులు వాయిదా వేస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఒక మహాసామ్రాజ్యం క్షిపణులను ప్రయోగించింది. ఒక పురాతన నాగరికత ఆ దాష్టీకాన్ని తట్టుకొని నిలబడింది. ఇది ఏడువేల ఏళ్ల చరిత్ర వర్సెస్ రెండువందల ఏళ్ల అధికారం!
ఇరాన్ పీఠభూమిలో 7,000 ఏళ్ల నుంచే మానవ ఆవాసం ఉంది. క్రీస్తుపూర్వం 3200 నాటికే అక్కడ ఒక గొప్ప నాగరికత విలసిల్లింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ‘సైరస్ ది గ్రేట్’ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగింది. గ్రీస్, ఈజిప్ట్, టర్కీ, ఇరాక్ నుంచి మన పక్కనే ఉన్న పాకిస్థాన్ వరకు అది విస్తరించింది. క్రీస్తుపూర్వం 539లో, యుద్ధం లేకుండానే బాబిలోన్‌ను సైరస్ జయించారు. అక్కడి ప్రజలే కోట తలుపులు తెరిచి ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సైరస్ తన ఆజ్ఞను ఒక స్తూపంపై రాయించారు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆ స్తూపాన్ని, 1971లో ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోనే మొదటి మానవ హక్కుల ప్రకటనగా గుర్తించింది. ఆ సైరస్ స్తూపం ప్రకారం.. ఆయన బానిసలందరికీ విముక్తిని, మతస్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించారు. హీబ్రూ బైబిల్‌లో యూదుడు కాని వ్యక్తిని ‘మెస్సయ్య’ (దేవునిచే ఎన్నుకోబడినవాడు) అని పిలిచారంటే అది కేవలం సైరస్‌ను మాత్రమే.
సైరస్ చక్రవర్తి మానవ హక్కుల పత్రాన్ని ప్రకటించిన 2,315 ఏళ్ల తర్వాత (1776లో) పుట్టిన అమెరికా.. ఇప్పుడు అదే నాగరికతను గగనతలం నుంచి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది. సైరస్ పత్రం వెలువడిన 2,487 ఏళ్ల తర్వాత (1948లో) ఏర్పడిన ఇజ్రాయెల్.. తన భద్రత పేరుతో ఆ నాగరికతను లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోంది. పాతికరోజుల పాటు సాగిన ఈ వైమానిక దాడులు ఇరాన్ సుదీర్ఘచరిత్రలో ఒక చేదు అధ్యాయం మాత్రమే. కానీ, అమెరికాకు మాత్రం ఇలాంటి యుద్ధం ఊహకందని విషయం.
క్రీస్తుపూర్వం 330లో అలెగ్జాండర్ ‘పెర్సెపోలిస్’ నగరాన్ని తగులబెట్టాడు. 13వ శతాబ్దంలో మంగోలులు ఇరాన్ నగరాలపై విరుచుకుపడి, కొన్ని ప్రాంతాల్లో ముప్పావు వంతు జనాభాను ఊచకోత కోశారు. ఇక 1953లో బ్రిటన్ కుట్ర పన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొహమ్మద్ మొసాద్దెగ్‌ను గద్దె దించింది. 1980లో అమెరికా అందించిన ఆయుధాలతో ఇరాక్.. ఇరాన్‌పై ఎనిమిదేళ్ల పాటు సాగించిన యుద్ధంలో లక్షలాది మంది ఇరానీయులు బలయ్యారు. అయినా సరే, ఇరాన్ ఇంకా ఉంది. పర్షియా ఎప్పుడూ ఇక్కడే ఉంది.
ఇప్పుడు బాంబుల దాడికి గురవుతున్నది అవిసెన్నా (ఇబ్న్ సీనా) వంటి మహనీయుల నాగరికత. ఆయన రాసిన ‘కానన్ ఆఫ్ మెడిసిన్’ గ్రంథం ఆరు శతాబ్దాల పాటు యూరప్ విశ్వవిద్యాలయాల్లో ప్రధాన వైద్య పాఠ్యపుస్తకంగా ఉండేది. ఇది అల్–బిరూని నాగరికత. ఆయన వెయ్యేళ్ల క్రితమే భూమి చుట్టుకొలతను కేవలం ఒక శాతం తేడాతో కచ్చితంగా లెక్కించారు. యూరప్‌లో పుస్తకాలు తగులబెడుతున్న కాలంలోనే, బీజగణితంలో క్యూబిక్ ఈక్వేషన్స్‌కు పరిష్కారాలు చూపిన ఖయ్యామ్ నాగరికత ఇది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే హఫీజ్, రూమీల కవిత్వం పుట్టిన గడ్డ ఇది. టెహ్రాన్‌పై బాంబులు పడుతున్నాయంటే, ఆ గొప్ప వారసత్వాన్ని మోస్తున్న నగరంపై పడుతున్నాయని అర్థం. అటువంటి లోతైన వారసత్వం వైమానిక దాడులతో అంతమైపోదు. ఇలాంటి దాడులు ఆ పాత పౌరుషాన్ని మరింతగా తట్టి లేపుతాయి.
ఫిబ్రవరి 28, 2026న మొదటి ‘టోమాహాక్’ క్షిపణి ప్రయోగించడానికి ముందే, ఇరాన్ దాదాపు అర్ధ శతాబ్దకాలంగా మనుగడకోసం పోరాడుతూనే ఉంది. అమెరికా మొదటిసారిగా 1979 నవంబర్‌లో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షులు మారారు తప్ప ఇరాన్‌పై ఆంక్షలు ఎప్పుడూ తొలగలేదు, పైగా పెరుగుతూనే వచ్చాయి. అవి ఇరాన్‌ను మరింతగా రాటుదేల్చాయి. ఇరాన్ విడిభాగాలను దిగుమతి చేసుకోలేకపోయింది కాబట్టి, వాటిని సొంతంగా తయారు చేయడం నేర్చుకుంది. పాశ్చాత్య సాంకేతికత దొరకలేదు కాబట్టి, దాన్ని ‘రివర్స్–ఇంజనీరింగ్’ చేసింది. అత్యాధునిక ఆయుధాలను కొనలేకపోయింది కాబట్టి, తక్కువ ఖర్చుతో, భారీ స్థాయిలో వినూత్న ఆయుధాలను అభివృద్ధి చేసింది. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నుంచే ‘షాహెద్–136’ సూసైడ్ డ్రోన్ పుట్టింది. ఒంటరిని చేసిన పరిస్థితుల్లో, అవసరం నేర్పిన తెలివితేటలకు ఈ డ్రోన్ ఒక నిదర్శనం.
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసి, సైనికపరంగా బలహీనపరచాలని అమెరికా యాభై ఏళ్ల పాటు ప్రయత్నించింది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. అమెరికా వద్ద ఉన్న ‘ఇంటర్సెప్టర్’ (క్షిపణి నిరోధక) నిల్వలను ఖాళీ చేసే స్థాయి ఆయుధాన్ని ఇరాన్ తయారు చేసుకుంది. ఆ నిల్వలను తిరిగి నింపే వేగం భూమి మీద ఏ ఫ్యాక్టరీకి కూడా లేదు. అమెరికాకు చెందిన పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి ఖరీదు సుమారు 4 మిలియన్ డాలర్లు. ఇరాన్‌కు షాహెద్–136 డ్రోన్ తయారీ ఖరీదు 30 వేల డాలర్లు మాత్రమే. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏడాదికి సుమారు 600 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లను మాత్రమే తయారు చేయగలదు. కానీ ఇరాన్ ఈ యుద్ధం మొదలైన మొదటి వారంలోనే 2,000 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. 2025లో ఇరాన్ మొత్తం రక్షణ బడ్జెట్ సుమారు 23 బిలియన్ డాలర్లు. ఇది అమెరికా రక్షణ బడ్జెట్ 900 బిలియన్ డాలర్లలో కేవలం 2.5 శాతం!
హోర్ముజ్ జలసంధి అత్యంత ఇరుకైన చోట 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ, దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణా అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే LNG వ్యాపారంలో నాలుగోవంతు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దీనిని మూసివేసింది. ‘1970లలో వచ్చిన రెండు చమురు సంక్షోభాలు, ఇటీవలి ఉక్రెయిన్ యుద్ధం వల్ల కలిగిన నష్టాలను కలిపినా.. ప్రస్తుత సంక్షోభం అంతకంటే దారుణంగా ఉంది’ అన్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ డైరెక్టర్. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు తొమ్మిది దేశాల్లోని కనీసం 45 ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక, గల్ఫ్ దేశాలన్నీ ఉప్పునీటిని మంచి నీరుగా మార్చే (డీశాలినేషన్) వ్యవస్థలమీద ఆధారపడే జీవిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు అందే తాగు నీటిలో 90శాతం కేవలం 56 భారీ ప్లాంట్ల నుంచే వస్తున్నది. మార్చి 7న, బహ్రెయిన్‌లోని ఒక ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగింది. గల్ఫ్ నీటి మౌలిక సదుపాయాలపై జరిగిన మొదటి దాడి ఇదే. దీనిపై ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇలా అన్నారు: ‘ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం చాలా ప్రమాదకరమైన చర్య, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ పద్ధతిని మొదలుపెట్టింది అమెరికాయే, ఇరాన్ కాదు.’ డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు చేయడం ఇరాన్ సైనిక విధానంలో భాగమైనపక్షంలో అది కచ్చితంగా ఆందోళనకరమైన విషయం, ఎందుకంటే గల్ఫ్ దేశాల వద్ద కేవలం కొన్ని వారాలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఇరవైఐదు రోజుల తర్వాత కూడా ఇరాన్ ప్రభుత్వం నడుస్తోంది. పాలన సాగిస్తూనే ఉంది. ఒక నాయకుడిని చంపగానే ముక్కలయ్యే పేకమేడ కాదు అది. ఇదొక మాట్రిక్స్. ఎటునుంచైనా తట్టుకోగలిగే ఒక పటిష్ఠ వ్యవస్థ. పాత నాయకుల కంటే అమెరికాపై ఇంకా ఎక్కువ కసి, ద్వేషం ఉన్న రెండోతరం నాయకులు వేదికపైకి వస్తున్నారు. అమెరికాను దెబ్బకొట్టడం కోసం ఎంతటి నష్టానికైనా సిద్ధపడే ప్రమాదకరమైన నాయకత్వం ఇది. ఒక దేశం యొక్క సైనికశక్తి, ఆర్థిక బలాన్ని పాశ్చాత్య దేశాలు అంచనా వేయగలవు. కానీ ఆ దేశం యొక్క ‘విశ్వాసం’ యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుందో అవి ఊహించలేవు. షియా ఇస్లాం పునాది కథే కర్బలా యుద్ధం (అక్టోబర్ 10, క్రీ.శ. 680). మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ, అన్యాయమైన అధికారానికి లొంగిపోవడం కంటే చావునే మిన్నగా ఎంచుకున్నారు. షియా క్యాలెండర్‌లో ఆ రోజే ఆషురా–అధికార గర్వం కంటే నమ్మిన సిద్ధాంతమే గొప్పదని చాటిచెప్పే రోజది. ఒక యుద్ధానికి స్పష్టమైన విజయ లక్ష్యం లేనప్పుడు, ఆ యుద్ధం మొదలవ్వకముందే ఓడిపోయినట్టు లెక్క. ఈ యుద్ధం కేవలం ఇరాన్ గురించి మాత్రమే కాదు. అమెరికా సైనికశక్తితో నడుస్తున్న ప్రస్తుత ప్రపంచంలో, పాశ్చాత్యేతర దేశాలన్నీ తమ వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఇరాన్ దారిచూపుతోంది.
లాల బెచతౌల
అల్జీరియన్ చరిత్రకారుడు
(కౌంటర్ కరెంట్స్)
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..