వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ఏకాత్మ మానవతావాదం
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:18 AM
ధర్మాన్ని ఆధారం చేసుకుని ఆధునిక సాంకేతిక అభివృద్ధిని నైతిక, సాంస్కృతిక విలువలతో సమన్వయపరిచే సమగ్ర అభివృద్ధి నమూనాను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారు. భౌతిక...
ధర్మాన్ని ఆధారం చేసుకుని ఆధునిక సాంకేతిక అభివృద్ధిని నైతిక, సాంస్కృతిక విలువలతో సమన్వయపరిచే సమగ్ర అభివృద్ధి నమూనాను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారు. భౌతిక అవసరాలు తీర్చగలగడం లేదా సాంకేతిక పురోగతే అభివృద్ధి కాదని, వ్యక్తి– సమాజం సంపూర్ణ శ్రేయస్సే అసలైన అభివృద్ధి అని ఆయన నమ్మారు. ఈ తత్వంలో ‘అంత్యోదయ’ భావన ప్రధానమైనది. ఇది సమాజంలోని అట్టడుగుస్థాయి వ్యక్తి అభ్యున్నతినే అభివృద్ధి ప్రమాణంగా చూస్తుంది. మానవ సంక్షేమానికి సాధనంగా మాత్రమే సాంకేతికత ఉండాలని, నైతికతను దృష్టిలో ఉంచుకుని అందరూ పనిచేయాలని దీన్‌దయాళ్ తెలిపారు. ఏకాత్మ మానవదర్శనం ప్రకారం.. మానవుడు శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మలను కలిగినవాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలలో ధర్మం మిగతావాటికి నైతిక పునాది. ఈ తత్వం వ్యక్తి, సమాజం, ప్రకృతి మధ్య సౌహార్దాన్ని, అలాగే రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీకరణను బలంగా సమర్థిస్తుంది. స్థానిక సంస్థల బలోపేతం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని దీనదయాళ్ భావించారు. ఏఐ ఆధారిత డిజిటల్ పాలనలో ఈ తత్వాన్ని అన్వయిస్తే.. మానవ నిర్ణయాలకు సహాయక సాధనంగా ఏఐ ఉండాలి గానీ ప్రత్యామ్నాయంగా మారకూడదు. ఆల్గారిథమ్‌ల పారదర్శకత, వివరణాత్మకత, బాధ్యత తప్పనిసరి. పంచాయతీరాజ్ వ్యవస్థకు అనుగుణంగా డేటా, సాంకేతిక నియంత్రణ కూడా వికేంద్రీకృతంగా ఉండాలి. స్థానిక అవసరాలకు అనుగుణమైన డేటా, ప్రజల భాగస్వామ్యంతో డిజిటల్ వ్యవస్థలను రూపొందించాలి. ఈ ఏఐ యుగంలో ఏకాత్మ మానవతావాదంతో ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, వికసిత భారత్ –2047 లక్ష్యం వైపుగా అడుగులు వేద్దాం.
డా. వీరమల్ల శ్రీశైలం
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇగ్నో
(నేడు దీన్‌దయాళ్ వర్ధంతి)
ఇవి కూడా చదవండి..
సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్